అర్హత మార్కులు తగ్గించండి
పీజీ వైద్య విద్య ప్రవేశాలపై కేంద్రానికి తెలుగు రాష్ట్రాల వినతి
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి 2017–18 విద్యా సంవత్సరానికి నిర్వహించిన నీట్ (నేషనల్ ఎంట్రెన్స్ ఎగ్జామి నేషన్)లో తగినంత మంది ఎంపిక కాలేదని, ఈ పరిస్థితిని అధిగమించాలంటే తక్షణమే అర్హత మార్కులు తగ్గించాలని తెలుగు రాష్ట్రాలు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు విన్నవించాయి. నీట్ నిబంధనల ప్రకారం ఒక్కో సీటుకు 1ః5 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక కావాల్సి ఉండగా ప్రస్తుతం 1ః2.5 మాత్రమే ఎంపికయ్యారని రాష్ట్ర ప్రభుత్వాలు వివరించాయి. ప్రస్తుతం 700గా ఉన్న కటాఫ్ మార్కులను కొద్దిగా తగ్గిస్తే మరింత మంది పీజీ వైద్య ప్రవేశాలకు అర్హత సాధిస్తారని తెలిపాయి.
ఏపీ, తెలంగాణలకు చెందిన ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు కూడా అర్హత మార్కులు తగ్గించాలని ఇదివరకే భారతీయ వైద్య మండలికి లేఖలు రాశాయి. కాగా, శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్.. అర్హత మార్కులు తగ్గించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. కటాఫ్ మార్కులు తగ్గించకపోతే ప్రధానంగా ఇన్‌సర్వీస్ కోటా (ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వారికి ఇచ్చేవి) సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంటుందని, తమ వినతిని తక్షణమే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. భారతీయ వైద్యమండలి అధ్యక్షులు కూడా అర్హత మార్కుల తగ్గింపుపై కేంద్ర మంత్రి నడ్డాను కలిసినట్టు తెలిసింది.
ఈ ఏడాది నేషనల్ పూల్‌కి వెళ్లని ఏపీ
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ పూల్‌లోకి వెళ్లే పరిస్థితి లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీల నలో ఉంది. అయితే ఏపీ, తెలంగాణ, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలు నేషనల్ పూల్ (జాతీయ కోటా)లోకి వెళ్లాలంటే 371డి సవరణ చేయాలి. ఈ సవరణ రాష్ట్ర కేబి నెట్‌లో ఆమోదం పొంది, ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పాసై, రాష్ట్రపతికి వెళ్లాల్సి ఉంది. అయితే ఏప్రిల్ నాటికి పీజీ వైద్యసీట్ల కౌన్సిలింగ్ పూర్తి కావాలి. ఈ నేపథ్యంలో జాతీయ కోటాలోకి ప్రవేశించడానికి సమయం సరిపోదని అధికా రులు చెప్పారు. వచ్చే ఏడాది ఈ అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. నేషనల్ పూల్‌కి వెళ్లే విషయమై తెలంగాణ ఇంకా కసరత్తే చేయలేదు.