సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కీలకమైన వైద్య సేవలు అందించే బోధన ఆస్పత్రులు అన్నింటిలోనూ రోగుల పడకల సంఖ్యను భారీగా పెంచాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన ఆస్పత్రుల్లో కొత్తగా 8,500 పడకల పెంపునకు వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో పెద్దాసుపత్రులైన ఉస్మానియా, గాంధీల్లో 2,000 చొప్పున పడకలను పెంచనున్నారు.
వరంగల్ ఎంజీఎంలో 1,500, నిలోఫర్‌లో 1,000 చొప్పున పడకలను పెంచేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆమోదం రాగానే పడకల పెంపు పనులు జరగనున్నాయి. మారుతున్న జీవనశైలి, ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. 2016–17లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు 4.60 కోట్ల మంది రోగులు వచ్చారు.
వీరిలో ఒకటి కంటే ఎక్కువసార్లు వచ్చిన వారు కూడా ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య ప్రతి ఏటా 20 శాతం వరకు పెరుగుతోంది. ముఖ్యమైన వైద్య సేవలు అందించే బోధన ఆస్పత్రులకు ప్రతి ఏటా 70 లక్షల మంది రోగులు వస్తున్నారు. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య వసతులు ఉండటంలేదు. ఈ పరిస్థితులను మార్చేందుకు వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల పెంపు...
ఆస్పత్రి ప్రస్తుతం పెంచేవి
ఉస్మానియా 1,168 2,000
గాంధీ 1,012 2,000
ఎంజీఎం 1,000 1,500
నిలోఫర్ 500 1,000
పేట్ల బురుజు 462 750
సుల్తాన్‌బజార్ 160 400
ఆదిలాబాద్ రిమ్స్ 500 650
హన్మకొండ ప్రసూతి ఆస్పత్రి 100 200
Comments
Please login to add a commentAdd a comment