sliding system
-
21, 22 తేదీల్లో ఇంజనీరింగ్ సీట్ల మార్పిడి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీ సీట్ల మార్పిడి (స్లైడింగ్)కి ఈ నెల 21, 22 తేదీల్లో అవకా శం కల్పించాలని సాంకేతిక విద్య విభాగం నిర్ణయించింది. స్లైడింగ్ ప్రక్రియను ప్రతీ ఏటా కాలేజీలే చేపట్టేవి. ఈసారి సాంకేతిక విద్య కమిషనరేట్ దీన్ని నిర్వహిస్తోంది.స్లైడింగ్ పేరుతో ప్రైవేటు కాలేజీలు కొన్నేళ్ళుగా సాగిస్తున్న సీట్ల వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తుది విడత సీట్లను సోమవారం కేటాయించారు. ఇంకా 5,039 సీట్లు మిగిలిపోయాయి. స్లైడింగ్ తర్వాత మిగిలిపోయే సీట్లను కలుపుకుని స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం మీద ఈ నెలాఖరుకు కౌన్సెలింగ్ ముగించుకుని ఇంజనీరింగ్ క్లాసులు మొదలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.స్లైడింగ్‌కు 3 వేల సీట్లుజాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వదులుకుంటారు. అలాగే తుది దశ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లో సీట్లు వదులుకుంటారు. ఈ రకంగా తుది దశ కౌన్సెలింగ్ నాటికి ప్రతీ ఏటా దాదాపు 3 వేల మంది స్లైడింగ్ ద్వారా సీట్లు మారుతుంటారు. కాలేజీలో తుది దశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చిన వాళ్ళు ఈ నెల 17 నాటికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇలా చేయని పక్షంలో ఆ సీటును ఖాళీ అయినట్టుగా ప్రకటిస్తారు. విద్యార్థులు సీట్లు రద్దు చేసుకున్నా వాటినీ ప్రకటించాల్సి ఉంటుంది. అప్పటికే ఆ కాలేజీలో చేరిన విద్యార్థులు నచ్చిన బ్రాంచీలో ఖాళీలుంటే స్లైడింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ప్రైవేటు కాలేజీలు ర్యాంకర్ల చేత తొలి దశలోనే కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా చేసేవి. తుది దశ ముగిసిన తర్వాత సీటు రద్దు చేసుకునేలా చేసేవి. ఈ సీటును స్లైడింగ్ ప్రక్రియలో ఎక్కువ రేటు పెట్టి ఇతర బ్రాంచీల్లో ఉన్నవారికి అమ్ముకునేవి. ఇప్పుడు ప్రభుత్వమే స్లైడింగ్ చేపట్టడం వల్ల ఆ అవకాశం ఉండే వీల్లేదు.స్పాట్లో కంప్యూటర్ సీట్లు కష్టమేఈ ఏడాది కంప్యూటర్, అనుబంధ బ్రాంచీల్లో సీట్లు పెద్ద ఎత్తున భర్తీ అయ్యాయి. స్పాట్ అడ్మి షన్లలో ఈ సీట్లు పొందే అవకాశాలు తక్కువనే అధికారులు అంటున్నారు. గత ఏడాది సీట్లు పెద్ద ఎత్తున మిగిలిపోయాయి. జేఈఈ కౌన్సెలింగ్ ఇప్పటికే ముగిసింది. దీంతో జాతీయ కాలేజీ ల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో మొదటి, రెండో దశ కౌన్సెలింగ్ తర్వాత మళ్ళీ రాష్ట్ర కాలేజీలకు దరఖాస్తు చేయలేదు. గత ఏడాది అన్ని బ్రాంచీల్లో కలిపి తుది దశ కౌన్సెలింగ్ తర్వాత 19,154 సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది మాత్రం 5,039 సీట్లు మాత్రమే మిగిలా యి. కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో 2023లో తుది దశ కౌన్సెలింగ్‌లో 5,723 సీట్లు మిగిలితే... ఈ ఏడాది తుది దశ కౌన్సెలింగ్ నాటికి కేవలం 1,225 సీట్లు మిగిలాయి. ఇవి కూడా మారు మూల ప్రాంతాల కాలేజీల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువగా ఆశించే కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో స్పాట్ అడ్మిషన్లలో పెద్దగా సీట్లు వచ్చే అవకాశం కన్పించడం లేదు. -
ఈ రాళ్లు నడుస్తాయి...!
ఈ భూమిపై మనుషులు, ప్రాణం ఉన్న ఇతర జంతువులు నడుస్తుంటాయి. కొన్ని ప్రాణులు గాల్లో విహరిస్తే మరికొన్ని భూమిపై పాకేవి కూడా ఉన్నాయి. ప్రాణం ఉన్న చెట్లు కూడా అవి ఉన్న స్థానం నుంచి పక్కకు కదల్లేవు. అలాంటిది ప్రాణంలేని ఏ వస్తువులైనా ఇతర జీవుల ప్రమేయం లేకుండా పక్కకు కదలవు. ఇలాంటివి మనం కొన్ని హర్రర్ సినిమాల్లో చూసి ఉంటాం. నిజజీవితంలో అది అసాధ్యం. కానీ అదోలోయ ప్రాంతం. అక్కడ రాళ్లన్నీ పరుచుకొని ఉంటాయి. అవి ఎవరూ కదల్చకుండానే ముందుకు కదిలిపోతుంటాయి. రాళ్లేంటి కదలడంమేంటనీ అశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం చదవండి...! అమెరికాలోని కాలిఫోర్నియాలోని పానామింట్ పర్వతాలకు సమీపంలో ఒకలోయ ఉంది. దీన్ని అందరూ మృత్యులోయ అని పిలుస్తారు. అక్కడ జనసంచారం ఉండదు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. అక్కడ రాళ్లు జీవం ఉన్న ప్రాణు ల్లా వాటంతట అవే ముందుకు కదులుతాయి. ఈ రాళ్లనే సెయిలింగ్ స్టోన్స్ అనీ, స్లైడింగ్ రాక్స్ అనీ, మూవింగ్ రాక్స్ అనీ ఇలా ఎవరికి తోచిన పేర్లు వారు పెడుతూ వచ్చారు. అలా ముందుకు కదిలే రాళ్ల బరువు 700 పౌండ్ల బరువు ఉంటుంది. రాళ్లు కదులుతాయంటే సరే నమ్ముదాం. కానీ అవి కదిలినట్లు మనకి ఎలా తెలుస్తుంది అనేగా మీ సందేహం. అవి ఎంత దూరం ప్రయాణించాయో ఆ ప్రయాణించిన మేరకు చారలు స్పష్టంగా కనిపిస్తాయి అక్కడ. చార చివరలో రాయి ఆగి ఉంటుంది. ఆ చారల ద్వారా ఆ రాయి ఎక్కడ నుంచి ఎక్కడికి దొర్లుకుంటూ వచ్చిందనే విషయం తెలుసుకోవచ్చు. వంద సంవత్సరాలకుపైగా ఇలా రాళ్లు కదులుతున్నా దానివెనక ఉన్న రహస్యం ఏంటో ఇప్పటివరకూ ఎవరూ చేధించలేదు. రెండు, మూడేళ్లకు ఒకసారే... ఈ రాళ్లు కొలువై ఉన్న సరస్సును అక్కడ పర్యాటక అభిమానులు రేస్ ట్రాక్ ప్లే అంటూ వ్యవహరిస్తారు. ఈ ప్రాంతం కొండల మధ్య ఉన్న ఓ విశాలమైన మైదానంలా, చాలా చదనుగా ఉంటుంది. అయితే రాళ్లు రోజూ కదులుతూ ఉంటాయి అనుకుంటే పొరబాటే. రెండు లేదా మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఈ రాళ్లు కదలడం లేదా దొర్లడం జరుగుతూ ఉంటుంది. అదీ సమాంతరంగా ఒక రాయి కదలడం మొదలుపెడితే ఆ రాతితో పాటే మరో రాయి తన దిశను మార్చుకుంటుంది. దిశ మార్చుకున్న రాయి, సమాంతర రాయి రెండూ ఒకే బరువుతో ఉండడం ఇంకో విశేషం. కొన్నిరాళ్లు పదడుగుల దూరం వెళ్లగా మరికొన్ని వంద అడుగులకుపైగా ముందుకు కదిలాయి. కొన్ని కొన్ని రాళ్లు 90 డిగ్రీల కోణంలో కూడా తమ దిశను మార్చుకోవడం విశేషం. వందేళ్ల క్రితమే గుర్తించారు... ఈ ప్రాంతంలో పెద్దగా జంతు సంచారం కూడా ఉండదు. కనుక వాటివల్ల రాళ్లు కదిలే అవకాశం లేదు. జనసంచారం కూడా ఆ ప్రాంతంలో చాలా తక్కువ. కొందరేమో దె య్యాలు ఈ రాళ్లను కదులుస్తున్నాయని అంటే మరికొందరేమో ప్రత్యేకమైన అయస్కాంత లక్షణాలే ఈ రాళ్లను కదులిస్తున్నాయని అంటున్నారు. దాదాపు వందేళ్ల క్రితమే పరిశోధకులు ఈ రాళ్ల కదలికలను మొదటిసారి గుర్తించారు. ఇప్పటికి అరవై ఏడేళ్లుగా వీటి కదలికలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఎలాంటి సమాచారం తెలియలేదు. మంచు పర్వత శ్రేణులైతే రాతి శిలలు వేగంగా కదులుతాయనటానికి ఆస్కారం ఉంది. కానీ, ఇక్కడ ఆ దాఖలాలు లేవు. పరిశోధనలు జరుగుతున్నతసేపూ ఒక్క అంగుళం కూడా కదలని రాళ్లు ఆ పరిశోధనలు ముగిసి తిరిగి వెళ్లిపోతున్నప్పుడు కదిలాయి. కానీ వీటిని వీడియోలో బంధించలేక పోయారు. ఫోటోలు మాత్రం తీయగలిగారు. అసలు రహస్యం... ఆ తర్వాత 1955లో, 1972లో బాండ్ షార్ప్, డ్విట్ కేరే అనే శాస్త్రవేత్తలు మళ్లీ పరిశోధనలు మొదలుపెట్టారు. ఆయా ప్రాంతాల్లో అప్పటికే 30 రాతిశిలల్లో కదలిక ఉందని గ్రహించారు. ఏడేళ్ల సుదీర్ఘ కాలంలో పరిశోధనల్లో కొంత పురోగతి కనిపించినప్పటికీ సంగతులేవీ సరిగ్గా తెలియలేదు. ఆ ప్రాంతం కొండల మధ్యలో ఉంటుంది. వర్షాకాలంలో అక్కడ భారీగా వర్షాలు కురుస్తాయి. కొండల వాలు వెంబడి వర్షం నీరు జారి మైదానాన్ని ముంచెత్తుతుంది. ఆ ప్రాంతం చిన్నపాటి సరస్సులా మారుతుంది. ఎండాకాలంలో నీరు పూర్తిగా ఇంకిపోతుంది. ఎండిన నేలలో బీటలు పడతాయి. అప్పుడు ఆ నేల మీద పూర్తిగా తడి ఆరని పరిస్థితుల్లో నేల చిత్తడిగా ఉంటుంది. ఈ స్థితిలో రాళ్లకి నేలకి మద్య రాపిడి కాస్త తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గాలి ప్రభావం వల్ల రాళ్లు మరికొంచెం వేగంగా కదిలే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో గమనించదగిన విషయం ఏంటంటే అక్కడ బలమైన ఈదురు గాలులు వీస్తాయి. అక్కడి గాలులు సామాన్యంగా నైరుతి దిశ నుంచి ఈశాన్యదిశ వైపు వీస్తుంటాయి. విచిత్రమేమిటంటే, కదిలే రాళ్ల దిశ కూడా ఈ క్రమంలోనే ఉంటుంది. ఈ విషయమై ఓ వైజ్ఞానిక బృందం పరిశోధించింది. మంచు, గాలి రాళ్ల కదలికకు కారణమనీ, వేసవి కాలంలో వీటిలో కదలికలు లేవనీ, శీతాకాలంలో మాత్రమే కదులుతున్నాయని తేల్చారు. ఆయా కాలాల్లో వీచే గాలులు,శీతోష్ణ స్థితిగతులు ఇవన్నీ రాతి కదలికలపై ప్రభావాన్ని చూపుతున్నాయని కనుగొన్నారు. – సాక్షి స్కూల్ ఎడిషన్ -
'కొందరు మగవాళ్లు మాట వినడంలేదు'
మహిళల భద్రత దృష్ట్యా సిటీ బస్సుల్లో 'స్లైడింగ్ డోరు సిస్టమ్' ఏర్పాటును పలువురు పురుషులు జీర్ణించుకోలేక పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన స్లైడింగ్ వ్యవస్థ అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చేసేందుకు సిటీ బస్సులలో మహిళల, పురుషుల సీట్లకు మధ్య స్లైడింగ్ డోర్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు మగవాళ్లు మాత్రం ... ఆర్డినరీ సిటీ బస్సు ముందు డోర్ల నుంచి ఎక్కడం...మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో కూర్చోవటం తమ జన్మహక్కుగా వ్యవహరిస్తున్నారట. ఈ కొత్త సిస్టమ్‌ను అనుసరించడం లేదు. స్త్రీలకు మేం దూరంగా ఉండలేము అన్నట్లుగా ఉంది పురుషుల వ్యవహారం. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే... మధ్యవయస్సు వారితో ఎక్కువగా సమస్యలు తలెత్తుతున్నాయనేది కండక్టర్లు, డ్రైవర్ల వాదన. 'బస్సు ముందు డోరు భాగం అనేది స్త్రీలు, వృద్ధులు, వికలాంగులకు కేటాయించారు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పినా కూడా మగవాళ్లు వినిపించుకోవడం లేదు' అని ఓ సిటీ బస్సు డ్రైవర్ అన్నారు. 'పురుషులకు కేటాయించిన సెక్షన్‌కు వెళ్లాలని ఎంత చెప్పినా మగవారు అర్థం చేసుకోవడం లేదు. మధ్య వయస్సు ఉన్న వారితోనే అసలు సమస్య వస్తుంది. ఆరోగ్యం బాగాలేదని కూర్చోవడానికి అనుమతించాలని మహిళల విభాగంలోనే ఉంటున్నారు. పెనాల్టీ లాంటిది ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ పరిస్థితి ఉండదు' అని ఓ మహిళా కండక్టర్ తెలిపారు. ఇక సిటీ బస్సుల్లో తమ కోసం కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ ఊపిరి పీల్చుకుంటుంటే... మగవారు మాత్రం స్లైడింగ్ డోరు వ్యవస్థను జీర్ణించుకోలేకపోతున్నారు.