teacher training
-
కొలువుల చదువు.. భవితకు నెలవు
గిరి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ రంపచోడవరం ఉపాధ్యాయ శిక్షణ సంస్థ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. బోధనకు అవసరమైన నైపుణ్యం, విజ్ఞానం అందిస్తూ శిక్షణ ఇస్తోంది. వారు కొలువులు సాధించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలోనే గిరిజన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే ఏకైక కళాశాల ఇదే. ఏటా 50 మంది విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్నారు. రంపచోడవరం: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రంపచోడవరంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాల (డైట్ కళాశాల) గిరి విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చి ఉపాధ్యాయులుగా కొలువులు సాధించడంలో ఎంతో దోహదపడుతోంది. నూరుశాతం ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. 15 ఏళ్లుగా గురువులుగా తీర్చిదిద్దుతూ... రంపచోడవరంలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను 2008లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా డైట్ ద్వారా 50 మంది గిరి విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు కళాశాలలో 520 మంది విద్యార్థులు శిక్షణ పొంది బయటకు వెళ్లారు. ► 2008 –2101 విద్యా సంవత్సరానికి సంబంధించి 82 శాతం ఉత్తీర్ణత సాధించింది. 2009 నుంచి 2014 వరకు 96శాతం ఉత్తీర్ణత సాధించింది. 2013 నుంచి 2020 వరకు ఆరు బ్యాచ్‌లు నూరుశాతం ఫలితాలు సాధించాయి. అలాగే 2021 బ్యాచ్ నూరు శాతం ఫలితాలు సాధించాయి. చక్కని వసతి సదుపాయం ► రాష్ట్రంలోని రంపచోడవరం, చింతూరు, పాడేరు, పార్వతీపురం, కన్నపురం ఐటీడీఏల పరిధిలోని విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం రంపచోడవరం ఉపాధ్యాయ శిక్షణ కళాశాలకు రావాల్సిందే. రంపచోడవరం డైట్ కళాశాలకు అనుబంధంగా హాస్టల్ వసతి కల్పించారు. బాలురకు కళాశాల ఆవరణలోనే హాస్టల్ వసతి ఉంది. బాలికలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని వసతి గృహంలో కల్పించారు. మెరుగైన శిక్షణ రంపచోడరంలోని డైట్ కళాశాలలో మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తరువాత ఉద్యోగం సాధిస్తామనే భరోసా ఉంది. ఏజెన్సీలో గిరిజన విద్యార్థులకు ప్రత్యేకంగా కళాశాల ఏర్పాటుతో ఎంతో మేలు కలుగుతుంది. –కల్యాణ్, విద్యార్థి డైట్ కళాశాల, రంపచోడవరం మెరిట్ విద్యార్థులకే ప్రవేశం రంపచోడవరం డైట్ కళాశాలలో ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. రెండేళ్ల పాటు చదువుకునేందుకు అన్ని సదుపాయాలతో వసతి సమకూరుస్తున్నారు. ఇక్కడ చదివిన అనేక మంది విద్యారంగంలో స్థిరపడ్డారు. –కోసు ఠాగూర్దొర, డైట్ కళాశాల విద్యార్ధి. నూరుశాతం ఫలితాలు తమ కళాశాలలో చేరిన విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తున్నాం. వారు బాగా చదివేందుకు అవసరమైన వాతావరణం కల్పిస్తున్నాం. కళాశాల నూరుశాతం ఫలితాలు సాధిస్తూ ముందంజలో ఉంది. –సీహెచ్ చిన్నబాబు, ప్రిన్సిపాల్, డైట్ కళాశాల, రంపచోడవరం -
‘నిష్ఠా’ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ
సాక్షి, అమరావతి: నిష్ఠా కార్యక్రమం ద్వారా లక్షా యాభైవేల మంది ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్సీఈఆర్టీకి రాష్ట్రం తరఫున సంపూర్ణ సహకారం అందజేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ► కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 1200 మంది కీ రిసోర్సు పర్సన్లకు నిష్ఠా (నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్) కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ వెబినార్ ద్వారా ప్రారంభించింది. ► కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ అమలు చేస్తోన్న ‘అమ్మ ఒడి, మనబడి: నాడు–నేడు’, ఆంగ్లమాధ్యమ ఆవశ్యకత, జగనన్న గోరుముద్ద’ తదితర అంశాలతో పాటు ‘జగనన్న విద్యాకానుక’ గురించి వివరించారు. ► ప్రాథమిక స్థాయిలో అందరు ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలల అధిపతులు, రాష్ట్ర పరిశోధనా శిక్షణా సంస్థల అధ్యాపకులు, డైట్లతో పాటు మండల వనరుల కేంద్రం, సముదాయ వనరుల కేంద్రాల నుంచి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇవ్వడం నిష్ఠా లక్ష్యమని అన్నారు. పలువురు కేంద్ర రాష్ట్రప్రభుత్వా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. -
అక్టోబర్‌లో పర్మాకల్చర్ టీచర్ ట్రైనింగ్ శిబిరం
ప్రసిద్ధ పర్మాకల్చర్ సంస్థ అయిన అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ ఆధ్వర్యంలో అక్టోబర్ 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పర్మాకల్చర్ టీచర్ ట్రైనింగ్ శిబిరం జరగనుంది. దీర్ఘకాలంలో ప్రయోజనాలను అందించే వ్యవసాయ పద్ధతులపై ప్రసిద్ధ పర్మాకల్చర్ టీచర్లు రోజ్మరి మారో, కొప్పుల నరసన్న శిక్షణ ఇస్తారు. జహీరాబాద్ మండలం బిడకదిన్నె గ్రామంలోని అరణ్య పర్మాకల్చర్ వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ ఇస్తారు. ఇతర వివరాలకు.. 79-8-17 55-7-8-5, aranyahyd@gmail.com -
లక్కీచాన్స్
టెట్‌లో అర్హత సాధించిన బీఈడీ, డీఈడీ మహిళా అభ్యర్థులకు టీఆర్టీ రూపంలో అదృష్టం వేచిచూస్తోంది. టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపడం.. ఇందులో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం మహిళలకు వరంగా మారింది. దీనికి తోడు జనరల్ కోటాలో వీరు పోటీ పడనుండడంతో వీరికి మరిన్ని సీట్లు పెరిగే ఆస్కారం ఉంది. జిల్లాలో మొత్తం 820 పోస్టులకు గాను సుమారు 270 పోస్టులు మహిళలకు రిజర్వు కానున్నాయి. ఉద్యోగంపై నమ్మకం ఏర్పడింది టీఆర్టీలో మహిళల కోటా ఎక్కువగా ఉండటంతో ఈ సారి ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం. డీఎస్సీ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళలకు ఇది సదావకాశం. కోటాను సద్వినియోగం చేసుకుని విజయం సాధించాలి. – మాధవి, వికారాబాద్ సాక్షి, వికారాబాద్: ఉపాధ్యాయ శిక్షణ పొందిన మహిళా అభ్యర్థులు ఉద్యోగం పొందడానికి మంచి అవకాశం లభించింది. టీచర్ పోస్టుల భర్తీకిగాను సుప్రీంకోర్టు ఆదేశాలకనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో మాదిరిగా జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో కాకుండా పోస్టుల భర్తీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించింది. డీఎస్సీ బదులు టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) పేరుతో పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ప్రకటించిన విధంగా జిల్లాలో 820 పోస్టులు ఉన్నట్లు లెక్కతేల్చారు. వీటిలో 33 శాతం మంది మహిళా అభ్యర్థులకు రిజర్వేషన్ కల్పించారు. దీంతో సుమారు వీరికి 270 పోస్టులు ప్రత్యేకంగా దక్కనున్నాయి. తమకు కేటాయించిన పోస్టులతో పాటుగా జనరల్ కేటగిరీలోనూ మహిళలు ఉద్యోగాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రోస్టర్ పాయింట్ల ఆధారంగా మహిళలకు ఎక్కువ శాతం పోస్టులను కేటాయించారు. దీంతో జిల్లాలో ఎక్కువ మంది పంతులమ్మలు దర్శనమివ్వనున్నారు. మహిళలు చదువుకుంటే భవిష్యత్‌లో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయనడానికి ఈ ఖాళీలే నిదర్శనమని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు. టెట్‌లో మహిళల ఉత్తీర్ణతే అధికం.. టెట్ (టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో అర్హత సాధించిన వారిలో పురుషులకంటే మహిళలే అధికంగా ఉన్నారు. జిల్లాలో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు సుమారుగా 3,500 వరకు ఉండవచ్చని అంచనా. గత ఆగస్టులో నిర్వహించిన టెట్‌లో అన్ని విభాగాల్లో కలిపి 2,468 మంది అర్హత సాధించారు. పేపర్ – 1లో 1,683 మంది అభ్యర్థులు పాస్‌కాగా, పేపర్– 2లో సోషల్ స్టడీస్‌లో 490 మంది అభ్యర్థులు, గణితం మరియు సైన్స్ విభాగాల్లో 295 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో పురుషులకంటే మహిళలే అధికంగా ఉన్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో కూడా రిజర్వేషన్, జనరల్ కేటగిరీల్లో కలిపి పురుషులకంటే ఎక్కువ మంది మహిళలే ఉద్యోగాలను కైవసం చేసుకునే అవకాశముంది. మంచి అవకాశం.. ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో మహిళలకు మంచి అవకాశాలున్నాయి. ఎస్జీటీ తెలుగు మీడియం పోస్టులు 528 ఉండగా, వాటిలో 346 జనరల్ కేటగిరీకి కేటాయించారు. వీటిలో 182 పోస్టులు మహిళలకు రిజర్వుచేశారు. ఎస్ఏ (స్కూల్ అసిస్టెంట్) పోస్టులు జిల్లాలో 135 ఉండగా, వీటిలో జనరల్ కేటగిరీకి 63 పోస్టులను రిజర్వు చేశారు. మహిళలకు 72 పోస్టులను కేటాయించారు. దీంతో ఎస్ఏ పోస్టుల్లో జనరల్ పోస్టులకంటే మహిళలకే 9 పోస్టులను అధికంగా రిజర్వ్ చేశారు. భాషా పండితుల పోస్టుల విషయానికొస్తే తెలుగు పండిత్ విభాగానికి సంబంధించి 54 ఖాళీలు ఉండగా, వీటిలో 32 జనరల్ కేటగిరీకి కేటాయించగా, మహిళలకు 24 పోస్టులను రిజర్వు చేశారు. ఉర్దూ మీడియంలో 30 పోస్టులు ఉండగా, వీటిలో 14 పోస్టులను మహిళలకు కేటాయించారు. ఆంగ్ల మాధ్యమంలో 35 పోస్టులు ఉండగా, జనరల్ కేటగిరీకి 19 పోస్టులు, మహిళలకు 16 ఖాళీలను రిజర్వు చేశారు. హిందీ పండిత్ ఖాళీలు జిల్లాలో 29 ఉండగా, వీటిలో జనరల్ కేటగిరీకి 32 పోస్టులు, మహిళలకు 22 పోస్టులను కేటాయించారు. పీఈటీ పోస్టులు జిల్లాలో మొత్తం 6 ఉండగా, జనరల్ కేటగిరీకిలో 2 పోస్టులు, మహిళలకు 4 పోస్టులను రిజర్వు చేశారు. పీఈటీలలో పురుషుల కంటే రెండు పోస్టులు మహిళలకే ఎక్కువగా కేటాయించడం విశేషం. -
లాస్ట్ ఛాన్స్
అనంతపురం, రాయదుర్గం టౌన్ :‘విద్యాహక్కు చట్టం 2009’ ప్రకారం ఉపాధ్యాయ కోర్సుల్లో శిక్షణ పొందని వారు స్కూళ్లలో పాఠ్యాంశాలు బోధించేందుకు అనర్హులు. ఈ నిబంధన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు వర్తిస్తుంది. ఇప్పటి వరకూ ఎలాంటి శిక్షణ పొందకుండా పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ డిప్లొమా ఇన్ లెర్నింగ్ ఎడ్యుకేషన్(డీఎల్ఈడీ) కోర్సు దూరవిద్య ద్వారా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2019 మార్చి 31లోపు జాతీయ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా డీఎల్ఈడీ కోర్సును పూర్తి చేసిన వారు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధించే అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రకటించారు. 2019 తర్వాత శిక్షణ పొందని ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి అన్ ట్రైన్డ్ టీచర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 30లోపు పూర్తి చేయాలని డీఈఓలకు ఆదేశాలు అందాయి. 30లోపు ఫీజు చెల్లించాలి శిక్షణ పొందని ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెబ్సైట్లో ఈ నెల 30లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల డేటాను ఆయా జిల్లాల డీఈఓలు ధ్రువీకరించి ఆ తర్వాత దాన్ని జాతీయ సార్వత్రిక విద్యాపీఠం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అనంతరం రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను సార్వత్రిక విద్యాపీఠం వారు ఎస్ఎంఎస్ రూపంలో అభ్యర్థులకు సమాచారం అందిస్తారు. అనంతరం మొదటి సంవత్సరం కోర్సు ఫీజు రూ.4,500 ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఇలా... డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో టీచర్ కార్నర్ క్లిక్ చేసి ఎన్ఐఓవీ అన్ ట్రైన్డ్ టీచర్స్ రిజిస్ట్రేషన్ కాలం క్లిక్ చేయాలి. అక్కడ ప్రొ ఫారం–1 లో ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల మేనేజ్మెంట్, ప్రొఫారం–2 లో ఎయిడెడ్ అన్ఎయిడెడ్, ప్రైవేటు మేనేజ్మెంట్ టీచర్స్ కాలంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులైతే టీచర్ కోడ్‌తో, ప్రైవేటు పాఠశాలల టీచర్స్ స్కూల్ యూడైస్ కోడ్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే చివరి అవకాశం డీఎల్ఈడీ కోర్సుకు సంబంధించి యూడైస్ మేరకు జిల్లాలో 189 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందువల్ల రాష్ట్రంలోనే జిల్లా మొదటిస్థానంలో ఉంది. ఇప్పటి దాకా 55.5 శాతం మంది ఆన్లైన్లో ఫీజులు చెల్లించారు. మిగతా వారు కూడా గడువులో ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేనిపక్షంలో అలాంటి టీచర్స్‌ను తొలగిస్తాం. – లక్ష్మీనారాయణ, డీఈఓ -
అన్ట్రైన్డ్ టీచర్లూ అర్హత పొందాల్సిందే
► 2019 మార్చి 31కల్లా ఉపాధ్యాయ శిక్షణ తప్పనిసరి ► లేదంటే బోధించడానికి వీల్లేదని స్పష్టం చేసిన ఎంహెచ్ఆర్డీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు సహా ఏ పాఠశాలలో బోధించాలన్నా తప్పనిసరిగా ఉపాధ్యాయ శిక్షణ పొంది ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే బోధిస్తున్న అన్ట్రైన్డ్ టీచర్లు కూడా తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాలని.. 2019 మార్చి 31వ తేదీలోగా వారంతా అర్హత సంపాదించాలని సూచించింది. లేదంటే వారిని పాఠశాలల నుంచి తొలగించాలని, అన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టడంపై దృష్టి సారించింది. పెద్ద సంఖ్యలో..: రాష్ట్రంలో 25,750 వరకు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 1,09,022 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారంతా ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తిచేసిన వారే. 720 ఎయిడెడ్ పాఠశాలల్లో 3,177 మంది టీచర్లు పనిచేస్తుండగా.. అందులో 25 మంది అన్ట్రైన్డ్ టీచర్లున్నారు. ఇక 11,262 ప్రైవేటు పాఠశాలల్లో 92,675 మంది టీచర్లుండగా.. ఇందులో 3,905 మంది ఉపాధ్యాయ శిక్షణ పొందలేదని యూ–డైస్ లెక్కల ప్రకారం విద్యా శాఖ గుర్తించింది. వారంతా వచ్చే నెల 15వ తేదీలోగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో చేరేలా చర్యలు చేపట్టాలని ప్రైవేటు పాఠశాలలకు సూచించింది. లేదంటే కేంద్రం ఆదేశాల మేరకు వారిని ఉపాధ్యాయ వృత్తి నుంచి తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మార్కుల శాతం పెంచుకోవాల్సిందే ప్రస్తుతం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో చేరేందుకు ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలన్న నిబంధన ఉంది. అయితే ఆయా టీచర్లు ఎప్పుడో ఇంటర్, డిగ్రీలు కోర్సులు పూర్తి చేసి ప్రైవేటు స్కూళ్లలో చేరి ఉంటారు. వారిలో ఎవరికైనా ఇంటర్లో 50 శాతం మార్కులు లేకపోతే.. ఇప్పుడు తిరిగి దూర విద్యా విధానంలో ఇంటర్ చదివి.. ఉపాధ్యాయ విద్య కోర్సు పూర్తయ్యే లోగా నిర్ణీత మార్కులను సాధించాలని కేంద్రం స్పష్టం చేసింది. శిక్షణ పొందని వారు భారీ సంఖ్యలోనే! ప్రైవేటు పాఠశాలల్లో అన్ట్రైన్డ్ టీచర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని, కానీ స్కూళ్లు వివరాలు సరిగా ఇవ్వకపోవడంతో కేవలం 3,905 మందే లెక్కతేలుతున్నారని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం 23 లక్షల మంది విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే 1,09,022 మంది టీచర్లున్నారు. అయినా టీచర్లు సరిపోవడం లేదన్న డిమాండ్ ఉంది. అలాంటిది 31 లక్షల మంది విద్యార్థులు చదువుతున్న ప్రైవేటు పాఠశాలల్లో 92,672 మందే టీచర్లున్నారా.. అనే ప్రశ్న తలెత్తుతోంది. అధికారికంగా ప్రైవేటు పాఠశాలలు ఇచ్చిన లెక్క అంతేనని, వాస్తవంగా మరో 30వేల మందికిపైగా టీచర్లు పనిచేస్తున్నారని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అధికారికంగా వారిని వివరాల్లో చూపిస్తే నిబంధనల ప్రకారం ప్రయోజనాలు కల్పించాల్సి వస్తుందనే లెక్కలు చెప్పడం లేదేమోనని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. -
17 నుంచి డైట్ సెట్
అభ్యర్థులు గమనించాల్సిన అంశాలు విజయనగరం అర్బన్ : ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల17, 18, 19వ తేదీల్లో ప్రవేశ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. జిల్లాలోని కోస్టల్ ఇన్స్టిట్యూట్ ఇంజినీరింగ్ కళాశాల (వీరభద్రపురం, కొత్తవలస), సత్యా ఇంజినీరింగ్ కళాశాల (గాజులరేగ, విజయనగరం), లెండీ ఇంజినీరింగ్ కళాశాల (జొన్నాడ)లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కేవీ రమణ తెలిపారు. ప్రతి కేంద్రంలోనూ ఉదయం10.00 నుంచి 12.30 గంటల వరకు, అలాగే 2.30 నుంచి 5 గంటల మధ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులకు కేటారయించిన తేదీ, సమయూలకు అనుగుణంగా పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోగానే ముద్రణా తప్పిదాలు చూసుకొని సరిచేసుకోవాలి. అభ్యర్థులకు కేటాయించిన తేదీ, సమయంలోనే పరీక్ష కేంద్రానికి హాజరుకావాలి. హాల్ టికెట్లో ఇచ్చిన పాస్వర్ట్తో మీకు కేటాయించిన కంప్యూటర్లో మాత్రమే లాగాన్ చేసుకోవాలి. లాగాన్ అయిన తర్వాత మానిటర్ తెరపై అభ్యర్థి వివరాలు సరిచూసుకొని ‘ఐ కన్ఫర్మ్’ లేదా ‘ఐ డీఈఎన్వై’ పై క్లిక్ చేయాలి. పరీక్షకు సంబంధించిన అన్ని సూచనలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకున్న తర్వాత ‘బీఓఎక్స్’ను క్లిక్ చేయాలి. సూచనలను చదివిన తర్వాత ‘ఐ యామ్ రడీ టు బిగిన్ అనే బటన్‌ను క్లిక్ చేయాలి. ప్రశ్నలకు ఇచ్చిన నాలుగు సమాధానాల్లో సరియైన సమాధానాన్ని ఎంచుకొనుటకు మౌస్‌ను మాత్రమే వినియోగించాలి. ఒక ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించిన తర్వాత ‘సేవ్’ క్లిక్ చేయాలి. మరో ప్రశ్నకు వెళ్లడానికి ‘సేవ్ అండ్ ఎన్ఈఎక్స్టీ’ బటన్‌ను క్లిక్ చేయాలి. ఒక ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించిన తర్వాత మరల సరిచేసుకొనుటకు, మార్చు కొనుటకు ‘క్లియర్ రెస్పాన్స్’ బటన్‌ను క్లిక్ చేయాలి. పరీక్ష జరుగు సమయంలో ఎప్పుడైనా సూచనలను చూడవచ్చు. సూచనలను చూసేందుకు ‘ఇన్స్ట్రక్షన్స్’ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. పరీక్ష పూర్తయ్యే సమయంలో ‘సబ్మిట్’ బటన్ క్లిక్‌చేస్తే ఏక్టివేట్ అవుతుంది. పరీక్షను ముగించుటకు ముందు మాత్రమే ఇది చేయాలి. ఏ విధమైన సాంకేతిక సమస్యలు ఉన్నా ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకొని వెళ్లవచ్చు. మాక్ టెస్ట్‌కి ఉచిత ‘వెబ్ సైట్’ తొలిసారిగా ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తున్న కారణంగా అభ్యర్థుల అవగాహన కోసం ప్రభుత్వం నమూనా పత్రాలను వెబ్సైట్లో పొందుపరిచింది. ‘డీఈఈసీఈ.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్సైట్లో తెలుగు, ఇంగ్లిష్ విభాగాల్లో ఉన్న నమూనాపత్రాలను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కేవీ రమణ సూచించారు. కీ బోర్డ్‌ను తాకరాదు. తాకినచో మీ ‘ఐడీ లాక్’ అవుతుంది. అలాంటి పరిస్థితిలో మీ ‘ఐడీ’ని ‘అన్ లాక్’ చేసుకోవాలి. ఇందుకోసం ఇన్విజిలేటర్‌ని సంప్రదించాలి. పరీక్ష కేంద్రంలోనిక సెల్‌ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పరీక్ష సమయం పూర్తయ్యేవరకు పరీక్ష గదిని విడిచి వెళ్ల కూడదు. -
జనవరి 7నుంచి డైట్‌సెట్ కౌన్సెలింగ్
* రెండు రాష్ట్రాలకు కలిపి రెండు విడతల్లో నిర్వహణ * మలివిడత ఫిబ్రవరి 2నుంచి ప్రారంభం * షెడ్యూల్ విడుదల చేసిన కన్వీనర్ సురేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: డిస్ట్రిక్ట్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రయినింగ్, ఎలిమెంటరీ టీచర్ ట్రయినింగ్ ఇనిస్టిట్యూట్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డైట్‌సెట్) కౌన్సెలింగ్ జనవరి ఏడో తేదీనుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు డైట్‌సెట్ కన్వీనర్ ఎన్.సురేందర్‌రెడ్డి మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. జనవరి ఏడో తేదీనుంచి తొలివిడత, ఫిబ్రవరి రెండో తేదీనుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కలిపి ఉమ్మడిగా ఈ కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ కౌన్సెలింగ్‌కోసం గత ఆరునెలలుగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. దీని ద్వారా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఐఈడీ) కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు. డీఈడీ కాలేజీలకు సంబంధించిన జాబితా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే అందించింది. ఏపీ నుంచి 409 కాలేజీలకు సంబంధించిన జాబితా డైట్‌సెట్ కన్వీనర్‌కు అందింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ జాబితా రాలేదు. దీంతో రెండు విడతల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి అయిదో తేదీ నాటికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా కాలేజీల జాబితా అందితే వాటిని తొలివిడత కౌన్సెలింగ్‌లో చేరుస్తారు. లేనిపక్షంలో ఫిబ్రవరి రెండో తేదీనుంచి ప్రారంభమయ్యే రెండో విడత కౌన్సిలింగ్లో వాటిని చేరుస్తారు. ఈ ఉమ్మడి కౌన్సెలింగ్ కోసం తెలంగాణ పరీక్షల విభాగం అడిషనల్ డెరైక్టర్ గోపాల్‌రెడ్డిని కో కన్వీనర్‌గా ఆ ప్రభుత్వం నియమించింది. జనవరి ఆరో తేదీన కాలేజీల జాబితా, కౌన్సెలింగ్ విధివిధానాలు డైట్ సెట్ ర్యాంకులు ఇతర వివరాలను http:\\ dietcet.cgg.gov.in అనే వెబ్సైట్లో పెట్టనున్నారు. డైట్‌సెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు తాము కోరుకుంటున్న కాలేజీలకు వెబ్ ఆప్షన్లను జనవరి ఏడో తేదీ నుంచి పదో తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు. -
అగ్ని‘పరీక్ష’ !
నేటినుంచే త్రైమాసిక పరీక్షలు, ఉపాధ్యాయ శిక్షణ మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయం ఉపాధ్యాయులకు అగ్నిపరీక్షలా మారింది. శిక్షణలు, పరీక్షలు, కార్యక్రమాలు ఇలా అన్నీ ఒకేసారి నిర్వహించి ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులను అయోమయానికి గురిచేస్తున్నారు. సోమవారం నుంచి త్రైమాసిక పరీక్షలు, ఆర్‌ఎంఎస్‌ఏ శిక్షణ కార్యక్రమాలు వరుసగా నిర్విహ స్తుండడంతో ఉపాధ్యాయులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణలు నిర్వహిస్తున్నారు. మొదటి విడత 15 వరకు, రెండోవిడత 18వ తేదీ వరకు నిర్వహిస్తుండడంతో సగంమందికిపైగా ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాల్లో నిమగ్నమవడంతో త్రైమాసిక పరీక్షల నిర్వహణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈనెల 8 నుంచి 27వ తేదీ వరకు పాఠశాలల్లో ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాలను చేపట్టాలని అదే విద్యాశాఖ ఆదేశించడంతో ఇన్ని కార్యక్రమాల మధ్య త్రైమాసిక పరీక్షలను ఎలా నిర్వహించాలని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 14 వరకు ఎల్ఈపీ-3ఆర్‌లో భాగంగా విద్యార్థులకు బేసిక్స్ నేర్పమనడంతో, పూర్తిగా సిలబస్ పూర్తికాకపోవడం వల్ల త్రైమాసిక పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియక విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. త్రైమాసిక పరీక్షల సమయంలో సబ్జెక్టు ఉపాధ్యాయులు పాఠశాలల్లో లేకపోతే ప్రశ్నాపత్రంలో వచ్చే సందేహాలను ఎవరు తీరుస్తారని విద్యార్థులు మదనపడుతున్నారు. ఇవి చాలవన్నట్లు అక్టోబర్ 24వ తేదీలోపు డైస్ కార్యక్రమాలు పూర్తిచేయాలని షెడ్యూల్‌ను రూపొందించడంతో ఏ పని చేయాలో తెలియక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. త్రైమాసిక పరీక్షల నేపథ్యంలో ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదావేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి అస్తవ్యస్తంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై డీఈఓ చంద్రమోహన్‌ను వివరణ కోరగా.. పాఠశాలల్లో త్రైమాసిక పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు తగినచర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేయొద్దు ఏకకాలంలో అనేక కార్యక్రమాలను ఉపాధ్యాయులపై రుద్ది వారిని ఆందోళన గురిచేయవద్దని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ప్రపుల్లా చంద్ర డిమాండ్‌చేశారు. విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్లు సమన్వయంతో పనిచేస్తూ ఉపాధ్యాయులకు గందరగోళ పరిస్థితులు కల్పించకుండా చూడాలని, శిక్షణ లో పాల్గొనే ఉపాధ్యాయులకు నిబంధనల ప్రకారం టీఏ, డీఏలు చెల్లించాలని డిమాండ్‌చేశారు. -
డీఎస్సీ ఎప్పుడో!
కామారెడ్డి: ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న వేలాది మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం రెండేళ్లుగా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నా రు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు దొరుకుతాయని ఆశలతో ఉన్న వారు సర్కారు నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నిర్వహణకు అక్కడి ప్రభుత్వం చొరవ చూపుతుండగా, మన ప్రభుత్వం కూడా ప్రకటన విడుదల చేస్తుందేమోనని వేచి చూస్తున్నారు. జిల్లాలో ఉన్న బీఈడీ కళాశాలల ద్వారా ఏటా 1,200 మంది పట్టభద్రులు ఉపాధ్యాయ శిక్షణ పొంది బయటకు వస్తున్నారు. అలాగే డీఎడ్, పండిత శిక్షణ కళాశాలల ద్వారా మరో రెండు వేల మంది శిక్షణ పూర్తి చేసుకుంటున్నారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలలో బీపీఈడీ, పండిట్ ట్రైనింగ్ కోర్సులు చదివినవారు కూడా వేలల్లోనే ఉంటున్నారు. గడచిన పది, పదిహేనేళ్ల కాలంలో బీఈడీ, డీఈడీ, బీపీఈడీ, పండిట్ శిక్షణ పూర్తి చేసినవారు జిల్లాలో 30 వేల మంది వరకు ఉద్యోగాల వేటలో ఉన్నారు. వయసు మీరిపోతుందేమోనని ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించే డీఎస్సీ ప్రకటనలో ఆలస్యం జరుగుతుండడంతో నిరుద్యోగులలో ఆందోళన పెరుగుతోంది. పలుమార్లు డీఎస్సీ రాసినా తీవ్రమైన పోటీతో ఉద్యోగం సంపాదించలేనివారు తెలంగాణ రాష్ట్రంలోనైనా పోస్టుల సంఖ్య పెరిగి తమకు ప్రయోజనం కలుగుతుందని ఆశతో ఉన్నారు. ఆలస్యమైతే వయసు మీరిపోయి డీఎస్సీకి అర్హత కోల్పోతామేమోనని కంగారు పడుతుతున్నారు. చదువులో కొత్త బ్యాచ్‌లు వస్తున్నకొద్దీ పోటీ పెరుగుతోంది. చదువును కొనసా గిస్తున్నవారు డీఎస్సీలో ఈజీగా సక్సెస్ అవుతుంటే, గతంలో శిక్షణ పూర్తి చేసినవారు తమకు పోటీ పెరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య ఏటేటా పడిపోతుండడంతో ఉపాధ్యాయ పోస్టులు రేషనలైజేషన్‌లో తగ్గిపోతున్నా యి. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేవారి సంఖ్య భారీగా పడిపోతోంది. ఈ క్రమంలో ఉన్నత పాఠశాలలలోనూ ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. తద్వారా ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోతాయన్న ఆందోళన నిరుద్యోగ ఉపాధ్యాయులలో వ్యక్తమవుతోంది. నియామకాలు చేపట్టాలి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజులలో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే అవకాశం ఉం దని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీలను భర్తీ చేయడంతోపాటు పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా ప్రభుత్వ విద్యపై ప్రజలలో నమ్మకం, విశ్వాసం పెరుగుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
బట్టీ చదువులకు చెక్!
తెరపైకి కొత్త పద్ధతి - సీసీఈ విధానానికి శ్రీకారం - ఉపాధ్యాయులకు శిక్షణ కెరమెరి : టెస్ట్ పేపర్ కొని వరుసగా నాలుగు మోడల్ పేపర్లు బట్టీ పట్టేస్తే వార్షిక పరీక్షలో ఈజీగా పాసయ్యేవారు. కానీ ఆ పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇక నుంచి విద్యార్థి మేథో సంపత్తి, తార్కిక శక్తిని నిశితంగా పరిశీలించేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆ విధానమే ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవ్య విధానంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంతో కథనం. ఇదీ నిరంతర సమగ్ర మూల్యాంకనం పాఠశాలలో జరిగే అభ్యాసన ప్రక్రియలకు, లక్ష్యాలకు, బోధనలకు, ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థి మేథో మథనానికి తోడ్పడే విధానమే నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ). ఈ విధానం నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ఈ ఏడాది 9, 10 తరగతులకూ వర్తింపజేశారు. పదో త రగతి పాఠ్యపుస్తకాలు మారడంతో పరీక్ష విధానం కూడా సీసీఈ పద్ధతిలోనే ఉండనుంది. ఇందుకోసం ఉపాధ్యాయులకు కొత్త పాఠ్యపుస్తకాల బోధన విధానం, మూ ల్యాంకనంపై అవగాహన కోసం ఈ నెల 16 నుంచి శిక్ష ణ ఇస్తున్నారు. ప్రతీ సబ్జెక్టులో నిర్మాణాత్మక మూల్యాం కనం (ఫార్మెటీవ్ అసిస్మెంట్) ద్వారా ఏడాదిలో నాలు గు సార్లు లఘు పరీక్ష పెడుతారు. ఇక సంగ్రాహనాత్మక మూల్యాంకనమంటే విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, సమాచార సేక రణ, ప్రాజెక్టు పనులు, విలువలు, మొదలగు విద్యాప్రమాణాలను అనుసరించి ఏడాదికి మూడు సార్లు పరీక్ష నిర్వహించే విధానం. ఇందులో విద్యార్థి ప్ర శ్నలు ఆలోచించి రాయాల్సి ఉంటుంది. ఈ విధానంలో పుస్తకంలో ఉన్న ప్రశ్నలను నేరుగా ఇవ్వరు. అలాగే ఒకసారి ఇచ్చిన ప్రశ్న రెండోసారి పునారావృతం కాదు. మార్కుల విధానం.. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగానే ఈ ఏడాది 9, 10 తరగతులకు 100 మార్కులకు బదులు 80 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. మిగిలిన 20 మార్కులు విద్యార్థుల జ్ఞాపకశక్తి, ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెకు పనులకు సంబంధించి మార్కులు ఉంటాయి. జీవితానికి అన్వయించుకునేలా.. విద్యార్థి పాఠ్యాంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని తను నేర్చుకున్న అంశాలను తన జీవితానికి అన్వయించుకునేందుకు ఈ విధానం దోహదపడుతుంది. విద్యార్థులను టీచర్లు కొన్ని కోణాల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, విషయ పరిశీలన, పరిశోధనా శక్తి మెరుగుపడుతుంది. అయితే 20 మార్కులకు సంబంధించి ఉపాధ్యాయుడు విద్యార్థుల విషయంలో ఎంతో నిశితంగా పరిశీలనతో వ్యవహరించాల్సి ఉంటుంది. - చంద్రశేఖర్, ఉపాధ్యాయుడు, అనార్పల్లి ఆలోచన విధానానికే మార్కులు గత బోధన విధానం ప్రకారం పాఠాల వెనుక ఉన్న నిరంతరం వచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయడమనేది మూస పద్ధతి. కానీ ప్రస్తుత విధానంలో విషయ సంసిద్ధతతో ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్లాలి. గణితంలో ప్రస్తుతం సమస్యకు సంబంధించిన సూత్రాలు కూడా ఉపాధ్యాయులే విద్యార్థుల ద్వారా రాబట్టాల్సి ఉంటుంది. అందువల్ల విద్యార్థుల ఆలోచన శక్తి పెరిగేలా ఉపాధ్యాయుడు ఎంతో చొరవ చూపాలి. - తిరుపతి, ఉపాధ్యాయుడు, గోయగాం నిశిత పరిశీలన అవసరం ఈ విధానం మేథోసంపత్తి ఉన్న నేటి తరం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో కీలకం. పాఠశాల వెలుపల, లోపల విద్యార్థులను నిశితంగా పరిశీలించాలి. ఇంతకు ముందులా నోట్స్, గైడ్స్ ఉండవు. తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకున్న దానిని తన మేథో ఆధారంగా రాయాల్సి ఉంటుంది. దీని వల్ల విద్యార్థిలో ఉన్న జ్ఞానం వెలికి వచ్చి ఒక ప్రశ్నకు ఒక్కో విద్యార్థి ఒక్కో రీతిలో సమాధానమిస్తాడు. ఇది విద్యార్థి తార్కిక ఆలోచనకు, పరిశోధన శక్తికి దోహదపడుతుంది. - ఆర్.రమేశ్, ఉపాధ్యాయుడు, కెరమెరి