బట్టీ చదువులకు చెక్!
తెరపైకి కొత్త పద్ధతి
- సీసీఈ విధానానికి శ్రీకారం
- ఉపాధ్యాయులకు శిక్షణ
కెరమెరి : టెస్ట్ పేపర్ కొని వరుసగా నాలుగు మోడల్ పేపర్లు బట్టీ పట్టేస్తే వార్షిక పరీక్షలో ఈజీగా పాసయ్యేవారు. కానీ ఆ పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇక నుంచి విద్యార్థి మేథో సంపత్తి, తార్కిక శక్తిని నిశితంగా పరిశీలించేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆ విధానమే ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవ్య విధానంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంతో కథనం.
ఇదీ నిరంతర సమగ్ర మూల్యాంకనం
పాఠశాలలో జరిగే అభ్యాసన ప్రక్రియలకు, లక్ష్యాలకు, బోధనలకు, ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థి మేథో మథనానికి తోడ్పడే విధానమే నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ). ఈ విధానం నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ఈ ఏడాది 9, 10 తరగతులకూ వర్తింపజేశారు. పదో త రగతి పాఠ్యపుస్తకాలు మారడంతో పరీక్ష విధానం కూడా సీసీఈ పద్ధతిలోనే ఉండనుంది.
ఇందుకోసం ఉపాధ్యాయులకు కొత్త పాఠ్యపుస్తకాల బోధన విధానం, మూ ల్యాంకనంపై అవగాహన కోసం ఈ నెల 16 నుంచి శిక్ష ణ ఇస్తున్నారు. ప్రతీ సబ్జెక్టులో నిర్మాణాత్మక మూల్యాం కనం (ఫార్మెటీవ్ అసిస్‌మెంట్) ద్వారా ఏడాదిలో నాలు గు సార్లు లఘు పరీక్ష పెడుతారు. ఇక సంగ్రాహనాత్మక మూల్యాంకనమంటే విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, సమాచార సేక రణ, ప్రాజెక్టు పనులు, విలువలు, మొదలగు విద్యాప్రమాణాలను అనుసరించి ఏడాదికి మూడు సార్లు పరీక్ష నిర్వహించే విధానం. ఇందులో విద్యార్థి ప్ర శ్నలు ఆలోచించి రాయాల్సి ఉంటుంది. ఈ విధానంలో పుస్తకంలో ఉన్న ప్రశ్నలను నేరుగా ఇవ్వరు. అలాగే ఒకసారి ఇచ్చిన ప్రశ్న రెండోసారి పునారావృతం కాదు.
మార్కుల విధానం..
నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగానే ఈ ఏడాది 9, 10 తరగతులకు 100 మార్కులకు బదులు 80 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. మిగిలిన 20 మార్కులు విద్యార్థుల జ్ఞాపకశక్తి, ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెకు పనులకు సంబంధించి మార్కులు ఉంటాయి.
జీవితానికి అన్వయించుకునేలా..
విద్యార్థి పాఠ్యాంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని తను నేర్చుకున్న అంశాలను తన జీవితానికి అన్వయించుకునేందుకు ఈ విధానం దోహదపడుతుంది. విద్యార్థులను టీచర్లు కొన్ని కోణాల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, విషయ పరిశీలన, పరిశోధనా శక్తి మెరుగుపడుతుంది. అయితే 20 మార్కులకు సంబంధించి ఉపాధ్యాయుడు విద్యార్థుల విషయంలో ఎంతో నిశితంగా పరిశీలనతో వ్యవహరించాల్సి ఉంటుంది.
- చంద్రశేఖర్, ఉపాధ్యాయుడు, అనార్‌పల్లి
ఆలోచన విధానానికే మార్కులు
గత బోధన విధానం ప్రకారం పాఠాల వెనుక ఉన్న నిరంతరం వచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయడమనేది మూస పద్ధతి. కానీ ప్రస్తుత విధానంలో విషయ సంసిద్ధతతో ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్లాలి. గణితంలో ప్రస్తుతం సమస్యకు సంబంధించిన సూత్రాలు కూడా ఉపాధ్యాయులే విద్యార్థుల ద్వారా రాబట్టాల్సి ఉంటుంది. అందువల్ల విద్యార్థుల ఆలోచన శక్తి పెరిగేలా ఉపాధ్యాయుడు ఎంతో చొరవ చూపాలి.
- తిరుపతి, ఉపాధ్యాయుడు, గోయగాం
నిశిత పరిశీలన అవసరం
ఈ విధానం మేథోసంపత్తి ఉన్న నేటి తరం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో కీలకం. పాఠశాల వెలుపల, లోపల విద్యార్థులను నిశితంగా పరిశీలించాలి. ఇంతకు ముందులా నోట్స్, గైడ్స్ ఉండవు. తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకున్న దానిని తన మేథో ఆధారంగా రాయాల్సి ఉంటుంది. దీని వల్ల విద్యార్థిలో ఉన్న జ్ఞానం వెలికి వచ్చి ఒక ప్రశ్నకు ఒక్కో విద్యార్థి ఒక్కో రీతిలో సమాధానమిస్తాడు. ఇది విద్యార్థి తార్కిక ఆలోచనకు, పరిశోధన శక్తికి దోహదపడుతుంది.
- ఆర్.రమేశ్, ఉపాధ్యాయుడు, కెరమెరి