85% మెడికల్‌ సీట్లు రాష్ట్ర విద్యార్థులకే.. | Andhra Pradesh Govt On Seats To Medical Students | Sakshi
Sakshi News home page

85% మెడికల్‌ సీట్లు రాష్ట్ర విద్యార్థులకే..

Published Thu, Oct 13 2022 6:00 AM | Last Updated on Thu, Oct 13 2022 6:00 AM

Andhra Pradesh Govt On Seats To Medical Students - Sakshi

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కోర్సుల్ని చేయాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులకు సంబంధించిన బీ కేటగిరీ సీట్లలో 85 శాతం సీట్లను ఏపీ విద్యార్థులకు రిజర్వ్‌ చేస్తూ అడ్మిషన్ల నిబంధనలు సవరించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 15 ప్రైవేట్, 2 మైనార్టీ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్‌ కాలేజీల్లో 2,450 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా.. ఈ ఏడాది రెండు ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఒక్కో కాలేజీకి 50 చొప్పున 100 సీట్లు పెరిగాయి. మరోవైపు తిరుపతి జిల్లా రేణిగుంటలో శ్రీ బాలజీ మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్లకు అనుమతులు లభించాయి. ఇక్కడ 150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. అంటే ప్రైవేట్‌ కాలేజీల్లో 2,700 ఎంబీబీఎస్‌ సీట్లు ఈ విద్యా సంవత్సరం అందుబాటులో ఉంటాయి. ఇందులో బీ కేటగిరీ కింద 35 శాతం అంటే 945 సీట్లు ఉన్నాయి. గత ఏడాది వరకూ వీటికి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. 

తాజా సవరణ మేరకు బీ కేటగిరీలో సీట్లలో 85 శాతం సీట్లు అంటే సుమారు 804 సీట్లు ప్రత్యేకంగా ఏపీ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15 శాతం సీట్లు మాత్రమే ఓపెన్‌ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడతారు. ఓపెన్‌ కోటాలోనూ మన రాష్ట్ర విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది.  

రాష్ట్ర విద్యార్థులకు ఎంతో మేలు
ఇప్పటివరకు ‘బీ’ కేటగిరీలో ఉండే 35 శాతం కోటాలో ఎలాంటి స్థానిక రిజర్వేషన్లు లేవు. దీంతో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ‘బీ’ కేటగిరీ ఎంబీబీఎస్‌ సీట్లను ఎక్కువగా సొంతం చేసుకునేందుకు అవకాశాలు ఉండేవి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మన విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది. 

‘కన్వీనర్‌’ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లలో 2022–23 విద్యా సంవత్సరానికి సం బంధించిన ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయస్థాయి అర్హత పరీక్ష (నీట్‌) యూజీ– 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాసు చేసుకోవాల్సిందిగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

గురువారం ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20వ తేదీ సాయంత్రం 6గంటల వరకూ దరఖాస్తులకు అవకాశం కల్పించారు.  https://ugcq.ntruhsadmi ssions. com/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచారు. పూర్తి నోటిఫికేషన్‌  http://ntruhs.ap.nic.in/ వెబ్‌సైట్‌లో ఉంది. నియమ, నిబంధనల కోసం 89787 80501, 79977 10168, 93918 05238, 93918 05239 నంబర్లలోను,  ఫీజు చెల్లింపు  కోసం 83338 83934లోనూ సంప్రదించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement