మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ సతీశ్ కాలర్ పట్టి లాగుతున్న ప్రిన్సిపాల్ సత్యనారాయణగౌడ్
జగిత్యాలక్రైం: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు అడ్డదారి తొక్కారు. దొంగచాటున ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో పదోతరగతి పరీక్ష పత్రంలోని ప్రశ్నలకు జవాబులు రాస్తున్న ఉపాధ్యాయులను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా వారు పరారయ్యారు. ఇదే సమయంలో ఓ ప్రిన్సిపాల్ ఎస్‌ఐపై దాడికి యత్నించారు. మండల విద్యాధికారి సహా మొత్తం 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయగా.. వారిలో ఏడుగురిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన గురువారం జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో కలకలం సృష్టించింది. ఎస్‌ఐ సతీశ్‌కుమార్ కథనం ప్రకారం. పదోతరగతి పరీక్షల కోసం కొడిమ్యాలలోని మోడల్ స్కూల్, జెడ్పీహెచ్‌ఎస్, పూడూరు జెడ్పీహెచ్‌ఎస్‌లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కొడిమ్యాలలోని రెండు పరీక్ష కేంద్రాలకు జవాబులు రాసి విద్యార్థులకు చేర వేసేందుకు ఉపాధ్యాయులు ప్రణాళిక రచించారు. వీరంతా ఎంఈవో కార్యాలయం సమీపంలోని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో కొడిమ్యాల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బత్తిని సత్యనారాయణగౌడ్, కోనాపూర్ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు వడ్లకొండ రమేశ్, రాంసాగర్ స్కూల్ టీచర్ శ్రీనివాస్, కొడిమ్యాల కేజీబీవీ ప్రత్యేకాధికారి మంద లింగవ్వ, కేజీబీవీ మ్యాథ్స్ టీచర్ పద్మ, మోడల్‌స్కూల్ మ్యాథ్స్ టీచర్ రాధ ఉదయం 10.45 గంటలకు కలుసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ అక్కడికి చేరుకునే సరికి ఉపాధ్యాయులు జవాబులు రాస్తూ కనిపించారు. ఆయన రాకను గమనించిన ఐదుగురు ఉపాధ్యాయులు పారిపోయారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణగౌడ్ ను అదుపులోకి తీసుకునే క్రమంలో ఎస్‌ఐపై దాడికి యత్నించారు. ఎస్‌ఐ ఫిర్యాదుతో మొత్తం 10 మందిపై కేసు నమోదు చేసినట్లు మల్యాల సీఐ సీహెచ్.నాగేందర్ తెలిపారు.
ఏడుగురి ఉపాధ్యాయుల సస్పెన్షన్
జవాబుపత్రాలు రాస్తున్నట్లు నిర్ధారణ కావడంతో ఏడుగురు ఉపాధ్యాయులను డీఈవో వెంకటేశ్వర్లు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బత్తిని సత్యనారాయణగౌడ్, కోనాపూర్ మ్యాథ్స్ టీచర్ వడ్లకొండ రమేశ్, రాంసాగర్ మ్యాథ్స్ టీచర్ శ్రీనివాస్, కొడిమ్యాల కేజీబీవీ ప్రత్యే కాధికారి మంద లింగవ్వ, కేజీబీవీ మ్యాథ్స్ టీచర్ పద్మ, మోడల్‌స్కూల్ మ్యాథ్స్ టీచర్ రాధతోపాటు ఇంటి యజమాని, సూరంపేట పాఠశాల ఉపాధ్యాయుడు సతీశ్‌ను సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment