సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను ఎత్తివేసి, దాని స్థానంలో వెయిటేజీ ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో శనివారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రభుత్వం ఈ నెల 22న జారీ చేసిన జీవోలు 21, 22లను కొట్టేసి, 2017లో జారీ చేసిన జీవో 27 ప్రకారమే ప్రవేశాలు కల్పించేలా కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. పీజీ ప్రవేశాలు ఆశిస్తున్న వైద్యులు డాక్టర్ ఎం.వసుచరణ్‌రెడ్డి, మరో 12 మంది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో వైద్య విద్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, వైస్ చాన్స్‌లర్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కన్వీనర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం పీజీలో నేషనల్ పూల్‌కు 50 శాతం సీట్లు పోగా, మిగిలిన 50 శాతం సీట్లు స్థానికులకే చెందుతాయని ప్రభుత్వం తాజా జీవోల్లో పేర్కొందని పిటిషనర్లు వివరించారు. అంతేగాక ప్రస్తుతం రాష్ట్రంలో పీజీ చేస్తున్న విద్యార్థులకు పీజీ ప్రవేశాల్లో నిర్దిష్ట కోటా ఉందని, క్లినికల్‌కు 30 శాతం, నాన్ క్లినికల్‌కు 50 శాతం కోటా ఉందన్నారు.
ప్రభుత్వం తాజా జీవోల ద్వారా ఈ కోటాను ఎత్తివేసిందని తెలిపారు. ఈ జీవోలు ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 95కు విరుద్ధమని వివరించారు. నేషనల్ పూల్‌లో 50 శాతం సీట్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలో ఇన్ సర్వీస్ కోటా విద్యార్థులకు పదేళ్ల పాటు అమల్లో ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారని.. కానీ, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఈ జీవోలు జారీ చేసిందని వివరించారు. వైద్య విశ్వవిద్యాలయం వీసీ రాసిన లేఖ ఆధారంగా ప్రభుత్వం ఈ జీవోలు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ జీవోల వల్ల తమకు తీరని నష్టం కలుగుతుందని వీటిని కొట్టేయాలని కోరారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు జీవోల అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఆ రెండు జీవోలను కొట్టేయండి
Published Sun, Mar 25 2018 3:25 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment