స్లైడింగ్‌కు 2 రోజుల పాటు అవకాశం
గతంలో ఈ అవకాశం కాలేజీలకే
ఇప్పుడు తొలిసారిగా సాంకేతిక విద్య కమిషనరేట్ ఆధ్వర్యంలో
3 వేల సీట్లల్లో మార్పిడికి చాన్స్
వెంటనే స్పాట్ అడ్మిషన్లు
ఈ నెలాఖరు నుంచి ఇంజనీరింగ్ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీ సీట్ల మార్పిడి (స్లైడింగ్)కి ఈ నెల 21, 22 తేదీల్లో అవకా శం కల్పించాలని సాంకేతిక విద్య విభాగం నిర్ణయించింది. స్లైడింగ్ ప్రక్రియను ప్రతీ ఏటా కాలేజీలే చేపట్టేవి. ఈసారి సాంకేతిక విద్య కమిషనరేట్ దీన్ని నిర్వహిస్తోంది.స్లైడింగ్ పేరుతో ప్రైవేటు కాలేజీలు కొన్నేళ్ళుగా సాగిస్తున్న సీట్ల వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తుది విడత సీట్లను సోమవారం కేటాయించారు. ఇంకా 5,039 సీట్లు మిగిలిపోయాయి. స్లైడింగ్ తర్వాత మిగిలిపోయే సీట్లను కలుపుకుని స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం మీద ఈ నెలాఖరుకు కౌన్సెలింగ్ ముగించుకుని ఇంజనీరింగ్ క్లాసులు మొదలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
స్లైడింగ్‌కు 3 వేల సీట్లు
జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వదులుకుంటారు. అలాగే తుది దశ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లో సీట్లు వదులుకుంటారు. ఈ రకంగా తుది దశ కౌన్సెలింగ్ నాటికి ప్రతీ ఏటా దాదాపు 3 వేల మంది స్లైడింగ్ ద్వారా సీట్లు మారుతుంటారు.
కాలేజీలో తుది దశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చిన వాళ్ళు ఈ నెల 17 నాటికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇలా చేయని పక్షంలో ఆ సీటును ఖాళీ అయినట్టుగా ప్రకటిస్తారు. విద్యార్థులు సీట్లు రద్దు చేసుకున్నా వాటినీ ప్రకటించాల్సి ఉంటుంది. అప్పటికే ఆ కాలేజీలో చేరిన విద్యార్థులు నచ్చిన బ్రాంచీలో ఖాళీలుంటే స్లైడింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
గతంలో ప్రైవేటు కాలేజీలు ర్యాంకర్ల చేత తొలి దశలోనే కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా చేసేవి. తుది దశ ముగిసిన తర్వాత సీటు రద్దు చేసుకునేలా చేసేవి. ఈ సీటును స్లైడింగ్ ప్రక్రియలో ఎక్కువ రేటు పెట్టి ఇతర బ్రాంచీల్లో ఉన్నవారికి అమ్ముకునేవి. ఇప్పుడు ప్రభుత్వమే స్లైడింగ్ చేపట్టడం వల్ల ఆ అవకాశం ఉండే వీల్లేదు.
స్పాట్‌లో కంప్యూటర్ సీట్లు కష్టమే
ఈ ఏడాది కంప్యూటర్, అనుబంధ బ్రాంచీల్లో సీట్లు పెద్ద ఎత్తున భర్తీ అయ్యాయి. స్పాట్ అడ్మి షన్లలో ఈ సీట్లు పొందే అవకాశాలు తక్కువనే అధికారులు అంటున్నారు. గత ఏడాది సీట్లు పెద్ద ఎత్తున మిగిలిపోయాయి. జేఈఈ కౌన్సెలింగ్ ఇప్పటికే ముగిసింది. దీంతో జాతీయ కాలేజీ ల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో మొదటి, రెండో దశ కౌన్సెలింగ్ తర్వాత మళ్ళీ రాష్ట్ర కాలేజీలకు దరఖాస్తు చేయలేదు.
గత ఏడాది అన్ని బ్రాంచీల్లో కలిపి తుది దశ కౌన్సెలింగ్ తర్వాత 19,154 సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది మాత్రం 5,039 సీట్లు మాత్రమే మిగిలా యి. కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో 2023లో తుది దశ కౌన్సెలింగ్‌లో 5,723 సీట్లు మిగిలితే... ఈ ఏడాది తుది దశ కౌన్సెలింగ్ నాటికి కేవలం 1,225 సీట్లు మిగిలాయి.
ఇవి కూడా మారు మూల ప్రాంతాల కాలేజీల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువగా ఆశించే కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో స్పాట్ అడ్మిషన్లలో పెద్దగా సీట్లు వచ్చే అవకాశం కన్పించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment