సాక్షి, హైదరాబాద్: విద్యాసంస్థలు మళ్లీ ఆన్‌లైన్ బాటపట్టాయి. కరోనా ఉధృతి దృష్ట్యా సెలవుల పొడిగింపుతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇంజనీరింగ్ సహా ఉన్నత విద్య విభాగాలు ఇప్పటికే ఆన్‌లైన్ బోధనపై కాలేజీలకు ఆదేశాలు జారీ చేశాయి. ఇంటర్ బోర్డ్ టీ–శాట్ ద్వారా బోధనకు షెడ్యూల్ ఇచ్చింది. పాఠశాల విద్యపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. ఉన్నతాధికారులు సోమవారం దీనిపై సమాలోచనలు జరపనున్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పరిగణనలోకి తీసుకుని ఆన్‌లైన్ వైపు అడుగు లేయక తప్పదని పాఠశాల విద్య ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అన్ని ప్రైవేటు కాలేజీల అధ్యా పకులు అందుబాటులోకి రావాలని ఆదివారం కబురుపెట్టాయి. ఆన్‌లైన్ తరగతులకు సిద్ధంగా ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రైవేటు యాజమాన్యాలు సందేశాలు పంపాయి. సెలవులు ఈనెల 30 వరకు ప్రకటించినందున ఆ తర్వాతైనా విద్యా సంస్థలు ప్రత్యక్ష బోధనకు వెళ్తాయా? అనే సందేహాలు ఉన్నాయి.
రెండేళ్లుగా అరకొర బోధనే..
కరోనా కారణంగా రెండేళ్లుగా విద్యారంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. 2020 మార్చిలో లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత ఆన్‌లైన్ బోధనే అనివార్యమైంది. 2021లో ఫిబ్రవరిలో
ప్రత్యక్ష బోధన మొదలైనా కోవిడ్ తీవ్రత పెరగడంతో మార్చి 21 నుంచి విద్యాసంస్థలు మళ్లీ మూతపడ్డాయి. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండా అందరినీ ప్రమోట్ చేశారు. ఇంజనీరింగ్ ఫైనల్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న కేంద్రాల్లోనే పరీక్షల తంతు ముగించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం పూర్తిగా దెబ్బతింది. 2021 జూలై నుంచి ఆన్‌లైన్ ద్వారానే బోధన చేపట్టారు. కరోనా తీవ్రత తగ్గడంతో పూర్తిస్థాయి ప్రత్యక్ష బోధన అక్టోబర్ నుంచి మొదలైంది. ఇదే సమయంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించడం, 49 శాతం కూడా పాస్‌కాకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో ఫెయిలైన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేశారు. సరిగ్గా నాలుగు నెలలు కూడా బోధన సాగకుండానే ఈ నెల 8 నుంచి సంక్రాంతి సెలవులు రావడం.. దాన్ని పొడిగించడం జరిగింది.
సిలబస్ సంగతేంటి?
►ఆన్‌లైన్ క్లాసుల్లో రోజుకు రెండు సబ్జెక్టులు బోధించడమే కష్టంగా ఉండేది. దీంతో జూలై–సెప్టెంబర్ వరకు జరిగిన ఆన్‌లైన్ క్లాసుల్లో పదో తరగతి సిలబస్ 60 శాతం పూర్తయినట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. వచ్చే రెండు నెలల్లో మిగతాది పూర్తి చేసి, రివిజన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రైవేటు స్కూళ్లలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆన్‌లైన్ బోధన వల్ల సిలబస్ పూర్తి చేయడం సాధ్యమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి.
►ఇంటర్ విద్యలో ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటికే సిలబస్ పూర్తయింది. ఇప్పుడు ఆన్‌లైన్ చేపట్టినా రివిజన్ మాత్రమే ఉంటుందని కాలేజీ నిర్వాహకులు అంటున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఇంకా 50 శాతం సిలబస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. టీ–శాట్ ద్వారా బోధన గతానికన్నా భిన్నంగా ఉంటే తప్ప, పూర్తిస్థాయిలో సిలబస్ పూర్తయ్యే పరిస్థితి ఉండదు.
►ఉన్నత విద్య క్లాసులన్నీ ఆన్‌లైన్‌లోనే చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఉత్తర్వులు ఇచ్చాయి. ఇంజనీరింగ్ ఫస్టియర్ మినహా మిగతా సెమిస్టర్ల సిలబస్ 70 శాతం వరకూ పూర్తయింది. ఫస్టియర్ విద్యార్థులకు చాలాచోట్ల ఇప్పుడిప్పుడే క్లాసులు మొదలవుతున్నాయి. కాబట్టి ఫస్టియర్ విద్యార్థులకు సమస్య ఉంది. డిగ్రీ కోర్సుల్లోనూ సిలబస్ పూర్తవ్వలేదని అధికారులు తెలిపారు.
30 వరకు సెలవులు పొడిగింపు
రాష్ట్రంలో ఈ నెల 30 వరకూ అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదివారం ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. తొలుత ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఈ సెలవులను పొడిగించారు. వైద్య విద్య కాలేజీలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ ఉత్తర్వులు అమలవుతాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇదిలాఉంటే, ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూహెచ్‌తోపాటు మరికొన్ని యూనివర్సిటీలు సెలవుల కాలంలో ఆన్‌లైన్ పద్ధతిలో బోధన చేపట్టాలని ఆదేశాలిచ్చాయి. పాఠశాల విద్యా విభాగం అధికారులు సోమవారం సమావేశమై ఆన్‌లైన్ బోధనపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment