PG medical education
-
తుది దశకు నీట్–పీజీ అడ్మిషన్లు
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్యవిద్యలో ప్రవేశాల ప్రక్రియ తుది దశకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర కోటా ప్రవేశాల కోసం రెండు దశల్లో విడుదలైన అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. తాజాగా కేంద్రం పీజీ అడ్మిషన్లకు కటాఫ్ తగ్గించటంతో అందుకు తగ్గట్లుగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో కలిపి రాష్ట్ర కోటా కింద 1,350 పీజీ సీట్లు ఉన్నాయి. కటాఫ్ తగ్గించడంతో మిగిలిపోయిన సీట్ల భర్తీకి మార్గం సుగమమైంది. పీజీ ప్రవేశాలకు అర్హత సాధించాలంటే ఇప్పటివరకు జనరల్ విద్యార్థులు 50 శాతం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు 40 శాతం పర్సంటైల్ సాధించాలనే నిబంధన ఉంది. దీనివల్ల చాలా వర్సిటీలలో పీజీ సీట్లు మిగిలిపోతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కటాఫ్ పర్సంటైల్‌ను జనరల్‌కు 15 శాతం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 10 శాతంగా నిర్ణయించింది. తగ్గిన కటాఫ్ ప్రాతిపదికన మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బుధవారం (8వ తేదీ) సాయంత్రం ఐదు గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్లైన్లో రిజి్రస్టేషన్ చేసుకోవాలని కోరింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ జాబితాను విడుదల చేస్తుంది. తదనుగుణంగా వెబ్ ఆప్షన్లకు మరో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఇన్‌సర్వీస్ వైద్యులకు నిరాశే స్థానికతపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం జరగాల్సిన వాదనలు 15 తేదీకి వాయిదా పడ్డాయి. దీంతో తెలంగాణ ఇన్ సర్వీస్ డాక్టర్లకు నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో ఇన్‌సర్వీస్ కోటా కింద 297 సీట్లు ఉండగా , ఇప్పటివరకు 17 మంది మాత్రమే పీజీలో చేరారు. కటాఫ్ తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఇచ్చిన నోటిఫికేషన్ దరఖాస్తులకు ఈ నెల 11 చివరి తేదీగా నిర్ణయించటంతో.. కేసు విచారణకు ముందే ఇన్ సర్వీస్ కోటా సీట్ల భర్తీ కూడా పూర్తవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. -
పీజీ వైద్య విద్య అవకాశాలకు గండి
సాక్షి, అమరావతి: తమ పీజీ వైద్య విద్య అవకాశాలకు రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతోందని ఎంబీబీఎస్ పూర్తయిన విద్యార్థులు మండిపడుతున్నారు. ఏపీలోని మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ చదివిన వారంతా రాష్ట్రంలో స్థానికులుగా గుర్తించి పీజీ మెడికల్ అడ్మిషన్లు చేపడుతుండటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎంబీబీఎస్ చదివిన ఉత్తరాది సహా పక్కనున్న తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళకు చెందిన మెడికోలకు స్థానికత కల్పించడం ఏంటని, ఒకటి నుంచి ఎంబీబీఎస్ వరకు మన రాష్ట్రంలో చదివిన మెడికోలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ మొదలైందని, నిబంధనలు సవరించ డం కుదరదని ప్రభుత్వం చేతులు ఎత్తేయడం పట్ల మండి పడుతున్నారు. జీవో 646ను అనుసరించి ఇలా చేయాల్సి వస్తోందని ఎన్టీఆర్ వర్సిటీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నెలతో రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. ఈ మేరకు విభజన చట్టం ప్రకారం సిద్ధార్థ వైద్య కళా శాలలో తెలంగాణాకు ఎంబీబీఎస్, పీజీ సీట్ల కేటాయింపును రద్దు చేశారు. అయినప్పటికీ పీజీ తెలంగాణ వారికి పీజీ సీట్లు కేటాయించడం ఏ లెక్కన సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. 646 జీవోకు ఎందుకు సవరణ చేయలేదని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వలేదని, ఈ నేపథ్యంలో ఈ జీవోకు సవరణ చేయా ల్సిందేనని మెడికోలు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తు న్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకో వాలని కోరుతున్నారు. కాగా, ఈ ఏడాది కొత్త కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు మంజూరైనా.. వద్దంటూ లేఖ రాసి గండికొట్టిన ప్రభుత్వం.. తాజాగా పీజీ విద్య విషయంలోనూ క్షమార్షం కాని తప్పిదం చేసిందంటున్నారు. మెడికోల వాదన ఇలా..రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివిన ఏ రాష్ట్రానికి చెందిన వారినైనా పీజీ మెడికల్ ప్రవేశాల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయం స్థానికులుగా పరిగణిస్తోంది. రాష్ట్ర కోటా సీట్లలో వారికి రిజర్వేషన్ కల్పిస్తోంది. ఉదాహరణకు రాష్ట్రంలో 460కి పైగా ఆల్ ఇండియా, 600 మేర సీ కేటగిరి, బీ కేటగిరిలోనే బీ1 కింద 150 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ సీట్లలో పెద్ద ఎత్తున అడ్మి షన్లు పొంది ఎంబీబీఎస్ చదువుతుంటారు. అలాగే కన్వీనర్ కోటా కింద గత ఏడాది వరకు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో తెలంగాణ విద్యార్థులు 40 శాతం మంది ఎంబీబీఎస్ చదివారు. ఇలా ఇక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇతర రాష్ట్రాల వారందరికీ స్థానికత కల్పించడంతో వందల సంఖ్యలో పీజీ సీట్లు రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారు. మరోవైపు పక్కనున్న తెలంగాణా రాష్ట్రం పీజీ అడ్మిషన్ల నిబంధనలను సవరించింది. మన వాళ్లు ఎక్కడ చదివినా స్థానికత కల్పించాలిఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర ఎంబీబీఎస్ చది విన వారికి స్థానికత కల్పించే విధానాన్ని రద్దు చేయాలి. ఏపీ విద్యార్థులు ఆల్ ఇండియా కోటా కింద ఏ రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినా పీజీలో మన దగ్గరే స్థానికత కల్పించాలి.మన విద్యార్థులకు పక్క రాష్ట్రాలు స్థానికత ఇవ్వ నప్పుడు, ఇతర రాష్ట్రాల వారికి మనం స్థానికత ఇవ్వడం సరికాదు. ఆ మేరకు నిబంధనలు సవరించాలి. లేదంటే మన విద్యార్థులకే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, ప్రెసిడెంట్, ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ -
సమ్మె విరమించేది లేదు
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటా కుదిస్తూ జారీ చేసిన జీవో 85ను రద్దు చేసే వరకూ సమ్మె విరమించబోమని పీహెచ్సీ వైద్యులు తేల్చిచెప్పారు. బుధవారం మంత్రి సత్యకుమార్‌తో చర్చల్లో సమ్మెల విరమణకు అంగీకరించిన పీహెచ్సీ వైద్యుల సంఘం ప్రతినిధులపై వైద్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి ప్రధాన డిమాండ్ అయిన జీవో రద్దుకు ప్రభుత్వం అంగీకరించకుండా సమ్మె విరమిస్తామని ప్రభుత్వానికి ఎలా చెబుతారని నిలదీశారు.సచివాలయంలో జరిగిన ఈ చర్చల్లో మంత్రితో పాటు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చల్లో జీవో 85 రద్దు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు సహా పలు అంశాలను వైద్యుల సంఘం నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీవో రద్దుకు ప్రభుత్వం అంగీకారం తెలపలేదు. జీవో సవరణ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు ప్రకటన విడుదల చేశారు. ఎంపిక చేసిన కోర్సుల్లోనే కాకుండా అన్ని క్లినికల్ కోర్సుల్లోనూ అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. చర్చల అనంతరం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఫంక్షన్ హాల్లో సుమారు 1500 మంది వైద్యులతో సంఘం నేతలు సమావేశమయ్యారు. మరోమారు ప్రభుత్వం సోమ, మంగళవారాల్లో చర్చలకు పిలుస్తుందని, ఈ క్రమంలో సమ్మె విరమిస్తామని ఒప్పుకున్నట్టు వెల్లడించారు. జీవో రద్దు చేయకుండా సమ్మె ఎలా విరమిస్తామంటూ వైద్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె కొనసాగించాల్సిందేనని చెప్పారు. వైద్యులను అవమానించిన పోలీసులుధర్నా చౌక్‌లో నిరసన తెలుపుతున్న వైద్యులను పోలీసులు అవమానించారు. ఇన్‌సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసనకు పోలీస్ శాఖను వైద్యులు అనుమతి కోరారు. మంగళ, బుధవారాల్లో నిరసన తెలపడానికి పోలీస్ కమిషనర్ అనుమతి ఇచ్చారు. బుధవారం ప్రభుత్వం చర్చలకు పిలిచినందున ధర్నాచౌక్‌లో అనుమతి రద్దు చేశామంటూ వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. నిల్చోడానికి కూడా వీల్లేకుండా వెళ్లిపోవాలంటూ బలవంతంగా పంపేశారు. చేసేదేమీ లేక బసవపున్నయ్య ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకుని అక్కడ సమావేశమయ్యారు. పోలీసుల చర్య తమను అవమానించడమేనని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు -
జిల్లాల్లో వైద్య సేవలు తప్పనిసరి..
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్య కోర్సుల్లో డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ (డీఆర్పీ)ని అమలు చేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రూపొందించింది. డీఆర్పీని 2020–21లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రవేశపెట్టింది. డీఆర్‌పీలో భాగంగా ఎండీ/ఎంఎస్ కోర్సులు చేసే పీజీ రెసిడెంట్లు మూడు, నాలుగు, ఐదో సెమిస్టర్ల సమయంలో మూడు నెలల పాటు ఆయా జిల్లాల్లోని 100 పడకలు పైబడిన ప్రభుత్వాస్పత్రుల్లో శిక్షణ పొందాలి. ఈ మూడు నెలలు వీరు ఆయా ఆస్పత్రుల్లో రెసిడెంట్లుగా సేవలు అందించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణపై పీజీ వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించడమే డీఆర్పీ ముఖ్య ఉద్దేశం. మూడు నెలల కాలంలో ప్రీ, పారా క్లినికల్ రెసిడెంట్లు రోగనిర్ధారణ/ప్రయోగశాలలు, ఫార్మసీ, ఫోరెన్సిక్ సేవలు, సాధారణ వైద్య విధులు, ప్రజారోగ్య కార్యక్రమాలపై శిక్షణ ఇస్తారు. క్లినికల్ స్పెషాలిటీ రెసిడెంట్లు ఆయా స్పెషాలిటీ ఔట్‌పేషెంట్, ఇన్ పేషెంట్, క్యాజువాలిటీ, ఇతర ప్రాంతాలలో సేవలు అందించడంతోపాటు రాత్రి విధులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మూడు నెలల కాలంలో వసతి, స్టైపెండ్ అందిస్తారు. 17 జిల్లా, 53 ఏరియా ఆస్పత్రులు.. రాష్ట్రంలో వంద పడకలు పైబడినవాటిలో 17 జిల్లా, 53 ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. డీఆర్పీ 2020–21లోనే అమలులోకి వచ్చినప్పటికీ కరోనా కారణంగా అమలు చేయలేదు. దీంతో వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2020–21లో పీజీ కోర్సుల్లో చేరిన 800 మంది ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మూడో సంవత్సరం చదువుతున్నారు. వీరందరికీ డీఆర్పీని వచ్చే జనవరి నుంచి అమలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. డీఆర్పీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లాకు ఒక కోఆర్డినేటర్‌ను నియమిస్తారు. పీజీ రెసిడెంట్లకు శిక్షణను కోఆర్డినేటర్ పర్యవేక్షిస్తుంటారు. పీజీ తుది పరీక్షలకు హాజరు కావడానికి ముందు డీఆర్పీని సంతృప్తికరంగా పూర్తి చేయడం తప్పనిసరి. ప్రతిపాదనలు సిద్ధం చేశాం.. పీజీ వైద్య విద్యలో డీఆర్పీ అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రస్తుతం మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులకు వచ్చే జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయించాం. అదేవిధంగా రొటేçÙన్ పద్ధతిలో రెండో సంవత్సరం విద్యార్థులను డీఆర్పీ పరిధిలోకి తీసుకొస్తాం. వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులతో పోలిస్తే జిల్లా స్థాయిలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలు భిన్నంగా ఉంటాయి. డీఆర్పీ అమలుతో జిల్లా స్థాయిలో వైద్య కార్యక్రమాల అమలు, క్లినికల్, ప్రీ, పారా క్లినికల్ సేవలపై విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. ఇది వారి భవిష్యత్‌కు ఎంతగానో తోడ్పడుతుంది. – డాక్టర్ వినోద్ కుమార్, డీఎంఈ -
జనరల్ మెడిసిన్‌కు డిమాండ్!
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఈ ఏడాది జనరల్ మెడిసిన్ సీట్లకు ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది. గత మూడు, నాలుగేళ్లుగా సీట్ల భర్తీ తీరును పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. జనరల్ మెడిసిన్ చేస్తే సూపర్ స్పెషాలిటీలో మంచి కోర్సులు చేసేందుకు అవకాశాలుంటాయి. జనరల్ మెడిసిన్(ఎండీ) పూర్తయ్యాక గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ, మెడికల్ అంకాలజీ, కార్డియాలజీ, వంటి సూపర్ స్పెషాలిటీ(డీఎం) కోర్సులు చేసేందుకు వీలుంటుంది. ఈ క్రమంలో తొలి కౌన్సెలింగ్‌లోనే జనరల్ మెడిసిన్ సీట్లు భర్తీ అవుతున్నాయి. వైద్య విద్యార్థుల రెండో ప్రాధాన్యంలో రేడియాలజీ, ఆర్థోపెడిక్స్, ప్రసూతి, గైనకాలజీ(ఓబీజీ), పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ కోర్సులుంటున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 2022–23 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య విద్య ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. నెలాఖరులోగా ప్రవేశ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరో వైపు రాష్ట్ర కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రం నుంచి నీట్ పీజీ–2022లో 8,636 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 13 ప్రైవేట్, ఒక మైనారిటీ వైద్య కళాశాలలున్నాయి. వీటిలో 2,207 పీజీ ఎండీ/ఎంఎస్ సీట్లున్నాయి. వీటిలో ఆలిండియా కోటా కింద 475 సీట్లు భర్తీ అవుతాయి. మిగిలిన సీట్లలో 1,138 సీట్లు కన్వీనర్ కోటాలో, 594 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు వైద్య కళాశాల, కాకినాడలోని రంగరాయ వంటి కాలేజీల్లో పీజీ వైద్య సీటు కోసం అభ్యర్థులు తీవ్రంగా పోటీపడతారు. మరో వైపు రాష్ట్రం నుంచి నీట్ ఎండీఎస్–2022లో 896 మంది అర్హత సాధించారు. ప్రభుత్వ పరిధిలో విజయవాడ, కడపలలో రెండు డెంటల్ కళాశాలలున్నాయి. ఈ రెండు కళాశాలలు, ప్రైవేట్ డెంటల్ కళాశాలల్లో 400 వరకూ ఎండీఎస్ సీట్లున్నాయి. ఇన్ సర్వీస్ సీట్ల భర్తీ ఇలా.. రాష్ట్ర ప్రభుత్వ కోటాలోని 50 శాతం సీట్లలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్ క్లినికల్ సీట్లను ప్రత్యేకంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించిన ఇన్–సర్వీస్ అభ్యర్థులకు కేటాయించారు. మరో వైపు ఇన్–సర్వీస్ కోటా నిబంధనల్లో ప్రభుత్వం ఈ ఏడాది మార్పులు చేసింది. గిరిజన ప్రాంతాల్లోని రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం గుర్తించిన సంస్థల్లో రెండేళ్లు పనిచేసిన వైద్యులకు ఇన్ సర్వీస్ కోటా కింద ప్రవేశాలకు అవకాశం కల్పించింది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు, ఏపీ వైద్య, ఆరోగ్య సేవలు, ఏపీవీవీపీ, ఏపీ ఇన్‌స్రూ?న్స్ మెడికల్ సర్వీసెస్, యూనివర్సిటీల్లో నిరంతరాయంగా ఆరేళ్లు సేవలందించిన వారికి ఇన్ సర్వీస్ కోటాలో ప్రవేశాలు కల్పించనున్నారు. స్పెషలైజేషన్ పూర్తయ్యాక ఇన్‌సర్వీస్ కోటా కోసం పని చేసినట్టు చూపిన ప్రాంతంలోనే ఆరేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. -
మేం పీజీ చేయొద్దా?
సాక్షి, హైదరాబాద్: ఇన్ సర్వీస్ కోటా రద్దుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే ఎంబీబీఎస్ వైద్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండేళ్లుగా వందల మంది సర్వీసులో ఉండగా, పీజీ వైద్య విద్య చదివేందుకు వీల్లేకుండా పోయింది. ప్రస్తుతం పీజీ వైద్య విద్యలో అడ్మిషన్లు జరుగుతున్న నేపథ్యంలో 51 మంది మాత్రమే సర్వీసులో ఉన్న ఎంబీబీఎస్ వైద్యులు అర్హత సాధించారు. గతంలో ఇన్ సర్వీస్ కోటా ఉన్న సమయంలో దాదాపు 150 మందికి పైగా పీజీ వైద్య సీట్లు సాధించేవారు. దీనిపై వైద్యులు, సంఘాలు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో ప్రభుత్వ వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాల్లో పీహెచ్సీ, సీహెచ్సీలలో వైద్యులు, స్పెషలిస్టులను పెద్ద ఎత్తున నియమించేందుకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1975లో ప్రభుత్వంలో పనిచేస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలుగా ఇన్‌సర్వీస్ పీజీ కోటాను ప్రవేశపెట్టారు. ఇలా దేశంలో 11 రాష్ట్రాలు ఇన్ సర్వీస్ కోటాను ప్రవేశపెట్టాయి. దీనిద్వారా చాలామంది వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. అయితే నీట్ పరీక్షలను తీసుకురావడంతో మొత్తం వ్యవహారం తలకిందులైంది. ఫలితంగా ప్రభుత్వ వైద్యులకు కల్పిస్తున్న ఇన్‌సర్వీస్ పీజీ కోటా రద్దు చేశారు. డిప్లొమా కోర్సులకు మాత్రమే రిజర్వేషన్ కల్పించి మెడికల్ డిగ్రీ కోర్సులకు ఏడాదికి 10 శాతం వెయిటేజీ కల్పించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లే ఇదంతా జరిగిందని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ వైద్యులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు. ఎంబీబీఎస్‌తో ఉద్యోగానికి వెళ్తే అంతేనా? ఎంబీబీఎస్ చేశాక పీహెచ్‌సీల్లో, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ వైద్యులుగా ఉద్యోగానికి వెళ్లాక, ఉన్నత చదువులు చదవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఐదారేళ్లు పనిచేశాక ‘నీట్’పరీక్ష రాయాలంటే అకడమిక్ వాతావరణం నుంచి కాస్త దూరం ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో పరీక్షల్లో మంచి ర్యాంకు వచ్చే అవకాశం ఉండట్లేదు. దీంతో వైద్య విద్యలో ఉన్నత చదువులకు దూరం కావాల్సి వస్తుందని ప్రభుత్వ ఎంబీబీఎస్ వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇన్‌సర్వీస్ కోటా రద్దు వల్ల ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇదే పరిస్థితి పదేళ్లు కొనసాగితే దేశంలో ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు రారని, ప్రభుత్వ వైద్యుల సంఖ్య తగ్గుతుందని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కమల్‌నాథ్ అభిప్రాయపడ్డారు. ఇన్ సర్వీస్ కోటా రద్దుపై పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు. -
వెద్యుల ‘పీజీ’ కలలు కల్లలు చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను ఎత్తివేసి, దాని స్థానంలో వెయిటేజీ ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఇన్ సర్వీస్ కోటాకు బదులు వెయిటేజీ ఇస్తూ ఈ నెల 22న జారీచేసిన జీవోలు 21, 22లను కొట్టేయాలని, 2017లో జారీచేసిన జీవో 27 ప్రకారమే ప్రవేశాలు కల్పించేలా కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాదులు విద్యాసాగర్, రఘురామ్‌లు వాదించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించిన వైద్యులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ఇన్‌సర్వీస్ కోటా కొనసాగించాలని కోరుతూ వైద్యులు ఎం.వసుచరణ్‌రెడ్డి, మరో 12 మంది దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. కొత్త విధానాన్ని కొనసాగిస్తే చాలా మంది వైద్యులు పీజీ చేయకుండానే మిగిలిపోతారని, పీజీ చేయాలనే వారి కలలు కల్లలవుతాయన్నారు. ఎంసీఐ నిబంధనల ప్రకారం పీజీలో నేషనల్ పూల్‌కు 50 శాతం సీట్లు పోగా, మిగిలిన 50 శాతం సీట్లు స్థానికులకే చెందుతాయని ప్రభుత్వం తాజా జీవోల్లో పేర్కొందని వారు హైకోర్టుకు వివరించారు. ఈ జీవోలు ఏపీ పునర్ విభజన చట్టంలోని సెక్షన్ 95కు విరుద్ధమన్నారు. పునర్విభజన చట్టంలో ఇన్ సర్వీస్ కోటా విద్యార్థులకు నిర్దేశించిన కోటా పదేళ్లపాటు అమల్లో ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారని, ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఈ జీవోలు జారీ చేసిందన్నారు. దీనిపై గురువారం కూడా వాదనలు కొనసాగనున్నాయి. -
ఆ రెండు జీవోలను కొట్టేయండి
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను ఎత్తివేసి, దాని స్థానంలో వెయిటేజీ ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో శనివారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రభుత్వం ఈ నెల 22న జారీ చేసిన జీవోలు 21, 22లను కొట్టేసి, 2017లో జారీ చేసిన జీవో 27 ప్రకారమే ప్రవేశాలు కల్పించేలా కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. పీజీ ప్రవేశాలు ఆశిస్తున్న వైద్యులు డాక్టర్ ఎం.వసుచరణ్‌రెడ్డి, మరో 12 మంది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో వైద్య విద్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, వైస్ చాన్స్‌లర్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కన్వీనర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం పీజీలో నేషనల్ పూల్‌కు 50 శాతం సీట్లు పోగా, మిగిలిన 50 శాతం సీట్లు స్థానికులకే చెందుతాయని ప్రభుత్వం తాజా జీవోల్లో పేర్కొందని పిటిషనర్లు వివరించారు. అంతేగాక ప్రస్తుతం రాష్ట్రంలో పీజీ చేస్తున్న విద్యార్థులకు పీజీ ప్రవేశాల్లో నిర్దిష్ట కోటా ఉందని, క్లినికల్‌కు 30 శాతం, నాన్ క్లినికల్‌కు 50 శాతం కోటా ఉందన్నారు. ప్రభుత్వం తాజా జీవోల ద్వారా ఈ కోటాను ఎత్తివేసిందని తెలిపారు. ఈ జీవోలు ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 95కు విరుద్ధమని వివరించారు. నేషనల్ పూల్‌లో 50 శాతం సీట్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలో ఇన్ సర్వీస్ కోటా విద్యార్థులకు పదేళ్ల పాటు అమల్లో ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారని.. కానీ, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఈ జీవోలు జారీ చేసిందని వివరించారు. వైద్య విశ్వవిద్యాలయం వీసీ రాసిన లేఖ ఆధారంగా ప్రభుత్వం ఈ జీవోలు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ జీవోల వల్ల తమకు తీరని నష్టం కలుగుతుందని వీటిని కొట్టేయాలని కోరారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు జీవోల అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
పీజీ వైద్య ఫీజులపై పునరాలోచించాలి
బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల దోపిడీకి వీలుకల్పించేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని దుయ్యబట్టారు. ఫీజుల పెంపుపై కేంద్ర వైద్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడుతూ భారీగా పెంచిన ఫీజుల వల్ల పేద వర్గాలకు చెందిన వారెవరూ పీజీ విద్యను చదివే పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమా అని ప్రశ్నించారు. వైద్య పీజీ కోర్సులు చదివేందుకు విద్యార్థులకు బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వనంత స్థాయిలో ఈ ఫీజులను పెంచడం దారుణమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు సరిగా లేవని, ప్రమాణాలను పాటిం చడం లేదని ఎంసీఐ చెబుతుండగా, ఇటువంటి నాసిరకం కాలేజీలకు భారీగా ఫీజు లను పెంచే వీలు కల్పించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అనుకూల మెడికల్ కాలేజీల యాజమాన్యాలు, మిత్రపక్షం ఎంఐఎం మెడికల్ కాలేజీకి లబ్ధి జరి గేలా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్, చంద్రబాబు ఒకరి అడుగు జాడల్లో మరొకరు నడుస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. -
పీజీ వైద్య విద్య అడ్మిషన్లకు నోటిఫికేషన్
నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పీజీ వైద్య సీట్ల అడ్మిషన్లకు సోమ వారం నోటిఫికేషన్ విడుదలైంది. నీట్ పీజీ–2017, నీట్ ఎండీ ఎస్–2017 ప్రవేశ పరీక్షలో కటాఫ్ మార్కులు సాధించిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి మెరిట్ జాబితా తయారు చేసి మెడికల్ పీజీ, డిప్లమో, ఎండీఎస్ కోర్సుల్లో సీట్లు భర్తీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్రావు వెల్లడించారు. నిమ్స్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని పీజీ వైద్య సీట్లు భర్తీ చేస్తారు. దరఖాస్తులను మంగళవారం ఉదయం 11 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. మరిన్ని వివరాలను www.knruhs.in, http://tsp gmed.tsche.in, http://tsmds.tsche.inల్లో చూడవచ్చు. ఉమ్మడి కౌన్సెలింగ్.. ప్రభుత్వ సీట్లు, నాన్ మైనారిటీ, మైనారిటీల్లోని కన్వీనర్ కోటా పీజీ వైద్య సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగా ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామని తెలుపుతూ వైద్య ఆరోగ్యశాఖ సోమవారం నోటిఫి కేషన్ జారీచేసింది. కాగా, ఏయే కాలేజీల్లో ఎన్ని పీజీ సీట్లు ఉన్నాయో ప్రకటించాల్సి ఉంది. ► ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29% రిజర్వేషన్ అమలుచేస్తారు. ► 30% క్లినికల్ పీజీ సీట్లను, 50% ప్రీ, పారా క్లినికల్ సీట్లను ఇన్ సర్వీస్ కోటాలో ఇస్తారు. అందులోనూ రిజర్వేషన్లు ఉంటాయి. ► రెండేళ్లు ఆపై గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వైద్యులు, మూడేళ్లు ఆపైన గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసినవారు, ఆరేళ్లు, ఆపైన పట్టణాల్లో పనిచేసిన అభ్యర్థులు ఇన్‌సర్వీస్ కోటా రిజర్వేషన్లకు అర్హులు. దరఖాస్తులో ఆ వివరాలన్నీ నమోదు చేయాలి. పనిచేస్తున్నట్లు డీఎంఈ నుంచి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ►కాంట్రాక్లు, ఔట్ సోర్సింగ్ వైద్యులు ఇన్‌సర్వీస్ కోటాకు అనర్హులు. ►85% సీట్లు స్థానికులకు, 15% సీట్లు స్థానికేతరులకు ఇస్తారు. వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. వెబ్‌కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారి వివరాలను వెబ్సైట్లో ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను విశ్వవిద్యాలయా నికి ఇవ్వాల్సి ఉంటుంది. ∙ పీజీ కోర్సులో చేరిన వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయడానికి, కన్సల్టేషన్గా ఉండటానికి వీల్లేదు. -
అర్హత మార్కులు తగ్గించండి
పీజీ వైద్య విద్య ప్రవేశాలపై కేంద్రానికి తెలుగు రాష్ట్రాల వినతి సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి 2017–18 విద్యా సంవత్సరానికి నిర్వహించిన నీట్ (నేషనల్ ఎంట్రెన్స్ ఎగ్జామి నేషన్)లో తగినంత మంది ఎంపిక కాలేదని, ఈ పరిస్థితిని అధిగమించాలంటే తక్షణమే అర్హత మార్కులు తగ్గించాలని తెలుగు రాష్ట్రాలు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు విన్నవించాయి. నీట్ నిబంధనల ప్రకారం ఒక్కో సీటుకు 1ః5 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక కావాల్సి ఉండగా ప్రస్తుతం 1ః2.5 మాత్రమే ఎంపికయ్యారని రాష్ట్ర ప్రభుత్వాలు వివరించాయి. ప్రస్తుతం 700గా ఉన్న కటాఫ్ మార్కులను కొద్దిగా తగ్గిస్తే మరింత మంది పీజీ వైద్య ప్రవేశాలకు అర్హత సాధిస్తారని తెలిపాయి. ఏపీ, తెలంగాణలకు చెందిన ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు కూడా అర్హత మార్కులు తగ్గించాలని ఇదివరకే భారతీయ వైద్య మండలికి లేఖలు రాశాయి. కాగా, శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్.. అర్హత మార్కులు తగ్గించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. కటాఫ్ మార్కులు తగ్గించకపోతే ప్రధానంగా ఇన్‌సర్వీస్ కోటా (ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వారికి ఇచ్చేవి) సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంటుందని, తమ వినతిని తక్షణమే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. భారతీయ వైద్యమండలి అధ్యక్షులు కూడా అర్హత మార్కుల తగ్గింపుపై కేంద్ర మంత్రి నడ్డాను కలిసినట్టు తెలిసింది. ఈ ఏడాది నేషనల్ పూల్‌కి వెళ్లని ఏపీ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ పూల్‌లోకి వెళ్లే పరిస్థితి లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీల నలో ఉంది. అయితే ఏపీ, తెలంగాణ, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలు నేషనల్ పూల్ (జాతీయ కోటా)లోకి వెళ్లాలంటే 371డి సవరణ చేయాలి. ఈ సవరణ రాష్ట్ర కేబి నెట్లో ఆమోదం పొంది, ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పాసై, రాష్ట్రపతికి వెళ్లాల్సి ఉంది. అయితే ఏప్రిల్ నాటికి పీజీ వైద్యసీట్ల కౌన్సిలింగ్ పూర్తి కావాలి. ఈ నేపథ్యంలో జాతీయ కోటాలోకి ప్రవేశించడానికి సమయం సరిపోదని అధికా రులు చెప్పారు. వచ్చే ఏడాది ఈ అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. నేషనల్ పూల్‌కి వెళ్లే విషయమై తెలంగాణ ఇంకా కసరత్తే చేయలేదు.