సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంశం ఇప్పుడు గందరగోళంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అస్పష్ట వైఖరి వైద్య వర్గాల్లో ఆందోళన పెంచుతోంది. ఇతర రాష్ట్రాల తరహాలో ఉద్యోగ విరమణ వయసు పెంచాలని కొందరు వైద్యులు డిమాండ్ చేస్తుండగా.. ఇలా చేస్తే కింది స్థాయి వైద్యుల అవకాశాలు దెబ్బతింటాయని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కొత్తగా వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ వైద్య సేవలు నాసిరకంగా ఉంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో అన్ని ఆస్పత్రుల్లోనూ ఖాళీలు పెరుగుతున్నాయి. బోధన ఆస్పత్రుల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ బోధన ఆస్పత్రుల్లో 2,500 మంది వైద్యులు ఉండాలి. వరుస రిటైర్మెంట్లు, కొత్త వైద్యుల భర్తీ జరగకపోవడంతో ప్రస్తుతం 1,800 మంది మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రెండుమూడేళ్లలో ప్రభుత్వ కాలేజీల్లోనూ ఎంబీబీఎస్, పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం ఉంది. మరోవైపు జిల్లా, ఏరియా, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటోంది. అన్ని జిల్లాల్లో కలిపి సగటున ఏటా 60 మంది వరకు వైద్యులు రిటైర్ అవుతున్నారు. కానీ ఖాళీ పోస్టుల భర్తీ మాత్రం ముందుకు జరగడంలేదు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంశం పదేపదే తెరపైకి వస్తోంది.
ప్రతిపాదనలపై రగడ
వైద్యుల పదవీ విరమణ వయసు విషయంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రెండేళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. బోధన ఆస్పత్రులు, వైద్య కాలేజీల్లో పని చేసే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 70 ఏళ్ల వరకు పెంచాలని నిర్ణయించింది. దీనిపై అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాలను కోరింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు పదవీ విరమణ వయసు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇక కేంద్ర ప్రతిపాదనపై ప్రభుత్వ వైద్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు సీనియర్ వైద్యులు అవసరమవుతారని, పదవీ విరమణ వయసు పెంచాలని కొందరు కోరుతున్నారు. బోధన ఆస్పత్రుల్లోని జూనియర్ వైద్యులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వయసు పెంచితే కింది స్థాయిలో ఉన్న వారి అవకాశాలు దెబ్బతింటాయని వారు తీవ్రంగా వాదిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత కూడా పని చేయాలనుకునే వారు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కాలేజీల్లో చేరే అవకాశం ఉందని ప్రభుత్వ వైద్యుల సంఘం చెబుతోంది. ఇలా వైద్యుల్లోనే పలు భిన్నాభిప్రాయాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా..
వైద్యుల ఉద్యోగ విరమణ వయస్సు దేశమంతటా ఒకేవిధంగా లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం వైద్య అధ్యాపకుల విరమణ వయస్సు 70 ఏళ్ల వరకు ఉండవచ్చు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో విరమణ వయసు 65 సంవత్సరాలు. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు, వైద్య కాలేజీల్లో అధ్యాపకుల ప్రస్తుత విరమణ వయస్సు 58 సంవత్సరాలు. ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో 60 ఏళ్లు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో విరమణ వయస్సు 70 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 60 ఏళ్లు.. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్‌లలో 62 ఏళ్లు.. హరియాణా, ఢిల్లీ, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 65 ఏళ్లు.. బిహార్‌లో 67 ఏళ్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ అంశంపై ఎటూ తేల్చకపోవడంతో వైద్యుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
రిటైర్మెంట్లే.. భర్తీలేవీ..?
Published Sun, May 13 2018 2:47 AM | Last Updated on Sun, May 13 2018 2:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment