నిమ్స్‌లో మరణ మృదంగం | 19 people dead in two days At NIMS Hospital | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో మరణ మృదంగం

Published Thu, Sep 13 2018 2:46 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

19 people dead in two days At NIMS Hospital - Sakshi

హైదరాబాద్‌: ఏపీలోని కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో నవజాత శిశువుల మరణాలు పెరుగుతుండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన విషయం మరువక ముందే తెలంగాణలోని నిమ్స్‌ వైద్యశాలలో 19 మంది మరణించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నిమ్స్‌లో వైద్యుల ఆందోళన నేపథ్యంలో సోమవారం 10 మంది, మంగళవారం 9 మంది మరణించారు. అవినీతి ఆరోపణలున్న ఆర్‌.వి.కుమార్‌ను నిమ్స్‌కు నూతన డీన్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 8 నుంచి రెసిడెంట్‌ వైద్యులు, వైద్య బోధకులు విధుల్ని బహిష్కరించి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 2 రోజుల్లోనే 19 మంది మరణించారు. ఇక బుధవారం నాటి మృత్యు గణాంకాలు నిమ్స్‌ రికార్డుల్లోకి ఎక్కలేదు.  

లిఖితపూర్వక హామీకి డిమాండ్‌.. 
ప్రభుత్వం ముందస్తు ఎన్నికల హడావుడిలో పడిపోవడంతో వైద్యుల సమ్మె గురించి పట్టించుకునే నాథుడు లేకపోయాడు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకారుల బృందం బుధవారం మంత్రి లక్ష్మారెడ్డిని కలసి వినతిపత్రం అందించిం ది. మంత్రితోపాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సుశీల్‌ శర్మను కలసి తమ సమస్యల సాధన కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే సమస్యల్ని పరిష్కరిస్తామని వారు మౌఖిక హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందని వైద్యులు తమకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని పట్టుబట్టగా.. అందుకు వారు నిరాకరించారు. 

విదేశీ పర్యటన ఏర్పాట్లలో బిజీ..  
నిమ్స్‌లో ఈ విధమైన దయనీయ పరిస్థితులు నెలకొంటే.. నిమ్స్‌ డైరెక్టర్‌ గురువారం (13న) విదేశీ పర్యటన ఏర్పాట్ల హడావుడిలో ఉన్నారు. గెస్ట్‌ లెక్చర్‌ ఇచ్చే నిమిత్తం అమెరికా వెళ్తున్న ఆయన ఈ నెల 18న వస్తారు. ఈలోగా వైద్యుల ఆందోళనను విరమింపజేసేందుకు ప్రయత్నాలు చేసే వారు ఉండకపోవచ్చని, ఇదే పరిస్థితి కొనసాగితే రోగుల పరిస్థితి దారుణం అవుతుందని రోగుల బంధువులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  

గవర్నర్‌ పర్యవేక్షణ కీలకం.. 
ఆపద్ధర్మ పాలన ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య అంశాలపై గవర్నర్‌ పర్యవేక్షణ చాలా కీలకం అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. గవర్నర్‌ కూడా గతంలో మాదిరిగానే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దలకు, మంత్రి వర్గానికి వదిలేస్తే.. ఇంతవరకూ ఉన్నట్టుగానే ప్రభుత్వమూ తమకే సంబంధం లేదన్నట్లుగా ఉన్న పక్షంలో హైకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదని రోగులు చెబుతున్నారు. 

ప్రారంభోత్సవ ఏర్పాట్లలో బిజీ.. 
నిమ్స్‌లో మరణ మృదంగం మోగుతుంటే ఏ మాత్రం పట్టని పాలక పెద్దలు ప్రారంభోత్సవాలకు సిద్ధం అవుతున్నారు. నిమ్స్‌లో గురువారం కేన్సర్‌ వైద్య విభాగం రెండో అంతస్తు ప్రారంభోత్సవానికి మంత్రులు లక్ష్మారెడ్డి, కేటీఆర్‌ హాజరుకానున్నారు. వీరి రాక సందర్భంగా ఏర్పాట్లు చేయడంలో నిమ్స్‌ అధికారులు నిమగ్నమయ్యారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement