సాక్షి, అమరావతి: ఉద్యోగులు సమస్యలపై కోర్టుకెళ్లడం చూశాం.. భూ తగాదాల విషయంలో కోర్టును ఆశ్రయించిన వారినీ చూశాం.. కానీ ఓ అరుదైన వ్యాధి బాధితుడు తనకు ప్రభుత్వం వైద్య చికిత్స అందించేలా ఆదేశించాలంటూ ఇటీవల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. బాధితుడికి అందించే వైద్యం అత్యంత ఖరీదైనది కావడం, చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వెళితే సదుపాయాలు లేకపోవడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. విజయనగరం జిల్లా నల్లబిల్లికి చెందిన ఓ అరుదైన వ్యాధిగ్రస్థుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులను బాధ్యులుగా పేర్కొంటూ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
అరుదైన వ్యాధితో అవస్థలు
కోర్టును ఆశ్రయించిన బాధితుడు కొన్నేళ్లుగా ‘గాచర్స్’ (ఎంజైమ్ లోపంతో పుట్టడం)తో బాధపడుతున్నాడు. ఇలాంటి వ్యాధిగ్రస్థులు 50 లక్షల మందిలో ఒకరు కూడా ఉండరు. కాలేయం, మూత్రపిండాల మార్పిడి తరహాలోనే ఈ జబ్బుకు ఎంజైమ్ మార్పిడి చేయాలి. లేదంటే ఖరీదైన మందులు వాడాలి. బాధితుడు విజయనగరం జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యులను సంప్రదించగా అంత ఖరీదైన మందులు తమ వద్ద లేవని చెప్పారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేక బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు.
చికిత్స ఖర్చు ఏటా కోటి రూపాయలు...
హైకోర్టు ఆదేశాలతో సర్కారు దీనిపై నివేదిక రూపొందించింది. ఇది జన్యుపరమైన వ్యాధి అని, గ్లూకోసెరిబ్రోసైడస్ ఎంజైము లోపంతో ఈ వ్యాధి సోకడం వల్ల పలు అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు నిర్ధారించారు. దీనికి చికిత్స కోసం ఏటా కోటి రూపాయలకు పైగా వ్యయం అవుతుందని తేల్చారు. దీనికోసం వాడే ఖరీదైన సెరిటైజం ఇంజెక్షన్ దేశంలో అందుబాటులో లేదు. 400 యూనిట్లు ఉన్న ఈ ఇంజెక్షన్ వైల్ (బాటిల్) ధర రూ.1,10,000 ఉంటుంది. వ్యక్తి బరువును బట్టి కిలోకు 60 యూనిట్లు (50 కిలోలు ఉంటే 3000 యూనిట్లు) చొప్పున వాడాలని వైద్యులు తెలిపారు.
భారీ వ్యయంపై సర్కారు తర్జనభర్జన
చికిత్సకు ఏటా కోటి రూపాయలకుపైనే వ్యయం కానుండడంతో బాధితుడికి వైద్యమందించేందుకు ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ఓ పేషెంట్‌కు ఇంత వ్యయంతో వైద్యం అందించడం కష్టమని అభిప్రాయపడుతోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పలువురు స్పెషలిస్టుల అభిప్రాయాలు సేకరించారు. దేశంలో ఈ వైద్యం అందుబాటులో లేనందున తామేమీ చేయలేమని హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించనున్నట్లు ఆరోగ్యశాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. బాధితుడు ప్రస్తుతం విజయనగరంలో ఉంటున్నాడు. కింగ్‌జార్జి ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరితే అందుబాటులో ఉన్న వైద్యం అందించేందుకు తమకు అభ్యంతరం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
వ్యాధి లక్షణాలు ఇలా...
–గాచర్స్ వ్యాధినే గ్లూకోసెరిబ్రోసైడస్ అని కూడా అంటారు
–ఎంజైము లోపం వల్ల కాలేయం పెరుగుతూ ఉంటుంది
–ప్లేట్‌లెట్స్ ఉండాల్సిన మోతాదు కంటే తక్కువగా ఉంటాయి
–ఎర్రరక్త కణాలను గాచర్స్ వ్యాధి ధ్వంసం చేస్తూ ఉంటుంది
–గాయమైతే రక్తం గడ్డకట్టకుండా స్రవిస్తూనే ఉంటుంది
–గాచర్స్ కణాలు ఎముకల్లో మూలుగను కూడా పీల్చేస్తూ ఉంటాయి
–ఎర్రరక్త కణాలు తక్కువ కావడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది
–ఇనుప ధాతువు మోతాదు రోజు రోజుకూ పడిపోతూ ఉంటుంది
–రక్తహీనత సమస్య ఉత్పన్నమవుతుంది
–ఊపిరితిత్తుల సమస్యతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది
–ఎముకలు, కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయి
–ఈ వ్యాధిని బెటా–గ్లూకోసైడస్ లుకోసైట్ (బీజీఎల్) అనే రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment