ఖానాపూర్ : చాలా మంది విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టి ప్రశ్న, జవాబులను బట్టీపట్టి పరీక్ష రాస్తున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసే విధంగా పదో తరగతి పరీక్ష విధానంలో తొలిసారిగా సీసీఈ (సమగ్ర మూల్యాంకన) విధానం అమలులోకి రానుంది. తద్వారా విద్యార్థులు పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు ఏమాత్రం పాల్పడకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది.
ప్రశ్నపత్రం ఇలా...
పదో తరగతి పరీక్షల్లో ఇప్పటివరకు వంద మార్కుల ప్రశ్న పత్రానికి గానూ 30 మార్కులు అబ్జెక్టివ్, మిగతా 70 మార్కులు ప్రశ్నపత్రం ఉండేది. ఇందులో 35 మార్కులు సాధించిన విద్యార్థులు ఉత్తీర్ణత పొందేవారు. కాగా ఈ యేడాది నుంచి ఈ విధానానికి స్వస్తి పలికారు. 100 మార్కులకు గానూ 20మార్కులు ప్రాజెక్టు వర్క్‌కు కేటాయించారు. విద్యార్థుల రికార్డులను పరిశీలించిన పాఠశాల యాజమాన్యం 20మార్కులు వేయాల్సి ఉంటుంది. ఇందులో 20కి ఏడు మార్కులు వస్తే ఉత్తీర్ణత పొందుతారు. ఇక మిగతా 80 మార్కుల కోసం పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణతకు 28 మార్కులు సాధించాల్సి ఉంటుంది.
గతంలో ప్రతీ సబ్జెక్టుకు సంబంధించి పాఠం చివరలో ప్రశ్నలుండేవి. ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబులు పాఠంలో నుంచే రాసేవారు. దీంతో పాటు క్వశ్చన్‌బ్యాంకు తదితర వాటిపై ఆధారపడి అందులోని ప్రశ్న, జవాబులను బట్టీ పట్టి పరీక్ష రాసేవారు. దీంతో చాలా చోట్ల పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు ఇవ్వగానే దానికి సంబంధించిన జవాబులు, జిరాక్స్ కాపీలు, పరీక్ష హాల్లోకి వెళ్లి జోరుగా మాస్‌కాపీయింగ్ జరిగేది. ఇక సీసీఈ విధానంతో పాఠ్యాంశం పూర్తి అర్థం చేసుకుంటే గానీ జవాబులు రాయలేని పరిస్థితి నెలకొంది. పలానా ప్రశ్నరావాలనే నిబంధన లేకుండా పాఠ్యాంశంలో ఎక్కడనుంచైనా ప్రశ్న రావచ్చు. దీంతో ప్రతీ పాఠంపై విద్యార్థికి కనీస పరిజ్ఞానం తప్పనిసరిగా మారింది.
విద్యార్థుల్లో ఆందోళన..
తొలిసారిగా ‘పది’ పరీక్షల్లో సీసీఈ విధానం ప్రవేశ పెట్టడంతో విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. మండలంలో మొత్తం ఆరు పరీక్ష కేంద్రాలున్నాయి. మండల కేంద్రంలోని బాలురు, బాలికల ఉన్నత పాఠశాలతో పాటు మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల, ధృవ, కృష్ణవేణి టాలెంట్‌స్కూల్, పెంబీ జెడ్పీ పాఠశాలల్లో కేంద్రాలుండగా వెయ్యి మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష ఉంటుంది. గతంలో పరీక్ష కాలం 2.30 గంటలు కాగా సీసీఈ విధానంతో ప్రశ్న పత్రావళిని చదివేందుకు మరో 15 నిమిషాల కాలాన్ని అదనంగా కేటాయించారు. దీంతో పాటు హిందీ పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45వరకు ఉంటుంది.
అరగంట ముందే కేంద్రానికి రావాలి
విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే రావాలి. ఈ ఏడాది సీసీఈ విధానం ప్రవేశ పెడ్తున్నాం. పాఠ్యాంశంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా జవాబులు రాసుకోవచ్చు.
- వై.వెంకటరమణారెడ్డి, ఎంఈవో, ఖానాపూర్
‘పది’లో మాస్ కాపీయింగ్‌కు చెక్
Published Sun, Mar 15 2015 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM
Advertisement
Advertisement