Engineering classes
-
21, 22 తేదీల్లో ఇంజనీరింగ్ సీట్ల మార్పిడి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీ సీట్ల మార్పిడి (స్లైడింగ్)కి ఈ నెల 21, 22 తేదీల్లో అవకా శం కల్పించాలని సాంకేతిక విద్య విభాగం నిర్ణయించింది. స్లైడింగ్ ప్రక్రియను ప్రతీ ఏటా కాలేజీలే చేపట్టేవి. ఈసారి సాంకేతిక విద్య కమిషనరేట్ దీన్ని నిర్వహిస్తోంది.స్లైడింగ్ పేరుతో ప్రైవేటు కాలేజీలు కొన్నేళ్ళుగా సాగిస్తున్న సీట్ల వ్యాపారానికి చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తుది విడత సీట్లను సోమవారం కేటాయించారు. ఇంకా 5,039 సీట్లు మిగిలిపోయాయి. స్లైడింగ్ తర్వాత మిగిలిపోయే సీట్లను కలుపుకుని స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం మీద ఈ నెలాఖరుకు కౌన్సెలింగ్ ముగించుకుని ఇంజనీరింగ్ క్లాసులు మొదలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.స్లైడింగ్‌కు 3 వేల సీట్లుజాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు వదులుకుంటారు. అలాగే తుది దశ కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లో సీట్లు వదులుకుంటారు. ఈ రకంగా తుది దశ కౌన్సెలింగ్ నాటికి ప్రతీ ఏటా దాదాపు 3 వేల మంది స్లైడింగ్ ద్వారా సీట్లు మారుతుంటారు. కాలేజీలో తుది దశ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చిన వాళ్ళు ఈ నెల 17 నాటికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇలా చేయని పక్షంలో ఆ సీటును ఖాళీ అయినట్టుగా ప్రకటిస్తారు. విద్యార్థులు సీట్లు రద్దు చేసుకున్నా వాటినీ ప్రకటించాల్సి ఉంటుంది. అప్పటికే ఆ కాలేజీలో చేరిన విద్యార్థులు నచ్చిన బ్రాంచీలో ఖాళీలుంటే స్లైడింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ప్రైవేటు కాలేజీలు ర్యాంకర్ల చేత తొలి దశలోనే కౌన్సెలింగ్‌లో పాల్గొనేలా చేసేవి. తుది దశ ముగిసిన తర్వాత సీటు రద్దు చేసుకునేలా చేసేవి. ఈ సీటును స్లైడింగ్ ప్రక్రియలో ఎక్కువ రేటు పెట్టి ఇతర బ్రాంచీల్లో ఉన్నవారికి అమ్ముకునేవి. ఇప్పుడు ప్రభుత్వమే స్లైడింగ్ చేపట్టడం వల్ల ఆ అవకాశం ఉండే వీల్లేదు.స్పాట్లో కంప్యూటర్ సీట్లు కష్టమేఈ ఏడాది కంప్యూటర్, అనుబంధ బ్రాంచీల్లో సీట్లు పెద్ద ఎత్తున భర్తీ అయ్యాయి. స్పాట్ అడ్మి షన్లలో ఈ సీట్లు పొందే అవకాశాలు తక్కువనే అధికారులు అంటున్నారు. గత ఏడాది సీట్లు పెద్ద ఎత్తున మిగిలిపోయాయి. జేఈఈ కౌన్సెలింగ్ ఇప్పటికే ముగిసింది. దీంతో జాతీయ కాలేజీ ల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కాలేజీల్లో మొదటి, రెండో దశ కౌన్సెలింగ్ తర్వాత మళ్ళీ రాష్ట్ర కాలేజీలకు దరఖాస్తు చేయలేదు. గత ఏడాది అన్ని బ్రాంచీల్లో కలిపి తుది దశ కౌన్సెలింగ్ తర్వాత 19,154 సీట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది మాత్రం 5,039 సీట్లు మాత్రమే మిగిలా యి. కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో 2023లో తుది దశ కౌన్సెలింగ్‌లో 5,723 సీట్లు మిగిలితే... ఈ ఏడాది తుది దశ కౌన్సెలింగ్ నాటికి కేవలం 1,225 సీట్లు మిగిలాయి. ఇవి కూడా మారు మూల ప్రాంతాల కాలేజీల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువగా ఆశించే కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో స్పాట్ అడ్మిషన్లలో పెద్దగా సీట్లు వచ్చే అవకాశం కన్పించడం లేదు. -
ఒత్తిడి తగ్గాలి..నైపుణ్యం పెరగాలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ క్లాసులు మొదలయ్యే ముందే విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని దేశంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విశ్వవిద్యాలయాలకు విడుదల చేసింది. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కాలేజీలు దీన్ని పాటించాలంది. మారిన బోధనా ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఏఐసీటీఈ రెండేళ్లుగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలను కూడా కౌన్సిల్ పరిగణనలోనికి తీసుకుంది. జాతీయ విద్యావిధానంలో వస్తున్న మార్పులపై విద్యార్థులకు తొలి దశలోనే అవగాహన కల్పించకపోవడమే మానసిక ఒత్తిడికి కారణమని భావిస్తోంది. ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో కూడిన విధానం అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చాయి. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో పాఠ్య ప్రణాళికలో మార్పు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక్కసారిగా మూస విధానం నుంచి స్వతహాగా ఆలోచించే విద్యావిధానంలో అడుగుపెడుతున్నారు. ఇది కూడా మానసిక ఒత్తిడికి కారణమవుతోందని ఏఐసీటీఈ అధ్యయనంలో తేలింది. బ్యాక్లాగ్స్తోపెరుగుతున్నఒత్తిడి... అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిబంధనల ప్రకారం ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో మానసిక నిపుణులను నియమించాలి. ఇంటర్మీడియట్ విద్య వరకూ విద్యార్థులు బట్టీ పద్ధతిలో చదువుతున్నారు. ఇంజనీరింగ్ విద్య ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాబట్టే పద్ధతి ఉండదు. కంప్యూటర్ సైన్స్‌లో గణితం భాష ఒక్కసారిగా మారిపోతోంది. రెండో ఏడాదికి వచ్చేసరికి అనేక కంప్యూటర్ లాంగ్వేజ్‌లను విద్యార్థి నేర్చుకోవడమే కాకుండా, దాని ఆధారంగా ప్రయోగాత్మకంగా ఫలితాలు సాధించాల్సి ఉంటుంది. సివిల్, మెకానికల్‌లోనూ బేసిక్ ఇంటర్ విద్య స్థానంలో ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థి వ్యక్తిగతంగా స్కిల్ పెంచుకుంటే తప్ప ఈ పరిస్థితుల్లో ముందుకెళ్లడం కష్టం. ఈ కారణంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులకు బ్యాక్‌లాగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే విద్యార్థి మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. నిపుణులు విద్యార్థి మానసిక స్థితిని కౌన్సెలింగ్ ద్వారా మెరుగుపరచాలని మండలి సూచిస్తోంది. నైపుణ్య కొరత కూడా కారణమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కంప్యూటర్ కోర్సుల్లో విద్యార్థులు ఎక్కువ శాతం ప్రతిభ కనబర్చడం లేదని మండలి భావిస్తోంది. ప్రతి ఏటా మార్కెట్లోకి వస్తున్న విద్యార్థుల్లో కేవలం 8 శాతం మాత్రమే అవసరమైన నైపుణ్యం కలిగిఉంటున్నారని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. ఈ అంతరాన్ని పూడ్చడానికి రెండో ఏడాది నుంచే సంబంధిత రంగాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలా ప్రాజెక్టులు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. ఇది కూడా నామమాత్రంగా జరగడం వల్ల విద్యార్థులు ఉపాధి పొందే విషయంలో, ఉద్యోగంలో రాణించే విషయంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని నిపుణులు అంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఆరు నెలలకోసారి విద్యార్థి మానసిక ధోరణిని పరిశీలించాలని ఏఐసీటీఈ సూచించింది. -
నవంబర్ నుంచే.. ఇంజనీరింగ్ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం క్లాసులను నవంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కాలపట్టికను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాస్తవానికి అక్టోబర్ 25 నుంచే 2022–23 విద్యా సంవత్సరం ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పేర్కొంది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవ్వలేదు. మొదటి దశ సీట్ల భర్తీ జరిగినా రెండో దశను గత నెల 27న పూర్తి చేయాలని తొలుత భావించారు. ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంలో ఎఫ్ఆర్సీ ఎటూ తేల్చకపోవడంతో రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 11 నుంచి మొదలు పెట్టారు. ఈ నెల 16వ తేదీన సీట్ల కేటాయింపు చేపడతారు. ఈ దశలో కూడా మిగిలిపోయిన సీట్లకు నెలాఖరులోగా ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ ఈ నెల 25లోగా పూర్తి చేసి. ఆ తర్వాత కాలేజీల్లో ఐదు రోజుల పాటు పరిచయ కార్యక్రమాలు నిర్వహించి, నవంబర్ 1 నుంచి బోధన చేపట్టాలని భావిçÜ్తున్నారు. జాతీయ స్థాయిలోనూ... ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో కూడా ఈ నెల 16తో సీట్ల భర్తీ కార్యక్రమం పూర్తవుతుంది. దీంతో జాతీయ స్థాయిలో కూడా నవంబర్ మొదటి వారంలోనే క్లాసులు మొదలయ్యే వీలుంది. జోసా కౌన్సెలింగ్ తర్వాతే రాష్ట్ర ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ ముగించాలని ఉన్నత విద్య మండలి రెండేళ్ళుగా ప్రత్యేక చర్యలు తీసుకుంది. జేఈఈ ర్యాంకు ద్వారా జాతీయ కాలేజీల్లో సీట్లు రాని అభ్యర్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈలోగానే సీట్ల భర్తీ ముగిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాస్త ఆలస్యంగానే ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇతర కోర్సులూ నవంబర్లోనే ఎంటెక్, ఎంబీఏ, బీఈడీ, న్యాయవాద కోర్సుల్లో కామన్ పరీక్ష ఫలితాలు ఇప్పటికే వెల్లడించారు. ఎంటెక్, ఎంసీఏ కోర్సులకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇది మరో పది రోజుల్లో ముగిసే వీలుంది. బీఈడీ సీట్ల భర్తీ కూడా త్వరలో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లాసెట్ ముగిసినప్పటికీ నేషనల్ బార్ కౌన్సిల్ గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కారణంగా లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో జాప్యం ఉండొచ్చని భావిస్తున్నారు. దోస్త్ ద్వారా డిగ్రీ సీట్ల భర్తీ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే లక్షన్నర మంది డిగ్రీ కోర్సుల్లో చేరారు. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ తర్వాత మరో 50 వేల మంది డిగ్రీ కోర్సుల్లో చేరే వీలుందని భావిస్తున్నారు. మొత్తం మీద నవంబర్ మొదటి వారంలో ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని కోర్సులు మొదలయ్యే అవకాశం ఉంది. త్వరలో షెడ్యూల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధనకు సంబంధించిన కాలపట్టికను త్వరలోనే విడుదల చేస్తాం. ఇప్పటికే దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాం. జోసా కౌన్సెలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంజనీరింగ్ సీట్ల భర్తీ చేపడుతున్నాం. – ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి -
మళ్లీ ఆన్లైన్!
సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థలు మళ్లీ ఆన్లైన్ బాటపట్టాయి. కరోనా ఉధృతి దృష్ట్యా సెలవుల పొడిగింపుతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇంజనీరింగ్ సహా ఉన్నత విద్య విభాగాలు ఇప్పటికే ఆన్లైన్ బోధనపై కాలేజీలకు ఆదేశాలు జారీ చేశాయి. ఇంటర్ బోర్డ్ టీ–శాట్ ద్వారా బోధనకు షెడ్యూల్ ఇచ్చింది. పాఠశాల విద్యపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. ఉన్నతాధికారులు సోమవారం దీనిపై సమాలోచనలు జరపనున్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పరిగణనలోకి తీసుకుని ఆన్లైన్ వైపు అడుగు లేయక తప్పదని పాఠశాల విద్య ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అన్ని ప్రైవేటు కాలేజీల అధ్యా పకులు అందుబాటులోకి రావాలని ఆదివారం కబురుపెట్టాయి. ఆన్లైన్ తరగతులకు సిద్ధంగా ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రైవేటు యాజమాన్యాలు సందేశాలు పంపాయి. సెలవులు ఈనెల 30 వరకు ప్రకటించినందున ఆ తర్వాతైనా విద్యా సంస్థలు ప్రత్యక్ష బోధనకు వెళ్తాయా? అనే సందేహాలు ఉన్నాయి. రెండేళ్లుగా అరకొర బోధనే.. కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యారంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. 2020 మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఆన్లైన్ బోధనే అనివార్యమైంది. 2021లో ఫిబ్రవరిలో ప్రత్యక్ష బోధన మొదలైనా కోవిడ్ తీవ్రత పెరగడంతో మార్చి 21 నుంచి విద్యాసంస్థలు మళ్లీ మూతపడ్డాయి. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండా అందరినీ ప్రమోట్ చేశారు. ఇంజనీరింగ్ ఫైనల్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కేంద్రాల్లోనే పరీక్షల తంతు ముగించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం పూర్తిగా దెబ్బతింది. 2021 జూలై నుంచి ఆన్లైన్ ద్వారానే బోధన చేపట్టారు. కరోనా తీవ్రత తగ్గడంతో పూర్తిస్థాయి ప్రత్యక్ష బోధన అక్టోబర్ నుంచి మొదలైంది. ఇదే సమయంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించడం, 49 శాతం కూడా పాస్‌కాకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో ఫెయిలైన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేశారు. సరిగ్గా నాలుగు నెలలు కూడా బోధన సాగకుండానే ఈ నెల 8 నుంచి సంక్రాంతి సెలవులు రావడం.. దాన్ని పొడిగించడం జరిగింది. సిలబస్ సంగతేంటి? ►ఆన్లైన్ క్లాసుల్లో రోజుకు రెండు సబ్జెక్టులు బోధించడమే కష్టంగా ఉండేది. దీంతో జూలై–సెప్టెంబర్ వరకు జరిగిన ఆన్లైన్ క్లాసుల్లో పదో తరగతి సిలబస్ 60 శాతం పూర్తయినట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. వచ్చే రెండు నెలల్లో మిగతాది పూర్తి చేసి, రివిజన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రైవేటు స్కూళ్లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆన్లైన్ బోధన వల్ల సిలబస్ పూర్తి చేయడం సాధ్యమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. ►ఇంటర్ విద్యలో ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటికే సిలబస్ పూర్తయింది. ఇప్పుడు ఆన్లైన్ చేపట్టినా రివిజన్ మాత్రమే ఉంటుందని కాలేజీ నిర్వాహకులు అంటున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఇంకా 50 శాతం సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. టీ–శాట్ ద్వారా బోధన గతానికన్నా భిన్నంగా ఉంటే తప్ప, పూర్తిస్థాయిలో సిలబస్ పూర్తయ్యే పరిస్థితి ఉండదు. ►ఉన్నత విద్య క్లాసులన్నీ ఆన్లైన్లోనే చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఉత్తర్వులు ఇచ్చాయి. ఇంజనీరింగ్ ఫస్టియర్ మినహా మిగతా సెమిస్టర్ల సిలబస్ 70 శాతం వరకూ పూర్తయింది. ఫస్టియర్ విద్యార్థులకు చాలాచోట్ల ఇప్పుడిప్పుడే క్లాసులు మొదలవుతున్నాయి. కాబట్టి ఫస్టియర్ విద్యార్థులకు సమస్య ఉంది. డిగ్రీ కోర్సుల్లోనూ సిలబస్ పూర్తవ్వలేదని అధికారులు తెలిపారు. 30 వరకు సెలవులు పొడిగింపు రాష్ట్రంలో ఈ నెల 30 వరకూ అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదివారం ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. తొలుత ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఈ సెలవులను పొడిగించారు. వైద్య విద్య కాలేజీలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ ఉత్తర్వులు అమలవుతాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదిలాఉంటే, ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్తోపాటు మరికొన్ని యూనివర్సిటీలు సెలవుల కాలంలో ఆన్లైన్ పద్ధతిలో బోధన చేపట్టాలని ఆదేశాలిచ్చాయి. పాఠశాల విద్యా విభాగం అధికారులు సోమవారం సమావేశమై ఆన్లైన్ బోధనపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
25 నుంచి ఇంజనీరింగ్ క్లాసులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫస్టియర్ క్లాసులు ఈ నెల 25 నుంచి ప్రారంభించే వీలుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అతి త్వరలో విడుదల చేస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఇప్పటికే ఎంసెట్ రెండు దశల కౌన్సెలింగ్ చేపట్టారు. రెండో దశలో సీట్లు పొందిన అభ్యర్థులు గురువారం నాటికి సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో సీట్లు పొందిన వారిలో దాదాపు 3,500 మంది జాతీయ కాలేజీలు, ఇతర ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలకు వెళ్లిపోయారు. రెండో దశలోనూ సీట్లు మిగిలితే ఈ నెల 21 తర్వాత ప్రత్యేక కౌన్సెలింగ్ చేపడతారు. దీంతో మొత్తం సీట్ల కేటాయింపు పూర్తవుతుంది. 2021 ఎంసెట్‌లో 1,21,480 మంది అర్హత పొందారు. ఇంజనీరింగ్‌లో మొత్తం కన్వీనర్ సీట్లు 79,790 సీట్లున్నాయి. రెండు దశల కౌన్సెలింగ్ ద్వారా 73,428 సీట్లు కేటాయించారు. ఇంకా 19,797 సీట్లు మిగిలిపోయాయి. విద్యార్థులు చేరకుండా మిగిలిపోయే వాటిని, ఇప్పటికే ఖాళీగా ఉన్న సీట్లకు కలిపి ఈ నెల 21 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ చేపడతారు. ఈ ప్రక్రియ ఈ నెల 22తో ముగుస్తుందని, 25 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. జాతీయ సాంకేతిక విద్యా మండలి కూడా ఈ నెలాఖరులో ఇంజనీరింగ్ ఫస్టియర్ క్లాసులు మొదలు పెట్టాలని సూచించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు కాలేజీలు యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తున్నాయి. మొదలైన హడావుడి.. రాష్ట్రంలో మొత్తం 175 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో ప్రైవేటువి 158 వరకూ ఉన్నాయి. ఇంజనీరింగ్ క్లాసులు మొదలయ్యే సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని కాలేజీల్లోనూ హడావిడి మొదలైంది. టాప్ టెన్ కాలేజీల్లో ఇప్పటికే యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయ్యాయి. ఇతర ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి మల్లగుల్లాలు పడుతున్నారు. ఈసారి కంప్యూటర్ సైన్స్‌లో కొత్త కోర్సులకు అనుమతి లభించింది. దీంతో సీట్లు పెరిగాయి. కాలేజీల్లో అదనపు సెక్షన్ల ఏర్పాటు అనివార్యమవుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరగడంతోపాటు సివిల్, మెకానికల్ సీట్లు తగ్గాయి. ఈ రెండు విభాగాల్లో దాదాపు 2 వేల సీట్లను కొన్ని కాలేజీలు ఉపసంహరించుకున్నాయి. మరోవైపు గతేడాది కన్నా ఈ సంవత్సరం సీఎస్ఈ సీట్లను అన్ని కాలేజీలు పెంచుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ సీట్లు 19,101 ఉన్నాయి. ఇందులో ఇప్పటికీ 767 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవి గ్రామీణ ప్రాంతాల ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయి. మొత్తమ్మీద ఈసారి కంప్యూటర్ అనుబంధ కోర్సుల విద్యార్థులే ఎక్కువగా హడావిడి చేసే అవకాశముందని ఉన్నత విద్యా మండలి అధికారులు అంటున్నారు. -
డిసెంబర్ 1లోగా ఇంజనీరింగ్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు డిసెంబర్ 1లోగా తరగతులను ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పేర్కొంది. ఈ మేరకు రివైజ్డ్ షెడ్యూలును ప్రకటించింది. నవంబర్ 1 నుంచే తరగతులను ప్రారంభించేలా గతంలో అకడమిక్ షెడ్యూలును ప్రకటించినప్పటికీ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ వంటి జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో అకడమిక్ షెడ్యూలును తాజాగా సవరించింది. వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో నవంబర్ 30లోగా ప్రవేశాలను పూర్తి చేయాలని, డిసెంబర్ 1లోగా తరగతులను ప్రారంభించాలని వివరించింది. పరిస్థితులను బట్టి ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్ విధానంలో తరగతులను (అవసరమైతే రెండు పద్ధతుల్లో) నిర్వహించాలని సూచించింది. యూజీసీ జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని తన పరిధిలోని విద్యాసంస్థలను ఆదేశించింది. విద్యార్థులకు అవగాహన కోసం నిర్వహించే ఇండక్షన్ ప్రోగ్రాంను 3 వారాలకు బదులు మొదట ఒక వారమే నిర్వహించాలని సూచించింది. మిగతా రెండు వారాల ప్రోగ్రాంను తదుపరి సెమిస్టర్లలో నిర్వహించాలని స్పష్టం చేసింది. -
ఇంజనీరింగ్‌లో ముందు ఆన్లైనే
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆన్లైన్ బోధనకు అధికారులు మొగ్గుచూపుతున్నారు. ప్రథమ సంవత్సరం మినహా మిగతా సంవత్సరాల వారికి వచ్చే నెల 17వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా జేఎన్ టీయూ, ఓయూ రిజిస్ట్రార్లతోనూ ఉన్నతాధికారులు శుక్రవారం చర్చించారు. వచ్చేనెల నుంచి తరగతులను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే జేఎన్టీయూ కరోనా నేపథ్యంలో అనుసరించాల్సిన విద్యా బోధన ప్రణాళికపై ఓ నివేదికను సిద్ధం చేసింది. దానిని కూడా అధికారులు పరిశీలించారు. దాని అమలుకు అవసర మైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముందుగా కాలేజీలు విద్యార్థులకు వెబి నార్లు నిర్వహించాలని నిర్ణయించారు. వాటిని ఇప్పుటి నుంచే ప్రారంభిస్తే విద్యార్థులు అలవాటు పడతారని, ఏమైనా లోటుపాట్లు ఉన్నా తెలుస్తాయని, వీటిని సవరించుకొని ఆగస్టు 17వ తేదీనుంచి రెగ్యులర్ తరగతులను ఆన్లైన్లో నిర్వíహించవచ్చన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ఆన్లైన్ తరగతులను ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లోనే అమలు చేయడం సాధ్యం అవుతుందన్న భావనకు వచ్చారు. ఇక సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో రికార్డెడ్ వీడియో పాఠాలను బోధించాలన్న నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా టీశాట్, దూరదర్శన్ వంటి చానళ్ల ద్వారా, మరోవైపు యూట్యూబ్ చానళ్ల ద్వారా వీటిని ప్రసారం చేస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో ఎక్కువ మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నందున ఆన్లైన్ బోధన సాధ్యం కాదన్న భావనకు వచ్చారు. అందుకే వీడియో పాఠాలను రూపొందించి యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. వీలైన వారు వింటారని, మరోవైపు స్వయం పోర్టల్‌లో ఉన్న పాఠాలను కూడా వింటారన్న భావనకు వచ్చారు. అలాగే టీశాట్, దూరదర్శన్ ఛానెళ్ల ద్వారా ప్రసారం చేస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించారు. ఇలా సాంకేతిక విద్యా కోర్సుల్లో ఆన్లైన్ బోధనను, సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో వీడియో పాఠాలను రెండు మూడు నెలలపాటు నిర్వహించనున్నారు. అప్పటికీ కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి రాకపోతే కొన్నాళ్లు ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్లైన్లో బోధనను కొనసాగించనున్నారు. భౌతికదూరం పాటించేలా విద్యార్థులను విభజించి షిప్ట్ పద్దతుల్లో తరగతులు కొనసాగించడం లేదా రోజు విడిచి రోజు (ఒక రోజు ఆన్లైన్, ఒక రోజు ఆఫ్‌లైన్) పద్ధతుల్లో బోధనను కొనసాగించనున్నారు. కరోనా అదుపులోకి వచ్చాకే విద్యార్థులు అందరికీ రెగ్యులర్ తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
సెప్టెంబర్ 1నుంచి ఇంజనీరింగ్ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా కాలేజీల్లో తరగతులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యేలా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) షెడ్యూల్‌ను సవరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. నెల రోజులు ఆలస్యంగా విద్యా సంవత్సరం ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరే పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే ల్యాటరల్ ఎంట్రీ కూడా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ తదితర పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) మంత్రి రమేశ్ పోఖ్రియాల్ విడుదల చేశారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలను కరోనా కారణంగా కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా మంగళవారం తాజా షెడ్యూల్‌ను కేంద్ర మంత్రి జారీ చేశారు. జూలై 18, 20, 21, 22, 23 తేదీల్లో జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తామని, తేదీని తర్వాత ప్రకటిస్తామని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఏఐసీటీఈ సాంకేతిక విద్యా కాలేజీల గుర్తింపు, యూనివర్సిటీలు ఇవ్వాల్సిన అఫిలియేషన్ (అనుబంధ గుర్తింపు), కౌన్సెలింగ్ నిర్వహణ, తరతగతుల ప్రారంభానికి సంబంధించిన పూర్తి వివరాలతో షెడ్యూల్‌ను జారీ చేసింది. చదవండి: జూలై 26న నీట్ అప్రూవల్స్ డౌన్లోడ్ చేసుకోండి.. కోర్సుల్లో ఎలాంటి మార్పులు లేకుండా అప్రూవల్స్ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు తమ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదం మేరకు ఏప్రిల్ 30న అనుమతులు జారీ చేసినట్లు ఏఐసీటీఈ మెంబర్ కన్వీనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఆయా యాజమాన్యాలు తమ వెబ్సైట్ నుంచి అప్రూవల్ లేఖలను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. కమిటీ నిర్ణయం మేరకు ఈ తాజా షెడ్యూల్‌ను జారీ చేసినట్లు వెల్లడించారు. కొత్త కోర్సులకు అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీలకు అప్రూవల్స్ ఇచ్చేందుకు జూన్ 15వ తేదీ వరకు గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినట్లు వెల్లడించింది. యాజమాన్యాలు ఆన్లైన్ మీటింగ్, ఆన్లైన్ స్క్రూటినీ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం మైక్రో సాఫ్ట్ టీం సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. మేనేజ్మెంట్ కోర్సులకు వేరుగా.. మేనేజ్మెంట్ కోర్సులకు మాత్రం ఏఐసీటీఈ వేరుగా షెడ్యూల్‌ను ప్రకటించింది. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం), పీజీసీఎం కోర్సులకు మాత్రం ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని.. 2021 జూలై 31 వరకు విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయాలని పేర్కొంది. పాత విద్యార్థులకు జూలై 1 నుంచే ప్రారంభించాలని తెలిపింది. ఈ కోర్సుల ప్రవేశాలను ప్రతి ఏటా జూన్ 30కే పూర్తి చేయాల్సి ఉన్నా ఈసారి మాత్రం జూలై 31 వరకు గడువు ఇచ్చింది. సాంకేతిక విద్యా సంస్థలకు యూజీసీ మార్గదర్శకాలే.. యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, సాంకేతిక విద్యా సంస్థల్లో విద్యా కార్యక్రమాలు, పరీక్షలకు సంబంధించి ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీ చేసిన మార్గదర్శకాలు అమలు చేయాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా సంస్థలకు అవే మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొంది. ఫైనల్ సెమిస్టర్, ఇతర సెమిస్టర్ విద్యార్థుల పరీక్షల విషయంలో వాటి ప్రకారమే ముందుకు సాగాలని సూచించింది. ఈ మేరకు ఏఐసీటీఈ మెంబర్ సెక్రటరీ రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో డిటెన్షన్‌ను ఎత్తేసి, ఆయా విద్యార్థులను పైసెమిస్టర్‌కు ప్రమోట్ చేయనున్నారు. ఈసారి ఫెయిల్ అనేది.. నిర్ణీత 50 శాతం సబ్జెక్టులు పాస్ కాకుండా అదే సెమిస్టర్లో ఆగిపోవడం అనేది ఉండదు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థులకు ప్రమోషన్ ఇవ్వనున్నారు. అయితే వారికి జూలై 15 నుంచి 30 మధ్య పరీక్షలు నిర్వహించాలని, ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు జూలై 1 నుంచి 15లోగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో వీటి అమలుకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. -
జూలై 20 నుంచి ఇంజనీరింగ్ తరగతులు!
కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యా మండలి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు తరగతులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. జూలై 20 నుంచి తరగతులను ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. బుధవారం కౌన్సెలింగ్‌లో పాల్గొని వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 63,588 మంది విద్యార్థుల్లో 56,046 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించింది. వారిలో 7,542 మంది విద్యార్థులకు సీట్లు లభించలేదు. సీట్లు పొందిన విద్యార్థులు జూలై 7లోగా కాలేజీల్లో చేరనున్నారు. జూలై 20 తర్వాత చివరి దశ కౌన్సెలింగ్.. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల ఆరో దశ కౌన్సెలింగ్ జూలై 29తో ముగియనుంది. నాల్గో దశ కౌన్సెలింగ్ నాటికి అంటే 20వ తేదీ తర్వాత రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తోంది. నేటి (శుక్రవారం) నుంచి ఈసెట్, వచ్చే నెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ఉన్నాయి. అలాగే ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్‌ను చూసే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొన్ని సెట్స్ కౌన్సెలింగ్‌ను వచ్చే నెల 14 నుంచి 19 వరకు చేపట్టేలా షెడ్యూల్ చేసుకుంది. వీటన్నింటి నేపథ్యంలో మొదటి దశ కౌన్సెలింగ్‌లో మిగిలిన 8,254 సీట్ల భర్తీకి వచ్చే నెల 20వ తేదీ తరువాత చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయానికి వచ్చింది. -
జూలై 7 నుంచి ఇంజనీరింగ్ తరగతులు
ప్రవేశాలకు జూన్12న షెడ్యూల్ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తరగతులు ఈసారి జూలైలోనే ప్రారంభం కానున్నాయి. గత ఐదారేళ్లుగా ప్రవేశాల ప్రక్రియలో తీవ్ర జాప్యంతో తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కానీ ఈ ఏడాది మాత్రం జూలైలోనే తరగతుల ప్రారంభానికి ప్రభుత్వం పక్కాగా ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగానే ఎంసెట్ ర్యాంకులు వెల్లడించిన రోజునే ప్రవేశాల నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం ఆగస్టు 1వ తేదీ నాటికి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కావాలి. అయితే అంతకన్నా ముందుగానే జూలై 7 నుంచే ఇంజనీరింగ్ తరగతుల ప్రారంభానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఇందుకోసం జూన్ 12న ప్రవేశాల షెడ్యూల్‌ను జారీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సీట్ల భర్తీ కోసం వెబ్ ఆప్షన్లలో పాత విధానాన్నే అమలు చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. వన్‌టైమ్ పాస్వర్డ్ విధానం ఉంటుందని.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకున్నపుడే విద్యార్థులు తమ మొబైల్ నంబర్ ఇవ్వాలని చెప్పారు. విద్యార్థులు వెబ్సైట్లోకి లాగిన్ అయిన ప్రతిసారి కొత్త పాస్వర్డ్ వస్తుంది. ప్రవేశాల షెడ్యూల్ జూన్ 12న ప్రవేశాలకు నోటిఫికేషన్ 18 నుంచి 24 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 20 నుంచి 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం 27న ఆప్షన్లలో మార్పులకు అవకాశం 30న సీట్ల కేటాయింపు జూలై 7 నుంచి తరగతుల ప్రారంభం 9 నుంచి 14 వరకు చివరిదశ కౌన్సెలింగ్ 21 నుంచి చివరి దశ తరగతులు