సాక్షి, హైదరాబాద్: సాధారణంగా కార్లలో సీటు బెల్టులు వాడుతుంటారు. కానీ, తొలిసారి నగరంలో సీట్ బెల్టులుండే సిటీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. విదేశాల్లో బస్సుల్లో కూడా సీటు బెల్టులు తప్పని సరి. వాస్తవానికి మన దగ్గర కూడా బస్సుల్లోనూ సీటు బెల్టులుండాలనే నిబంధ న ఉన్నా అది అమలుకావటం లేదు. తొలిసా రి ఆర్టీసీ సిటీ సర్విసుల్లో ఆ తరహా సీట్లను అందుబాటులోకి తెస్తోంది. నగరంలో మరో నెలన్నరలో అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ఇవి కనిపించనున్నాయి. ఆ బస్సులు ఎలా ఉండనున్నాయో అధికారులు పరిశీలించేందుకు వీలుగా నమూనా బస్సును సోమవారం బస్‌భవన్‌కు తీసుకురాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్ మార్గాల్లో తిరిగేందుకు వీలుగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తిప్పాలని ఆర్టీసీ ఇటీవల నిర్ణయించింది. ఇప్పటికే పుష్పక్ పేరుతో 40 ఎలక్ట్రిక్ బస్సులు విమానాశ్రయం మార్గంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. అవన్నీ లాభాల్లో ఉండటం, రద్దీకి చాలినన్ని లేకపోవటంతో అదనంగా మరిన్ని బస్సులు తిప్పాలని నిర్ణయించారు. దానితోపాటు ఐటీ కారిడార్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులో లేని రూట్లలో కొన్ని తిప్పనున్నారు. ప్రస్తుతం విమానాశ్రయ మార్గంలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులతో పోలిస్తే ఆధునిక వసతులు అదనంగా ఉన్న ఈ కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన రవాణా వసతిని అందించనున్నాయి.
500 బస్సులకు ఆర్డర్
500 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నగరంలో తిప్పాలని నిర్ణయించిన ఆరీ్టసీ, ఇప్పటికే ఆర్డర్ ఇచి్చన విషయం తెలిసిందే. సిటీ బస్సులుగా తిప్పే సర్విసులకు సంబంధించి తొలి విడతలో 50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అందులో 20 శంషాబాద్ విమానాశ్రయానికి, 30 ఐటీ కారిడార్‌లో తిరుగుతాయి. ఇందులో 25 బస్సులు నెలనెలన్నరలో రోడ్డెక్కుతాయని అధికారులు అంటున్నారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్దతిలో వీటిని ఆర్టీసీ అద్దెకు తీసుకుంటోంది. ఇవి కాకుండా మరో 800 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా సమకూర్చుకోవాలనేది ఆర్టీసీ ఆలోచన. వాటికి ఇంకా టెండర్లు పిలవలేదు.
ఆకుపచ్చ, తెలుపు రంగుతో..
ఆకుపచ్చ, తెలుపు రంగుతో ఈ బస్సులుంటాయి. రంగుల మేళవింపుపై ఎండీ సంతృప్తి వ్యక్తం చేశారు. బస్సు ముందువైపు ఆర్టీసీ లోగో లేకపోవటాన్ని ప్రశ్నించిన ఆయన, ప్రయాణికులకు కనిపించేలా లోగో ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని సీట్లకే బెల్టులుండటంతో, అన్ని సీట్లకు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఓఓ రవీందర్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, ఒలెక్ట్రా కంపెనీ ప్రతినిధులు వేణుగోపాలరావు, ఆనంద్, యతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
12 మీటర్ల పొడవు..
- ఇప్పుడు కొత్తగా సమకూరే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు 12 మీటర్ల పొడవుతో ఉంటాయి.
- ఒక్కో బస్సులో 35 సీట్లుంటాయి.ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సాకెట్ అందుబాటులో ఉంటుంది.
- బస్సుల్లో మూడు సీసీ టీవీ కెమెరాలు అమర్చి ఉంటాయి. అవి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్‌తో ఉంటాయి.
- రివర్స్ చేసేప్పుడు డ్రైవర్‌కు వెనక భాగం కనిపించేలా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది.
- ప్రయాణికులకు సూచనలు అందజేసేందుకు వీలుగా బస్సులో నాలుగు ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులుంటాయి.
- అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు వీలుగా బస్సులో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం ఉంటుంది. వెహికిల్ ట్రాకింగ్ సిస్టం కూడా ఉంటుంది.
- ఒకసారి ఫుల్ చార్జి అయితే 225 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి. ఫుల్ చార్జింగ్‌కు దాదాపు 3 గంటల సమయం పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment