ఓ మంచి దేవుడా: పరీక్షకు ముందు ప్రార్థన చేసుకుంటున్న విద్యార్థిని , తండ్రితో కలిసి వస్తున్న విద్యార్థిని
కర్నూలు(సిటీ): పదో తరగతి పరీక్షలు అసౌకర్యాల మధ్య గురువారం ప్రారంభమయ్యాయి. అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పినా దాదాపు అన్ని కేంద్రాల్లోనూ సమస్యలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ప్రభుత్వం అన్ని వసతులు కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించినప్పటికీ ప్రభుత్వ స్కూళ్లు కేంద్రాలుగా ఉన్నచోట విద్యార్థులు పాత బెంచీల మీదే పరీక్షలు రాశారు. కొన్ని చోట్ల పక్క స్కూళ్ల బెంచీలను ఏర్పాటు చేసి పరీక్షలు రాయించారు. ఫ్యాన్లు లేకపోవడంతో ఎండల తీవ్రతకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక ఆర్టీసీ బస్సులను తిప్పాలని డీఈఓ తహెరా సుల్తానా కోరినా ఎక్కడా ప్రత్యేక బస్సులు అగుపించలేదు. దీంతో చాలా మంది విద్యార్థులు ప్రైవేటు వాహనాల్లోనే కేంద్రాలకు చేరుకున్నారు.
మొదటిరోజు కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులతో కలసి అర గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సరైన రవాణా సదుపాయం లేకపోవడంతో అక్కడక్కడా 5, 10 నిముషాలు ఆలస్యంగా వచ్చినా అధికారులు అనుమతించారు. పరీక్ష ప్రారంభానికి ముందే చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో సమావేశమై పరీక్ష నిర్వహణపై పలు సూచనలిచ్చారు. కాగా కొలిమిగుండ్ల జెడ్పీ హైస్కూల్ సెంటర్‌లో కొంతమంది మోడల్ స్కూల్ టీచర్లు ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్‌తో ఫొటో తీసుకొని చిట్టీలు చించి విద్యార్థులకు అందజేసినట్లు, అదే సెంటర్ వద్ద ఓ విద్యార్థి తండ్రి చిట్టీలు వేసినట్లు సమాచారం. పరీక్షల అబ్జర్వర్ రాఘవరెడ్డి మాత్రం కాపీయింగ్‌కు అవకాశమే లేదని పేర్కొన్నారు.
173మంది విద్యార్థులు గైర్హాజరు
జిల్లాలో 226 కేంద్రాల్లో ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలకు మొదటిరోజున 49,932 మంది విద్యార్థులకు గాను 49,759 మంది విద్యార్థులు హాజరు కాగా, 173 మంది గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. కేంద్రాల్లో వాటర్ బాయ్‌ని ఏర్పాటు చేసుకోవడంలో కొంత ఉపాధ్యాయులు, సీఎస్‌ల మధ్య తాము చెప్పిన వారినే ఏర్పాటు చేసుకోవాలని వాదనలు జరిగాయి. కృష్ణగిరి మండలంలోని అమకతాడు, కోయిలకొండ గ్రామాల విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఆటోల్లో వచ్చారు. అలాగే జిల్లాలో రవాణా సౌకర్యం లేని సుమారు 600లకుపైగా గ్రామాలకు చెందిన విద్యార్థులు, రోడ్లు ఉన్నా బస్సు సౌకర్యం లేని మరో 70 గ్రామాల విద్యార్థులు అవస్థలు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment