ఏడాది నిబంధన నుంచి ఎంబీబీఎస్‌లకు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ పూర్తిచేసిన విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వ సర్వీసులో ఏడాదిపాటు పనిచేయాలన్న నిబంధన నుంచి మినహాయింపునిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం (జూడా) అనేక డిమాండ్లతోపాటు దీనిపైనా గతంలో సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. వారి విన్నపం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పీజీ పూర్తిచేసిన వైద్య విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా ఏడాదిపాటు ప్రభుత్వ వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. దీని వల్ల రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తిచేసి బయటకు వచ్చే దాదాపు 3 వేల మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు వెసులుబాటు దొరికింది. ఎంసీఐ నిబంధనల ప్రకారం పీజీ వైద్య విద్యార్థులకు కూడా వాలంటరీగా ముందుకు వచ్చే వారికే ప్రభుత్వ సర్వీసు ఇవ్వాలని, మిగతా వారికి అవసరం లేదని జూడాల అధ్యక్షుడు శ్రీనివాస్ ‘సాక్షి’తో అన్నారు. ఎంబీబీఎస్‌లకు మినహాయింపు ఇవ్వడంపట్ల ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.