జిల్లాల్లో వైద్య సేవలు తప్పనిసరి..  | Andhra Pradesh Govt Regulation for PD Medical Students | Sakshi
Sakshi News home page

జిల్లాల్లో వైద్య సేవలు తప్పనిసరి.. 

Published Wed, Dec 21 2022 6:30 AM | Last Updated on Wed, Dec 21 2022 7:00 AM

Andhra Pradesh Govt Regulation for PD Medical Students - Sakshi

సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్య కోర్సుల్లో డిస్ట్రిక్ట్‌ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌ (డీఆర్‌పీ)ని అమలు చేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) రూపొందించింది. డీఆర్‌పీని 2020–21లో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ప్రవేశపెట్టింది. డీఆర్‌పీలో భాగంగా ఎండీ/ఎంఎస్‌ కోర్సులు చేసే పీజీ రెసిడెంట్‌లు మూడు, నాలుగు, ఐదో సెమిస్టర్‌ల సమయంలో మూడు నెలల పాటు ఆయా జిల్లాల్లోని 100 పడకలు పైబడిన ప్రభుత్వాస్పత్రుల్లో శిక్షణ పొందాలి.

ఈ మూడు నెలలు వీరు ఆయా ఆస్పత్రుల్లో రెసిడెంట్‌లుగా సేవలు అందించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణపై పీజీ వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించడమే డీఆర్‌పీ ముఖ్య ఉద్దేశం. మూడు నెలల కాలంలో ప్రీ, పారా క్లినికల్‌ రెసిడెంట్‌లు రోగనిర్ధారణ/ప్రయోగశాలలు, ఫార్మసీ, ఫోరెన్సిక్‌ సేవలు, సాధారణ వైద్య విధులు, ప్రజారోగ్య కార్యక్రమాలపై శిక్షణ ఇస్తారు. క్లినికల్‌ స్పెషాలిటీ రెసిడెంట్‌లు ఆయా స్పెషాలిటీ ఔట్‌పేషెంట్, ఇన్‌ పేషెంట్, క్యాజువాలిటీ, ఇతర ప్రాంతాలలో సేవలు అందించడంతోపాటు రాత్రి విధులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మూడు నెలల కాలంలో వసతి, స్టైపెండ్‌ అందిస్తారు.  

17 జిల్లా, 53 ఏరియా ఆస్పత్రులు.. 
రాష్ట్రంలో వంద పడకలు పైబడినవాటిలో 17 జిల్లా, 53 ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. డీఆర్‌పీ 2020–21లోనే అమలులోకి వచ్చినప్పటికీ కరోనా కారణంగా అమలు చేయలేదు. దీంతో వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2020–21లో పీజీ కోర్సుల్లో చేరిన 800 మంది ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో మూడో సంవత్సరం చదువుతున్నారు.

వీరందరికీ డీఆర్‌పీని వచ్చే జనవరి నుంచి అమలు చేయా­లని ప్రణాళిక రూపొందించారు. డీఆర్‌పీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లాకు ఒక కోఆర్డినేటర్‌ను నియమి­స్తారు. పీజీ రెసిడెంట్‌లకు శిక్షణను కోఆర్డినేటర్‌ పర్యవేక్షిస్తుంటారు. పీజీ తుది పరీక్షలకు హాజరు కావడానికి ముందు డీఆర్‌పీని సంతృప్తికరంగా పూర్తి చేయడం తప్పనిసరి.  
ప్రతిపాదనలు సిద్ధం చేశాం.. 
పీజీ వైద్య విద్యలో డీఆర్‌పీ అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రస్తుతం మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులకు వచ్చే జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయించాం. అదేవిధంగా రొటేç­Ùన్‌ పద్ధతిలో రెండో సంవత్సరం విద్యార్థు­లను డీఆర్‌పీ పరిధిలోకి తీసుకొస్తాం. వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులతో పోలిస్తే జిల్లా స్థాయి­లోని ఆస్పత్రుల్లో వైద్య సేవలు భిన్నంగా ఉంటాయి. డీఆర్‌పీ అమలుతో జిల్లా స్థాయిలో వైద్య కార్యక్రమాల అమలు, క్లినికల్, ప్రీ, పారా క్లినికల్‌ సేవలపై విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. ఇది వారి భవిష్యత్‌కు ఎంతగానో తోడ్పడుతుంది.  
    – డాక్టర్‌ వినోద్‌ కుమార్, డీఎంఈ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement