How to Make Safe and Natural Holi Colours with Flowers at Home
Sakshi News home page

Home Made Holi Colours Tips: మార్కెట్‌ కలర్స్‌ కంటే.. పువ్వులతో కలర్స్‌ తయారు చేయడం చాలా ఈజీ! సురక్షితం కూడా!!

Published Tue, Mar 15 2022 4:38 PM | Last Updated on Tue, Mar 15 2022 5:36 PM

Make Organic Holi Colours with Flowers - Sakshi

Make Organic Holi Colours with Flowers: హోలీ 2022 సంబురం వచ్చేసింది. ఈ రంగులకేళిలో రసాయన రంగుల్ని వాడటం ‘ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు... కాదంటూ’ ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతుంది. అయితే కృత్రిమ రంగులతో పోలిస్తే ఆర్గానిక్‌ కలర్ పౌడర్లకే మార్కెట్‌లో రేటు ఎక్కువ. పైగా అవి నిజంగానే ఆర్గానిక్‌వేనా అనేది మనకు తెలీదు. కాబట్టి కొంచెం కష్టపడితే ఇంట్లోనే ఎవరికి వాళ్లు సహజరంగుల్ని తయారు చేసుకోవచ్చు. ఎలాగూ.. ఎర్రటి ఎండలు దండి కొడుతున్నాయ్‌ కదా!

రెడ్‌/ఎరుపు
మందార పువ్వులను శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఎండిన ఆ పువ్వులను మెత్తని పొడిగా నూరుకోవాలి. అంతే.. ఎరుపు రంగు సిద్ధమైనట్లే. ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే ఈ మిశ్రమానికి కొంచెం బియ్యప్పిండి కలిపితే సరిపోతుంది. మందారతో పాటు ఎర్ర చందనం పౌడర్‌తో కూడా రెడ్‌ కలర్‌ను తయారుచేసుకోవచ్చు. పైగా ఎర్ర చందనం శరీరానికి మంచి రంగును ఇస్తుంది. దీనిని తడి, పొడి రంగుగా వాడుకోవచ్చు.  లీటర్‌ నీటిలో రెండు చెంచాల ఎర్ర చందనం పౌడర్‌ని కలపి దగ్గరికి అయ్యేదాకా మరగనివ్వాలి. చల్లారక కొన్ని నీళ్లు కలిపితే తడి రంగు తయారవుతుంది. 

ఆరెంజ్‌/కాషాయం
మోదుగ పూలను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టాలి. లేదంటే నీటిలో మరగబెట్టినా సరిపోతుంది. పసుపు–కాషాయం రంగుల మిశ్రమంతో రంగు తయారవుతుంది. ఆయుర్వేద గుణాలున్న మోదుగ పూలను ఎండబెట్టి నూరుకుంటే పొడిరంగు తయారవుతుంది. మైదాకు(గోరింటాకు)ను నీటిలో కలిపి ఆరెంజ్‌ రంగు తయారు చేసుకోవచ్చు. కుంకుమ పువ్వును రాత్రంతా నీటిలో నానబెడితే తెల్లారేసరికల్లా కాషాయం రంగు తయారవుతుంది. కాకపోతే కొంచెం ఇది కాస్ట్లీ వ్యవహారం.   

యెల్లో/పసుపు
ఈ రంగును తయారు చేయడం కొంచెం శ్రమతో కూడుకున్న పని.  పొద్దుతిరుగుడు పువ్వులు(యాభై గ్రాములు), నారింజ తొక్కల పొఇ(ఇరవై గ్రాములు), చేమ గడ్డ పొడి(రెండొందల గ్రాములు), పసుపు(వంద గ్రాములు), నిమ్మ రసం(ఇరవై చుక్కలు).. ఈ మొత్తాన్ని ఒక పెద్ద పాత్రలో బాగా కలిపితే  మెత్తని పసుపు రంగు తయారవుతుంది. 

బ్లూ/నీలం
సూర్య కాంతిలో ఇసుక నేలల్లో ఎక్కువగా పెరిగే చెట్లు జకరండ(నీలి గుల్మహార్‌). వీటి పువ్వులు నీలి, ఊదా రంగుల్లో ఉంటాయి. వీటిని ఎండబెట్టి నీలం రంగును తయారు చేసుకోవచ్చు. కేరళ ప్రాంతంలో అయితే నీలి మందారం మొక్కల నుంచి సహజసిద్ధమైన రంగుల్ని తయారుచేస్తారు. తడి రంగు కోసం నీలిమందు చెట్ల కాయల్ని(బెర్రీలు) పొడి చేసి నీళ్లలో కలపాలి. కొన్ని  జాతుల నీలిమందు చెట్ల ఆకులు కూడా నీలం రంగుల్లోనే ఉంటాయి. వాటిని కూడా నీటితో కలిపి బ్లూ రంగు తయారుచేసుకోవచ్చు. 

గ్రీన్‌/ఆకుపచ్చ
గోరింటాకు పొడికి సమాన పరిమాణంలో బియ్యప్పిండి కలిపి గ్రీన్‌ కలర్‌ తయారు చేసుకోవచ్చు.  వేప ఆకుల్ని నీటిలో బాగా మరగబెట్టి చిక్కటి మిశ్రమంగా చేయాలి. పై పై నీటిని వడబోసి మిగిలిన నీటిని తడి ఆకుపచ్చ రంగుగా వాడుకోవచ్చు. 

పింక్‌/గులాబీ
పసుపు రంగు మందార పువ్వులు, బీట్‌రూట్‌ ద్వారా ఆర్గానికి పింక్‌ రంగును తయారు చేయొచ్చు. బీట్‌రూట్‌ను పేస్ట్‌గా నూరి.. ఆ మిశ్రమాన్ని ఎండలో నానబెట్టాలి. ఎక్కువ పరిమాణంలో కావాలనుకుంటే ఆ పొడికి కొంచెం శెనగ లేదా గోధుమ పిండిని కలపాలి. తడి రంగు కోసం బీట్‌రూట్‌ ముక్కలను నీటిలో మరగబెట్టి.. చల్లార్చాలి. 

బ్రౌన్‌/గోధుమ
గోరింటాకు పొడి ఒక భాగం తీసుకుని అందులో నాలుగు పాళ్ల  ఉసిరి పొడిని కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని నీళ్లలో కలిపితే తడి గోధుమ రంగు తయారవుతుంది. పొడి రంగు కోసం ఈ పౌడర్ల మిశ్రమానికి బియ్యప్పిండిని కలిపితే చాలు.

ఆయుర్వేదంలో హోలీ
హోలీ వెనుక పురాణకథనాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆయుర్వేదంలోనూ ఈ పండుగ గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. చలి కాలం వెళ్లిపోయి.. వేసవి వచ్చేప్పుడు  గాలిమార్పు కారణంగా జ్వరాలు, జలుబూ వచ్చే అవకాశం ఎక్కువ. అవేమీ రాకుండా ఉండేందుకే ఔషధగుణాలున్న పువ్వులు, ఆకుల పొడిలను నీళ్లలో కలిపి చల్లుకునేందుకే ఈ వేడుక పుట్టిందని చెప్తారు. ముఖ్యంగా మోదుగ, మందార పూలను మరిగించిన నీటిలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నీళ్లు శరీరాన్ని చల్లబరిస్తే, హోలీ పండుగ పూట చలువచేసే పానీయాలు తాగి, మిఠాయిలు తినడంవల్ల రోగాలు దరిచేరవని అంటారు.

:::సాక్షి, వెబ్‌స్పెషల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement