కటాఫ్ తగ్గింపుతో మిగిలిన సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ
11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
ఇన్ సర్వీస్ వైద్యులకు దక్కని ఊరట
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్యవిద్యలో ప్రవేశాల ప్రక్రియ తుది దశకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర కోటా ప్రవేశాల కోసం రెండు దశల్లో విడుదలైన అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. తాజాగా కేంద్రం పీజీ అడ్మిషన్లకు కటాఫ్ తగ్గించటంతో అందుకు తగ్గట్లుగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో కలిపి రాష్ట్ర కోటా కింద 1,350 పీజీ సీట్లు ఉన్నాయి.
కటాఫ్ తగ్గించడంతో మిగిలిపోయిన సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. పీజీ ప్రవేశాలకు అర్హత సాధించాలంటే ఇప్పటివరకు జనరల్ విద్యార్థులు 50 శాతం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు 40 శాతం పర్సంటైల్ సాధించాలనే నిబంధన ఉంది. దీనివల్ల చాలా వర్సిటీలలో పీజీ సీట్లు మిగిలిపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కటాఫ్ పర్సంటైల్‌ను జనరల్‌కు 15 శాతం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 10 శాతంగా నిర్ణయించింది.
తగ్గిన కటాఫ్ ప్రాతిపదికన మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం (8వ తేదీ) సాయంత్రం ఐదు గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజి్రస్టేషన్ చేసుకోవాలని కోరింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ జాబితాను విడుదల చేస్తుంది. తదనుగుణంగా వెబ్ ఆప్షన్లకు మరో నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
ఇన్‌సర్వీస్ వైద్యులకు నిరాశే
స్థానికతపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జరగాల్సిన వాదనలు 15 తేదీకి వాయిదా పడ్డాయి. దీంతో తెలంగాణ ఇన్ సర్వీస్ డాక్టర్లకు నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో ఇన్‌సర్వీస్ కోటా కింద 297 సీట్లు ఉండగా , ఇప్పటివరకు 17 మంది మాత్రమే పీజీలో చేరారు.
కటాఫ్ తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఇచ్చిన నోటిఫికేషన్ దరఖాస్తులకు ఈ నెల 11 చివరి తేదీగా నిర్ణయించటంతో.. కేసు విచారణకు ముందే ఇన్ సర్వీస్ కోటా సీట్ల భర్తీ కూడా పూర్తవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment