అయ్యవార్లకు అగ్నిపరీక్ష
Published Tue, Mar 14 2017 8:17 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
► పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్ట చర్యలు
► తెరపైకి యాక్ట్ 25
► కాపీయింగ్‌కు సహకరించే ఇన్విజిలేటర్లపై క్రిమినల్ కేసు
► ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం
► వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు
కలసపాడు / వేంపల్లె:
పదో తరగతి పరీక్షలు ఈ ఏడాది ఇన్విజిలేటర్లకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. పరీక్షా కేంద్రంలో మాస్ కాపీయింగ్‌కు సహకరించినట్లు ఏమాత్రం ఆధారం లభించినా సంబంధిత ఇన్విజిలేటర్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు 1997లో అప్పటి ప్రభుత్వం రూపొందించిన యాక్ట్ 25ని తెరముందుకు తెచ్చారు.
ఇన్విజిలేటర్ల సహకారంతో చాలా పరీక్షా కేంద్రాల్లో ప్రైవేటు పాఠశాలల వారు అక్రమాలకు తెర లేపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ యాక్ట్ ప్రకారం పరీక్షా కేంద్రంలో చూచి రాతలను ప్రోత్సహించినా.. చిట్టీలు పెట్టి రాయించినా బాధ్యుడైన ఇన్విజిలేటర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. నేరం రుజువైతే 3 నుంచి ఐదేళ్ల జైలు శిక్ష రూ.5 వేల నుంచి రూ.5 లక్షల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. రెండు దశాబ్దాల నాటి జీవోను బయటకు తీసి ఇన్విజిలేటర్లను ఇబ్బంది పెట్టే ఈ జీవోపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పరీక్షల్లో అక్రమాలకు కళ్లెం వేసేందుకే ఈ జీవోను అమలు చేయనున్నామని ప్రభుత్వం పేర్కొంటున్నా కనుమరుగైన యాక్ట్‌ను ఇప్పుడు వెలుగులోకి తేవాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఒక్క విధానమే కాకుండా పరీక్షల నిర్వహణలోనూ పలు మార్పులు చేశారు.
మాస్ కాపీయింగ్ ఎక్కువగా జరుగుతున్న కేంద్రాలను గుర్తించి ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా ఏర్పాట్లల్లో అధికారులు తలమునకలై ఉన్నారు. జిల్లాలో 35,292 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో బాలురు 18626మంది, బాలికలు 17,366మంది ఉన్నారు. వీరిలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు. 164 కేంద్రాలలో ఈ పరీక్షలు జరగనున్నాయి.
బెంచీకి ఇద్దరు కాదు.. ఒక్కరే..
గతంలో తరగతి గదిలో ఒక్కో బెంచీకి ఇద్దరు చొప్పున విద్యార్థులను జంబ్లింగ్ పద్ధతిన పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికారు. ఒక్కో బెంచీకి ఒక్కో విద్యార్థి మాత్రమే ఉండాలన్న నిబంధనను తీసుకొచ్చారు. అంతేకాకుండా ఒక్కో గదిలో 23 మంది కన్నా మించకూడదని నిర్ణయించారు.
ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌కు అనుమతి లేదు..
మాస్ కాపీయింగ్‌కు సెల్‌ఫోన్ కూడా ఒక ఆధారమని భావించి ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల సందర్భంగా సెల్‌ఫోన్ ఎవరి వద్ద ఉండకూడదన్న నిబంధనను తీసుకొచ్చారు. సిబ్బంది వద్ద ఒకవేళ ఉన్నట్లయితే మామూలు సెల్‌ఫోన్ ఉండొచ్చు కానీ.. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేందుకు అవకాశంలేదు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వాడితే చర్యలు తప్పవంటున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉంటే సోషల్ మీడియా ద్వారా మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ర్యాండం విధానం అమలు..
ఇక ఇన్విజిలేటర్ల నియామకానికి వస్తే ఈ ఏడాది కొత్తగా ర్యాండం విధానాన్ని పదవ తరగతి పరీక్షలలో తీసుకురానున్నారు. గతంలో ఒక పరీక్ష కేంద్రానికి 10మంది ఇన్విజిలేటర్లు ఉండగా.. వారే గదులు మారుతూ ఇన్విజిలేటర్లుగా కొనసాగేవారు. ప్రస్తుతం ర్యాండం విధానం ప్రకారం ఉదాహరణకు ఒక మండలంలో మూడు పరీక్ష కేంద్రాలు ఉంటే ఉమ్మడిగా అందరిని ఒక్క కేంద్రానికి పరిమితం చేయకుండా మూడు కేంద్రాలకు ఇన్విజిలేటర్ల నియామకం జరుగుతుంది. ఈ పద్ధతివల్ల మాస్ కాపీయింగ్‌కు తావు లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఎంఈవో ఇన్విజిలేటర్ల నియామకాన్ని కొనసాగిస్తుండగా.. ప్రస్తుతం ఆ పద్ధతి లేకుండా నేరుగా కలెక్టర్ కార్యాలయం నుంచి ఇన్విజిలేటర్ల నియామకం జరగనుంది. ఏ పరీక్ష కేంద్రానికి ఇన్విజిలేటర్ నియామకం జరిగింది.. పరీక్షకు ముందు రోజు రాత్రి ఆ ఇన్విజిలేటర్‌కు మెసేజ్ ద్వారా తెలియజేయనున్నారు. ఒకవేళ మెసేజ్ అందకపోతే మండలంలోని ఎంఈవోలు తెలియజేయాల్సి ఉంటుంది.
విద్యార్థులకు అదనపు సమయం కేటాయింపు
ఈ ఏడాది నుంచి 10వ తరగతి పరీక్షల్లో సీసీఈ విధానం అమలు చేయనుండటంతో ప్రశ్నపత్రం నమూనా పూర్తిగా మారింది. విద్యార్థులు ప్రశ్నపత్రం పూర్తిగా చదివేందుకు ప్రత్యేకంగా 15 నిమిషాలు సమయం అదనంగా ఇవ్వనున్నారు. సాధారణంగా పది పరీక్షలకు 2.30 గంటల సమయం కేటాయిస్తారు. ఈ ఏడాది నుంచి అదనంగా 15 నిమిషాలు కలిపి మొత్తంగా పరీక్షకు 2.45 గంటల సమయం ఇస్తారు.
చట్టం అమలుకు ఆదేశాలు
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ 25 చట్టాన్ని అమలు చేసేందుకు ఆదేశాలు జారిచేసింది. ఈ చట్టం ప్రకారం కాపీయింగ్‌కు పాల్పడినా..పరోక్షంగా సహకరించినా ఆలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించేలా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే పరీక్షల చీఫ్, సూపరింటెండెంట్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
Advertisement
Advertisement