సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య సేవల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రజలు ఫిర్యాదు చేయడానికి వీలుగా ప్రవేశపెట్టిన 104 కాల్‌సెంటర్ చక్కగా పనిచేస్తోంది. సత్వరమే ఫిర్యాదులను పరిష్కరిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో 104 కాల్ సెంటర్‌ను వైద్య శాఖ ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 6,336 ఫిర్యాదులు అందాయి. ఇందులో 5,918 ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించారు. మరో 235 ఫిర్యాదులు నిర్దేశిత సమయానికి కొంత ఆలస్యంగా పరిష్కారమయ్యాయి. కాల్‌సెంటర్‌లో 30 మంది సిబ్బంది 24/7 పనిచేస్తున్నారు. వీరు కాల్ సెంటర్‌కు వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.
చదవండి: ఏపీ బడిబాటలో యూపీ
ఐదు సేవలపై ఫిర్యాదులకు..
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వైద్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఒకటి రెండు చోట్ల అధికారుల ఉదాసీన వైఖరి, క్షేత్ర స్థాయి సిబ్బంది, ఆస్పత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య సేవలను పొందడంలో ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు తలెత్తితే ప్రజలు ఫిర్యాదు చేయడానికి 104 ఫిర్యాదుల కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ–ఆరోగ్య ఆసరా, 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 అంబులెన్స్, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, మహాప్రస్థానం ఈ ఐదు సేవలపై ఫిర్యాదులు స్వీకరించడం ప్రారంభించారు. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను తీవ్రతను బట్టి ఎంత సమయంలోగా పరిష్కరించాలి.. పరిష్కరించడానికి బాధ్యులు ఎవరనే దానిపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)ని రూపొందించారు. 104 కాల్ సెంటర్ సేవలను ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం, ఇతర సేవలపై ఫిర్యాదుల స్వీకారం దిశగా విస్తరించనున్నారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ..
కాల్‌సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు, వాటి పరిష్కారంపై డ్యాష్‌బోర్డ్ ద్వారా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను ఎస్‌వోపీలో నిర్దేశిత సమయంలోగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ డిప్యూటీ ఈవో మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోని హెల్ప్ డెస్క్‌లు, 104 ఎంఎంయూ, 108 అంబులెన్స్, మహాప్రస్థానం వాహనాలపై ఫిర్యాదుల నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు తలెత్తితే ఆ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఫిర్యాదులు ఇలా చేయొచ్చు..
►ఐదు సేవల్లో ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయాలనుకుంటే తొలుత 104కు కాల్ చేయాలి.
►కాల్ చేసిన వెంటనే వైద్య సేవలపై ఫిర్యాదుల కోసం 1, సమాచారం కోసం 2 నొక్కాలని ఐవీఆర్‌ఎస్ సూచిస్తుంది.
►అప్పుడు ఫిర్యాదులు చేయాల్సినవారు 1 నొక్కాలి.
►అనంతరం కాల్ సెంటర్‌లోని ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు స్వీకరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment