ఈ భూమిపై మనుషులు, ప్రాణం ఉన్న ఇతర జంతువులు నడుస్తుంటాయి. కొన్ని ప్రాణులు గాల్లో విహరిస్తే మరికొన్ని భూమిపై పాకేవి కూడా ఉన్నాయి. ప్రాణం ఉన్న చెట్లు కూడా అవి ఉన్న స్థానం నుంచి పక్కకు కదల్లేవు. అలాంటిది ప్రాణంలేని ఏ వస్తువులైనా ఇతర జీవుల ప్రమేయం లేకుండా పక్కకు కదలవు. ఇలాంటివి మనం కొన్ని హర్రర్ సినిమాల్లో చూసి ఉంటాం. నిజజీవితంలో అది అసాధ్యం. కానీ అదోలోయ ప్రాంతం. అక్కడ రాళ్లన్నీ పరుచుకొని ఉంటాయి. అవి ఎవరూ కదల్చకుండానే ముందుకు కదిలిపోతుంటాయి. రాళ్లేంటి కదలడంమేంటనీ అశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం చదవండి...!
అమెరికాలోని కాలిఫోర్నియాలోని పానామింట్ పర్వతాలకు సమీపంలో ఒకలోయ ఉంది. దీన్ని అందరూ మృత్యులోయ అని పిలుస్తారు. అక్కడ జనసంచారం ఉండదు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. అక్కడ రాళ్లు జీవం ఉన్న ప్రాణు ల్లా వాటంతట అవే ముందుకు కదులుతాయి. ఈ రాళ్లనే సెయిలింగ్ స్టోన్స్ అనీ, స్లైడింగ్ రాక్స్ అనీ, మూవింగ్ రాక్స్ అనీ ఇలా ఎవరికి తోచిన పేర్లు వారు పెడుతూ వచ్చారు. అలా ముందుకు కదిలే రాళ్ల బరువు 700 పౌండ్ల బరువు ఉంటుంది. రాళ్లు కదులుతాయంటే సరే నమ్ముదాం. కానీ అవి కదిలినట్లు మనకి ఎలా తెలుస్తుంది అనేగా మీ సందేహం. అవి ఎంత దూరం ప్రయాణించాయో ఆ ప్రయాణించిన మేరకు చారలు స్పష్టంగా కనిపిస్తాయి అక్కడ. చార చివరలో రాయి ఆగి ఉంటుంది. ఆ చారల ద్వారా ఆ రాయి ఎక్కడ నుంచి ఎక్కడికి దొర్లుకుంటూ వచ్చిందనే విషయం తెలుసుకోవచ్చు. వంద సంవత్సరాలకుపైగా ఇలా రాళ్లు కదులుతున్నా దానివెనక ఉన్న రహస్యం ఏంటో ఇప్పటివరకూ ఎవరూ చేధించలేదు.
రెండు, మూడేళ్లకు ఒకసారే...
ఈ రాళ్లు కొలువై ఉన్న సరస్సును అక్కడ పర్యాటక అభిమానులు రేస్ ట్రాక్ ప్లే అంటూ వ్యవహరిస్తారు. ఈ ప్రాంతం కొండల మధ్య ఉన్న ఓ విశాలమైన మైదానంలా, చాలా చదనుగా ఉంటుంది. అయితే రాళ్లు రోజూ కదులుతూ ఉంటాయి అనుకుంటే పొరబాటే. రెండు లేదా మూడేళ్లకు ఒకసారి మాత్రమే ఈ రాళ్లు కదలడం లేదా దొర్లడం జరుగుతూ ఉంటుంది. అదీ సమాంతరంగా ఒక రాయి కదలడం మొదలుపెడితే ఆ రాతితో పాటే మరో రాయి తన దిశను మార్చుకుంటుంది. దిశ మార్చుకున్న రాయి, సమాంతర రాయి రెండూ ఒకే బరువుతో ఉండడం ఇంకో విశేషం. కొన్నిరాళ్లు పదడుగుల దూరం వెళ్లగా మరికొన్ని వంద అడుగులకుపైగా ముందుకు కదిలాయి. కొన్ని కొన్ని రాళ్లు 90 డిగ్రీల కోణంలో కూడా తమ దిశను మార్చుకోవడం విశేషం.
వందేళ్ల క్రితమే గుర్తించారు...
ఈ ప్రాంతంలో పెద్దగా జంతు సంచారం కూడా ఉండదు. కనుక వాటివల్ల రాళ్లు కదిలే అవకాశం లేదు. జనసంచారం కూడా ఆ ప్రాంతంలో చాలా తక్కువ. కొందరేమో దె య్యాలు ఈ రాళ్లను కదులుస్తున్నాయని అంటే మరికొందరేమో ప్రత్యేకమైన అయస్కాంత లక్షణాలే ఈ రాళ్లను కదులిస్తున్నాయని అంటున్నారు. దాదాపు వందేళ్ల క్రితమే పరిశోధకులు ఈ రాళ్ల కదలికలను మొదటిసారి గుర్తించారు. ఇప్పటికి అరవై ఏడేళ్లుగా వీటి కదలికలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఎలాంటి సమాచారం తెలియలేదు. మంచు పర్వత శ్రేణులైతే రాతి శిలలు వేగంగా కదులుతాయనటానికి ఆస్కారం ఉంది. కానీ, ఇక్కడ ఆ దాఖలాలు లేవు. పరిశోధనలు జరుగుతున్నతసేపూ ఒక్క అంగుళం కూడా కదలని రాళ్లు ఆ పరిశోధనలు ముగిసి తిరిగి వెళ్లిపోతున్నప్పుడు కదిలాయి. కానీ వీటిని వీడియోలో బంధించలేక పోయారు. ఫోటోలు మాత్రం తీయగలిగారు.
అసలు రహస్యం...
ఆ తర్వాత 1955లో, 1972లో బాండ్ షార్ప్, డ్విట్ కేరే అనే శాస్త్రవేత్తలు మళ్లీ పరిశోధనలు మొదలుపెట్టారు. ఆయా ప్రాంతాల్లో అప్పటికే 30 రాతిశిలల్లో కదలిక ఉందని గ్రహించారు. ఏడేళ్ల సుదీర్ఘ కాలంలో పరిశోధనల్లో కొంత పురోగతి కనిపించినప్పటికీ సంగతులేవీ సరిగ్గా తెలియలేదు. ఆ ప్రాంతం కొండల మధ్యలో ఉంటుంది. వర్షాకాలంలో అక్కడ భారీగా వర్షాలు కురుస్తాయి. కొండల వాలు వెంబడి వర్షం నీరు జారి మైదానాన్ని ముంచెత్తుతుంది. ఆ ప్రాంతం చిన్నపాటి సరస్సులా మారుతుంది. ఎండాకాలంలో నీరు పూర్తిగా ఇంకిపోతుంది. ఎండిన నేలలో బీటలు పడతాయి. అప్పుడు ఆ నేల మీద పూర్తిగా తడి ఆరని పరిస్థితుల్లో నేల చిత్తడిగా ఉంటుంది. ఈ స్థితిలో రాళ్లకి నేలకి మద్య రాపిడి కాస్త తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గాలి ప్రభావం వల్ల రాళ్లు మరికొంచెం వేగంగా కదిలే అవకాశం ఉంది.
ఆ ప్రాంతంలో గమనించదగిన విషయం ఏంటంటే అక్కడ బలమైన ఈదురు గాలులు వీస్తాయి. అక్కడి గాలులు సామాన్యంగా నైరుతి దిశ నుంచి ఈశాన్యదిశ వైపు వీస్తుంటాయి. విచిత్రమేమిటంటే, కదిలే రాళ్ల దిశ కూడా ఈ క్రమంలోనే ఉంటుంది. ఈ విషయమై ఓ వైజ్ఞానిక బృందం పరిశోధించింది. మంచు, గాలి రాళ్ల కదలికకు కారణమనీ, వేసవి కాలంలో వీటిలో కదలికలు లేవనీ, శీతాకాలంలో మాత్రమే కదులుతున్నాయని తేల్చారు. ఆయా కాలాల్లో వీచే గాలులు,శీతోష్ణ స్థితిగతులు ఇవన్నీ రాతి కదలికలపై ప్రభావాన్ని చూపుతున్నాయని కనుగొన్నారు.
– సాక్షి స్కూల్ ఎడిషన్
Comments
Please login to add a commentAdd a comment