Government medical services
-
AP: సత్వరమే ఫిర్యాదుల పరిష్కారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య సేవల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రజలు ఫిర్యాదు చేయడానికి వీలుగా ప్రవేశపెట్టిన 104 కాల్‌సెంటర్ చక్కగా పనిచేస్తోంది. సత్వరమే ఫిర్యాదులను పరిష్కరిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో 104 కాల్ సెంటర్‌ను వైద్య శాఖ ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 6,336 ఫిర్యాదులు అందాయి. ఇందులో 5,918 ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించారు. మరో 235 ఫిర్యాదులు నిర్దేశిత సమయానికి కొంత ఆలస్యంగా పరిష్కారమయ్యాయి. కాల్సెంటర్లో 30 మంది సిబ్బంది 24/7 పనిచేస్తున్నారు. వీరు కాల్ సెంటర్‌కు వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. చదవండి: ఏపీ బడిబాటలో యూపీ ఐదు సేవలపై ఫిర్యాదులకు.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వైద్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఒకటి రెండు చోట్ల అధికారుల ఉదాసీన వైఖరి, క్షేత్ర స్థాయి సిబ్బంది, ఆస్పత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య సేవలను పొందడంలో ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు తలెత్తితే ప్రజలు ఫిర్యాదు చేయడానికి 104 ఫిర్యాదుల కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ–ఆరోగ్య ఆసరా, 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 అంబులెన్స్, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, మహాప్రస్థానం ఈ ఐదు సేవలపై ఫిర్యాదులు స్వీకరించడం ప్రారంభించారు. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను తీవ్రతను బట్టి ఎంత సమయంలోగా పరిష్కరించాలి.. పరిష్కరించడానికి బాధ్యులు ఎవరనే దానిపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ని రూపొందించారు. 104 కాల్ సెంటర్ సేవలను ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం, ఇతర సేవలపై ఫిర్యాదుల స్వీకారం దిశగా విస్తరించనున్నారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ.. కాల్‌సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు, వాటి పరిష్కారంపై డ్యాష్‌బోర్డ్ ద్వారా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను ఎస్‌వోపీలో నిర్దేశిత సమయంలోగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ డిప్యూటీ ఈవో మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోని హెల్ప్ డెస్క్‌లు, 104 ఎంఎంయూ, 108 అంబులెన్స్, మహాప్రస్థానం వాహనాలపై ఫిర్యాదుల నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు తలెత్తితే ఆ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదులు ఇలా చేయొచ్చు.. ►ఐదు సేవల్లో ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయాలనుకుంటే తొలుత 104కు కాల్ చేయాలి. ►కాల్ చేసిన వెంటనే వైద్య సేవలపై ఫిర్యాదుల కోసం 1, సమాచారం కోసం 2 నొక్కాలని ఐవీఆర్ఎస్ సూచిస్తుంది. ►అప్పుడు ఫిర్యాదులు చేయాల్సినవారు 1 నొక్కాలి. ►అనంతరం కాల్ సెంటర్లోని ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు స్వీకరిస్తారు. -
‘సాక్షి’ పరిశీలన: డాక్టర్ సారు.. ఉంటలేడు!
తన కూతురికి తానే వైద్యం చేసుకుంటున్న పరిస్థితి నిర్మల్ జిల్లా పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనిది. ఉదయం 9.30గంటలైనా అక్కడ వైద్య సిబ్బంది లేకపోవడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూతురికి తండ్రే డ్రెస్సింగ్ చేసుకున్నారు. 9.45 గంటలకు ల్యాబ్ టెక్నీషియన్ రాగా, పది గంటలకు ఫార్మసిస్టు వచ్చారు. వైద్యుడు, స్టాఫ్‌నర్సు శిక్షణకు వెళ్లడంతో రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఇదే మండలం పస్పుల గ్రామానికి చెందిన బాలిక రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం రాగా, సిబ్బంది లేకపోవడంతో తండ్రే మందు పూసి కట్టుకట్టాడు. ►కోయిలకొండ మండలానికి చెందిన అంబటిదాస్చౌహన్ భార్య ఊట్కూర్ మండలం రాంరెడ్డిగూడెంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం భార్యాబిడ్డలను చూసి మహబూబ్‌నగర్‌కు వస్తున్న క్రమంలో గోప్లాపూర్ సమీపంలోని రహదారిపై అంబటిదాస్ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం దేవరకద్ర పీహెచ్‌సీకి తెచ్చారు. అక్కడ డాక్టర్ సెలవులో ఉండటంతో సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. పది నిమిషాలపాటు బాధితుడిని ఆటోలో ఎండలోనే ఉంచారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ భగవంత్ రెడ్డి బాధితుడిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి పంపించారు. గాయాలపాలైన అతడిని అంబులెన్స్‌లో ఎక్కించే సమయంలో సిబ్బంది కనీసం ప్రథమ చికిత్స కూడా చేయకుండా కేవలం రెండు ఇంజెక్షన్లు ఇచ్చి పంపించారు. అంబటిదాస్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ►పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన పేరు మహ్మద్ అలీ. ఈ నెల 20న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తీవ్రమైన రక్తస్రావంతో కరీంనగర్‌లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అక్కడున్న నర్సులు రక్తం తుడిచి కుట్లు కుట్టి సూదిమందు ఇచ్చారు. వారే మందులు ఇచ్చారే కానీ డాక్టర్ ఎవరూ రాలేదు. ఉదయం 11 గంటల తర్వాత గానీ డాక్టర్ వచ్చిన పాపాన పోలేదని ఆయన కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. సాక్షి, నెట్వర్క్/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) మొదలు ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల వరకు ఇదే తంతు. డాక్టర్లు హాజరుకాకపోవడం, వచ్చినా సకాలంలో రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని రోగులు వాపోతున్నారు. కొందరు వైద్యులు సొంతంగా ప్రైవేట్ క్లినిక్‌లు పెట్టుకోగా, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తూ ప్రభుత్వ వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుస్తీ చేసిందని వస్తే బాగుచేసే వారే ఉండ టం లేదంటున్నారు. కొందరు డాక్టర్లయితే హైదరాబాద్‌లోనే ఉంటూ నిజామాబాద్, మెదక్, మహ బూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు వెళ్లి వస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో వైద్యులు విధులకు హాజరయ్యే తీరుపై ‘సాక్షి’మంగళవారం జరిపిన పరిశీలనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వారానికి ఒకట్రెండు రోజులు వైద్య ఆరోగ్యశాఖ వర్గాల లెక్కల ప్రకారం వారానికి రెండ్రోజులు మాత్రమే విధులకు హాజరయ్యే డాక్టర్లు దాదాపు 50% మంది ఉంటారు. మరీ ముఖ్యంగా పీహెచ్‌సీలకు వెళ్లే డాక్టర్లయితే వారానికి ఒకసారి వెళ్లేవారే ఎక్కువ. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు గగనమయ్యాయని బాధితులు వాపోతున్నారు. సర్కారు వైద్యంపై నమ్మకం లేకుండా పోతోందని అంటున్నారు. వైద్యులు ఎప్పుడొస్తారో... ఎప్పుడు వెళ్తారో తెలియక చాలామంది సర్కారు ఆసుపత్రులకు రావడానికి జంకుతున్నారు. వైద్యాధికారుల హాజరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలు చాలాచోట్ల పనిచేయడంలేదు. కొన్నిచోట్ల వైద్య సిబ్బందే వాటిని పనిచేయకుండా చేసినట్లు సమాచారం. వీరి విధులను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ఇటీవల ఆస్పత్రులను విజిట్ చేసిన దాఖలాల్లేవు. అదీగాక విధులకు ఎగనామం పెడుతున్న వైద్యులపై కనీస చర్యల్లేవని అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో... కరీంనగర్ జిల్లా ఆçస్పత్రితోపాటు హుజూరాబాద్, జమ్మికుంట ఏరియా ఆస్పత్రులు, 18 పీహెచ్‌సీలు, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడా కూడా వైద్యులు సకాలంలో రావట్లేదు. వైద్యులు 11 గంటలకు వచ్చి ఒంటి గంటకే వెళ్లిపోతున్నారు. ►కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ గదుల్లో కూర్చొని రోగులను చూడాల్సి ఉన్నా అమలుకావడం లేదు. సీనియర్ డాక్టర్లు కేవలం ఇన్‌పేషంట్‌గా చేరిన వారినే పరీక్షించి వెళ్లడం పరిపాటిగా మారింది. కొందరు వైద్యులైతే వారంలో రెండు మూడు రోజులు మాత్రమే హాజరై. రిజిస్టరులో వారం రోజులు హాజరైనట్లు సంతకాలు చేస్తున్నారు. ►పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని పీహెచ్సీలో ఉదయం 9 గంటల నుంచే వైద్యసేవలు అందించాల్సి ఉండగా, వైద్యులు 10.30 గంటలకు చేరుకున్నారు. ఉదయం 9.30 గంటలకు కేవలం ఫార్మసిస్టు, ఎన్సీడీ, ఒక్క స్టాఫ్ నర్స్ మాత్రమే ఉన్నారు. జిల్లాలో ఉన్న దాదాపు అన్ని పీహెచ్‌సీల్లో ఇదే దుస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో... ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు సామాజిక ఆసుపత్రుల్లో వైద్యులు కొరత ఉంది. పని చేస్తున్న వారు సైతం సమయానికి రావడం లేదు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లో పని చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉన్నవారితోనే నెట్టుకొస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా... సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 93 ప్రభుత్వాస్పత్రులు ఉన్నాయి. ఇందులో 3 జిల్లా కేంద్ర ఆస్పత్రులు, మిగతావి పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, అర్బన్ పీహెచ్సీ, సీహెచ్‌సీలున్నాయి. ‘సాక్షి’ బృందం 66 ఆస్పత్రులను విజిట్ చేసింది. వైద్యులు సమయానికి విధులకు రాకపోవడంతో పేదలకు వైద్యం అందట్లేదు. నర్సులు, కింది స్థాయి సిబ్బంది మందుబిళ్లలు ఇచ్చి పంపుతున్నారు. ►సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియాస్పత్రిలో బయోమెట్రిక్ ఏళ్లుగా పనిచేయడంలేదు. దీంతో పనిచేసే వారు ఎప్పుడు వస్తున్నారో... ఎప్పుడు వెళ్తున్నారో అడిగే నాథుడే లేరు. ►సంగారెడ్డి జిల్లాలోని మారుమూల మండలం పుల్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉదయం 11 దాటినా వైద్యులెవరూ రాకపోవడంతో రోగులు తీవ్ర నిరాశతో తిరిగి వెనుదిరిగారు. ఒక్క నర్సే విధులకు హాజరయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా... వరంగల్ జిల్లా నెక్కొండ పీహెచ్‌సీకి వైద్యాధికారితోపాటు ఇతర సిబ్బంది వరంగల్ నుంచి రోజూ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి వెళ్తుంటారు. వీరు 9 గంటలకు రావాల్సి ఉండగా రైలు రాకపోకలతో వారు వచ్చే సమయం 10 దాటుతుంది. అందుకే రోగులూ పది దాటాకే వస్తున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విధులకు వచ్చారు. ►వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే రోగులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ చికిత్స అందిస్తుంటారు. మంగళవారం ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యులు అర్ధగంట ఆలస్యంగా వచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ విధులకు హాజరు కాలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా... మహబూబ్‌నగర్ జిల్లాలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆస్పత్రుల్లో మినహాయిస్తే ఇతరచోట్ల ఎక్కడా వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. జనరల్ ఆస్పత్రిలో సీనియర్లు ఆలస్యంగా వచ్చి.. త్వరగా వెళ్లిపోతున్నారు. దీంతో హౌస్సర్జన్లపైనే భారం పడుతోంది. ►వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో పలు పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్ పనిచేయడం లేదు. ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలో న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలకు చెందిన డాక్టర్లు ఉదయం 11 గంటల వరకు కూడా రాలేదు. దీంతో చాలామంది రోగులు గంటల తరబడి వేచిచూసి వెనుదిరిగారు. మధ్యాహ్నం 12కు కూడా తాళం వేసి ఉన్న కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పీహెచ్సీ ఇన్ పేషెంట్ వార్డు ►సత్తుపల్లి ఏరియా ప్రభుత్వాస్పత్రిలో 21 మంది వైద్యులకు 9 మంది విధుల్లో ఉన్నారు. మిగతా 12 మంది చాలాకాలంగా గైర్హాజరవుతున్నారు. వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్ మిషన్‌ను వాడట్లేదు. జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాల్లో గాయపడే వారు చికిత్స కోసం వస్తే అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ ఉండడంలేదు. ఆయన దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్ప త్రిలో కొందరు ఆలస్యంగా వస్తున్నారు. మెడికల్ కళాశాలకు చెందిన ప్రొఫెసర్లు, అసోసి యేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో కొందరు ఆలస్యంగా వస్తున్నారు. రామన్న పేటలో ఉదయం 10:30కు కూడా సిబ్బంది లేక ఖాళీగా గైనకాలజీ క్లినిక్ ►తుంగతుర్తిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 10:30 గంటల వరకు కూడా ఎక్స్‌రే గదికి తాళం తీయలేదు. సూర్యా పేట జనరల్ ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ విభాగం, జనరల్ మెడిసిన్ వైద్యులు ఉదయం 8 గంటలకు రావాల్సి ఉండగా 10.30 గంటల తర్వాత వచ్చారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని గైనకాలజిస్టు వైద్యులు ఏ ఒక్కరూ ఉదయం 11 వరకు అందుబాటులో లేరు. దీంతో గర్భిణులు గంటల తరబడి ఎదురు చూశారు. ►సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పీహెచ్సీలో డాక్టర్ మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. ఆస్పత్రిలో బయోమెట్రిక్ పనిచేయడంలేదు. డాక్టర్లు ఆలస్యంగా వస్తున్నారు నేను ఉదయం 9 గంటలకు పెద్దాసుపత్రికి వచ్చాను. జ్వరం బాగా వచ్చింది. తొందరగా చూపించుకొని వెళ్దామంటే డాక్టర్ 11.30కు వచ్చారు. టెస్టులు రాసిస్తే, చేసుకొని వచ్చే సరికి డాక్టర్ వెళ్లిపోయాడు. 1.30 గంటలకు కొత్త డాక్టర్ పరీక్షల చిట్టి చూసి మందులు రాశారు. – లక్ష్మీ, కరీంనగర్ ఎప్పుడొచ్చినా సారు ఉంటలేడు నేను గర్భవతిని. కడుపులో నొప్పి అనిపిస్తే ఉదయం 9.30 గంటలకు పిట్టబొంగరంలోని దావఖానకు అచ్చిన. అచ్చినప్పటి నుంచి డాక్టర్ సారు లేడు. పది దాటినంక ఒక్కొక్కరు వచ్చారు. అయినా సారు రాలేదు. నొప్పి భరించలేక లోపలికి వెళ్లి సిస్టరమ్మకు చెబితే మందులిచ్చింది. ఇక్కడికి ఎప్పుడు వచ్చిన డాక్టర్ కనిపించడు. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. – కినక శశిక, పిట్టబొంగరం, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా -
ప్రసవానంతరం తల్లీబిడ్డలు సురక్షితంగా ఇంటికి..
సాక్షి, అమరావతి: గర్భిణులకు ఉచిత వైద్యసదుపాయం కల్పించడమేగాక ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటి వద్దకు పంపించే సేవలను కూడా ప్రభుత్వం సమర్థంగా నిర్వర్తిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవమయ్యే మహిళల్లో ఎక్కువమంది ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వ రవాణాను ఉపయోగించుకున్నారు. 2020–21 సంవత్సరంలో 2,20,731 మంది బాలింతలు అంటే మొత్తం డెలివరీల్లో 77.83 శాతం మంది తల్లీబిడ్డలు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. ప్రతి ఆస్పత్రిలోను బాలింతను డిశ్చార్జి చేసే సమయానికి వైద్యులే వాహనాలను సిద్ధం చేసి తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నారు. ప్రసవానంతరం ప్రభుత్వం ఇచ్చే పోషకాహారాన్ని 2.66 లక్షల మంది బాలింతలు వినియోగించుకున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో గర్భిణులుగా నమోదు చేసుకుని ఉచిత వైద్యపరీక్షలు, రక్తపరీక్షలు చేయించుకున్న వారు 2,67,069 మంది ఉన్నారు. ప్రసవానికి వెళ్లేందుకు ఉచిత రవాణా అంటే 108 వాహనాలను 48.45 శాతం మందే ఉపయోగించుకున్నారు. దీన్ని మరింతగా పెంచాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. పురిటినొప్పుల సమయంలో 108కు కాల్చేస్తే 15 నిమిషాల్లోనే ఇంటిదగ్గరకు వస్తుందని, ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం అయ్యే మహిళలకు సంబంధించిన వివరాలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు పంపించాలని ట్రస్ట్ సీఈవో అన్ని ఆస్పత్రులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రసవాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని కూడా ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. -
ప్రభుత్వ వైద్యానికి చికిత్స తప్పనిసరి
సాక్షి, అమరావతి: ‘‘గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను చక్కగా వినియోగించుకొని, ప్రభుత్వ వైద్య వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు కీలక సేవలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించారు. ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చారు. నిధులను ఖర్చు చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులు పూర్తిగా బలహీనపడ్డాయి. వైద్య వ్యవస్థ దిగజారిపోయింది.’’ అని నిపుణుల కమిటీ కుండబద్దలు కొట్టింది. ప్రభుత్వ వైద్య వ్యవస్థకు కాయకల్ప చికిత్స తప్పనిసరి అని తేల్చిచెప్పింది. ఆరోగ్య శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలను సిఫార్సు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలలపాటు పర్యటించారు. పలువురి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సామాన్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో కొనసాగుతున్న ప్రాజెక్టులను పరిశీలించారు. తుది నివేదికను సిద్ధం చేశారు. నిపుణుల కమిటీ ఈ నెల 19వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ నివేదికను అందజేయనుంది. నిపుణుల కమిటీ సిఫార్సులు - రోగులకు ఎలక్ట్రానిక్ హెల్త్‌కార్డులు ఇవ్వాలి. దీనివల్ల ప్రత్యేక ట్రాకింగ్ విధానం అమలు చేయొచ్చు. - ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన హెల్త్ ప్రాక్టీషనర్స్ మాత్రమే మందులు ఇచ్చే విధానం ఏర్పాటు చేయాలి. - విలేజ్ హెల్త్ క్లినిక్‌లు నెలకొల్పాలి. - ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థను బలోపేతం చేయాలి. - ప్రతి పీహెచ్సీలో ల్యాబొరేటరీ, ఫోన్, కంప్యూటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాటికల్ అసిస్టెంట్ ఉండాలి. - ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేసుకోవాలి. - అందులో వచ్చే సొమ్ములో 30% డబ్బును అద్దెకింద ప్రభుత్వ ఆస్పత్రికి చెల్లించాలి. - ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేసే వైద్యులు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి ఆరోగ్యశ్రీ పరిధిలోని సర్జరీలు చేయకూడదు. - అనుమతి లేకుండా ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తే తమను విధుల తొలగించవచ్చని వైద్యుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలి. - అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసీయూ, క్యాజువాలిటీ ఉండాలి - ‘108’ అంబులెన్సులను 3 షిఫ్టుల్లో నిర్వహించాలి. - రోగుల వివరాలు, బయోమెట్రిక్ అటెండెన్స్, లైవ్ డ్యాష్బోర్డ్లను ఏర్పాటు చేయాలి. - పీపీపీ ప్రాజెక్టులను పునఃసమీక్షించాలి. నిపుణుల కమిటీ నివేదికలోని ముఖ్యమైన అంశాలు.. - రాష్ట్రంలో గుండెపోటు, డయాబెటిక్, హైపర్ టెన్షన్ కేసులతో పాటు బలవన్మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. ఐరన్ లోపం, రక్తహీనత వంటి జబ్బులు వేధిస్తున్నాయి. - అర్హత లేని వైద్యులు రోగుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారు. అవసరం లేకపోయినా యాంటీబయోటిక్స్ వాడుతున్నారు. - మందుల సరఫరా అత్యంత లోపభూయిష్టంగా ఉంది. మందుల కొరత వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. - గత మూడేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా సేవలను ప్రైవేట్‌పరం చేశారు. - వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. - ప్రభుత్వ హాస్పిటళ్లలో మౌలిక వసతులు కొరవడ్డాయి. ఆపరేషన్ థియేటర్ల పరిస్థితి దారుణంగా మారింది. - అన్ని వసతులున్న ఆస్పత్రులను రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కోల్పోవాల్సి వచ్చింది. - ఏపీలో చాలా వైద్య కళాశాలల్లో ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, రేడియోథెరఫీ వంటి విభాగాలు లేవు. ఉన్నా సక్రమంగా పని చేయడం లేదు. - ఒక్కసారి ఇన్‌పేషెంట్‌గా చేరితే గ్రామీణ ప్రాంతాల్లో రూ.13,010, పట్టణ ప్రాంతాల్లో రూ.30,712 ఖర్చు చేయాల్సి వస్తోంది. - రాష్ట్ర ప్రజలు మందుల కోసం ప్రతిఏటా రూ.21,309 కోట్లు ఖర్చు చేస్తున్నారు. - సాంక్రమిక(కమ్యూనికబుల్) వ్యాధుల నియంత్రణలో రాష్ట్రం విఫలమైంది. ఖాళీలను భర్తీ చేయకపోవడం, సాంకేతిక సిబ్బంది లేకపోవడం వంటివి దారుణంగా దెబ్బతీశాయి. - నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (అసాంక్రమిక వ్యాధులు) నియంత్రణలో విఫలమయ్యారు. - క్యాన్సర్, గుండెజబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ జబ్బులు పెరుగుతున్నా వాటి నియంత్రణకు చర్యలు తీసుకోలేదు. - 50 శాతం అంబులెన్సులు సరైన కండిషన్లో లేవు. -
నేనొస్త బిడ్డో సర్కారు దవాఖానకు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక చర్యలతో తెలంగాణ వైద్య, ఆరోగ్య రంగంలో గుణాత్మక మార్పులు వచ్చాయని రాష్ట్ర, ఐటీ పురపాలక శాఖల మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందని, అన్ని సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలు పెరిగాయని చెప్పారు. మొత్తంగా ప్రభుత్వ వైద్య సేవలతో ‘నేనొస్త బిడ్డో సర్కార్ దవాఖానాకు’అని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనూ స్పెషాలిటీ వైద్య సేవలను విస్తరిస్తున్నామని, త్వరలోనే ఇంటింటికీ కంటి, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి అందరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తామని, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం వల్లే ఇదంతా సాధ్యమైందని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) ఆవరణలో డయాగ్నోస్టిక్ సెంటర్ సెంట్రల్ హబ్‌ను కేటీఆర్, వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభించారు. అద్భుతమైన పథకాలు తెచ్చాం.. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే పరిస్థితి ఉండేది. అప్పటి పరిస్థితులకు అద్దం పడుతూ కవులు ఆ విధంగా పాటలు రాశారు. ప్రజలూ ఆదరించారు. నేటి పరిస్థితులు వేరు. తెలంగాణ ఆవిర్భావం తర్వా త వైద్య రంగం అద్భుత ప్రగతి సాధించింది. మంత్రి లక్ష్మారెడ్డి కృషితో సత్ఫలితాలు వచ్చాయి. అందుకే సర్కారు దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పెరిగింది. 20 ఐసీయూలు, 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. కేసీఆర్ కిట్ వంటి అద్భుతమైన పథకాలను అందుబాటులోకి తెచ్చాం. హైదరాబాద్‌లో 17 బస్తీ దవాఖానాలు ప్రారంభించాం. త్వరలో ఈ సంఖ్యను 45కి పెంచుతాం. హైదరాబాద్‌లో 1,000 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. ప్రస్తుత డయాగ్నోస్టిక్ సేవలను బస్తీ దవాఖానాలకు అన్వయించాలి. సామాన్యులకు, పేదలకు రోగ నిర్ధారణ పరీక్షలు భారం కాకుండా వైద్య పరీక్షలు ఉచితంగా ప్రభుత్వమే అందించే చర్య లు అద్భుతమైన ఆలోచన. ఒక గంటలో 200 నుంచి వెయ్యి వరకు పరీక్షల రిపోర్టులు అందించే అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న టాటా ట్రస్ట్‌కు అభినందన లు. గత ప్రభుత్వాలు ఏనాడూ ఇలా ఆలోచించలేదు. వైద్యంలోనే ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తోంది. మరణానంతరం వాహనాలతో సామాన్యుల పార్థివదేహాలను వారి ఇళ్లకు చేరుస్తోంది. వైద్యశాఖలో సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. అత్యాధునిక సాంకేతికత.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. హైదరాబాద్ మహానగర పరిధిలోని జిల్లా ఆస్పత్రి, ఐదు ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 120 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, బస్తీ దవాఖానాల నుండి రోగ నిర్ధారణ పరీక్షల శాంపిల్స్ సేకరిస్తారు. సెంట్రల్ హబ్ 24 గంటలూ పని చేస్తుంది. మరో ఎనిమిది సామాజిక ఆరోగ్య కేంద్రాలు మినీ హబ్‌లుగా పనిచేస్తాయి. అల్ట్రా సౌండ్, ఎక్స్‌రే, ఈసీజీ సేవలు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ నిర్వహణకు కావాల్సిన సాంకేతిక సహాయాన్ని టాటా ట్రస్ట్ అందిస్తోంది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన శాంపిల్స్‌ని సెంట్రల్ హబ్‌కి చేర్చడానికి ఎనిమిది వాహనాలు ఏర్పాటు చేశారు. శాంపిల్స్ సేకరణ నుంచి సెంట్రల్ హబ్ చేరే వరకు సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన సాంకేతిక నైపుణ్యం కోసం సిబ్బందికి పూర్తి శిక్షణ ఇచ్చారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్‌లో గంట సమయంలో 200 నుంచి 1,000 వరకు పరీక్షలు నిర్వహించడానికి వీలుగా అధునాతన సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేశారు. నమ్మకం పెంచుతున్నాం.. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంచుతున్నామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు అందించడమే లక్ష్యంగా డయాగ్నోస్టిక్స్ సేవలను అందుబాటులో కి తెచ్చామన్నారు. హైదరాబాద్‌లోని ప్రతి ఒక్కరు పరీక్ష కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా దవాఖానాల్లో ఎక్కడికక్కడ అన్ని రకాల స్పెషాలిటీ చికిత్సలు అందిస్తున్నామని, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కార్యక్రమం గర్వించాల్సిన అంశమని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే అనేక రకాల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని చెప్పారు. పెయిన్ కిల్లర్స్‌ను ఇష్టం వచ్చినట్టు వాడటం వల్ల కిడ్నీలు దెబ్బ తింటున్నాయని, మందుల వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ శివప్రసాద్, ఐపీఎం డైరెక్టర్ శంకర్, ఎంఎన్‌జే ఆస్పత్రి డైరెక్టర్ జయలత పాల్గొన్నారు -
రిటైర్మెంట్లే.. భర్తీలేవీ..?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంశం ఇప్పుడు గందరగోళంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అస్పష్ట వైఖరి వైద్య వర్గాల్లో ఆందోళన పెంచుతోంది. ఇతర రాష్ట్రాల తరహాలో ఉద్యోగ విరమణ వయసు పెంచాలని కొందరు వైద్యులు డిమాండ్ చేస్తుండగా.. ఇలా చేస్తే కింది స్థాయి వైద్యుల అవకాశాలు దెబ్బతింటాయని మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు కొత్తగా వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ వైద్య సేవలు నాసిరకంగా ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడంతో అన్ని ఆస్పత్రుల్లోనూ ఖాళీలు పెరుగుతున్నాయి. బోధన ఆస్పత్రుల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. రాష్ట్రంలోని ఏడు ప్రభుత్వ బోధన ఆస్పత్రుల్లో 2,500 మంది వైద్యులు ఉండాలి. వరుస రిటైర్మెంట్లు, కొత్త వైద్యుల భర్తీ జరగకపోవడంతో ప్రస్తుతం 1,800 మంది మాత్రమే ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రెండుమూడేళ్లలో ప్రభుత్వ కాలేజీల్లోనూ ఎంబీబీఎస్, పీజీ సీట్లకు కోత పడే ప్రమాదం ఉంది. మరోవైపు జిల్లా, ఏరియా, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటోంది. అన్ని జిల్లాల్లో కలిపి సగటున ఏటా 60 మంది వరకు వైద్యులు రిటైర్ అవుతున్నారు. కానీ ఖాళీ పోస్టుల భర్తీ మాత్రం ముందుకు జరగడంలేదు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంశం పదేపదే తెరపైకి వస్తోంది. ప్రతిపాదనలపై రగడ వైద్యుల పదవీ విరమణ వయసు విషయంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రెండేళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. బోధన ఆస్పత్రులు, వైద్య కాలేజీల్లో పని చేసే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 70 ఏళ్ల వరకు పెంచాలని నిర్ణయించింది. దీనిపై అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాలను కోరింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు పదవీ విరమణ వయసు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక కేంద్ర ప్రతిపాదనపై ప్రభుత్వ వైద్యులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు సీనియర్ వైద్యులు అవసరమవుతారని, పదవీ విరమణ వయసు పెంచాలని కొందరు కోరుతున్నారు. బోధన ఆస్పత్రుల్లోని జూనియర్ వైద్యులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వయసు పెంచితే కింది స్థాయిలో ఉన్న వారి అవకాశాలు దెబ్బతింటాయని వారు తీవ్రంగా వాదిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత కూడా పని చేయాలనుకునే వారు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కాలేజీల్లో చేరే అవకాశం ఉందని ప్రభుత్వ వైద్యుల సంఘం చెబుతోంది. ఇలా వైద్యుల్లోనే పలు భిన్నాభిప్రాయాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా.. వైద్యుల ఉద్యోగ విరమణ వయస్సు దేశమంతటా ఒకేవిధంగా లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం వైద్య అధ్యాపకుల విరమణ వయస్సు 70 ఏళ్ల వరకు ఉండవచ్చు. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో విరమణ వయసు 65 సంవత్సరాలు. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు, వైద్య కాలేజీల్లో అధ్యాపకుల ప్రస్తుత విరమణ వయస్సు 58 సంవత్సరాలు. ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో 60 ఏళ్లు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో విరమణ వయస్సు 70 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 60 ఏళ్లు.. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్‌లలో 62 ఏళ్లు.. హరియాణా, ఢిల్లీ, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 65 ఏళ్లు.. బిహార్‌లో 67 ఏళ్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ అంశంపై ఎటూ తేల్చకపోవడంతో వైద్యుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
తల్లీ..బిడ్డా..బతికేదెట్టా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలు ఇంకా లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి అత్యవసర వైద్య సేవలు అందని ద్రాక్షగానే మిగులుతున్నాయి. ముఖ్యంగా కాన్పు సమయంలో తల్లులు, శిశువుల పరిరక్షణ సవాల్‌గా మారుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రకాల కార్యక్రమాలను అమలుచేస్తున్నా మాతాశిశు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో మాతాశిశు సంరక్షణ ఆందోళనకరంగానే ఉందని స్పష్టమవుతోంది. మన రాష్ట్రంలోని పాత జిల్లాల ప్రాతిపదికన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆ సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. రాష్ట్రంలో జరిగే ప్రతి లక్ష కాన్పులలో 92 మంది తల్లులు చనిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రసవ సమయంలో తల్లుల మరణాలరేటు ఎక్కువగా ఉంది. అక్కడ ప్రతి లక్షకు 152 మంది తల్లులు మరణిస్తున్నారు. హైదరాబాద్‌లో మరణాల సంఖ్య 71 ఉంది. చిన్న వయసులో పెళ్లిళ్లు, రక్తహీనత బాలింతల మరణాలకు ఎక్కువగా కారణమవుతోంది. గర్భిణులలో 51 శాతం మందికి ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఔషధాలు చేరడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కాన్పు సమయంలో రక్తస్రావం జరిగితే అందుబాటులో రక్తం లేకపోవడం వల్ల బాలింతల మరణాలు పెరుగుతున్నాయి. గర్భంలోని శిశువు పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమయ్యే స్కానింగ్ వ్యవస్థ గ్రామాల్లో లేకపోవడం వల్ల కాన్పు సమయంలో ఎక్కువ సమస్యలు వచ్చి మరణాలు జరుగుతున్నాయి. శిశుమరణాల పరిస్థితి సైతం రాష్ట్రంలో ఇలాగే ఉంది. రాష్ట్రంలో జన్మించే ప్రతి వెయ్యి మంది శిశువులలో 30 మంది చనిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మరణాల సంఖ్య 38, పట్టణ ప్రాంతాల్లో 20గా ఉంది. కాన్పు సమయం నుంచి కొన్ని రోజులలోపు ఇలా శిశువులు చనిపోతున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే శిశు మరణాల రేటు మన రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతోంది. కేరళలో 12, తమిళనాడులో 21 మంది శిశువులు చనిపోతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో శిశు మరణాల రేటు మరీ ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో ప్రతి వెయ్యి మంది శిశువులలో 53 మంది మరణిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సంఖ్య 20గా ఉంది. ప్రభుత్వం కొత్తగా ఆస్పత్రులను నిర్మిస్తున్నా అవసరమైన మేరకు సిబ్బంది లేకపోవడంతో శిశు మరణాల సంఖ్య తగ్గడం లేదని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాన్పులు చేసే ఆస్పత్రులలో కచ్చితంగా స్త్రీ వైద్య నిపుణులు, పిల్లల వైద్యుడు, మత్తు డాక్టరు ఉండాలి. 70 శాతం ఆస్పత్రులలో మత్తు వైద్యులు లేరు. మూడు కేటగిరీల వైద్యులు ఉన్న ఆస్పత్రులు తక్కువగా ఉండటమే మాతాశిశు మరణాలకు కారణమవుతోంది. -
శభాష్.. డాక్టర్
{పభుత్వ వైద్య సేవల్లో జిల్లా ఉత్తమం మన వైద్యులను ఆహ్వానించిన బీజాపూర్ కలెక్టర్ బృందాన్ని పంపిన కలెక్టర్ కరుణ వరంగల్ : ప్రభుత్వ వైద్య సేవల పరంగా జిల్లాలో కొన్ని నెలలుగా గణనీయమైన మార్పులు వచ్చాయి. ఏడాది క్రితంతో పోల్చితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు మెరుగయ్యాయి. ముఖ్యం గా కాన్పుల విషయంలో పురోగతి ఎక్కువగా ఉందని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ గుర్తిం చింది. వైద్య సేవల పరంగా రాష్ట్రంలోనే జిల్లా ఉత్తమంగా ఉందని ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కలెక్టర్‌కు తెలిపింది. ఆ జిల్లా కలెక్టర్ అయ్యాజ్ ఎఫ్ తాంబోలి స్వయంగా వైద్యుడు. అక్కడి ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర కుటుం బ సంక్షేమశాఖ కమిషర్‌కు లేఖ రాశా రు. ప్రభుత్వ సేవలపరంగా మెరు గ్గా ఉన్న వరంగల్ వైద్య బృం దాన్ని బీజాపూర్‌కు పంపించాలని కోరా రు. దీంతో ఇదే విషయమై కుటుం బసంక్షేమ కమిషనర్.. కలెక్టర్ వాకాటి కరుణకు లేఖ రాశారు. కాగా, కలెక్టర్ కరుణ ఆదేశాల మేరకు జిల్లాలోని వైద్య బృందం బీజాపూర్‌కు వెళ్లింది. మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి(ఎంజీఎం)లో నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న పిల్లల వైద్యులు బలరాం, సురేందర్, స్టేషన్‌ఘన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదర్శంగా నిలిపిన వైద్యుడు మహేందర్ ఈనెల 25 బీజాపూర్‌కు వెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడి వైద్యులకు తగు సలహాలు, సూచనలు అందించి 27న తిరిగి వచ్చారు. ప్రత్యేక శిక్షణకు వినతి... బీజాపూర్ జిల్లాలో 2.52 లక్షల మంది జనాభా ఉండగా, వైద్యులు 16 మంది మాత్రమే ఉన్నారని ఇక్కడి నుంచి వెళ్లిన వైద్య బృందం తెలిపింది. బీజాపూర్ జిల్లా కేంద్రంలో 35 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. అక్కడున్న 30 పడకల ఆస్పత్రిని 100 పడకల అస్పత్రిగా ఆ జిల్లా కలెక్టర్ తాంబోలి అభివృద్ధి చేశారు. 16 మంది వైద్యులలో తొమ్మిది మంది జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అక్కడి వారికి శిక్షణ అవసరమని భావించి మన జిల్లా వైద్యులను బీజాపూర్‌కు ఆహ్వానించారు. మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కోరారు. వైద్యుల కొరత తీవ్రంగా ఉన్నందున తమ వద్ద విధులు నిర్వహించేందుకు వచ్చే వారికి రెండు లక్షల రూపాయల చొప్పున వేతనం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అక్కడి కలెక్టర్ చెప్పారని మన వైద్యులు తెలిపారు. -
ఏడాది నిబంధన నుంచి ఎంబీబీఎస్‌లకు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ పూర్తిచేసిన విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వ సర్వీసులో ఏడాదిపాటు పనిచేయాలన్న నిబంధన నుంచి మినహాయింపునిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం (జూడా) అనేక డిమాండ్లతోపాటు దీనిపైనా గతంలో సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. వారి విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పీజీ పూర్తిచేసిన వైద్య విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా ఏడాదిపాటు ప్రభుత్వ వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. దీని వల్ల రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తిచేసి బయటకు వచ్చే దాదాపు 3 వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు వెసులుబాటు దొరికింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం పీజీ వైద్య విద్యార్థులకు కూడా వాలంటరీగా ముందుకు వచ్చే వారికే ప్రభుత్వ సర్వీసు ఇవ్వాలని, మిగతా వారికి అవసరం లేదని జూడాల అధ్యక్షుడు శ్రీనివాస్ ‘సాక్షి’తో అన్నారు. ఎంబీబీఎస్‌లకు మినహాయింపు ఇవ్వడంపట్ల ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యసేవలు
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆస్పత్రులకు కావలసిన వసతులు కల్పించామని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 4 వేల డాక్టర్, సిబ్బంది పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్‌ను లక్ష్మారెడ్డి ప్రారంభిం చారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రోగి మం దులు, పరీక్షలకు బయటకు వెళ్లకుండా అన్నీ ఆస్పత్రుల్లోనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ తయారీకి ముందుగానే సీఎం కేసీఆర్ ఆస్పత్రులను బలోపేతం చేయడానికి కావలసిన నిధుల గురించి అడిగి తెలుసుకుని వైద్య వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్లు 20 మంజూరు చేశామని, మరో 20 సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జాతీయ రహదారులు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే రహదారుల వెంట ఉన్న పట్టణాల్లోని ఆస్పత్రుల్లో ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. -
ప్రభుత్వ వైద్యసేవలపై ఎమ్మెల్యే అసంతృప్తి
రంపచోడవరం : సామాన్య గిరిజనులకు ప్రభుత్వాస్పత్రిపై నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత వైద్యులుపై ఉందని, అంతేగాని రిఫరల్ పేరుతో రోగులను రాజమండ్రి, కాకినాడ తరలించడం కాదని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై రాజేశ్వరి అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని, ఏరియా ఆస్పత్రికి వెళితే పలు కారణాలు చూపి బయటకు పంపితున్నారని ఫిర్యాదులు చేస్తున్నారంటే మీ వైద్యసేవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ఆమె వైద్యులనుద్దేశించి అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, పార్టీ రాష్ర్ట కార్యదర్శి కొమ్మిశెట్టి బాలకృష్ణ, ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డిలతో కలిసి స్థానిక ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముత్యాల గంగభవాని అనే మహిళ ప్రసవవేదనలో వస్తే రక్తం తక్కువగా ఉందని రిఫర్ చేశారు. ఆమె రంపచోడవరం క్రిస్టియన్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ స్థానికంగా ఉండడం లేదనే ఫిర్యాదుపై ఆరా తీశారు. రోగుల పట్ల ఆస్పత్రి సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలన్నారు. రాయుడు అనే రోగికి మలేరియా పరీక్షలు నిర్వహించి మలేరియా లేదని నిర్ధారణ చేశారు. అదే వ్యక్తి బయట ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేస్తే మలేరియా అని తేలింది. కనీసం రక్త పరీక్షలు నిర్ధారణ సక్రమంగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఆస్పత్రిలో రోగులకు మంచినీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. రాత్రి సమయంలో డ్యూటీ వైద్యుడు అందుబాటులో ఉండడం లేదని, రోగుల బంధువులు వైద్యుల క్వార్టర్స్‌కు వెళ్లి పిలుచుకు వస్తుంటే చిరాకు పడుతున్నారనే ఫిర్యాదు వచ్చిందన్నారు. రక్త నిల్వ కేంద్రంలో రక్తం నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రి వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ మండల కన్వీనర్ మంగరౌతు వీరబాబు, పత్తిగుళ్ల రామాంజనేయులు, జల్లేపల్లి రామన్నదొర, రాపాక సుధీర్ , బోండ్ల వరప్రసాదరావు తదితరులు ఉన్నారు.