cce method
-
నేడు ‘పది’ ఫలితాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరిగాయి. జిల్లాలో 49,555 మంది పరీక్ష రాశారు. వారితో పాటు తల్లిదండ్రులు ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. -
అయ్యవార్లకు అగ్నిపరీక్ష
► పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్ట చర్యలు ► తెరపైకి యాక్ట్ 25 ► కాపీయింగ్‌కు సహకరించే ఇన్విజిలేటర్లపై క్రిమినల్ కేసు ► ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ► వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు కలసపాడు / వేంపల్లె: పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది ఇన్విజిలేటర్లకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్‌కు సహకరించినట్లు ఏమాత్రం ఆధారం లభించినా సంబంధిత ఇన్విజిలేటర్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు 1997లో అప్పటి ప్రభుత్వం రూపొందించిన యాక్ట్ 25ని తెరముందుకు తెచ్చారు. ఇన్విజిలేటర్ల సహకారంతో చాలా పరీక్షా కేంద్రాల్లో ప్రైవేటు పాఠశాలల వారు అక్రమాలకు తెర లేపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ యాక్ట్ ప్రకారం పరీక్షా కేంద్రంలో చూచి రాతలను ప్రోత్సహించినా.. చిట్టీలు పెట్టి రాయించినా బాధ్యుడైన ఇన్విజిలేటర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే 3 నుంచి ఐదేళ్ల జైలు శిక్ష రూ.5 వేల నుంచి రూ.5 లక్షల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. రెండు దశాబ్దాల నాటి జీవోను బయటకు తీసి ఇన్విజిలేటర్లను ఇబ్బంది పెట్టే ఈ జీవోపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరీక్షల్లో అక్రమాలకు కళ్లెం వేసేందుకే ఈ జీవోను అమలు చేయనున్నామని ప్రభుత్వం పేర్కొంటున్నా కనుమరుగైన యాక్ట్‌ను ఇప్పుడు వెలుగులోకి తేవాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఒక్క విధానమే కాకుండా పరీక్షల నిర్వహణలోనూ పలు మార్పులు చేశారు. మాస్ కాపీయింగ్ ఎక్కువగా జరుగుతున్న కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా ఏర్పాట్లల్లో అధికారులు తలమునకలై ఉన్నారు. జిల్లాలో 35,292 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో బాలురు 18626మంది, బాలికలు 17,366మంది ఉన్నారు. వీరిలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు. 164 కేంద్రాలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. బెంచీకి ఇద్దరు కాదు.. ఒక్కరే.. గతంలో తరగతి గదిలో ఒక్కో బెంచీకి ఇద్దరు చొప్పున విద్యార్థులను జంబ్లింగ్ పద్ధతిన పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికారు. ఒక్కో బెంచీకి ఒక్కో విద్యార్థి మాత్రమే ఉండాలన్న నిబంధనను తీసుకొచ్చారు. అంతేకాకుండా ఒక్కో గదిలో 23 మంది కన్నా మించకూడదని నిర్ణయించారు. ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌కు అనుమతి లేదు.. మాస్ కాపీయింగ్‌కు సెల్‌ఫోన్ కూడా ఒక ఆధారమని భావించి ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల సందర్భంగా సెల్‌ఫోన్ ఎవరి వద్ద ఉండకూడదన్న నిబంధనను తీసుకొచ్చారు. సిబ్బంది వద్ద ఒకవేళ ఉన్నట్లయితే మామూలు సెల్‌ఫోన్ ఉండొచ్చు కానీ.. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేందుకు అవకాశంలేదు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వాడితే చర్యలు తప్పవంటున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉంటే సోషల్ మీడియా ద్వారా మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ర్యాండం విధానం అమలు.. ఇక ఇన్విజిలేటర్ల నియామకానికి వస్తే ఈ ఏడాది కొత్తగా ర్యాండం విధానాన్ని పదవ తరగతి పరీక్షలలో తీసుకురానున్నారు. గతంలో ఒక పరీక్ష కేంద్రానికి 10మంది ఇన్విజిలేటర్లు ఉండగా.. వారే గదులు మారుతూ ఇన్విజిలేటర్లుగా కొనసాగేవారు. ప్రస్తుతం ర్యాండం విధానం ప్రకారం ఉదాహరణకు ఒక మండలంలో మూడు పరీక్ష కేంద్రాలు ఉంటే ఉమ్మడిగా అందరిని ఒక్క కేంద్రానికి పరిమితం చేయకుండా మూడు కేంద్రాలకు ఇన్విజిలేటర్ల నియామకం జరుగుతుంది. ఈ పద్ధతివల్ల మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఎంఈవో ఇన్విజిలేటర్ల నియామకాన్ని కొనసాగిస్తుండగా.. ప్రస్తుతం ఆ పద్ధతి లేకుండా నేరుగా కలెక్టర్ కార్యాలయం నుంచి ఇన్విజిలేటర్ల నియామకం జరగనుంది. ఏ పరీక్ష కేంద్రానికి ఇన్విజిలేటర్ నియామకం జరిగింది.. పరీక్షకు ముందు రోజు రాత్రి ఆ ఇన్విజిలేటర్‌కు మెసేజ్ ద్వారా తెలియజేయనున్నారు. ఒకవేళ మెసేజ్ అందకపోతే మండలంలోని ఎంఈవోలు తెలియజేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు అదనపు సమయం కేటాయింపు ఈ ఏడాది నుంచి 10వ తరగతి పరీక్షల్లో సీసీఈ విధానం అమలు చేయనుండటంతో ప్రశ్నపత్రం నమూనా పూర్తిగా మారింది. విద్యార్థులు ప్రశ్నపత్రం పూర్తిగా చదివేందుకు ప్రత్యేకంగా 15 నిమిషాలు సమయం అదనంగా ఇవ్వనున్నారు. సాధారణంగా పది పరీక్షలకు 2.30 గంటల సమయం కేటాయిస్తారు. ఈ ఏడాది నుంచి అదనంగా 15 నిమిషాలు కలిపి మొత్తంగా పరీక్షకు 2.45 గంటల సమయం ఇస్తారు. చట్టం అమలుకు ఆదేశాలు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ 25 చట్టాన్ని అమలు చేసేందుకు ఆదేశాలు జారిచేసింది. ఈ చట్టం ప్రకారం కాపీయింగ్‌కు పాల్పడినా..పరోక్షంగా సహకరించినా ఆలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించేలా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే పరీక్షల చీఫ్, సూపరింటెండెంట్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. -
ప్రైవేటు ‘పది’కి స్వస్తి..!
సీసీఈలో ఇంటర్నల్ మార్కుల కేటాయింపు ఫలితం ఇకపై ఓపెన్ స్కూల్ విధానమొక్కటే మార్గం ఈ నెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ శ్రీకాకుళం : పాఠశాలకు వెళ్లకుండా ప్రైవేటుగా పదో తరగతి పరీక్షలకు హాజరుకావడం ఇక కుదరదు. గతంలో పరీక్ష ఫీజు చెల్లించి నేరుగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేవారు. ఇకపై ఆ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్ కంటిన్యూవస్ ఎవాల్యూషన్ (సీసీఈ) ఫలితంగా పదో తరగతిలో ప్రైవేటు స్టడీ ఫుల్స్టాప్ పడింది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచే నూతన విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలను జారీ చేసిందని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ స్టడీ చేద్దామనుకున్న విద్యార్థులకు ఇకపై ఓపెన్ స్కూల్ విధానం ఒక్కటే మార్గం. సీసీఈ ఎఫెక్ట్.. ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం 6 నుంచి 10వ తరగతి వరకు నిర్వహించే పరీక్షల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో అంతర్గత, బహిర్గత మూల్యాంకనాలున్నాయి. బహిర్గత మూల్యాంకనంలో ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అంతర్గత మూల్యాంకనానికి 20 మార్కులుంటాయి. విద్యార్థికి ఏడాది పొడవునా నిర్వహించే ఫార్మేటీవ్, సమ్మేటీవ్ పరీక్షలు, రికార్డులు, ప్రాజెక్టులు, ఇతర బోధనాంశాల నుంచి అంతర్గత మూల్యాంకనంలో 20 మార్కులు కేటాయిస్తారు. అయితే ప్రైవేట్ స్టడీ అభ్యర్థులకు ఇంటర్నల్ మార్కులు వేసేందుకు వీలు పడదు. వీరు ఏకంగా పబ్లిక్ పరీక్షలకు హాజరవుతుండడంతో ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఏకంగా పదో తరగతిలో ప్రైవేట్ స్టడీ విధానాన్ని రద్దు చేసింది. ఓపెన్ స్కూలే దిక్కు.. జిల్లాలో ఏటా 3500 నుంచి 4500 మంది విద్యార్థులు ప్రైవేట్ స్టడీ విధానంలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఇలాంటి విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ఒక్కటే దిక్కుగా మారింది. లేదంటే రెగ్యులర్‌గా చదవాల్సిన పరిస్థితి. ఈ ఏడాదికి సంబంధించి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిని చదివేందుకు ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు సమీప అధ్యయన కేంద్రాలు, డీఈఓ కార్యాలయంలో సంప్రదించవచ్చు. -
‘పది’లో మాస్ కాపీయింగ్‌కు చెక్
ఖానాపూర్ : చాలా మంది విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టి ప్రశ్న, జవాబులను బట్టీపట్టి పరీక్ష రాస్తున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసే విధంగా పదో తరగతి పరీక్ష విధానంలో తొలిసారిగా సీసీఈ (సమగ్ర మూల్యాంకన) విధానం అమలులోకి రానుంది. తద్వారా విద్యార్థులు పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు ఏమాత్రం పాల్పడకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రశ్నపత్రం ఇలా... పదో తరగతి పరీక్షల్లో ఇప్పటివరకు వంద మార్కుల ప్రశ్న పత్రానికి గానూ 30 మార్కులు అబ్జెక్టివ్, మిగతా 70 మార్కులు ప్రశ్నపత్రం ఉండేది. ఇందులో 35 మార్కులు సాధించిన విద్యార్థులు ఉత్తీర్ణత పొందేవారు. కాగా ఈ యేడాది నుంచి ఈ విధానానికి స్వస్తి పలికారు. 100 మార్కులకు గానూ 20మార్కులు ప్రాజెక్టు వర్క్‌కు కేటాయించారు. విద్యార్థుల రికార్డులను పరిశీలించిన పాఠశాల యాజమాన్యం 20మార్కులు వేయాల్సి ఉంటుంది. ఇందులో 20కి ఏడు మార్కులు వస్తే ఉత్తీర్ణత పొందుతారు. ఇక మిగతా 80 మార్కుల కోసం పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణతకు 28 మార్కులు సాధించాల్సి ఉంటుంది. గతంలో ప్రతీ సబ్జెక్టుకు సంబంధించి పాఠం చివరలో ప్రశ్నలుండేవి. ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబులు పాఠంలో నుంచే రాసేవారు. దీంతో పాటు క్వశ్చన్బ్యాంకు తదితర వాటిపై ఆధారపడి అందులోని ప్రశ్న, జవాబులను బట్టీ పట్టి పరీక్ష రాసేవారు. దీంతో చాలా చోట్ల పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు ఇవ్వగానే దానికి సంబంధించిన జవాబులు, జిరాక్స్ కాపీలు, పరీక్ష హాల్లోకి వెళ్లి జోరుగా మాస్‌కాపీయింగ్ జరిగేది. ఇక సీసీఈ విధానంతో పాఠ్యాంశం పూర్తి అర్థం చేసుకుంటే గానీ జవాబులు రాయలేని పరిస్థితి నెలకొంది. పలానా ప్రశ్నరావాలనే నిబంధన లేకుండా పాఠ్యాంశంలో ఎక్కడనుంచైనా ప్రశ్న రావచ్చు. దీంతో ప్రతీ పాఠంపై విద్యార్థికి కనీస పరిజ్ఞానం తప్పనిసరిగా మారింది. విద్యార్థుల్లో ఆందోళన.. తొలిసారిగా ‘పది’ పరీక్షల్లో సీసీఈ విధానం ప్రవేశ పెట్టడంతో విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. మండలంలో మొత్తం ఆరు పరీక్ష కేంద్రాలున్నాయి. మండల కేంద్రంలోని బాలురు, బాలికల ఉన్నత పాఠశాలతో పాటు మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల, ధృవ, కృష్ణవేణి టాలెంట్స్కూల్, పెంబీ జెడ్పీ పాఠశాలల్లో కేంద్రాలుండగా వెయ్యి మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష ఉంటుంది. గతంలో పరీక్ష కాలం 2.30 గంటలు కాగా సీసీఈ విధానంతో ప్రశ్న పత్రావళిని చదివేందుకు మరో 15 నిమిషాల కాలాన్ని అదనంగా కేటాయించారు. దీంతో పాటు హిందీ పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45వరకు ఉంటుంది. అరగంట ముందే కేంద్రానికి రావాలి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే రావాలి. ఈ ఏడాది సీసీఈ విధానం ప్రవేశ పెడ్తున్నాం. పాఠ్యాంశంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా జవాబులు రాసుకోవచ్చు. - వై.వెంకటరమణారెడ్డి, ఎంఈవో, ఖానాపూర్ -
బట్టీ చదువులకు చెక్!
తెరపైకి కొత్త పద్ధతి - సీసీఈ విధానానికి శ్రీకారం - ఉపాధ్యాయులకు శిక్షణ కెరమెరి : టెస్ట్ పేపర్ కొని వరుసగా నాలుగు మోడల్ పేపర్లు బట్టీ పట్టేస్తే వార్షిక పరీక్షలో ఈజీగా పాసయ్యేవారు. కానీ ఆ పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇక నుంచి విద్యార్థి మేథో సంపత్తి, తార్కిక శక్తిని నిశితంగా పరిశీలించేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆ విధానమే ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవ్య విధానంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంతో కథనం. ఇదీ నిరంతర సమగ్ర మూల్యాంకనం పాఠశాలలో జరిగే అభ్యాసన ప్రక్రియలకు, లక్ష్యాలకు, బోధనలకు, ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థి మేథో మథనానికి తోడ్పడే విధానమే నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ). ఈ విధానం నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ఈ ఏడాది 9, 10 తరగతులకూ వర్తింపజేశారు. పదో త రగతి పాఠ్యపుస్తకాలు మారడంతో పరీక్ష విధానం కూడా సీసీఈ పద్ధతిలోనే ఉండనుంది. ఇందుకోసం ఉపాధ్యాయులకు కొత్త పాఠ్యపుస్తకాల బోధన విధానం, మూ ల్యాంకనంపై అవగాహన కోసం ఈ నెల 16 నుంచి శిక్ష ణ ఇస్తున్నారు. ప్రతీ సబ్జెక్టులో నిర్మాణాత్మక మూల్యాం కనం (ఫార్మెటీవ్ అసిస్మెంట్) ద్వారా ఏడాదిలో నాలు గు సార్లు లఘు పరీక్ష పెడుతారు. ఇక సంగ్రాహనాత్మక మూల్యాంకనమంటే విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, సమాచార సేక రణ, ప్రాజెక్టు పనులు, విలువలు, మొదలగు విద్యాప్రమాణాలను అనుసరించి ఏడాదికి మూడు సార్లు పరీక్ష నిర్వహించే విధానం. ఇందులో విద్యార్థి ప్ర శ్నలు ఆలోచించి రాయాల్సి ఉంటుంది. ఈ విధానంలో పుస్తకంలో ఉన్న ప్రశ్నలను నేరుగా ఇవ్వరు. అలాగే ఒకసారి ఇచ్చిన ప్రశ్న రెండోసారి పునారావృతం కాదు. మార్కుల విధానం.. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగానే ఈ ఏడాది 9, 10 తరగతులకు 100 మార్కులకు బదులు 80 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. మిగిలిన 20 మార్కులు విద్యార్థుల జ్ఞాపకశక్తి, ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెకు పనులకు సంబంధించి మార్కులు ఉంటాయి. జీవితానికి అన్వయించుకునేలా.. విద్యార్థి పాఠ్యాంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని తను నేర్చుకున్న అంశాలను తన జీవితానికి అన్వయించుకునేందుకు ఈ విధానం దోహదపడుతుంది. విద్యార్థులను టీచర్లు కొన్ని కోణాల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, విషయ పరిశీలన, పరిశోధనా శక్తి మెరుగుపడుతుంది. అయితే 20 మార్కులకు సంబంధించి ఉపాధ్యాయుడు విద్యార్థుల విషయంలో ఎంతో నిశితంగా పరిశీలనతో వ్యవహరించాల్సి ఉంటుంది. - చంద్రశేఖర్, ఉపాధ్యాయుడు, అనార్పల్లి ఆలోచన విధానానికే మార్కులు గత బోధన విధానం ప్రకారం పాఠాల వెనుక ఉన్న నిరంతరం వచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయడమనేది మూస పద్ధతి. కానీ ప్రస్తుత విధానంలో విషయ సంసిద్ధతతో ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్లాలి. గణితంలో ప్రస్తుతం సమస్యకు సంబంధించిన సూత్రాలు కూడా ఉపాధ్యాయులే విద్యార్థుల ద్వారా రాబట్టాల్సి ఉంటుంది. అందువల్ల విద్యార్థుల ఆలోచన శక్తి పెరిగేలా ఉపాధ్యాయుడు ఎంతో చొరవ చూపాలి. - తిరుపతి, ఉపాధ్యాయుడు, గోయగాం నిశిత పరిశీలన అవసరం ఈ విధానం మేథోసంపత్తి ఉన్న నేటి తరం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో కీలకం. పాఠశాల వెలుపల, లోపల విద్యార్థులను నిశితంగా పరిశీలించాలి. ఇంతకు ముందులా నోట్స్, గైడ్స్ ఉండవు. తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకున్న దానిని తన మేథో ఆధారంగా రాయాల్సి ఉంటుంది. దీని వల్ల విద్యార్థిలో ఉన్న జ్ఞానం వెలికి వచ్చి ఒక ప్రశ్నకు ఒక్కో విద్యార్థి ఒక్కో రీతిలో సమాధానమిస్తాడు. ఇది విద్యార్థి తార్కిక ఆలోచనకు, పరిశోధన శక్తికి దోహదపడుతుంది. - ఆర్.రమేశ్, ఉపాధ్యాయుడు, కెరమెరి