రంపచోడవరం : సామాన్య గిరిజనులకు ప్రభుత్వాస్పత్రిపై నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత వైద్యులుపై ఉందని, అంతేగాని రిఫరల్ పేరుతో రోగులను రాజమండ్రి, కాకినాడ తరలించడం కాదని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై రాజేశ్వరి అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని, ఏరియా ఆస్పత్రికి వెళితే పలు కారణాలు చూపి బయటకు పంపితున్నారని ఫిర్యాదులు చేస్తున్నారంటే మీ వైద్యసేవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ఆమె వైద్యులనుద్దేశించి అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, పార్టీ రాష్ర్ట కార్యదర్శి కొమ్మిశెట్టి బాలకృష్ణ, ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డిలతో కలిసి స్థానిక ఏరియా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముత్యాల గంగభవాని అనే మహిళ ప్రసవవేదనలో వస్తే రక్తం తక్కువగా ఉందని రిఫర్ చేశారు. ఆమె రంపచోడవరం క్రిస్టియన్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ స్థానికంగా ఉండడం లేదనే ఫిర్యాదుపై ఆరా తీశారు. రోగుల పట్ల ఆస్పత్రి సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలన్నారు. రాయుడు అనే రోగికి మలేరియా పరీక్షలు నిర్వహించి మలేరియా లేదని నిర్ధారణ చేశారు. అదే వ్యక్తి బయట ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేస్తే మలేరియా అని తేలింది. కనీసం రక్త పరీక్షలు నిర్ధారణ సక్రమంగా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఆస్పత్రిలో రోగులకు మంచినీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు.
రాత్రి సమయంలో డ్యూటీ వైద్యుడు అందుబాటులో ఉండడం లేదని, రోగుల బంధువులు వైద్యుల క్వార్టర్స్‌కు వెళ్లి పిలుచుకు వస్తుంటే చిరాకు పడుతున్నారనే ఫిర్యాదు వచ్చిందన్నారు. రక్త నిల్వ కేంద్రంలో రక్తం నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రి వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ మండల కన్వీనర్ మంగరౌతు వీరబాబు, పత్తిగుళ్ల రామాంజనేయులు, జల్లేపల్లి రామన్నదొర, రాపాక సుధీర్ , బోండ్ల వరప్రసాదరావు తదితరులు ఉన్నారు.
ప్రభుత్వ వైద్యసేవలపై ఎమ్మెల్యే అసంతృప్తి
Published Fri, May 1 2015 3:43 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement