రంపచోడవరం డైట్ కళాశాల
గిరి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ రంపచోడవరం ఉపాధ్యాయ శిక్షణ సంస్థ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. బోధనకు అవసరమైన నైపుణ్యం, విజ్ఞానం అందిస్తూ శిక్షణ ఇస్తోంది. వారు కొలువులు సాధించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలోనే గిరిజన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ఏకైక కళాశాల ఇదే. ఏటా 50 మంది విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారు.
రంపచోడవరం: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రంపచోడవరంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాల (డైట్ కళాశాల) గిరి విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చి ఉపాధ్యాయులుగా కొలువులు సాధించడంలో ఎంతో దోహదపడుతోంది. నూరుశాతం ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.
15 ఏళ్లుగా గురువులుగా తీర్చిదిద్దుతూ...
రంపచోడవరంలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను 2008లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డైట్ ద్వారా 50 మంది గిరి విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు కళాశాలలో 520 మంది విద్యార్థులు శిక్షణ పొంది బయటకు వెళ్లారు.
► 2008 –2101 విద్యా సంవత్సరానికి సంబంధించి 82 శాతం ఉత్తీర్ణత సాధించింది. 2009 నుంచి 2014 వరకు 96శాతం ఉత్తీర్ణత సాధించింది. 2013 నుంచి 2020 వరకు ఆరు బ్యాచ్‌లు నూరుశాతం ఫలితాలు సాధించాయి. అలాగే 2021 బ్యాచ్ నూరు శాతం ఫలితాలు సాధించాయి.
చక్కని వసతి సదుపాయం
► రాష్ట్రంలోని రంపచోడవరం, చింతూరు, పాడేరు, పార్వతీపురం, కన్నపురం ఐటీడీఏల పరిధిలోని విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం రంపచోడవరం ఉపాధ్యాయ శిక్షణ కళాశాలకు రావాల్సిందే. రంపచోడవరం డైట్ కళాశాలకు అనుబంధంగా హాస్టల్ వసతి కల్పించారు. బాలురకు కళాశాల ఆవరణలోనే హాస్టల్ వసతి ఉంది. బాలికలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని వసతి గృహంలో కల్పించారు.
మెరుగైన శిక్షణ
రంపచోడరంలోని డైట్ కళాశాలలో మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తరువాత ఉద్యోగం సాధిస్తామనే భరోసా ఉంది. ఏజెన్సీలో గిరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా కళాశాల ఏర్పాటుతో ఎంతో మేలు కలుగుతుంది.
–కల్యాణ్, విద్యార్థి డైట్ కళాశాల, రంపచోడవరం
మెరిట్ విద్యార్థులకే ప్రవేశం
రంపచోడవరం డైట్ కళాశాలలో ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. రెండేళ్ల పాటు చదువుకునేందుకు అన్ని సదుపాయాలతో వసతి సమకూరుస్తున్నారు. ఇక్కడ చదివిన అనేక మంది విద్యారంగంలో స్థిరపడ్డారు.
–కోసు ఠాగూర్‌దొర, డైట్ కళాశాల విద్యార్ధి.
నూరుశాతం ఫలితాలు
తమ కళాశాలలో చేరిన విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తున్నాం. వారు బాగా చదివేందుకు అవసరమైన వాతావరణం కల్పిస్తున్నాం. కళాశాల నూరుశాతం ఫలితాలు సాధిస్తూ ముందంజలో ఉంది.
–సీహెచ్ చిన్నబాబు, ప్రిన్సిపాల్, డైట్ కళాశాల, రంపచోడవరం
Comments
Please login to add a commentAdd a comment