Indian Medical Council
-
కరోనా: ఇటలీ చేరుకున్న భారత వైద్య బృందం
రోమ్ : ఇతర దేశాల నుంచి భారత్‌కు చేరుతున్న వారితో కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్న హెచ్చరికల నేపథ్యంలో భారత వైద్య బృందం శుక్రవారం ఇటలీకి చేరుకుంది. అక్కడ వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులతో పాటు, భారత పౌరులకు కరోనా పరీక్షలు నిర్వహించడానికి లియెనార్డో డా విన్సీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. వారికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలించనున్నారు. కాగా దీనికంటే ముందు ఇటలీలోని భారతీయులకు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించడానికి భారత్ రాయబార కార్యాలయం ఇటాలియన్ అధికారులతో సంప్రదింపులు జరిపింది. అయితే ఇటలీలో ఇప్పటికే కరోనా అధికంగా ప్రభావం చూపుతున్నందున భారతీయులకు వైద్యసాయం అందించేదుకు అక్కడి అధికారులు ఇందుకు అంగీకరించలేదు. (కరోనా భయం: నా సోదరి శవాన్ని తీసుకువెళ్లండి..) ఈ నేపథ్యంలో స్పందించిన భారత ప్రభుత్వం.. స్వయంగా భారత్ వైద్యాధికారులు ఇటలీకి పంపించింది. ఇండియన్ మిషన్ ప్రకారం ఇటలీలో సుమారు 1.6 లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. వారిలో 3,800 మంది విద్యార్థులు ఉన్నారు. ఇటలీలోని పలు ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై సంప్రదింపులు జరుపుతున్నామని, రాయబార కార్యాలయంలోని ఓ అధికారి తెలిపారు. ఇక ఇటలీకి చేరుకున్న భారత వైద్య బృందం రెండు, మూడు రోజులపాటు అక్కడే ఉంటారని ఇటలీ భారత రాయబారి రీనాట్ సంధు తెలిపారు.(ఆర్మీకి సోకిన కరోనా వైరస్) అక్కడి భారతీయులకు కరోనా టెస్ట్‌లు నిర్వహించి నెగిటివ్ వచ్చిన వారిని తిరిగి ఇండియాకు పంపిస్తామని తెలిపారు. వాళ్లు భారత్‌కు వచ్చాక 14 రోజుల పాటు మళ్లీ వైద్య పరీక్షలు నిమిత్తం నిర్బంధంలో ఉంటారని వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1, 34, 500 కరోనా కేసులు నమోదవ్వగా, 4,900 మందికి పైగా మరణించారు. చైనా తర్వాత కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతం ఇటలీనే. ఇప్పటి వరకు ఇటలీలో 15, 113 కరోనా కేసులు నమోదవ్వగా 1000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. (కరోనా: ‘ఈ మధ్యకాలంలో ఇదే గొప్ప బహుమతి’) -
ఎన్ఎంసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)ను ఏర్పాటు చేసే బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీనివల్ల వైద్య విద్యారంగంలో పారదర్శకత ఏర్పడుతుందనీ, అనవసరమైన తనిఖీల ప్రహసనం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ఏకీకృత విధానాలను తీసుకురానున్నారు. ఇందులోభాగంగా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షను పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షగా పరిగణిస్తారు. అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి భారత్‌లో పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం ఓ స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ పరీక్షకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్టŠస్)గా నామకరణం చేశారు. ఎన్ఎంసీ చట్టం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాల్లో 50 శాతం సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు అందుతాయని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన మూడేళ్ల లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌ను నిర్వహిస్తామన్నారు. పోంజి బిల్లుకు ఆమోదం: చిట్‌ఫండ్ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టే ‘అనియంత్రిత డిపాజిట్ స్కీంల నిషేధ’ బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. పేద డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించడం, వసూలు చేసిన డబ్బును తిరిగిచ్చేలా చూడటం ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే చట్ట విరుద్ధంగా వసూళ్లకు పాల్పడిన వారికి జరిమానా, జైలుశిక్ష పడనున్నాయి. ఈ విషయమై ఆర్థికమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ..‘ ‘చట్టంలోని లొసుగుల ఆధారంగా కొందరు వ్యక్తులు నిరుపేదలకు భారీవడ్డీ ఆశచూపి నగదును వసూలుచేస్తున్నారు. తాజా బిల్లులో పోంజి పథకంతో పాటు స్నేహితులు, పరిచయస్తులు, బంధువుల నుంచి వసూలు చేసే రియల్‌ఎస్టేల్ సంస్థలపైనా చర్యలు తీసుకునేలా నిబంధనలు చేర్చాం. సంబంధిత వ్యక్తులకు ఏడా ది నుంచి పదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.2 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. పోంజి స్కీమ్‌లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 978 కేసులు నమోదు కాగా, వీటిలో 326 కేసులో పశ్చిమబెంగాల్లోనే నమోదయ్యాయి’ అని తెలిపారు. ఈ బిల్లును లోక్‌సభ జూలై 24న ఆమోదించింది. ‘ఉన్నావ్’ ప్రమాదంపై సభలో రగడ.. ఉన్నావ్ రేప్ బాధితురాలి కారును ఓ లారీ అనుమానాస్పద రీతిలో ఢీకొట్టడంపై ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభ దద్దరిల్లింది. ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బాధితురాలిని చంపే ప్రయత్నం జరిగింద ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు యాదవ్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదాపడింది. -
ఎంసీఐ స్థానంలో ఇక పాలక మండలి
న్యూఢిల్లీ: అవినీతిలో కూరుకుపోయిన భారతీయ వైద్య మండలి (ఎంసీఐ–మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)ని రద్దు చేసి, దాని బాధ్యతలను పరిపాలక మండలికి అప్పగిస్తూ కేంద్రం బుధవారం ఆర్డినెన్స్ జారీచేసింది. ఆ వెంటనే ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఎంసీఐని రద్దు చేసి దాని స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటుచేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు ఆమోదించేంత వరకు ఎంసీఐ అధికారాలన్నీ ఈ పరిపాలక మండలి వద్ద ఉంటాయి. ఎంసీఐ స్థానంలో జాతీయ వైద్య కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు పార్లమెంటులో పెండింగ్‌లో ఉండటం తెలిసిందే. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఎయిమ్స్–ఢిల్లీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, పీజీఐఎంఈఆర్–చండీగఢ్ డైరెక్టర్ జగత్ రామ్, నిమ్హాన్స్–బెంగళూరు డెరెక్టర్ గంగాధర్, నిఖిల్ టాండన్(ఢిల్లీ ఎయిమ్స్)లు పరిపాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. -
రెన్యువల్ కోసం నకిలీ రోగులు!
సాక్షి, న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సులో రెన్యువల్ అనుమతి కోసం నకిలీ పేషెంట్లను చూపారన్న కారణంగా వికారాబాద్ జిల్లాకు చెందిన మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు సుప్రీంకోర్టు రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వర్రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. 2018–19 విద్యా సంవత్సరం కోసం ఎంబీబీఎస్ ప్రవేశాల అనుమతి రెన్యువల్‌కు మహావీర్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో 2017 నవంబర్ 8, 9 తేదీల్లో భారత వైద్య మండలి(ఎంసీఐ)కి చెందిన నిపుణుల కమిటీ తనిఖీ చేసింది. ఈ తనిఖీలో కళాశాలలో అనేక లోపాలను గుర్తించిన కమిటీ మరో బ్యాచ్‌లో ప్రవేశాలు కల్పించేందుకు వీలుగా రెన్యువల్‌కు అనుమతి ఇవ్వరాదని కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ లోపాలను వైద్య కళాశాలకు కూడా తెలిపింది. ఈ నేపథ్యంలో లోపాలను సరిచేసుకుంటూ సరిదిద్దిన చర్యలను చూపుతూ కళాశాల నివేదిక సమర్పించింది. తద్వారా మరోసారి తమ అభ్యర్థనను పరిశీలించాలని కళాశాల విన్నవించగా కేంద్రం అందుకు సమ్మతించి సమీక్షించాలని ఎంసీఐని కోరింది. 9 రకాల లోపాల గుర్తింపు.. ఈ నేపథ్యంలో 13 మార్చి 2018న మరోసారి తనిఖీ జరిగింది. రెండుసార్లు జరిగిన తనిఖీ నివేదికలను పరిశీలించిన ఎంసీఐ కార్యనిర్వాహక కమిటీ తీవ్రమైన లోపాలను గుర్తించింది. ఫ్యాకల్టీ 22 శాతం తక్కువగా ఉన్నారని, రెసిడెంట్ డాక్టర్లు 42.85 శాతం తక్కువగా ఉన్నారని గుర్తించింది. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లు నిజమైన పేషంట్లు కాదని, చికిత్స అవసరమైనంత పరిస్థితి లేదని గుర్తించింది. ఇలా 9 రకాల లోపాలను గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ కళాశాలకు రెన్యువల్ అనుమతి ఇవ్వొద్దని కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసును ఓవర్‌సైట్ కమిటీ ఆమోదించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ కళాశాల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో తుది నిర్ణయం తీసుకునేలోపు మరోసారి సమీక్షించాలని సుప్రీం కోర్టు మే 23న ఉత్తర్వులు జారీచేసింది. కేంద్రం అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని కళాశాలకు రెన్యువల్ అనుమతి ఇవ్వరాదన్న ఎంసీఐ సిఫారసును ఆమోదించింది. ఈ నేపథ్యంలో కళాశాల మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కాగా, నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో తాము జోక్యం చేసుకోబోమని, కేంద్రం నిర్ణయంలోనూ జోక్యం అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని ఇన్పేషెంట్లుగా ఉంచుకోవాల్సిన అవసరం లేదని, ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేని వారిని ఆస్పత్రిలో చేర్పించి రెన్యువల్ తెచ్చుకోవాలని చూసిన కళాశాల యాజమాన్యం మోసపూరితమైన చర్యకు పాల్పడిందని పేర్కొంది. పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు ఆరోగ్యవంతులను పేషెంట్లుగా చూపిన కారణంగా నాలుగు వారాల్లోగా రూ.2 కోట్ల జరిమానా సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ వెల్ఫేర్ ఫండ్‌లో జమ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. -
‘నీట్’లో సీటెక్కడ?
సాక్షి, అమరావతి: ‘నీట్’ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం పోటీపడిన రాష్ట్రంలోని వేలాది మంది అభ్యర్థులు అడ్మిషన్ ఎక్కడ వస్తుందనే అంచనాల్లో తలమునకలై ఉన్నారు. తొలిసారిగా ఏపీ జాతీయ పూల్‌లోకి వెళ్లడంతో దేశవ్యాప్తంగా ఏ కళాశాల ఎలాంటిదో తెలియక.. వచ్చిన ర్యాంకుతో ఏ కళాశాలలో సీటు వస్తుందో అర్ధంకాక సతమతమవుతున్నారు. గత ఏడాది రాష్ట్ర సీట్లు జాతీయ పూల్‌లో లేవు. ఈ ఏడాది కొత్తగా చేరడంతో రాష్ట్రంలోని 280 సీట్లకు పైగా జాతీయ కోటాలోకి వెళ్లాయి. అలాగే, అన్ని రాష్ట్రాలకు చెందిన 4,400 జాతీయ పూల్ సీట్లకు అన్ని రాష్ట్రాలూ పోటీపడవచ్చు. తాజాగా గత సోమవారం ‘నీట్’ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో.. తమ ర్యాంకుకు ప్రభుత్వ సీటు లేదా కన్వీనర్ కోటా సీటు వస్తుందో రాదోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. కాగా, అనేకమంది అభ్యర్థులకు 460 నుంచి 480 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మార్కులతో కన్వీనర్ కోటా సీటు వస్తుందో లేదోనన్న టెన్షన్లో అభ్యర్ధులు ఉన్నారు. 500 మార్కులు దాటిన అభ్యర్థులు మాత్రం సీటు వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీట్ల కోతతో మరింత అసంతృప్తి మన రాష్ట్రంలో ఈ ఏడాది 49వేల మంది పైచిలుకు అభ్యర్థులు ‘నీట్’ పరీక్ష రాశారు. అయితే, ఈ ఏడాది నాలుగు ప్రైవేటు కళాశాలలకు సంబంధించిన మొత్తం సీట్లకు భారతీయ వైద్యమండలి అనుమతి నిరాకరించింది. దీనివల్ల కన్వీనర్ కోటా సీట్లు కోల్పోయినట్లయింది. సీట్లు తగ్గడంతో మెరుగైన మార్కులు సాధించినా ఫలితం ఉండదని అభ్యర్థులు వాపోతున్నారు. దీంతో అభ్యర్థులు కేటగిరీల వారీగా గత ఏడాది కటాఫ్ మార్కులు, ఏ ర్యాంకు వరకూ సీటు వచ్చింది.. వంటి వివరాలను ఆరా తీస్తున్నారు. నీట్ అభ్యర్థుల్లో ఆందోళన దేశవ్యాప్తంగా సుమారు 82 వైద్య కళాశాలల్లో 11వేల పైచిలుకు సీట్లకు అనుమతి ఇవ్వకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఈ విషయమై ఆయా ప్రైవేటు వైద్య కళాశాలలు ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఎంసీఐ నిర్ణయాన్ని రాజస్థాన్ హైకోర్టు ఇప్పటికే తప్పుబట్టింది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇలా కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు కళాశాలల మంజూరును సరళతరం చేస్తామంటూనే మరోవైపు సీట్లను తొలగించడం వెనుక ఏదో ఉందని ప్రైవేటు వైద్య కళాశాలలు తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నాయి. ఇది పూర్తిగా ఎంసీఐ తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగా పలు వైద్యకళాశాలలు అభివర్ణించాయి. -
రిటైర్మెంట్లే.. భర్తీలేవీ..?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంశం ఇప్పుడు గందరగోళంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అస్పష్ట వైఖరి వైద్య వర్గాల్లో ఆందోళన పెంచుతోంది. ఇతర రాష్ట్రాల తరహాలో ఉద్యోగ విరమణ వయసు పెంచాలని కొందరు వైద్యులు డిమాండ్ చేస్తుండగా.. ఇలా చేస్తే కింది స్థాయి వైద్యుల అవకాశాలు దెబ్బతింటాయని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కొత్తగా వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ వైద్య సేవలు నాసిరకంగా ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో అన్ని ఆస్పత్రుల్లోనూ ఖాళీలు పెరుగుతున్నాయి. బోధన ఆస్పత్రుల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ బోధన ఆస్పత్రుల్లో 2,500 మంది వైద్యులు ఉండాలి. వరుస రిటైర్మెంట్లు, కొత్త వైద్యుల భర్తీ జరగకపోవడంతో ప్రస్తుతం 1,800 మంది మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రెండుమూడేళ్లలో ప్రభుత్వ కాలేజీల్లోనూ ఎంబీబీఎస్, పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం ఉంది. మరోవైపు జిల్లా, ఏరియా, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటోంది. అన్ని జిల్లాల్లో కలిపి సగటున ఏటా 60 మంది వరకు వైద్యులు రిటైర్ అవుతున్నారు. కానీ ఖాళీ పోస్టుల భర్తీ మాత్రం ముందుకు జరగడంలేదు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంశం పదేపదే తెరపైకి వస్తోంది. ప్రతిపాదనలపై రగడ వైద్యుల పదవీ విరమణ వయసు విషయంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రెండేళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. బోధన ఆస్పత్రులు, వైద్య కాలేజీల్లో పని చేసే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 70 ఏళ్ల వరకు పెంచాలని నిర్ణయించింది. దీనిపై అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాలను కోరింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు పదవీ విరమణ వయసు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక కేంద్ర ప్రతిపాదనపై ప్రభుత్వ వైద్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు సీనియర్ వైద్యులు అవసరమవుతారని, పదవీ విరమణ వయసు పెంచాలని కొందరు కోరుతున్నారు. బోధన ఆస్పత్రుల్లోని జూనియర్ వైద్యులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వయసు పెంచితే కింది స్థాయిలో ఉన్న వారి అవకాశాలు దెబ్బతింటాయని వారు తీవ్రంగా వాదిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత కూడా పని చేయాలనుకునే వారు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కాలేజీల్లో చేరే అవకాశం ఉందని ప్రభుత్వ వైద్యుల సంఘం చెబుతోంది. ఇలా వైద్యుల్లోనే పలు భిన్నాభిప్రాయాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా.. వైద్యుల ఉద్యోగ విరమణ వయస్సు దేశమంతటా ఒకేవిధంగా లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం వైద్య అధ్యాపకుల విరమణ వయస్సు 70 ఏళ్ల వరకు ఉండవచ్చు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో విరమణ వయసు 65 సంవత్సరాలు. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు, వైద్య కాలేజీల్లో అధ్యాపకుల ప్రస్తుత విరమణ వయస్సు 58 సంవత్సరాలు. ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో 60 ఏళ్లు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో విరమణ వయస్సు 70 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 60 ఏళ్లు.. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్‌లలో 62 ఏళ్లు.. హరియాణా, ఢిల్లీ, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 65 ఏళ్లు.. బిహార్‌లో 67 ఏళ్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ అంశంపై ఎటూ తేల్చకపోవడంతో వైద్యుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
ఎంసీఐ రూల్స్ మేరకే ఇన్‌సర్వీస్ కోటా రద్దు
సాక్షి, హైదరాబాద్: భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనలకు లోబడే పీజీ మెడికల్ సీట్ల భర్తీలో ఇన్‌సర్వీస్ కోటాను రద్దు చేసి, వెయిటేజీ మార్కు ల విధానాన్ని ప్రవేశపెట్టామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలియజేసింది. పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ఇన్‌సర్వీస్ కోటాను తెలుగు ప్రభుత్వాలు రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ, ఏపీకిచెందిన వైద్యులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర వియలక్ష్మిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎంసీఐ నిబంధనల్లోని తొమ్మిది ప్రకారం ఇన్‌సర్వీస్ కోటాను ఎత్తివేసి వెయిటేజీ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్ వాదించారు. అఖిల భారత స్థాయిలో 50 సీట్ల భర్తీ జరుగుతుందని, మిగిలిన సగం సీట్లలో వైద్యులుగా సేవలందించిన వారికి ఇన్ సర్వీస్ కోటాకు బదులు వెయిటేజీ మార్కులు ఇస్తామన్నారు. వెయిటేజీ మార్కుల విధానంలో ఒక్క సీటు కూడా తమకు రాదనే పిటిషనర్ల వాదనను ధర్మాసనం కొట్టేసింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదాపడింది. -
ఆ రెండు జీవోలను కొట్టేయండి
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను ఎత్తివేసి, దాని స్థానంలో వెయిటేజీ ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో శనివారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రభుత్వం ఈ నెల 22న జారీ చేసిన జీవోలు 21, 22లను కొట్టేసి, 2017లో జారీ చేసిన జీవో 27 ప్రకారమే ప్రవేశాలు కల్పించేలా కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. పీజీ ప్రవేశాలు ఆశిస్తున్న వైద్యులు డాక్టర్ ఎం.వసుచరణ్‌రెడ్డి, మరో 12 మంది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో వైద్య విద్య, కుటుంబ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, వైస్ చాన్స్‌లర్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కన్వీనర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. భారత వైద్య మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం పీజీలో నేషనల్ పూల్‌కు 50 శాతం సీట్లు పోగా, మిగిలిన 50 శాతం సీట్లు స్థానికులకే చెందుతాయని ప్రభుత్వం తాజా జీవోల్లో పేర్కొందని పిటిషనర్లు వివరించారు. అంతేగాక ప్రస్తుతం రాష్ట్రంలో పీజీ చేస్తున్న విద్యార్థులకు పీజీ ప్రవేశాల్లో నిర్దిష్ట కోటా ఉందని, క్లినికల్‌కు 30 శాతం, నాన్ క్లినికల్‌కు 50 శాతం కోటా ఉందన్నారు. ప్రభుత్వం తాజా జీవోల ద్వారా ఈ కోటాను ఎత్తివేసిందని తెలిపారు. ఈ జీవోలు ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 95కు విరుద్ధమని వివరించారు. నేషనల్ పూల్‌లో 50 శాతం సీట్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలో ఇన్ సర్వీస్ కోటా విద్యార్థులకు పదేళ్ల పాటు అమల్లో ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారని.. కానీ, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ప్రభుత్వం ఈ జీవోలు జారీ చేసిందని వివరించారు. వైద్య విశ్వవిద్యాలయం వీసీ రాసిన లేఖ ఆధారంగా ప్రభుత్వం ఈ జీవోలు జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ జీవోల వల్ల తమకు తీరని నష్టం కలుగుతుందని వీటిని కొట్టేయాలని కోరారు. ఈ వ్యాజ్యం తేలేంత వరకు జీవోల అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. -
విదేశాల్లో ఎంబీబీఎస్‌కూ నీట్ !
-
విదేశాల్లో ఎంబీబీఎస్‌కూ నీట్ !
న్యూఢిల్లీ: విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)లో ఉత్తీర్ణత సాధించడాన్ని కేంద్రం త్వరలోనే తప్పనిసరి చేసే అవకాశముందని ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం చివరిదశ పరిశీలనలో ఉందన్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన అభ్యర్థులు దేశంలో వైద్య వృత్తిని చేపట్టేందుకు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) ఫారిన్ మెడికల్గ్రాడ్యుయేట్ ఎగ్జామ్(ఎఫ్ఎంజీఈ)ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష రాసే మొత్తం విద్యార్థుల్లో కేవలం 12 నుంచి 15 శాతం మాత్రమే ఉత్తీర్ణులు అవుతున్నారని పేర్కొన్నారు. ఒకవేళ ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కాకుంటే వైద్యవృత్తిని చేపట్టడం కుదరదన్నారు. దీంతో పలువురు చట్టవిరుద్ధంగా వైద్య వృత్తిని ప్రారంభిస్తున్నారని తెలిపారు. -
స్టాండింగ్ కమిటీకి మెడికల్ బిల్లు
న్యూఢిల్లీ: దేశంలోని వైద్య విద్య ప్రక్షాళనతో పాటు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ)ని మార్చేందుకు ఉద్దేశించిన వివాదాస్పద నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. బడ్జెట్ సమావేశాలకు ముందు నివేదిక సమర్పించాలని కమిటీని లోక్‌సభ కోరింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు దిగడంతో పాటు, మంగళవారం సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. ఈ నేపథ్యంలో బిల్లుపై లోక్‌సభలో మంగళవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ ప్రకటన చేస్తూ.. ప్రతిపక్షంతో పాటు అధికార ఎన్డీఏ కూడా బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని కోరిందని అందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. బడ్జెట్ సమావేశాలకు ముందే నివేదికను సమర్పించాలని కమిటీని కోరాలని స్పీకర్ మహాజన్‌ను మంత్రి కోరారు. తర్వాత స్పీకర్ లోక్‌సభలో ప్రకటన చేస్తూ.. బడ్జెట్ సమావేశాలకు ముందు లోక్‌సభకు నివేదిక సమర్పించాలని స్టాండింగ్ కమిటీని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, స్టాండింగ్ కమిటీ నివేదిక నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు వైద్య వృత్తికి ఉపయోగకరమని కేంద్రం ప్రకటించింది. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఐఎంఏ ఈ బిల్లును ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధికారులకు, వైద్య విద్యతో సంబంధంలేని యంత్రాంగానికి తమను జవాబుదారీగా ఉంచడమంటే వైద్య వృత్తిని నిర్వీర్యం చేయడమేనని వారు ఆరోపిస్తున్నారు. మంగళవారాన్ని బ్లాక్ డేగా ప్రకటిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఉదయం నుంచి వైద్య సేవలు నిలిచిపోయాయి. సమ్మె నుంచి అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు. అయితే లోక్‌సభలో బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపడంతో ఐఎంఏ సమ్మెను విరమించుకుంది. రాజ్యసభ ‘ప్రశ్నల’ రికార్డు ప్రశ్నోత్తరాల సమయంలో జాబితాలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా రాజ్యసభ మంగళవారం రికార్డు సృష్టించింది. ప్రశ్నలడిగిన 20 మంది సభ్యుల్లో మంగళవారం 10 మంది గైర్హాజరు కావడంతో ఇది సాధ్యమైంది. ఆ తర్వాత మిగతా సభ్యులు అప్పటికప్పుడు ప్రశ్నలడిగేందుకు సభాధ్యక్షుడు వెంకయ్య అనుమతించారు. జీరో అవర్‌లో గరిష్టంగా18 మంది పలు ప్రజాప్రాముఖ్యం ఉన్న అంశాలపై మాట్లాడారు. ‘దివాలా’ బిల్లుకు ఓకే దివాలా చట్టం సవరణ బిల్లుపార్లమెంట్‌లో ఆమోదం పొందింది. ది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(సవరణ) ఆర్డినెన్స్ పేరిట తెచ్చిన ఈ బిల్లు మంగళవారం రాజ్యసభలో గట్టెక్కింది.అవసరాలకు తగినట్లు బిల్లులో మార్పులు చేస్తామని జైట్లీ సభకు హామీ ఇచ్చారు. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టపరచి రాజకీయాలకు అతీతంగా ఉంచడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎవరి రుణాలనూ రద్దుచేయలేదన్నారు. అన్ని వస్తువులకు ఒకే జీఎస్టీ రేటు వర్తింపజేయడం సాధ్యం కాదన్నారు. మొత్తం జనాభా దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న దేశాల్లోనే ఏకరేటు పన్ను విధానం అమల్లో ఉందని, భారత్‌లో అది సాధ్యం కాదనిచెప్పారు. యూరియా వాడకాన్ని తగ్గించడానికి ఒక సంచి పరిమాణాన్ని 45 కిలోలకు తగ్గించినట్లు ఎరువుల శాఖ సహాయ మంత్రి లోక్‌సభలో చెప్పారు. -
ఆర్వీఎం మెడికల్ కాలేజీపై వేటు
2017–18, 2018–19 అడ్మిషన్లు వద్దు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆర్వీఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడి కల్ సైన్సెస్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వేటు వేసింది. ఆర్వీఎం వైద్య కాలేజీలో వరుసగా రెండేళ్లు వైద్య విద్య ప్రవేశాలు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2017–18, 2018–19 సంవత్సరాల్లో విద్యా ర్థులకు ప్రవేశం కల్పించవద్దని నిర్ణయం తీసుకుంది. భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అండర్ సెక్రటరీ డీవీకే రావు ఈ మేరకు ఆగస్టు 10న ఉత్త ర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రతులను ఆర్వీఎం చారిట బుల్ ట్రస్ట్ చైర్మన్‌కు పంపారు. ప్రవేశాల రద్దు ఉత్త ర్వుల ప్రతులను భారత వైద్య మండలికి, జాతీయ వైద్య విద్య అదనపు డైరెక్టర్ జనరల్‌కు, తెలంగాణ వైద్య శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శికి, కాళోజీ హెల్త్ వర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి, తెలంగాణ వైద్య విద్య సంచాలకుడికి పంపారు. ఉమ్మడి మెదక్ జిల్లా ములుగు మండలంలోని ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్వీఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(వైద్య కళాశాల)ను కొత్తగా ఏర్పాటు చేశారు. 2016–17 విద్యా సంత్సరంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కోసం భారత వైద్య మండలి (ఎంసీఐ)కి ఈ సంస్థ దరఖాస్తు చేసుకుంది. 2016 జనవరిలో ఎంసీఐ బృందం ఆర్వీఎం కళాశాల లోని ఏర్పాట్లను పరిశీలించింది. అదే నెలలో కాలేజీ లోని లోపాలపై సమగ్ర నివేదికను రూపొందించింది. 33 అంశాలలో లోపాలను పేర్కొంది. 2016–17లో ప్రవే శాలకు అనుమతి ఇవ్వవద్దని ప్రతిపాదించింది. ఆరోగ్య శాఖ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలి పింది. అనంతరం ఆర్వీఎం చారిటబుల్ చేసిన విజ్ఞప్తి మేరకు షరతులతో 150 మంది విద్యార్థులను చేర్చు కునేందుకు అనుమతి ఇచ్చింది. ఎంసీఐ పేర్కొన్న లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలని షరతు విధిం చింది. 2017–18 ప్రవేశాల అనుమతుల జారీ ప్రక్రి యలో భాగంగా 2016 నవంబర్‌లో ఎంసీఐ మళ్లీ తని ఖీలు నిర్వహించింది. వైద్య కాలేజీ నిర్వహణలో తప్ప నిసరిగా ఉండాల్సిన వసతులలో 27 అంశాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. వైద్య విద్యకు అవస రమైన అంశాలు లేనందున 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో కొత్తగా ప్రవేశాలు కల్పించవ ద్దని ప్రతిపాదించింది. అనంతరం కాలేజీ యాజమా న్యం వాదనను ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్(డీజీహెచ్ఎస్) స్వీకరించింది. 27 అంశాల్లోని లోపాలను పేర్కొంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపింది. బోధన సిబ్బంది, వసతులు, వైద్య కాలేజీ నిర్వహణలో లోపాలు ఉన్నాయని పేర్కొంది. భారత వైద్య మండలి, డీజీహెచ్ఎస్ నివేదికల ఆధారంగా ఆర్వీఎం కాలేజీకి రెండేళ్లపాటు ప్రవేశాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2017 మే 31న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై అభ్యంతరం తెలుపుతూ కాలేజీ యాజమాన్యం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. లోపాలపై కాలేజీ యాజమాన్యం వాదనను వినేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశిస్తూ ఆగస్టు 1న ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజులలో ఈ పక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఆగస్టు 4న ఆరోగ్య మంత్రిత్వ శాఖ కమిటీ.. కాలేజీ యాజమాన్యానికి మరో అవకాశం ఇచ్చింది. కాలేజీ సమర్పించిన తాజా రికార్డులు... లిఖితపూర్వక, మౌఖిక వాదనలను తీసుకుంది. బోధన సిబ్బంది, ఆరోగ్య చికిత్స అంశాలపై ఇచ్చిన నివేదికలు నకిలీవని తేల్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం సరైనదేనని కమిటీ పేర్కొంది. అన్ని అంశాల ఆధారంగా ఆర్వీఎం కాలేజీలో రెండేళ్లపాటు అడ్మిషన్లను డిబార్ చేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి ఉత్తర్వులు జారీ చేసింది. -
అల్లోపతి వైద్యులకూ ప్రత్యేక లోగో
చండీగఢ్: అల్లోపతి డాక్టర్ల వినియోగం కోసం భారత వైద్య మండలి ఓ లోగోకు పేటెంట్ సంపాదిం చింది. కొత్త లోగోలో.. ఎర్రని ప్లస్ గుర్తులో కూపర్ ఫాంట్లో ఇంగ్లిష్ అక్షరాలు డీఆర్ రాసి ఉన్నాయి. ఆయుర్వేద, హోమియోపతి వైద్యుల తో పోల్చితే అల్లోపతి వైద్యులను ప్రత్యేకంగా గుర్తించేందుకే ఈ లోగోను తీసుకొచ్చామని చండీగఢ్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రమనీక్ సింగ్ బేడీ చెప్పారు. ఈ గుర్తు సాయంతో రోగులు సులభంగా నిష్ణాతులైన వైద్యులను గుర్తించవచ్చని సింగ్ తెలిపారు. కేంద్రప్రభుత్వ ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ ఈ లోగోను ఐఎంఏ మేధోసంపత్తి హక్కుగా నమోదుచేసింది. -
50 శాతం రద్దు!
► వైద్యులకు షాక్ ► వైద్య కౌన్సిల్ నిబంధనలు తప్పనిసరి ► ఆందోళనలో ప్రభుత్వ వైద్యులు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్న వైద్యులకు పీజీలో యాభై శాతం సీట్ల కేటాయింపును రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. వైద్యులకు షాక్ ఇచ్చే రీతిలో తీర్పు వెలువడడమే కాకుండా, భారత వైద్య కౌన్సిల్ నిబంధనల మేరకు సీట్ల కేటాయింపులు సాగాల్సిందేనని శనివారం కోర్టు స్పష్టం చేసింది. సాక్షి, చెన్నై: గ్రాడ్యుయేషన్‌తో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులుగా సేవల్ని అందిస్తున్న వారికి పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ప్రత్యేక రాయితీ ఇన్నాళ్లు తమిళనాట దక్కుతూ వచ్చింది. తమిళనాడు వైద్య విధానం మేరకు ఉన్నత చదువుల్లో 50 శాతం సీట్లను ఈ వైద్యులకు కేటాయిస్తూ వచ్చారు. నీట్ పుణ్యమా ఇటీవల భారత వైద్య కౌన్సిల్ రూపొందించిన నిబంధనలు తమిళనాడు పాలసీ మీద తీవ్ర ప్రభావం పడేలా చేసింది. నీట్‌కు వ్యతిరేకంగా ఓ వైపు పోరాటం సాగుతున్న సమయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు వైద్యుల్ని ఆందోళనలో పడేసింది. యాభై శాతం సీట్లను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వైద్యులు ఆందోళన బాట పట్టారు. రెండు వారాలకు పైగా ఆందోళనలు సాగడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అప్పీలుకు వెళ్లింది. ప్రభుత్వం, వైద్య సంఘాల తరఫున దాఖలు చేసుకున్న అప్పీలు పిటిషన్‌ను న్యాయమూర్తులు శశిధరన్, సుబ్రమణియన్లతోకూడిన బెంచ్ విచారించింది. ఈ బెంచ్ తీర్పుభిన్న వాదనలకు దారి తీయడంతో మూడో న్యాయమూర్తి బెంచ్‌కు విచారణ చేరింది. న్యాయమూర్తి సత్యనారాయన్ నేతృత్వంలో, న్యాయమూర్తులు శశిధరన్, సుబ్రమణియన్‌లతో కూడిన బెంచ్ రెండు రోజులుగా పిటిషన్‌ను విచారించి శనివారం తీర్పును వెలువరించింది. 50 శాతం రద్దు : ఇది వరకు ఇచ్చిన తీర్పులో న్యాయమూర్తి శశిధరన్ తమిళనాడు పాలసీకి అనుగుణంగా, న్యాయమూర్తి సుబ్రమణియన్ భారత వైద్య కౌన్సిల్ నిబంధనల్ని పాటించాల్సిన ఇచ్చిన తీర్పులను, తన నేతృత్వంలోని సాగిన విచారణను పరిగణించి న్యాయమూర్తి సత్యనారాయణన్ సాయంత్రం నాలుగున్నర గంటలకు తీర్పు ఇచ్చారు. తమకు అనుకూలంగా తీర్పు ఉంటుందన్న భావనతో వైద్యులు ఆందోళనను సైతం వీడి రోగులకు వైద్య సేవల్ని అందించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, తీర్పు వైద్యులకు పెద్ద షాక్‌గా మారింది. న్యాయమూర్తి సుబ్రమణియన్ తీర్పును గుర్తుచేస్తూ న్యాయమూర్తి సత్యనారాయణన్ 120 పేజీలతో కూడిన తీర్పును వెలువరించారు. 50 శాతం కేటాయింపును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తమిళనాడు పాలసీతో పని లేదని, నీట్ రూపంలో భారత వైద్య కౌన్సిల్ తీసుకొచ్చిన నిబంధనల్ని అనుసరించాల్సిన అవసరం ఉందని బెంచ్ స్పష్టం చేసింది. అప్పీలు పిటిషన్లను తిరస్కరించింది. కింది బెంచ్ ఇచ్చిన తీర్పు, న్యాయమూర్తి సుబ్రమణియన్ తీర్పును సమర్థిస్తూ 50 శాతం రద్దును ధ్రువీకరిస్తున్నట్టు సత్యనారాయణన్ ప్రకటించడం వైద్యులక పెద్ద షాక్ తగిలేలా చేసింది. తమిళనాడు హక్కులను కాలరాసే విధంగా తీర్పు వెలువడిందంటూ వైద్య సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. భవిష్యత్తుల్లో గ్రామీణ, అటవీ, కుగ్రామాల్లో వైద్య సేవల్ని అందించేందుకు ఏ ఒక్కరూ ముందుకురారు అని , ఇందుకు అద్దం పట్టే రీతిలో తీర్పు వెలువడిందని వైద్యుల సంఘం నాయకుడు కదిర్ వేల్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే విధానం అంటూ, 28 ఏళ్లుగా తమిళనాడులో సాగుతున్న విధానాన్ని తుంగలో తొక్కడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మరో నాయకుడు బాలకృష్ణన్ పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని, ప్రభుత్వ వైద్యులకు అనుగుణంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకు రావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తుల్లో గ్రామీణ ప్రాంతాల వైపుగా ఏ వైద్యుడూ వెళ్లడని, అలాగే, గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థికి వైద్య సీటు అందని ద్రాక్షగా మారడం ఖాయం అని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును సమగ్రంగా పరిశీలించినానంతరం తదుపరి తమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. -
అర్హత మార్కులు తగ్గించండి
పీజీ వైద్య విద్య ప్రవేశాలపై కేంద్రానికి తెలుగు రాష్ట్రాల వినతి సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి 2017–18 విద్యా సంవత్సరానికి నిర్వహించిన నీట్ (నేషనల్ ఎంట్రెన్స్ ఎగ్జామి నేషన్)లో తగినంత మంది ఎంపిక కాలేదని, ఈ పరిస్థితిని అధిగమించాలంటే తక్షణమే అర్హత మార్కులు తగ్గించాలని తెలుగు రాష్ట్రాలు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖకు విన్నవించాయి. నీట్ నిబంధనల ప్రకారం ఒక్కో సీటుకు 1ః5 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక కావాల్సి ఉండగా ప్రస్తుతం 1ః2.5 మాత్రమే ఎంపికయ్యారని రాష్ట్ర ప్రభుత్వాలు వివరించాయి. ప్రస్తుతం 700గా ఉన్న కటాఫ్ మార్కులను కొద్దిగా తగ్గిస్తే మరింత మంది పీజీ వైద్య ప్రవేశాలకు అర్హత సాధిస్తారని తెలిపాయి. ఏపీ, తెలంగాణలకు చెందిన ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు కూడా అర్హత మార్కులు తగ్గించాలని ఇదివరకే భారతీయ వైద్య మండలికి లేఖలు రాశాయి. కాగా, శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్.. అర్హత మార్కులు తగ్గించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. కటాఫ్ మార్కులు తగ్గించకపోతే ప్రధానంగా ఇన్‌సర్వీస్ కోటా (ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వారికి ఇచ్చేవి) సీట్లు మిగిలిపోయే అవకాశం ఉంటుందని, తమ వినతిని తక్షణమే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. భారతీయ వైద్యమండలి అధ్యక్షులు కూడా అర్హత మార్కుల తగ్గింపుపై కేంద్ర మంత్రి నడ్డాను కలిసినట్టు తెలిసింది. ఈ ఏడాది నేషనల్ పూల్‌కి వెళ్లని ఏపీ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ పూల్‌లోకి వెళ్లే పరిస్థితి లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీల నలో ఉంది. అయితే ఏపీ, తెలంగాణ, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలు నేషనల్ పూల్ (జాతీయ కోటా)లోకి వెళ్లాలంటే 371డి సవరణ చేయాలి. ఈ సవరణ రాష్ట్ర కేబి నెట్లో ఆమోదం పొంది, ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పాసై, రాష్ట్రపతికి వెళ్లాల్సి ఉంది. అయితే ఏప్రిల్ నాటికి పీజీ వైద్యసీట్ల కౌన్సిలింగ్ పూర్తి కావాలి. ఈ నేపథ్యంలో జాతీయ కోటాలోకి ప్రవేశించడానికి సమయం సరిపోదని అధికా రులు చెప్పారు. వచ్చే ఏడాది ఈ అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. నేషనల్ పూల్‌కి వెళ్లే విషయమై తెలంగాణ ఇంకా కసరత్తే చేయలేదు. -
ఐటి దాడులతో వేడెక్కిన తిరుపతి రాజకీయం
తిరుపతి తుడా : ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యుడు డాక్టర్ గుణశేఖర్ యాదవ్ తన భార్యకు తిరుపతి మేయర్ టికెట్ ఖరారు చేసుకున్నారనే నేపథ్యంలో ఐటీదాడులు షాకిచ్చాయి. అంతర్గత విభేదాలతోనే ఈ దాడులు జరిగా యా అని పార్టీలో చర్చించుకుంటున్నారు. ఏళ్ల తరబడి వున్న తమను కాదని కొత్త వ్యక్తికి ఎలా ఇస్తారని కొందరు, మంత్రి నారాయణ జోక్యంపై మరికొందరు అధిష్టానానికి గతంలోనే ఫిర్యాదు చేశారు. గుణశేఖర్ యాదవ్‌ను మేయర్ రేసు నుంచి తప్పించాలంటే ఐటీ దాడులే సరైన మార్గమని ఓ ఎమ్మెల్యే సమీప బంధువు, ఓ మహిళా నేత పథకాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. యాదవ వర్గానికే మేయర్ టికెట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అదే సామాజిక వర్గానికి చెందిన గుణశేఖర్ మంత్రి నారాయణ ద్వారా పావులు కదిపారు. తిరుపతిలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఆర్థిక వనరులెక్కువగా వుండడంతో మంత్రి ఆయనపైనే మొగ్గు చూపుతూ వచ్చారు. టికెట్ పోటీలో ముందు వరుసలో వున్న గుణశేఖర్ యాదవ్‌పై ఐటీ గురిపెట్టి భారీ మొత్తంలో ఆస్తులున్నట్లు గుర్తించడంతో దారులు మూసుకుపోయాయి. దీంతో ఆశావాహ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. సామాజిక వర్గం పరంగా నర్సింహయాదవ్ ముందు వరుసలో వుండగా ఎమ్మెల్యే వర్గం ఆయనకు పోటీగా అదే సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తిని తెరపైకి తెచ్చేం దుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. డాక్టర్ సుధారాణి పార్టీతో సన్నిహితంగా వుంటూ మేయర్ టికెట్ లేదా తుడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. -
వసతులు లేకున్నా వైద్య కళాశాల!
సాక్షి, హైదరాబాద్: ఆస్పత్రి లేదు, వైద్యులు లేరు, రోగులు లేరు.. అయినా అక్కడ వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతిచ్చారు! ఎలాంటి వసతులు లేకపోయినా ప్రభుత్వమే ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ మంజూరు చేసింది! రెండు తెలుగు రాష్ట్రాల్లో 11 కళాశాలలకు ఇలా ఆయా ప్రభుత్వాలు ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్లు మంజూరు చేయడంపై భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీచేసిన విషయం విదితమే. కొన్నిచోట్ల చిన్న గది కూడా లేకపోయినా ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ మంజూరు చేశారు. అలా మంజూరు చేసిన వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో అపోలో ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(చిత్తూరు), శ్రీనివాస ఎడ్యుకేషనల్ అకాడమీ(చిత్తూరు), నిమ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ(జూపూడి), గాయత్రీ విద్యాపరిషత్ సొసైటీ(విశాఖపట్నం) ఉన్నాయి. తెలంగాణలో ఈఎస్ఐ మెడికల్ కళాశాలతోపాటు సెయింట్ అగస్టీన్ ఎడ్యుకేషనల్ సొసైటీ (పటాన్చెరు), ఆలేటి సునీత ఎడ్యుకేషనల్ సొసైటీ(మెదక్), బీఎంఎంటీ ఇన్స్టిట్యూట్(వికారాబాద్), ఆయాన్ మెడికల్ కళాశాల ఉన్నాయి. -
7లోగా వివరాలివ్వండి
వైద్య కళాశాలలకు ఎంసీఐ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఈ నెల 7లోగా ఎంబీబీఎస్ అడ్మిషన్ల వివరాలు, అభ్యర్థుల పేర్లు ఇవ్వాలని భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) అన్ని రాష్ట్రాల మెడికల్ కాలేజీలనూ ఆదేశించింది. ఏవైనా సవరణలుంటే ఈ లోగానే చేసుకోవాలని అక్టోబర్ 7 తర్వాత ఇలాంటి సవరణలకు అనుమతించబోమని స్పష్టం చేసింది. అలాగే అక్టోబర్ 15లోగా ప్రింట్ కాపీలు కూడా పంపించాలని కోరింది. సూపర్ స్పెషాలిటీ సీట్లకు సంబంధించిన అడ్మిషన్ల వివరాలు ఈ నెల 5లోగానే పంపించాలని ఎంసీఐ అన్ని కళాశాలలనూ కోరింది. ఆ రెండు కళాశాలలు అనుమతి తెచ్చుకోవాలి.. భారతీయ వైద్యమండలి నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30తో అడ్మిషన్లకు గడువు ముగిసింది. ఆ తర్వాత ఫాతిమా, మల్లారెడ్డి కాలేజీలు అడ్మిషన్లకు ఢిల్లీ హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నాయి. కానీ వాళ్లు సుప్రీంకోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుందని, ఈ అనుమతిని బట్టే అడ్మిషన్లు జరిపే అవకాశం ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ డా.రవిరాజు తెలిపారు. -
4 కొత్త మెడికల్ కాలేజీలు!
* ఉభయ గోదావరి జిల్లాలకు చెరొకటి * ప్రొద్దుటూరు, విజయనగరాల్లో ఒక్కొక్కటి ప్రతిపాదన * వైద్య కళాశాలలుగా జిల్లా ఆస్పత్రుల ఉన్నతీకరణ * నిధులిచ్చేందుకు కేంద్రం సంసిద్ధత సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో నాలుగు వైద్య కళాశాలల ఏర్పాటుకు వైద్య విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11 వైద్య కళాశాలలుండగా జిల్లా ఆస్పత్రులను ఉన్నతీకరించి అదనంగా నాలుగు మెడికల్ కళాశాలలకు అనుమతి తెచ్చుకోవాలని భావిస్తున్నారు. జిల్లా ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేసి మెడికల్ కళాశాలలుగా మార్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అంగీకరించింది. ఈ కాలేజీలకు కేంద్ర ప్రాయోజిత పథకం కింద నిధులు ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఒక్కో కళాశాలకు 100 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు కూడా ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపింది. ఈ నేపథ్యంలో వైద్యవిద్యా శాఖాధికారులు నాలుగు కాలేజీల ప్రతిపాదనల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందచేసినట్లు సమాచారం. ఒక్కో కళాశాలకు రూ.189 కోట్లు చొప్పున యవ్యయం అవుతుందని అంచనా. ఇందులో 75 శాతం కేంద్రం, 25 శాతం నిధులు రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. కొత్త కళాశాలలు ఇక్కడే ఏలూరు జిల్లా ఆస్పత్రి(పశ్చిమగోదావరి), జిల్లా ఆస్పత్రి (విజయనగరం), ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి (వైఎస్సార్), రాజమండ్రి జిల్లా ఆస్పత్రి (తూర్పుగోదావరి)లను వైద్య కళాశాలలుగా ఉన్నతీకరించాలని ప్రతిపాదించారు. మరోవైపు నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల, తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలను కూడా కేంద్ర ప్రాయోజిత పథకం కింద చేర్చుకుని నిధులివ్వాలని అధికారులు కోరారు. జిల్లా ఆస్పత్రులను వైద్య కళాశాలలుగా అనుమతించాలంటే కనీసం 500 పడకల ఆస్పత్రిగా ఉండాలి. 4 లక్షల చదరపు అడుగు విస్తీర్ణంలో ఆస్పత్రి భవనాలు ఉండాలని భారతీయ వైద్యమండలి నిబంధన విధించింది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రుల్లో 350 పడకలు లోపే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో 150 పడకలు అదనంగా ఏర్పాటు చేసుకోవాలి. -
వైద్య విద్యలో మరో మూడు కొత్త కోర్సులు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో మరో మూడు కొత్త కోర్సులు వచ్చే అవకాశముంది. ఈ మేరకు భారతీయ వైద్య మండలి అనుమతి కూడా లభించినట్టు వైద్య విద్యా శాఖ వర్గాలు పేర్కొన్నాయి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్(ఇమ్యునో హిమటాలజీ పాటు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్), ఎమర్జెన్సీ మెడిసిన్/ నియోనెటాలజీ కోర్సులు కొత్తగా రానున్నాయి. 2015-16 నుంచి వీటిని ప్రవేశపెట్టే అవకాశమున్నట్టు సమాచారం. ఇవి పీజీ లేదా పీజీ డిప్లొమా కోర్సులుగా ఉంటాయి. ప్రస్తుతం ఈ కోర్సులు చేసిన వైద్యులతో అవసరం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని ప్రవేశ పెడుతున్నట్టు వైద్యశాఖ పేర్కొంది. -
ఎంసీఐ వైఖరి సరికాదు
* సుప్రీంలో వాదనలు వినిపించిన ప్రయివేట్ వైద్యకళాశాలలు * ఏపీ, తెలంగాణల నుంచి 13 వైద్య కాలేజీల్లో సీట్ల కోత * రెన్యువల్ సీట్లకైనా అనుమతి ఇప్పించండి సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీల సీట్లు రెన్యువల్, కొత్త సీట్లు మంజూరు, అదనపు సీట్లకు అనుమతికి సంబంధించి భారత వైద్య మండలి(ఎంసీఐ) వైఖరిపై దాఖలైన సుమారు 20 పిటిషన్లను సుప్రీం కోర్టు గురువారం విచారించింది. దేశవ్యాప్తంగా పలు ప్రయివేట్ వైద్య కాలేజీలు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై జస్టిస్ అనిల్. ఆర్. దవే, జస్టిస్ విక్రమ్‌జిత్‌సేన్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. సీట్ల మంజూరు విషయంలో ఎంసీఐ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని తెలిపారు. 77 ప్రభుత్వ కళాశాలల్లో తగిన వసతులు, బోధనా సిబ్బంది లేకపోయినా ఆ రాష్ట్రాల సీఎస్ల అండర్ టేకింగ్ తీసుకుని వాటికి అనుమతులు ఇచ్చారని, అయితే ప్రయివేట్ కళాశాలలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఇంకా సమయం ఉన్నందున రెన్యువల్స్, అదనపు సీట్లు, కొత్త కళాశాలలకు సీట్లకు అనుమతి మంజూరు చేయాలని కోరారు. కోర్టును ఆశ్రయించిన కళాశాలల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 13 కళాశాలలున్నాయి. వీటిలో మూడు కొత్త కళాశాలలు కూడా ఉన్నాయి. ఈ కొత్త కళాశాలలు, పాత కళాశాలలకు సంబంధించి 1,250 సీట్లకు ఎంసీఐ కోత విధించింది. కళాశాలలను ఎంసీఐ తనిఖీ చేసిన తర్వాత లోటుపాట్లపై ఆయా కళాశాలలకు తెలిపి.. వాటిని పూరించేందుకు కొంత సమయం ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసిందని, అయితే ఈ విషయంలో ఎంసీఐ పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. కేవలం ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఎంసీఐ పనిచేసింది తప్ప.. లోటుపాట్లపై సమాచారమివ్వలేదని, కేవలం 4 నుంచి 5 శాతం లోటుపాట్లు ఉన్నా సీట్ల మంజూరుకు అనుమతి నిరాకరించిందని పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం నాణ్యమైన విద్యకు చర్యలు తీసుకోవాల్సిందే కదా అని వ్యాఖ్యానించింది. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వివరణ ఇస్తూ.. ప్రభుత్వం ఉన్నత విద్యను అందించే పరిస్థితుల్లో లేదని, ప్రయివేటు సంస్థలు వందల కోట్లు పెట్టి విద్యాసంస్థలు నెలకొల్పితే.. చిన్న చిన్న వసతుల లేమిని చూపి సీట్ల అనుమతిని నిరాకరించడం న్యాయం కాదన్నారు. నాణ్యత లేనివాటిని తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని, ఆ పేరు చెప్పి అందరినీ పక్కనబెట్టడం అన్యాయమని వాదించారు. ఈ నేపథ్యంలో వైద్య కళాశాల వారీగా వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. ఆ మేరకు ఒక్కో కళాశాల తరఫున న్యాయవాదులు విడిగా తమ వాదనలు వినిపించారు. అయినప్పటికీ ధర్మాసనం ఆ సీట్లను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇచ్చేందుకు సంతృప్తిచెందలేదు. కనీసం గత కొన్నేళ్లుగా అందుబాటులో ఉన్న సీట్లనైనా రెన్యువల్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని చివరగా పిటిషనర్ల తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోరగా.. ఈ కేసును వచ్చే గురువారానికి వాయిదావేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. -
350 ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణ
భారతీయ వైద్య మండలి నిర్ణయం ఏపీలో 200, తెలంగాణలో 150 సీట్ల పునరుద్ధరణ ఏపీలో కొత్తగా అందుబాటులో 600 సీట్లు హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్ల విషయంలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయూలు తీసుకుంది. ఉభయ రాష్ట్రాల్లోని మొత్తం ఎనిమిది ప్రభుత్వ కళాశాలలు వసతుల లేమి కారణంగా ఇటీవల 500 సీట్లు కోల్పోగా.. వీటిలో మూడు కళాశాలలకు మినహా మిగతా అన్ని కళాశాలల్లో కోల్పోయిన 350 సీట్లను పునరుద్ధరిస్తూ మంగళవారం నిర్వహించిన కార్యవర్గ కమిటీ సమావేశంలో ఎంసీఐ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు రెండు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు సీట్ల కేటాయింపునకు అనుమతించింది. దీనితో పాటు కర్నూలు జిల్లాలోని ఓ కొత్త ప్రైవేటు కాలేజీకి సీట్లు కేటారుుంచారు. ఇప్పటికే నడుస్తున్న కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలకు సైతం అదనపు సీట్లను కేటాయించారు. 2014-15 సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కలిపి 6,500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉంటాయని అంచనా. వసతులు, అధ్యాపకులు లేని కారణంగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలు కొన్ని నెలల క్రితం 500 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. తెలంగాణలోని నిజామాబాద్ కళాశాల 100, గాంధీ వైద్య కళాశాల 50 సీట్లు కోల్పోయూరుు. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విశాఖపట్నం ఏఎంసీ, కాకినాడ రంగరాయ, విజయవాడ సిద్ధార్థ, తిరుపతి ఎస్వీ కళాశాలలు ఒక్కొక్కటి 50 చొప్పున కోల్పోగా, ఒంగోలు రిమ్స్ 100 సీట్లు నష్టపోరుుంది. మంగళవారం జరిగిన ఎంసీఐ ఈసీ మీటింగ్‌లో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల, ఏఎంసీ, సిద్ధార్థ కళాశాలలు మినహా మిగతా అన్ని కళాశాలలకూ కోల్పోరుున సీట్లు తిరిగి లభించారుు. ఐదొందల సీట్లు కోల్పోగా అందులో 350 సీట్లను పునరుద్ధరించారు. ఏపీ కోల్పోరుున 200 సీట్లు, తెలంగాణ కోల్పోరుున 150 సీట్లను పునరుద్ధరించినట్టరుుంది. ఏపీకి కొత్తగా 600 సీట్లు ఆంధ్రప్రదేశ్‌లోని కొత్త ప్రభుత్వ కళాశాలల్లో ఈ ఏడాది 300 ఎంబీబీఎస్ సీట్లు కేటారుుంచారు. నెల్లూరులో నిర్మించిన వైద్య కళాశాలకు 150 సీట్లు, తిరుపతిలోని పద్మావతి కళాశాలకు 150 సీట్ల చొప్పున మొత్తం 300 సీట్లకు అనుమతి లభించింది. మరోవైపు ప్రైవేటు కళాశాలల్లోనూ 300 సీట్లు పెరిగాయి. ఈ ఏడాది కర్నూలులో కొత్తగా నిర్మించిన విశ్వభారతి మెడికల్ కళాశాలకు 150 సీట్లు కేటాయించారు. -
వైద్య సీట్లు పోయినట్లే!
సతులు లేకుండా సీట్లివ్వలేమన్న ఎంసీఐ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలల్లో సీట్ల కోతపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)ని కలిసినా ఫలితం దక్కలేదు. మంత్రితో పాటు కొందరు ఉన్నతాధికారులు తాజాగా ఎంసీఐ అధికారులను కలిసి రాష్ట్రంలో వైద్య కళాశాలల్లో కోత విధించిన సీట్లను పునరుద్ధరించాలని, వసతుల కల్పనలో లోపాలుంటే సవరిస్తామని కోరినా పెద్దగా స్పందన లేదని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఏడాది క్రితం ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చే సమయంలోనే రెన్యువల్ నాటికి పూర్తిస్థాయి వసతులు కల్పించాలని స్పష్టం చేసినట్లు ఎంసీఐ అధికారులు గుర్తు చేశారు. కానీ ఏ కళాశాలలోనూ వసతులు గురించి పట్టించుకోలేదన్నారు. ‘ల్యాబరేటరీలు లేవు.. రక్త పరీక్షలు చేసే విధానం సరిగా లేదు.. లెక్చర్ హాళ్లు బాగా లేవు.. జూనియర్ వైద్యులకు నివాస గృహాలు కూడా లేవు.. ఇలాంటి పరిస్థితుల్లో సీట్లు ఎలా ఇస్తాం?’ అని ఎంసీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఎంసీఐ అధికారులు స్పందించిన తీరును బట్టి చూస్తే రాష్ట్రం కోల్పోయిన ఎంబీబీఎస్ సీట్లను ఈ ఏడాది ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఓ అధికారి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. -
300 ఎంబీబీఎస్ సీట్లకు కోత!
నాలుగు వైద్య కాలేజీల్లో సీట్ల కొనసాగింపునకు ఎంసీఐ నో సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలకు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) షాక్ ఇచ్చింది. గతేడాది ఈ కాలేజీలకు అదనంగా కేటాయించిన సీట్ల కొనసాగింపునకు తిరస్కరించింది. దీంతో 300 ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. గత ఏడాది కొత్తగా ఏర్పాటైన నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలకు 100 సీట్లు కేటాయించారు. కానీ ఈ ఏడాది ఈ సీట్లను కొనసాగించేందుకు ఎంసీఐ తిరస్కరించింది. అలాగే ఒంగోలులోని రిమ్స్ కాలేజీలో కొన్నేళ్లుగా 100 ఎంబీబీఎస్ సీట్లతో కొనసాగుతుండగా, ఈ ఏడాది ఆ సీట్ల రెన్యువల్‌కు అనుమతినివ్వలేదు. దీంతో నిజామాబాద్, ఒంగోలు రిమ్స్‌లలో ఈ ఏడాది అడ్మిషన్లు ఉండవు. సికింద్రాబాద్‌లోని గాంధీ వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లుండగా, గతేడాది అదనంగా 50 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ 50 సీట్లను కొనసాగించేందుకు ఎంసీఐ అనుమతించలేదు. తిరుపతిలోని వెంకటేశ్వర వైద్య కళాశాల పరిస్థితీ అంతే. గత ఏడాది ఇచ్చిన 50 సీట్లకు ఈసారి అనుమతినివ్వలేదు. వైద్య విద్యకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని, అధ్యాపకుల కొరత ఉందన్న కారణంగానే సీట్లను తొలగించినట్లు ఎంసీఐ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,300 సీట్లుండగా, ఆ సంఖ్య ఈ ఏడాది 2 వేలకు పడిపోయింది. మరికొద్ది రోజుల్లో ఎంసెట్ పరీక్ష జరగనున్న నేపథ్యంలో సీట్లలో కోత విధించడంతో ఎంబీబీఎస్‌లో చేరాలనుకునే విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఎండీ, ఎంఎస్ సీట్లకు కోత
ఆంధ్ర మెడికల్ కళాశాలకు ఎదురుదెబ్బ హైదరాబాద్: రాష్ట్రంలోనే అత్యంత పురాతన కళాశాల, వైద్య విద్యలో గొప్ప పేరుప్రతిష్టలున్న ఆంధ్ర మెడికల్ కళాశాలకు భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) నుంచి ఎదురుదెబ్బ తగిలింది. వసతుల లేమి కారణంగా ఎండీ పీడియాట్రిక్, ఎంఎస్ ఈఎన్టీ సీట్లను తొలగించారు. ఎండీ పీడియాట్రిక్ 5 సీట్లు, ఎంఎస్ ఈఎన్టీలో 5 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. కళాశాలలో ఉన్న వసతులను తనిఖీ చేసేందుకు కొద్ది రోజుల క్రితం ఎంసీఐ బృందం విశాఖలోని ఆంధ్రమెడికల్ కళాశాలను తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో పీడియాట్రిక్ విభాగంలో 120 పడకలు ఉండాల్సి ఉండగా, 60 మాత్రమే ఉన్నాయని, బోధనా ప్రమాణాలు లేవని, ఔట్ పేషెంట్ విభాగం సరిగా లేదని తేల్చారు. అలాగే ఈఎన్టీ విభాగంలోనూ స్పెషాలిటీ క్లినిక్ లేదని, ఓపీ సరిగా లేదని పేర్కొన్నారు. విచిత్రమేమంటే ప్రస్తుతం వైద్య విద్యసంచాలకులుగా ఉన్న డా.శాంతారావు ఇదే కళాశాలలో చదివి, అక్కడే పనిచేసి వచ్చిన వారే. ఆంధ్రా మెడికల్ కళాశాలకు కొత్తగా సీట్లు రాకపోగా ఉన్న సీట్లు కోల్పోవడం ఇదే ప్రథమం. మరిన్ని కళాశాలలు కూడా సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఎంసీఐ వర్గాలు తెలిపాయి.