Tenth class examination
-
30 మంది టీచర్ల సస్పెన్షన్
సాక్షి, అమరావతి/మచిలీపట్నం/పసుమర్రు (పామర్రు)/ఏలూరు (ఆర్ఆర్ పేట): రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ తదితర అక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 44 మంది అరెస్ట్ అయ్యారని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి చెప్పారు. వీరిలో 30 మంది ప్రభుత్వ టీచర్లను పాఠశాల విద్యా శాఖ సస్పెండ్ చేసిందని తెలిపారు. కృష్ణా జిల్లాలో ఏడుగురు.. పామర్రు మండలం పసుమర్రు జెడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ అందిన సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ, విద్యా శాఖ అధికారులతో కలిసి కృష్ణా జిల్లా డీఈవో తాహెరా సుల్తానా సోమవారం తనిఖీలు జరిపారు. ఉపాధ్యాయులు సీహెచ్ వెంకయ్యచౌదరి, వై.సురేష్, పి.గంగాధరం, కె.వరప్రసాద్, తిరుమలేష్, శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని డీఈవో తెలిపారు. వీరికి ఏలూరు జిల్లా కనుమోలు టీచర్ బి.రత్నకుమార్ సహకరించినట్లు గుర్తించామన్నారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తాము కూడా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. మాస్ కాపీయింగ్ ప్రయత్నం భగ్నం.. ఏలూరులోని సత్రంపాడు విద్యా వికాస్ స్కూల్లోని పరీక్ష కేంద్రాన్ని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఎల్.శ్రీకాంత్ సోమవారం తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం డిపార్ట్మెంటల్ అధికారి రామాంజనేయ వరప్రసాద్ మ్యాథ్స్ ప్రశ్నపత్రానికి సంబంధించిన జవాబులు చెబుతుండగా.. అదనపు ఇన్విజిలేటర్ ప్రదీప్ తెల్ల కాగితం కింద రెండు కార్బన్ పేపర్లు పెట్టి రాస్తుండడాన్ని గుర్తించారు. ఇదంతా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సమక్షంలోనే జరగడాన్ని గమనించి.. వెంటనే వారందరినీ ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డిపార్ట్మెంటల్ అధికారిని, అదనపు ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకునేందుకు పాఠశాల విద్యా శాఖకు సిఫార్సు చేశారు. -
పదిలమైన ఏర్పాట్లు
సాక్షి, అమరావతి/ మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. కోవిడ్–19 నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయవాడలోని సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేశ్ ఏమన్నారంటే.. ► ప్రతి కేంద్రంలో గదికి 10 నుంచి 12 మంది విద్యార్థులే ఉండేలా చర్యలు. ► గతంలో నిర్ణయించిన 2,882 పరీక్ష కేంద్రాలు 4,154కు పెంపు. ► ప్రతి గదిలో మాస్కులు, శానిటైజర్లు. ► విద్యార్థుల కోసం 8 లక్షల మాస్కులు సిద్ధం.. టీచింగ్ స్టాఫ్‌కు గ్లౌజులు. ► ప్రతి కేంద్రంలో థర్మల్ స్కానర్ ఉండేలా 4,500 స్కానర్ల ఏర్పాటు. ► ప్రస్తుతం ఉన్న కంటైన్మెంట్ జోన్లలో పరీక్ష కేంద్రాలు ఉండవు. ► ఇదే తరహాలో జాగ్రత్తలతో ఓపెన్ స్కూల్ పరీక్షలు కూడా నిర్వహిస్తాం. ► జూలై చివరికి నాడు–నేడు కింద తొలి దశలో పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ చినవీరభద్రుడు, మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ సలహాదారు మురళి, పలువురు అధికారులు పాల్గొన్నారు. అధ్యాపకులు ప్రచారం చేయాలి ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై అధ్యాపకులు ప్రచారం చేయాలని మంత్రి సురేశ్ కోరారు. ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు మంగళవారం మంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. ‘ప్రభుత్వ విద్యను పటిష్టం చేద్దాం’ పేరుతో సంఘం ముద్రించిన కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు. కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం చేస్తున్న చర్యలకు తమ వంతుగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ అధ్యాపకులు సేకరించిన రూ.కోటి 15 లక్షల చెక్కును సంఘం నాయకులు మంత్రికి అందించారు. -
టెన్త్ మ్యాథ్స్–1 పేపర్ లీక్
- గార్లలో బయటకొచ్చిన ప్రశ్నపత్రం - పోలీసుల అదుపులో నిందితులు సాక్షి, మహబూబాబాద్: పదో తరగతి పరీక్షల్లో లీకేజీ పరంపర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో మ్యాథ్స్–1 ప్రశ్నపత్రం మహబూబాబాద్ జిల్లా గార్లలో లీక్ అయ్యింది. గార్లలోని బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 9.30 నిమిషాలకు మ్యాథ్స్–1 పరీక్ష ప్రారంభమైంది. అరగంట తర్వాత గార్ల మండలం సింగారం గ్రామానికి చెందిన బానోత్ కార్తీక్ అనే యువకుడు పాఠశాల ప్రహరీగోడ దూకి పరీక్ష హాలులోకి వెళ్లి, అదే పాఠశాలలో పనిచేస్తున్న ఇన్విజిలేటర్ భద్రును ప్రశ్నపత్రాన్ని సెల్లో ఫొటో తీసి ఇవ్వాలని కోరారు. దీంతో ఇన్విజిలేటర్ సెల్లో ఫొటో తీసి ఇచ్చాడు. పాఠశాల నుంచి బయటకు వచ్చిన కార్తీక్ స్నేహితులకు వాట్సాప్‌లో గణితం ప్రశ్నపత్రం ఫొటోను పోస్టు చేయడంతో, గార్లలో పది గణితం ప్రశ్నపత్రం లీకైనట్లు వెలుగు చూసింది. దీంతో అప్రమత్తమైన ఎస్సై సీహెచ్.వంశీధర్ వెంటనే పరీక్షా కేంద్రానికి వెళ్లి విచారణ చేపట్టి ఇన్విజిలేటర్ భద్రు, యువకుడు కార్తీక్‌ను అదుపులోకి తీసుకొని జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సీఐ ఎం.సాంబయ్య పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, ఇన్విజిలేటర్ భద్రు, కార్తీక్‌లను 2 గంటల పాటు విచారించగా, వారు జరిగిన విషయాన్ని పోలీసులకు వెల్లడించారు. ఈ ఏడాది వార్షిక పరీక్షలో మార్చి 21న మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ఇంగ్లీష్ పేపర్–1 ప్రశ్నపత్రం లీకైంది. మళ్లీ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోనే ప్రశ్నపత్రం లీక్ అయింది. మార్చి 22న సూర్యాపేట జిల్లా హూజుర్‌నగర్‌లో ఇంగ్లీష్–2 ప్రశ్నపత్రం లీకైంది. గతంలో దంతాలపల్లి నుంచి ఖమ్మంకు ప్రశ్నపత్రం వాట్సాప్ ద్వారా చేరింది. ఇందుకు బాధ్యులైన వారి అరెస్ట్ చేశారు. ముగ్గురి సస్పెన్షన్ గణితం–1 పరీక్షలో పేపరు లీకేజీకి ప్రయత్నించిన వ్యవహారంలో ముగ్గురిని సస్పెండ్ చేయడంతో పాటు ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పరీక్షా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న డిపార్ట్మెంట్ అధికారి, చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేశారు. ఇన్విజిలేటర్, సమాచారం తీసుకోవడానికి గోడ దూకి వచ్చిన వ్యక్తిపై క్రిమినల్ కేసును నమోదు చేశారు. ఫొటోలు తీసుకునేందుకు సహకరించిన విద్యార్థిని డిబార్ చేశారు. పేపర్ లీక్ కాలేదని, అధికారులు అప్రమత్తమై తగిన చర్యలను తీసుకున్నారని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌రెడ్డి వెల్లడించారు. -
ఏపీలో ‘పది’ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలను ప్రస్తుత విద్యాసంవత్సరంలో నిరంతర, సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు పరీక్షల విభాగం డెరైక్టర్ ఎంఆర్ ప్రసన్నకుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మార్గదర్శకాలు ఇవీ.. ► 2017 మార్చిలో జరిగే పది పబ్లిక్ పరీక్షలు సీసీఈ ప్యాట్రన్‌ను అనుసరించి నిర్వహిస్తారు. ► పరీక్షలకు ఆరు సబ్జెక్టుల్లో 11 పేపర్లు ఉంటాయి. ► తుది పరీక్షలో సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 80 మార్కులకు, మిగిలిన పది పేపర్లలో ఒక్కోదాన్ని 40 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నపత్రం చదువుకోవడానికి అదనంగా 15 నిమిషాలు కేటాయిస్తారు. ► సెకండ్ లాంగ్వేజ్ మినహా మిగిలిన 10 పేపర్లలో అంతర్గత అంచనా మార్కుల కింద ఒక్కో పేపర్‌కు 10 మార్కులు(సబ్జెక్టుకు 20 మార్కులు) ఉంటాయి. ఒక్కో పేపర్లో ఆయా అభ్యర్థులు సాధించిన మార్కులను తుది పరీక్ష మార్కులకు జతచేస్తారు. ► ఫైనల్ పరీక్షలో కాంపోజిట్ ఫస్ట్లాంగ్వేజ్ పేపర్-1 తెలుగు, ఉర్దూ పరీక్షలు 60 మార్కులకే ఉంటాయి. ఇంటర్నల్ మార్కులు 20 ఉంటాయి. ► కాంపోజిట్ కోర్సు పేపర్-2 సంస్కృతం, హిందీ, అరబిక్, పర్షియన్ భాషలకు సంబంధించి 20 మార్కులకు పరీక్ష ఉంటుంది. అంతర్గత అంచనా మార్కులు ఉండవు. ► మెయిన్ లాంగ్వేజ్ సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషలకు సంబంధించి పేపర్-1, 2లలో ఫైనల్ పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. అంతర్గత అంచనా మార్కులు 20 ఉంటాయి. ► సెకండ్ లాంగ్వేజ్ మినహా అన్ని పేపర్లలో పాస్ మార్కులు 35 శాతం రావాలి. ప్రతి అభ్యర్థి ఫైనల్ పరీక్షలో ప్రతి పేపర్లో 28 మార్కులు తెచ్చుకోవాలి. మిగతావి అంతర్గత అంచనా విధానంలో సాధించాలి. ► సెకండ్ లాంగ్వేజ్ పేపర్లో పాస్ మార్కులు 20 శాతం ఉండాలి. ఫైనల్ పరీక్షలో అభ్యర్థులు తప్పనిసరిగా 16 మార్కులు సాధించాలి. మిగతా మార్కులు ఇంటర్నల్ అసెస్మెంటు ద్వారా సాధించవచ్చు. ► ఇంటర్నల్ అసెస్మెంటు(అంతర్గత అంచనా)లో కనిష్ట పాస్‌మార్కులు లేవు. ► 2017 నుంచి మరాఠీ, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు హిందీ, తమిళ్, కన్నడ, ఒడియా, సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ సబ్జెక్టుల పరీక్షలుండవు. ► పాఠశాలలో చదవకుండా నేరుగా ఎస్సెస్సీ పరీక్షలకు హాజరవుతున్న వారికి ఇకపై ఆ అవకాశం ఉండదు. అలాంటి వారు ఓపెన్ స్కూల్ పరీక్షలకు హాజరవ్వాలి. ► మూగ, చెవిటి, అంధ అభ్యర్థులకు ఉత్తీర్ణత మార్కులు 20 శాతం. వీరు ఫైనల్ పరీక్షలో 16 మార్కులు పొందాలి. మిగతావి ఇంటర్నల్ మార్కుల ద్వారా సాధించాలి. ► 2016లో ఫెయిలైన అభ్యర్థులకు 2017లో మాత్రం పాత ప్యాట్రన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత పాత విధానాన్ని పూర్తిగా తీసివేస్తారు. -
ట్రిపుల్ఐటీ పిలుస్తోంది
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభావంతులకు ట్రిపుల్ ఐటీ సువర్ణావకాశం. మధ్య తరగతి విద్యార్థులు ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో చేరే అవకాశం ఇక్కడ లభిస్తుంది. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్ సోమవారం ప్రారంభమైంది. ఎంపికైన విద్యార్థులకు జూన్, జూలై నెలల్లో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో నూజివీడు, ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ కేంద్రాల్లో రెండు దశల్లో ఈ కౌన్సెలింగ్ ఉంటుంది. సత్తెనపల్లి: జిల్లాలో ఈ ఏడాది 59,478 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 56,345 మంది విద్యార్థుల ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 579 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి పదికి పది జీపీఏ సాధించారు. వీరితో పాటుగా ప్రతిభావంతులైన మిగిలిన గ్రేడ్లు సాధించిన విద్యార్థులు కూడా ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దాని ప్రవేశానికి విద్యార్థుల అర్హతను బట్టి ఆన్లైన్ ద్వారా జూన్ 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎవరు అర్హులంటే.. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో ప్రతిభావంతులుగా నిలిచిన అన్ని పాఠశాలల విద్యార్థులు అర్హులే. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పది చదివిన విద్యార్థులకు 0.4 జీపీఏ అదనంగా కలిపి కౌన్సెలింగ్‌లో ప్రతిభ నిర్ధారిస్తారు. పదో తరగతి తత్సమానమైన పరీక్షల్లో రెగ్యులర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన వారే అర్హులు. ఈ ఏడాది డిసెంబరు నాటికి 18 ఏళ్ల దాటని విద్యార్థులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వయో పరిమితిలో 21 ఏళ్ల వరకు సడలింపు ఉంది. దరఖాస్తు చేయడమిలా.. ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించాలంటే ఓసీ, బీసీలు రూ. 150, ఎస్సీ, ఎస్టీలు రూ. 100 చెల్లించి ఏపీ ఆన్లైన్ ద్వారా మీసేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి హాల్ టికెట్ నంబరు, నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్హత, నివాసం, కులం, పదో తరగతి ఉత్తీర్ణత, ఇతర కోటాలకు సంబంధించిన ఆయా ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. ఎంపిక విధానం పదో తరగతిలో విద్యార్థులు సాధించిన గ్రేడ్ల వారీగా ఎంపిక ఉంటుంది. ఒక వేళ ఎక్కువ మంది విద్యార్థులు ఒకే గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించి పోటీ పడితే సబ్జెక్టుల వారీగా సాధించిన గ్రేడ్లను పరిగణనలోకి తీసుకుంటారు. అయినా పోటీ అనివార్యమైతే పుట్టిన తేదీ ప్రకారం వయసులో పెద్ద వారిని ఎంపిక చేస్తారు. నూజివీడు, ఇడుపులపాయ, ట్రిపుల్ ఐటీ సంస్థల్లో వెయ్యేసి చొప్పున సీట్లు ఉన్నాయి. వాటి ఆధారంగా వికలాంగులకు మూడు శాతం, సైనిక విభాగంలో రెండు శాతం, ఎన్సీసీ విభాగంలో ఒక శాతం, క్రీడా కోటాలో 0.5 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారు. మిగిలిన వాటిల్లో ఓపెన్ కేటగిరీ ద్వారా ప్రాంతాల వారీగా సీటిస్తారు. రుసుము చెల్లింపులు ఇలా రాష్ట్ర పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ. 36 వేలు ఫీజు చెల్లించాలి. విద్యార్థులు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైతే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల పిల్లలు, రీయింబర్స్‌మెంట్‌కు అర్హత లేని విద్యార్థులు తప్పనిసరిగా రుసుము చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. వెయ్యి, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ. 500 చెల్లించాలి. డిపాజిట్ కింద రూ. 2 వేలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. వసతి సౌకర్యం ట్రిపుల్ ఐటీలో చేరిన విద్యార్థులకు వసతి, భోజన సదుపాయం, పుస్తకాలు, లాప్‌ట్యాప్, రెండు జతల యూనిఫాం, బూట్లు ఇస్తారు. ప్రభుత్వ రాయితీలను అనుసరించి ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. -
‘లెక్క’ తప్పింది!
మ్యాథ్స్‌లో అత్యధికంగా 51,121 మంది ఫెయిల్ సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో గణితం సబ్జెక్టు ఈసారి కూడా విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. గ తేడాదిలాగే ఈసారి గణితంలోనే అధిక సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మ్యాథ్స్ తర్వాత సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. గణితంలో 51,121 మంది ఫెయిల్ కాగా.. సైన్స్‌లో 23,821 మంది, ఇంగ్లిష్‌లో 9,623 మంది ఫెయిల్ అయ్యారు. అయితే గతేడాదితో పోలిస్తే మాత్రం అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది ప్రథమ భాషలో 95.43 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ద్వితీయ భాషలో 99.31 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్‌లో 97.53 శాతం మంది ఉత్తీర్ణులు కాగా గణితంలో 82.59 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సామాన్య శాస్త్రంలో 89.72 శాతం మంది ఉత్తీర్ణులు కాగా.. సాంఘిక శాస్త్రంలో 97.80 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. -
ఇంగ్లిష్‌లో ఇరగదీశారు!
♦ తెలుగు మీడియం కంటే అధిక ఉత్తీర్ణత ♦ తెలుగులో 81.75%..ఆంగ్ల మాధ్యమంలో 89.30% సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల సరాసరితో పోలిస్తే ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎక్కువగా నమోదైంది. పదో తరగతిలో మొత్తంగా 85.63 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఇంగ్లిష్ మీడియంలో మాత్రం 89.30 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మీడియంలో 81.75 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పెరిగిన ఆంగ్ల మాధ్యమ విద్యార్థులు ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు స్కూళ్లతోపాటు ప్రభుత్వ సక్సెస్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిష్ మీడియం ఉండటమే ఇందుకు కారణం. గతేడాది ఇంగ్లిష్ మీడియంలో 2,56,363 మంది పరీక్షలకు హాజరైతే 2,11,281 మంది (73.32 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈసారి మాత్రం పరీక్షలకు 2,82,682 మంది హాజరు కాగా.. వారిలో 2,52,433 మంది (89.30) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది తెలుగు మీడియం విద్యార్థులు 2,44,448 మంది హాజరు కాగా 1,79,221 మంది (73.32 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక ఉర్దూ మీడియంలో గతేడాది 11,713 మంది హాజరు కాగా 7,034 మంది (60.05 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోల్చితే ఈసారి తెలుగు మీడియంలో విద్యార్థుల సంఖ్య తగ్గినా ఉత్తీర్ణత శాతం పెరిగింది. అదే ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థుల సంఖ్యతోపాటు ఉత్తీర్ణత శాతం కూడా పెరగడం గమనార్హం. -
లక్ష్యం ముందు తలవంచిన విధి
వారు ఏడాదంతా కష్టపడి చదివారు. విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతిలో ఉత్తీర్ణులుగా నిలిచి ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి విధి పరీక్ష పెట్టింది. ఇంట్లో తల్లి శవం ఉండగా.. ఓ కూతురు.. నిన్నటి వరకు తనతో ఆడుకున్న చెల్లెలు విగతజీవిగా పడి ఉండగా ఓ అన్న దుఃఖాన్ని దిగమింగి విధి పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. సోమవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలను రాశారు. మరో చోట చేతులు లేవని దిగులు చెందకుండా పరీక్ష రాస్తే.. తన అనారోగ్యానికి కుంగిపోకుండా సహాయకుడి ద్వారా పరీక్ష రాసి ఆదర్శంగా నిలిచిందో విద్యార్థిని. వరంగల్ జిల్లాలో పరీక్షకు కొద్ది గంటల ముందే తండ్రి మరణించగా, కన్నీరుమున్నీరవుతూ పరీక్ష రాసి వచ్చింది. మరో విద్యార్థినికి తండ్రి మరణించిన విషయం పరీక్షా కేంద్రం వద్దగానీ తెలియలేదు. ఇంట్లో తల్లి శవం.. ఇల్లెందు: తల్లి మృతదేహం ఇంట్లో ఉండగానే ఆ కూతురికి ‘విషమపరీక్ష’ ఎదురైంది. ఓ పక్క తల్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోపక్క ఆమె పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తిరుమలాపురంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన బానోత్ నాగేశ్వరరావు-కౌసల్యల కూతురు రుక్ష్మిణీబాయి ఇల్లెందు బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఎస్టీ(న్యూ) బాలికల హాస్టల్లో ఉంటోంది. రుక్మిణీబారుు తల్లి కౌసల్య ఆదివారం మృతి చెందింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం స్వగ్రామంలో కౌసల్య అంత్యక్రియలకు ఏర్పాటు జరుగుతుండగానే, రుక్మిణీబారుు ఇల్లెందులోని గురుకుల పాఠశాల సెంటర్లో పదోతరగతి పరీక్షకు హాజరైంది. పరీక్ష ముగియగానే వెళ్లి తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది. కాలితో పరీక్ష సదాశివనగర్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రంలో విద్యార్థి భానుప్రసాద్ కాలితో పరీక్ష రాశాడు. ధర్మారావ్‌పేట్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న భానుప్రసాద్‌కు పుట్టినప్పటి నుంచి రెండు చేతులు చచ్చుబడి పోవడంతో కుడి కాలితో రాయడం అలవాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షకు హాజరై కాలితో పరీక్ష రాశాడు. పక్షవాతంతో పరీక్షకు.. కడెం: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలన్న తపన ముందు విధి తలవంచింది. పరీక్షలకు రెండు నెలల ముందు పక్షవాతం బారిన పడిన ఆ విద్యార్థిని మొక్కవోని ధైర్యంతో పరీక్షలకు హాజరైంది. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం చిన్నబెల్లాల్ గ్రామానికి చెందిన మునిగంటి భూలక్ష్మీ, లక్ష్మణ్‌ల కూతురు రజిత మండలంలోని అల్లంపల్లి జీయర్ గురుకులంలో పదో తరగతి చదువుతోంది. రెండు నెలల క్రితం ఒక్కసారిగా ఆమె పక్షవాతం బారిన పడింది. ఎడమ చేరుు, ఎడమ కాలు పని చేయడం లేదు. అప్పటి నుంచి కుటుంబమంతా విషాదంలో ఉండగా, సోమవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షకు రజిత తల్లి సహాయం తో హాజరైంది. కడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో పరీ క్షకు హాజరైంది. అధికారుల అనుమతితో సహాయకుడితో పరీక్ష రాసింది. పరీక్షకు కొద్ది గంటల ముందే.. వరంగల్: వరంగల్ జిల్లా జనగామ మండ లం యశ్వంతాపూర్‌కు చెందిన కట్ట అయోధ్య(40) ఆటో నడుపుతూ భార్య, నలుగురు పిల్లలను పోషించేవాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నాడు. సోమవారం వేకువజామున గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే చనిపోయాడు. అయితే, అయోధ్య రెండో కూతురు శ్వేత రఘునాథపల్లి మండలం నిడిగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పరీక్షకు కొద్ది గంటల మెందే తండ్రి చనిపోవడంతో బోరున విలపించింది. అరుునా తిరిగి ధైర్యం తెచ్చుకుని పరీక్షకు హాజరైంది. అలాగే, వర్ధన్నపేటకు చెందిన గుడికందుల దేవేందర్(39) కూతురు కావ్య స్థానిక అరబిందో పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. దేవేందర్ రెండేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఆదివారం రాత్రి తాను పని చేసే పెట్రోల్ బంక్‌కు వెళ్లి.. సోమవారం వేకువజామున అస్వస్థతకు గురయ్యూడు. 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. సోమవారం ఉదయం మృతి చెందాడు. అరుుతే తండ్రి మరణవార్త కావ్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. తోటి స్నేహితులతో కలసి ఉత్సాహంగా పరీక్ష కేంద్రానికి వచ్చాక.. మరి కొందరు మిత్రుల ద్వారా విషయం తెలిసింది. బోరున విలపించిన కావ్యకు తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పడంతో పరీక్ష రాసింది. సోదరి చనిపోయినా.. ధరూరు: తోడబుట్టిన సోదరి అనారోగ్యంతో బాధపడుతూ చనిపోగా.. ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. మహబూబ్‌నగర్ జిల్లా ధరూర్ మండల కేంద్రానికి చెందిన దరెప్ప, లక్ష్మీలకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. దరెప్ప ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. వీరి రెండవ కుమార్తె బేబీ(12) కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. పెద్దకుమారుడు రాజు పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. సోదరి మృతదేహం ఇంట్లో ఉండగా, రాజు సోమవారం తెలుగు పరీక్ష రాశాడు. తర్వాత సోదరి అంత్యక్రియలకు హాజరయ్యాడు. స్నేహితుడి సహాయంతో.. జహీరాబాద్: స్నేహితుడి సహాయంతో ఓ మరుగుజ్జు పదో తరగతి పరీక్ష రాశాడు. సోమవారం మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల కేంద్రానికి టి.శ్రీకాంత్(మరుగుజ్జు)ను అతని స్నేహితుడు చవాన్ కిషన్ ఎత్తుకుని తీసుకొచ్చాడు. శ్రీకాంత్‌కు రాయడం రానందునా స్నేహితుడి సహాయం తీసుకునేందుకు పరీక్ష కేంద్రం నిర్వాహకులు అనుమతించారు. జహీరాబాద్ మండలం గుడ్‌పల్లికి చెందిన శ్రీకాంత్ సమీపంలోని మొగుడంపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివాడు. -
ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ ఫీజు మినహాయించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఇవ్వాలని, తల్లిదండ్రుల వార్షికాదాయంతో సంబంధం లేకుండా ఈ చర్యలు చే పట్టాలని పీఆర్టీయూ-టీఎస్ పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు జనార్ధన్‌రెడ్డి, రవీందర్, ఏఐటీవో చైర్మన్ మోహన్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వెంకట్‌రెడ్డి కలసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పూర్తిగా పరీక్ష ఫీజు మినహాయిస్తే పాఠశాలల్లో నమోదు పెరుగుతుందన్నారు. -
‘పది’లో మాస్ కాపీయింగ్‌కు చెక్
ఖానాపూర్ : చాలా మంది విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టి ప్రశ్న, జవాబులను బట్టీపట్టి పరీక్ష రాస్తున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికి విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసే విధంగా పదో తరగతి పరీక్ష విధానంలో తొలిసారిగా సీసీఈ (సమగ్ర మూల్యాంకన) విధానం అమలులోకి రానుంది. తద్వారా విద్యార్థులు పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు ఏమాత్రం పాల్పడకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రశ్నపత్రం ఇలా... పదో తరగతి పరీక్షల్లో ఇప్పటివరకు వంద మార్కుల ప్రశ్న పత్రానికి గానూ 30 మార్కులు అబ్జెక్టివ్, మిగతా 70 మార్కులు ప్రశ్నపత్రం ఉండేది. ఇందులో 35 మార్కులు సాధించిన విద్యార్థులు ఉత్తీర్ణత పొందేవారు. కాగా ఈ యేడాది నుంచి ఈ విధానానికి స్వస్తి పలికారు. 100 మార్కులకు గానూ 20మార్కులు ప్రాజెక్టు వర్క్‌కు కేటాయించారు. విద్యార్థుల రికార్డులను పరిశీలించిన పాఠశాల యాజమాన్యం 20మార్కులు వేయాల్సి ఉంటుంది. ఇందులో 20కి ఏడు మార్కులు వస్తే ఉత్తీర్ణత పొందుతారు. ఇక మిగతా 80 మార్కుల కోసం పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణతకు 28 మార్కులు సాధించాల్సి ఉంటుంది. గతంలో ప్రతీ సబ్జెక్టుకు సంబంధించి పాఠం చివరలో ప్రశ్నలుండేవి. ఈ ప్రశ్నలకు సంబంధించి జవాబులు పాఠంలో నుంచే రాసేవారు. దీంతో పాటు క్వశ్చన్బ్యాంకు తదితర వాటిపై ఆధారపడి అందులోని ప్రశ్న, జవాబులను బట్టీ పట్టి పరీక్ష రాసేవారు. దీంతో చాలా చోట్ల పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు ఇవ్వగానే దానికి సంబంధించిన జవాబులు, జిరాక్స్ కాపీలు, పరీక్ష హాల్లోకి వెళ్లి జోరుగా మాస్‌కాపీయింగ్ జరిగేది. ఇక సీసీఈ విధానంతో పాఠ్యాంశం పూర్తి అర్థం చేసుకుంటే గానీ జవాబులు రాయలేని పరిస్థితి నెలకొంది. పలానా ప్రశ్నరావాలనే నిబంధన లేకుండా పాఠ్యాంశంలో ఎక్కడనుంచైనా ప్రశ్న రావచ్చు. దీంతో ప్రతీ పాఠంపై విద్యార్థికి కనీస పరిజ్ఞానం తప్పనిసరిగా మారింది. విద్యార్థుల్లో ఆందోళన.. తొలిసారిగా ‘పది’ పరీక్షల్లో సీసీఈ విధానం ప్రవేశ పెట్టడంతో విద్యార్థుల్లో భయాందోళన నెలకొంది. మండలంలో మొత్తం ఆరు పరీక్ష కేంద్రాలున్నాయి. మండల కేంద్రంలోని బాలురు, బాలికల ఉన్నత పాఠశాలతో పాటు మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల, ధృవ, కృష్ణవేణి టాలెంట్స్కూల్, పెంబీ జెడ్పీ పాఠశాలల్లో కేంద్రాలుండగా వెయ్యి మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్ష ఉంటుంది. గతంలో పరీక్ష కాలం 2.30 గంటలు కాగా సీసీఈ విధానంతో ప్రశ్న పత్రావళిని చదివేందుకు మరో 15 నిమిషాల కాలాన్ని అదనంగా కేటాయించారు. దీంతో పాటు హిందీ పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45వరకు ఉంటుంది. అరగంట ముందే కేంద్రానికి రావాలి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందే రావాలి. ఈ ఏడాది సీసీఈ విధానం ప్రవేశ పెడ్తున్నాం. పాఠ్యాంశంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా జవాబులు రాసుకోవచ్చు. - వై.వెంకటరమణారెడ్డి, ఎంఈవో, ఖానాపూర్ -
నాణ్యత లేని జవాబు పత్రాలు
మంచిర్యాల సిటీ : మార్చి 25 తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత లేని జవాబు పత్రాలు సరఫరా చేసి చేతులు దులుపుకొంది. దీంతో విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాణ్యతలేని జవాబు పత్రాలను ఉపయోగించడం ద్వారా పరీక్ష రాసే సమయంలో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు. విద్యార్థికి నాలుగు పేజీల జవాబు పత్రాలు సరఫరా చేస్తున్నామని చెప్పుకోడానికి గొప్పగా ఉంటుంది. నాలుగు పేజీల్లో కేవలం రెండు పేజీలు మాత్రమే సద్వినియోగం అవుతాయి. దీంతో విద్యార్థితో పాటు ఇన్విజిలేటర్‌కు సైతం ఇబ్బందులు తప్పవు. పరీక్ష రుసుమును రూ.125 వసూలు చేసిన విద్యాశాఖ నాణ్యతతోపాటు, విద్యార్థికి ఇబ్బందులు లేకుండా జవాబు పత్రాలు ఇవ్వడంలో విఫలమైందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నాణ్యత, ఎక్కువ పేజీలు ఉన్న జవాబు పత్రాలను సరఫరా చేసి విద్యార్థుల ఇబ్బందులను దూరం చేయూల్సిన అవసరం ఉంది. కేవలం రెండు పేజీలే... సరఫరా చేసిన నాలుగు పేజీల జవాబు పత్రాల్లో కేవలం మూడు పేజీల్లోనే విద్యార్థులు జవాబులు రాయాల్సి ఉంటుంది. మొదటి పేజీలో పరీక్ష వివరాలు నమోదు చేయనున్న నేపథ్యంలో అధిక శాతం విద్యార్థులు కోడింగ్, డీ కోడింగ్‌ను దృష్టిలో ఉంచుకొని రెండో పేజీలో జవాబులు రాయలేరు. కేవలం రెండు పేజీలను మాత్రమే సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. వంద మార్కుల ప్రశ్న పత్రానికి రెండు పేజీలు సరిపోవు. దీంతో విద్యార్థులు అదన పు పత్రాల కోసం తిప్పలు పడక తప్పదు. అదనపు జవాబు పత్రంలో సైతం నాలుగు పేజీలే ఉంటాయి. అడిగినన్ని జవాబు పత్రాలు ఇచ్చినా ప్రతిభ గల విద్యార్థికి సమయం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్విజిలేటర్‌కు సైతం పని పెరుగుతుంది. నాణ్యత విద్యార్థికి సరఫరా చేసిన జవాబు పత్రం నాణ్యత లేనివి కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగితంపై జవాబులు ఒక వైపు రాసిన తరువాత రెండో వైపు రాయడం వలన చినిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. జవాబు పత్రము చించుట గాని, వేరు చేయుటగాని చేయరాదని జవాబు పత్రం మొదటి పేజీలో విద్యాశాఖ అధికారులు పొందుపరిచారు. రాయడం ద్వారా చినిగిన నేపథ్యంలో అందుకు ఎవరు బాధ్యులు అవుతారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్‌కు... దూర విద్య ద్వారా పది, ఇంటర్ చదివి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు పన్నెండు పేజీలతో ఉన్న నాణ్యమైన బుక్‌లెట్‌ను విద్యాశాఖ అధికారులు సరఫరా చేస్తారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ రెగ్యులర్ విద్యార్థులకు కూడ నాణ్యత కలిగిన 24 పేజీల బుక్‌లెట్‌ను ఇంటర్ బోర్డు అధికారులు సరఫరా చేస్తారు. కానీ రెగ్యులర్ పదో తరగతి విద్యార్థులకు మాత్రం మూడు పేజీల సమాధాన పత్రాలే ఇస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సమయం ఎక్కువ పేజీలు ఉన్న సమాధాన పత్రాలను విద్యార్థికి సరఫరా చేసినట్లరుుతే విద్యార్థులకు సమయం ఆదా అవుతుంది. అదనపు పత్రాల కోసం పలుమార్లు ఇన్విజిలేటరు వద్దకు వెళ్లడం ద్వారా విద్యార్థి ఏకాగ్రత దెబ్బతింటుంది. నష్టం పలు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న అనారోగ్యకరమైన పోటీ వలన కూడా ప్రతిభ గల విద్యార్థులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిభ గల విద్యార్థి రాసిన అదనపు పత్రాల్లోంచి కొన్నింటిని తొలగించినచో ఆ విద్యార్థి నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు సైతం ఉన్నాయి. -
‘పది’ పరీక్షే..
ఒంగోలు వన్‌టౌన్, అద్దంకి: పదో తరగతి పరీక్షల విషయంలో విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. ఉపాధ్యాయులకు సైతం పరీక్ష పత్రాల నమూనాపై స్పష్టత లేదు. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల నమూనా ఎలా ఉంటుందో ఇప్పటి వరకు తెలియకపోవడంతో అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు అందరికీ ఇబ్బందిగా మారింది. కొత్త సిలబస్... ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పదో తరగతికి కొత్త సిలబస్, కొత్త పాఠ్యపుస్తకాలు అమల్లోకి వచ్చాయి. 2015 మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానాన్ని కూడా మార్చారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం తొలుత ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు పరీక్షలు, 20 మార్కులు ఇంటర్నల్‌కు కేటాయించారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న 11 పేపర్ల స్థానంలో 9 పేపర్లు ఉంటాయని నిర్ణయించారు. తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులకు ఇప్పటి వరకు రెండేసి పేపర్లుండగా..కొత్త విధానంలో ఒక్కో పేపర్ మాత్రమే ఉంటాయి. కొత్త విధానంలో ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయో నమూనా కూడా ప్రకటించారు. అయితే వివిధ వర్గాల నుంచి వచ్చిన విన తుల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ప్రస్తుత విద్యా సంవత్సరానికి పాత పద్ధతిలోనే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈమేరకు విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీంతో పాత పద్ధతిలోనే 11 పరీక్షలు జరుగుతాయి. కొత్త సీసాలో..పాత సారా: పదో తరగతి పరీక్షల వ్యవహారం కొత్తసీసాలో పాతసారా చందంగా ఉంది. కొత్త సిలబస్, కొత్త పాఠ్యపుస్తకాలు..పాత పద్ధతిలో పరీక్షలు ఇదీ..ప్రస్తుత పరిస్థితి. కొత్త సిలబస్‌లోని పాఠ్యాంశాలన్నీ సీసీఈ పరీక్ష విధానానికి అనుగుణంగా రూపొందించారు. పాత బట్టీ విధానానికి స్వస్తి చెబుతూ విద్యార్థులు సొంతంగా ఆలోచించి సమాధానాలు రాసేలా పాఠ్యాంశాలున్నాయి. ప్రాజెక్టు పని, ఇతరత్రా అన్నీ కొత్త విధానానికి అనుగుణంగా ఇచ్చారు. కొత్త ప్రశ్నపత్రాలకు అనుగుణంగా మొత్తం సిలబస్ ఉంది. అయితే అందుకు భిన్నంగా పాత పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తామనడంతో అసలు ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయో తెలియక ఉపాధ్యాయులు, విద్యార్థులు తికమకపడుతున్నారు. పాత సిలబస్‌లో భాషా సబ్జెక్టుల్లో (తెలుగు, హిందీ, ఇంగ్లిష్) పేపర్-1, పేపర్-2లకు వేర్వేరు సిలబస్లిచ్చి స్పష్టత ఉండేది. పాత సిలబస్‌లో పాఠ్యపుస్తకంతో పాటు సప్లిమెంటరీ రీడర్లు కూడా ఉండేవి. ప్రస్తుతం సప్లిమెంటరీ రీడర్లు లేవు. దీంతో ఏఏ అంశాలు పేపర్-1లో వస్తాయో..ఏఏ అంశాలు పేపర్-2లో వస్తాయో స్పష్టత లేదు. సబ్జెక్టులు కూడా రెండు పేపర్లు, పేపర్లకు ఏ సిలబస్‌లో ప్రశ్నలిస్తారో స్పష్టత లేదు. దీంతో అందరిలో ప్రశ్నపత్రాల విధానంపై స్పష్టత లేకుండా పోయింది. కొత్త సిలబస్‌ను పాత పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తామంటే ఏ పేపర్‌కు ఏ సిలబస్, ప్రశ్నలు ఏవిధంగా ఉంటాయో వెంటనే స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్సీఈఆర్టీ పాఠశాల విద్యాశాఖలో సమన్వయంతో వ్యవహరించి వెంటనే ప్రశ్నపత్రాల నమూనాలు ప్రకటించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు. -
తీరని ‘టెన్’షన్
పదో తరగతి పరీక్షలపై స్పష్టతలేని సర్కారు చోడవరం రూరల్: ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులతో చెలగాటమాడుతోందనే చెప్పాలి. ఈ ఏడాది సిలబస్ మార్చారు. సీబీఎస్ఈ తరహాలో పాఠ్య పుస్తకాలు సరఫరా చేశారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ నూతన విధానం అమల్లోకి వచ్చింది. సీసీఈ (నిరంతర సమగ్ర మూల్యాంకనం) పద్ధతి అంటూ పుస్తకాలలో సమాచారం ఇచ్చారు. విద్యార్థులు సాధించాల్సిన ప్రమాణాలను కూడా ఆయా సబ్జెక్టుల వారీగా పుస్తకాలలోనే పొందుపరిచారు. ఉపాధ్యాయులకు సీసీఈపై అవగాహన కల్పించే తరగతులు కూడా నిర్వహించారు. గడచిన రెండేళ్లలో 6, 7 తరగతులకు ఒకసారి, 8, 9 తరగతులకు గత ఏడాది నూతన్ సిలబస్ రూపొందించారు. ఈ ఏడాది 10వ తరగతి సిలబస్ మార్చారు. రెండేళ్ల నాటి ఎల్ఈపీ స్థానంలో సీసీఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. బట్టీ చదువులు కాకుండా విద్యార్థుల్లో స్వీయ రచన, ఆలోచన, బహిరంగ పర్చడం, చర్చించడం, ప్రాజెక్టు పని వంటి ప్రామాణిక అంశాల్లో నైపుణ్యం వచ్చేలా పుస్తకాలలో అంశాలు పొందుపరిచారు. ఈ పద్ధతిలోనే వార్షిక పరీక్షలు జరుగుతాయని గతంలో ప్రకటించారు. దీనికి అనుగుణంగా రెండు నెలలుగా ఈ విధానంలోనే బోధన, విద్యార్థులకు ప్రాజెక్టు పనులు పాఠశాలలో చేయిస్తున్నారు. సిలబస్ కూడా పాత పరీక్ష విధానంతో ఏ మాత్రం పోలిక లేదు. ఈ పరిస్థితుల్లో పాత విధానంలోనే పరీక్షలన్న వార్తలు తల్లిదండ్రులు, విద్యార్థల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఏమి చదవాలో, ఏ విధంగా చదవాలో అర్థంకాని సందిగ్ధ పరిస్థితి విద్యార్థుల్లో నెలకొంది. ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్న అంశమే. వాస్తవానికి పాతపద్ధతిలో పరీక్షలు నిర్వహించడమంటే గతంలో మాదిరి 11 పేపర్లు నిర్వహించడంతోబాటు, పాత నమూనాలోనే 100 మార్కులకు పేపర్ ఉండాలి. ఇలాగే ఉంటుందా లేక నూతన సిలబస్ ఆధారంగా నమూనా మారుతుందా అన్న విషయం స్పష్టం కాలేదు. ప్రస్తుత సిలబస్ పాత నమూనాకు అనుగుణంగా లేదు. నూతన సిలబస్‌లో ప్రశ్నలకు విద్యార్థి ఆలోచనలకు తగ్గట్టుగా సమాధానాలు రాసే విధంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఏ పద్ధతిలో పరీక్షలు సిద్ధం కావాలన్నదే పెద్ద పరీక్షగా మారింది. ప్రభుత్వం ఇకనైనా పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో స్పష్టంగా ప్రకటన చేయడం, నమూనా పరీక్ష పేపర్ విడుదల చేయడం ద్వారా విద్యార్థుల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలి. పాతపద్ధతిలోనే పరీక్షలు పదో తరగతి పరీక్షలు పాత పద్ధతిలో 11 పేపర్లు ఉంటాయి. పాత విధానాన్ని ఈ విద్యా సంవత్సరానికి కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మోడల్ పేపర్ విషయంలో నెట్ ద్వారా ఉపాధ్యాయుల నుంచి సూచనలు నేరుగా ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ సమాచారం ఉపాధ్యాయులకు అందించడం జరిగింది. పేపర్ విధానం ఎలా ఉంటుందన్నది ప్రభుత్వమే విడుదల చేయాల్సి ఉంది. - కృష్ణారెడ్డి, డీఈఓ -
‘పది’ ఇంటర్నల్స్‌ను ఇక పరిగణించరు!
టెన్త్ ఇంటర్నల్స్‌లో 7 మార్కులు వస్తేనే పాస్ అన్న నిబంధన తొలగింపు వాటి మార్కులను పరిగణనలోకి తీసుకోకూడదని సర్కారు నిర్ణయం 80 మార్కుల్లో 35 శాతం వస్తే ఉత్తీర్ణత పొందినట్టే మారనున్న గ్రేడింగ్ విధానం.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక హైదరాబాద్: సంస్కరణల్లో భాగంగా పదో తరగతి పరీక్షల్లో పలు మార్పులకు సర్కారు శ్రీకారం చుట్టింది. ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్స్‌కు ఇచ్చే 20 మార్కులను సదరు విద్యార్థి పాస్/ఫెయిల్‌లో పరిగణనలోకి తీసుకోకూడదని నిర్ణయానికి వచ్చింది. 80 మార్కులకు నిర్వహించే పబ్లిక్ పరీక్షలో కనీసం 28 మార్కులతోపాటు (35%) ఇంటర్నల్స్లోనూ కనీసంగా 7 మార్కులు వస్తేనే ఆ సబ్జెక్టులో విద్యార్థి ఉత్తీర్ణత సాధించినట్టుగా పరిగణించాలనే నిబంధనను తొలగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇంటర్నల్స్‌కు ఇచ్చే మార్కులను పరిగణనలోకి తీసుకుంటే విద్యార్థులను టీచర్లు బెదిరించే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రెండు చొప్పున పేపర్లు ఉండే సైన్స్, మ్యాథ్స్, సోషల్ సబ్జెక్టుల్లో వేర్వేరుగా కాకుండా రెండు పేపర్లలో కలిపి 35 శాతం మార్కులు వస్తే చాలు. 40 మార్కులకు నిర్వహించే ఒక్కో పేపరులోనూ 35 శాతం చొప్పున మార్కులు వస్తేనే పాస్ అనే నిబంధనను కూడా తొలగించనుంది. ఒక్క పేపరు మాత్రమే ఉండే తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో మాత్రం 80 మార్కులకు గాను 28 మార్కులు (35%) మార్కులు వస్తే పాస్ అన్న పాత నిబంధననే కొనసాగించాలని నిర్ణయించింది. పాఠశాల విద్యా డెరైక్టరేట్లో బుధవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. పదో తరగతి పరీక్షల సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం గత మే నెలలో జారీ చేసిన ఉత్తర్వుల్లో చేయాల్సిన సవరణలపై చర్చించారు. పరీక్షల్లో తీసుకురావాల్సిన సవరణలపై ఈనెల 18న పాఠశాల విద్యా డెరైక్టర్‌కు ప్రతిపాదనలు అందజేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదం కోసం పంపించనున్నారు. ఇందుకు అనుగుణంగా గ్రేడింగ్ విధానాన్ని కూడా మార్పు చేయాలని ప్రతిపాదించనున్నారు. ఎస్ఎస్సీ కాంపోజిట్ కోర్సులో అరబిక్, పర్షియన్ వంటి ఇతర భాషలను ఆంగ్ల మీడియం విద్యార్థులు ఎంచుకుంటున్నారు. ఇది త్రిభాషా సిద్ధాంతానికి వ్యతిరేకమవుతోంది. నాలుగో భాషను అనుమతించాలా.. లేదా? అనే అంశంపై చర్చించినా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ఇతర రాష్ట్రాలవారు ద్వితీయ భాషగా స్పెషల్ ఇంగ్లిష్‌ను (11ఈ) ఎంచుకోవడాన్ని తొలగించనున్నారు. ఇప్పటివరకు హిందీలో కనీసం 20 మార్కులు వస్తే పాస్ అనే నిబంధన ఉంది. సంస్కరణల నేపథ్యంలో హిందీలోనూ 28 మార్కులు రావాల్సిందే. కాగా, విద్యార్థి పాస్/ఫెయిల్ నిర్ధారణలో ఇంటర్నల్స్ మార్కులను పరిగణనలోకి తీసుకోకపోయినా పాఠశాలల్లో ఏడాదికి నాలుగుసార్లు ఇంటర్నల్స్ నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలను జారీ చేయనుంది. -
ముందు 77... తరువాత 98...
గొల్లప్రోలు : పరీక్షాపత్రాల వేల్యుయేషన్‌లో చేసిన పొరపాట్లు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. గొల్లప్రోలు మాధురి విద్యాలయానికి చెందిన తోట ధనలక్ష్మి లిఖిత గతేడాది(ఎప్పుడు) పదో తరగతి పరీక్షల్లో గణితం మినహా తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల్లో పదికి పది పాయింట్లు సాధించింది. ఎప్పుడూ స్కూల్ ఫస్ట్ రావడంతో పాటు సాధారణ పరీక్షల్లో మ్యాథ్స్‌లో వందకు వంద మార్కులు(గ్రేడ్-ఏ1) వచ్చేవి. పబ్లిక్ పరీక్షలో మ్యాథ్స్‌లో 77 మార్కులతో ఎనిమిది పాయింట్లు (గ్రేడ్‌బీ-1) వచ్చాయి. దీంతో విద్యార్థిని తండ్రి వీరవెంకటసత్యనారాయణ, స్కూల్ యాజమాన్యం ఎస్ఎస్సీ ఎక్జామ్ బోర్డుకు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేశారు. దీంట్లో 98 మార్కులతో ఏ-1గ్రేడ్‌తో పది పాయింట్లు సాధించినట్లు అడిషనల్ జాయింట్ సెక్రటరీ మెమోరాండం జారీ చేశారు. దీంతో విద్యార్థిని లిఖిత అన్ని సబ్జెక్టుల్లోనూ పదికి పది పాయింట్లు సాధించినట్టు మాధురి విద్యాలయ కరస్పాండెంట్ కడారి తమ్మయ్యనాయుడు తెలిపారు. విద్యార్థినిని ప్రిన్సిపల్ లూకోస్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
నేడు పది ఫలితాలు
సాక్షి, చెన్నై: పదో తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఈ మేరకు పరీక్షల విభాగం సర్వం సిద్ధం చేసింది. మరికొన్ని గంటల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయోనన్న ఉత్కంఠతో విద్యార్థులు ఎదురుచూపుల్లో ఉన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్లస్‌టూ, పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్లస్‌టూ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇందులో విద్యార్థినులు హవా కొనసాగించారు. ప్లస్‌టూ పరీక్షలు ముగియగానే మార్చి 26 నుంచి ఏప్రిల్ తొమ్మిది వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది సరికొత్త పద్ధతిలో పరీక్షల్ని నిర్వహించారు. విద్యార్థులకు 30 పేజీలతో కూడిన సమాధాన పత్రాన్ని పుస్తక రూపంలో అందజేశారు. అలాగే తొలి పేజీలో విద్యార్థి వివరాలు, ఫొటోలు పొందుపరిచారు. ఈ పరీక్షలకు 11,552 పాఠశాలల నుంచి 10,38,876 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 5,30,462 మంది బాలురు, 5,08,414 మంది బాలికలు ఉన్నారు. అలాగే 74,647 మంది ప్రైవేటుగా పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రంలో పరీక్షలు విజయవంతంగా ముగియడంతో ఏప్రిల్ పదో తేదీ నుంచి మూల్యాంకనం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మూల్యాంకనం ముగియడంతో ఫలితాల వెల్లడికి పరీక్షల విభాగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం పది గంటలకు ఫలితాల్ని పరీక్షల విభాగం డెరైక్టర్ దేవరాజన్ విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలి తాల్ని తెలుసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సబ్జెక్టుల వారీగా మార్కుల్ని తెలుసుకునే అవకాశం కల్పించారు. రీటోటలింగ్కు ఈ నెల 26 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ముందుగానే ప్రకటించారు. రెండు సబ్జెక్టులకు రూ.305, ఒక సబ్జెక్టుకు రూ.205 చొప్పున రీ టోటలింగ్ చార్జి చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లోను రీ టోటలింగ్ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వెబ్ సైట్లు ఫలితాల్ని విద్యార్థులు ఉదయం పది గంటల నుంచి తెలుసుకునే వీలు కల్పిస్తూ ఆయా పాఠశాలల్లో ఏర్పాట్లు చేశారు. అలాగే ఆన్లైన్లో ఫలితాల్ని తెలుసుకునేందుకు పరీక్షల విభాగం కొన్ని వెబ్సైట్లను ప్రకటించింది. www.tnresults.nic.in www.dge1.tn.nic.in www.dge2.tn.nic.in www.dge3.tn.nic.in -
వెనుకబడిన సర్కారీ స్కూళ్లు
- టెన్త్‌లో 79.96 శాతం ఉత్తీర్ణత - తూర్పుగోదావరి ఫస్ట్.. ఆదిలాబాద్ లాస్ట్ సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడ్డాయి. అయితే ప్రభుత్వ ఆధీనంలోని ఏపీ గురుకులాలు మాత్రం ముందంజలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలోనే ప్రైవేటు స్కూళ్లు నిలిచాయి. మొత్తం 10,61,703 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 88.62 శాతం ఉత్తీర్ణత నమోదరు్యంది. 95.41 శాతం ఉత్తీర్ణతతో ఏపీ గురుకులాలు ముందంజలో ఉండగా, 79.96 శాతంతో ప్రభుత్వ పాఠశాలలు చివరి స్థానంలో ఉన్నాయి. 93.04 శాతం ఉత్తీర్ణతతో ప్రైవేటు పాఠశాలలు రెండో స్థానంలో నిలిచారు. ఎయిడెడ్ స్కూళ్లు 83.29 శాతం ఉత్తీర్ణత సాధించగా, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో 85.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 96.26 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలువగా, 58.31 శాతంతో ఆదిలాబాద్ చివరి స్థానంలోకి వెళ్లింది. కడప రెండో స్థానంలో (95.14 శాతం), వరంగల్ మూడో స్థానంలో (94.54 శాతం), మహబూబ్‌నగర్ నాలుగో స్థానంలో (93.77 శాతం), కర్నూలు ఐదో స్థానంలో (93.23 శాతం) నిలిచారు. -
తండ్రి మరణాన్ని తట్టుకుని..
బంగారుపాళెం, న్యూస్‌లైన్: కన్నతండ్రి మరణంతో తల్ల డిల్లి పోయిందా బాలిక. అయినా బాధను తట్టుకుని పదోతరగతి పరీ క్షకు హాజరైంది. రాగిమానుపెంట గ్రామానికి చెందిన ప్రియ స్థానిక జె డ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. శుక్రవారం ఆమె పదో తరగతి తెలుగు పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంది. ఇంతలోనే పిడు గులాంటి వార్త... తండ్రి శివయ్య విద్యుత్ షాక్‌తో మరణించాడని సమాచారం. కుంగిపోయిన ప్రియ గుండెలవిసేలా విలపించింది. కన్నతండ్రి విద్యుత్ షాక్‌కు గురై చనిపోయిన బాధను దిగమింగి శుక్రవారం జరిగిన పదో తరగతి తెలుగు పేపర్-2 పరీక్షకు హాజరైంది. తండ్రి మరణాన్ని తట్టుకుని పబ్లిక్ పరీక్షకు హాజరై చదువుపై ఇష్టాన్ని చాటింది. విద్యుత్ షాక్‌తో మృతి గురువారం అర్ధరాత్రి మండలంలో ని బోడబండ్ల సీజేఎస్‌ఎఫ్ కాలనీ వద్ద విద్యుత్ షాక్‌తో శివయ్య మర ణించాడు. రాగిమానుపెంట గ్రామానికి చెందిన పురుషోత్తంనాయుడుకు చెందిన బోరు మోటారు రిపేరు చేసే జీపు క్రేన్ బండికి అదే గ్రామానికి చెందిన ఎం.శివయ్య ఆపరేటరుగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి సీజేఎస్‌ఎఫ్ కాలనీలో పంచాయతీ బోరు మోటారు అమర్చేందుకు వెళ్లారు. బోరుబావిలో నుంచి మోటారు బయటకు తీస్తుండగా పక్కనే 11కేవీ విద్యుత్ తీగలకు రోప్ తగిలింది. దీంతో క్రేన్ ఆపరేటరు శివయ్య(40) కరెంటు షాక్‌కు గురై మృతి చెందా డు. పోలీసులు మృతదేహాన్ని బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. మృతుడి భార్య నిర్మల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి చిన్న కుమార్తె ప్రియ. పెద్ద కుమార్తెకు రెండు నెలల్లో పెళ్లి కావాల్సి ఉంది. -
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
సాక్షి, విశాఖపట్నం : పదో తరగతి పరీక్షలు గురువారం నుంచి జరగనున్నాయి. ప్రస్తుత ం ఉన్న సిలబస్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మారనుంది. పాత సిలబస్‌తో విద్యార్థులు రాసే ఆఖరు పరీక్షలు ఇవే. పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే విద్యార్థులు సర్వ సన్నద్ధమయ్యారు. వారికి ఉపాధ్యాయులు ఆల్ ద బెస్ట్ చెప్పి పరీక్షలకు సిద్ధం చేశారు. 264 కేంద్రాల్లో పరీక్షలు గురువారం నుంచి ఏప్రిల్ 15 వరకు జరగనున్న పరీక్షలకు జిల్లా నుంచి 62,265 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకు 264 పరీక్ష కేంద్రాల్లో జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. విశాఖ అర్బన్(గాజువాక, భీమిలి కలిపి)లో 142 కేంద్రాలు, గ్రామీణ జిల్లాలో 81, ఏజెన్సీలో 42 పరీక్షా కేంద్రాలున్నాయి. 13 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 28 సమస్యాత్మక కేంద్రాల్లో 28 సిట్టింగ్ స్క్వాడ్లును ఏర్పాటు చేశారు. 264 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అంతే సంఖ్యలో డిపార్ట్మెంటల్ అధికారుల్ని నియమించారు. సుమారు 3 వేల మంది ఇన్విజిలేటర్లను ఎంపిక చేశారు. గాజువాక ప్రాంతంలో 50 మంది ఇన్విజిలేటర్ల కొరత ఉండడంతో అనకాపల్లి నుంచి వీరిని సర్దుబాటు చేశారు. 28 మంది రూట్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయానికంటే గంట ముందుగానే హాజరు కావాల్సిందిగా జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి విద్యార్థులకు సూచించారు. బార్ కోడింగ్‌లో ప్రధాన అంశాలు పరీక్ష ప్రారంభానికి ముందు ప్రధాన (మెయిన్) జవాబు పత్రానికి ఒక బార్కోడ్ కలిగిన ఒఎంఆర్ షీట్‌ను ప్రతి విద్యార్థికి ఇస్తారు. మెయిన్ షీట్‌ను పదహారు పేజీల ఖాళీ జవాబు పత్రం ఉంటుంది. ఇది కాకుండా ఇచ్చే అదనపు పత్రానికి నాలుగు పేజీలు ఉంటాయి. (అదనపు జవాబు పత్రాన్ని విద్యార్థి అవసరార్ధం తీసుకోవాలి) ఓఎంఆర్ పత్రం మూడు విభాగాలుగా ఉంటుంది. పార్ట్-1లో విద్యార్థి పేరు, రోల్ నెంబర్, పేపర్ కోడ్, పేపర్ పేరు, పరీక్షాకేంద్రం పేరు, కోడ్, మీడియం, పరీక్ష తేదీ ఉంటుంది. ఇవన్నీ తనవో? కాదో? వివరాలు సరిగా ఉన్నాయో? లేదో? విద్యార్థి సరిచూసుకోవాలి. పార్ట్-1లో ప్రధాన సమాధానపత్రం(మెయిన్ బుక్లెట్) సీరియల్ నెంబర్, అదనపు పత్రాల సంఖ్య, రూమ్ నెంబర్‌తోపాటు, కుడివైపున ఇన్విజిలేటర్లు, విద్యార్థి పూర్తి సంతకం చేసేందుకు వీలుగా ఖాళీ గడులుంటాయి. గడిని దాటకుండా సంతకం చేయాలి. పై వివరాలు సరిగా లే కపోయినా, తప్పులతో ఉన్నా వారి కోసం ‘నాన్ స్టాండర్డ్/బ్లాంక్ బార్ కోడ్ ఓఎంఆర్ షీట్’ కేటాయిస్తారు. వీరు పూర్తి వివరాలను ఇందులో స్వదస్తూరీతో రాయాల్సి ఉంటుంది. పార్ట్-2లో ప్రధాన సమాధానపత్రం బుక్లెట్ నంబర్, అదనపు సమాధాన పత్రాల సంఖ్య మాత్రమే విద్యార్థులు వేయాలి. పార్ట్-3లో విద్యార్థి రాయడానికి ఏమీ ఉండదు. కోడింగ్ విధానంలో నాలుగు పేజీల జవాబు పత్రాలు ఇస్తారు. అందులో సబ్జెక్టు, పేపర్ పేరు, తీసుకున్న అదనపు సమాధాన పత్రాల సంఖ్య, ఇన్విజిలేటర్ సంతకం చేయాడానికి స్థలం కేటాయిస్తారు. జవాబు పత్రం ఎడమవైపు అదనపు పత్రాలు, గ్రాఫ్, మ్యాపు, పార్ట్-బి(బిట్‌పేపర్)ను టై్వన్ దారంతో కట్టేందుకు వీలుగా రంధ్రం ఉంటుంది. ఓఎంఆర్‌ను ప్రధాన సమాధాన పత్రంపై సూచించిన రెండు చోట్ల పిన్చేసి, పేపర్ సీళ్ల(ఉపాధ్యాయులు అందించిన)ను అతికించాలి. ఓఎంఆర్‌ను ప్రధాన సమాధాన పత్రానికి జతచేయడానికి పైనున్న రంధ్రాలకు దిగువన, ఓఎంఆర్ షీట్ అంచులు, ప్రత్యేకంగా పార్ట్-3 చివరి అంచులు ప్రధాన సమాధాన పత్రాన్ని దాటకుండా పిన్చేయాలి. పార్ట్-3 అంచు కనీసం నాలుగు నుంచి ఐదు మిల్లీ మీటర్లపైన ఉండేలా పిన్చేయాలి. ప్రధాన సమాధానపత్రం, అదనపు సమాధాన పత్రాలు, గ్రాఫ్, మ్యాప్, బిట్పేపర్పై ఎక్కడా రోల్ నెంబర్ వేయరాదు. అలా వేస్తే మాల్ ప్రాక్టీస్‌గా పరిగణించి సమాధాన పత్రాన్ని మూల్యాంకనం(దిద్దడం) చేయరు. సబ్జెక్టు పేరు, పేపర్ నంబర్‌ను ప్రధాన సమాధాన పత్రంలో సూచించిన గడుల్లోనే రాయాలి. ప్రధాన సమాధాన పత్రంపై ఉండే నంబర్(క్రమ సంఖ్య)ను ఓఎంఆర్ పత్రంలోని పార్ట్-1, పార్ట్-1లో సూచించిన గడుల్లో రాయాలి. నంబర్‌లేని సమాధాన పత్రం చేతికి వస్తే దాన్ని ఇన్విజిలేటర్‌కు తిరిగి ఇచ్చి, క్రమసంఖ్య ఉన్న బుక్‌లెట్‌ను తీసుకోవాలి. సమాధాన పత్రాల్లో బ్లూ, బ్లాక్ ఇంక్ పెన్నుతోనే జవాబులు రాయాలి. ఎరుపు,ఆకుపచ్చ రంగుసిరా పెన్నులను వాడటం నిషేధం. పరీక్ష ముగిశాక తీసుకున్న అదనపు సమాధాన పత్రాల సంఖ్యను ప్రధాన సమాధానపత్రంపైన, ఓఎంఆర్ షీట్‌లోని పార్ట్-1, పార్ట్-2లో పేర్కొన్న గడుల్లో రాయాలి. అనంతరం ఓఎంఆర్ షీట్‌తో సహా ఇన్విజిలేటర్‌కు సమాధాన పత్రాలను ఇవ్వాల్సిన బాధ్యత విద్యార్థులదే. -
నేటినుంచి పదో తరగతి పరీక్షలు
సమయం : ఉ.9.30 - మ.12 వరకు రెగ్యులర్ విద్యార్థులు : 52,500 మంది ప్రైవేటు విద్యార్థులు :7,800 మంది పరీక్ష కేంద్రాలు : 296 ఇబ్బందులుంటే కాల్ చేయండి : 92911 06999 మచిలీపట్నం, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 11వ తేదీతో ముగిసే ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని డీఈవో డి.దేవానందరెడ్డి చెప్పారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి తొమ్మిది గంటల నుంచి అనుమతిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 296 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రెగ్యులర్‌గా 52,500 మంది, ప్రైవేటుగా 7,800 మంది.. మొత్తం 60,300 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు కేంద్రాలను పర్యవేక్షిస్తారు. 3,500 మంది ఇన్విజిలేటర్లు, 14 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 25 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులుంటే తెలుసుకునేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెల్ 24 గంటలపాటు పనిచేస్తుంది. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే 9291106999 నంబరుకు కాల్ చేయాలని డీఈవో కోరారు. ఇప్పటికే వచ్చిన ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు దగ్గరలోని పోలీస్స్టేషన్లకు తరలించామని, రూట్ ఆఫీసర్ల ద్వారా కేంద్రాలకు తీసుకువెళతామని పేర్కొన్నారు. ప్రతి కేంద్రం వద్ద ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. కేంద్రాల్లో విద్యుత్‌కోత లేకుండా ఆ శాఖ అధికారులతో మాట్లాడామన్నారు. ఆర్టీసీ అధికారులతో చర్చించి బస్సులను సకాలంలో నడిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని కేంద్రాల్లో బల్లలు ఏర్పా టు చేశామన్నారు. ఇలా చేయండి... పరీక్షల సమయంలో ఒంటిరిగా కాకుండా మీకు నచ్చిన తోటి విద్యార్థులతో కలిసి చదువుకోండి. బాతాఖానీలు పెట్టకుండా చదివితే అనుమానాలు నివృత్తి అవుతాయి. పరీక్ష బలంగా రాసే ధైర్యం వస్తుంది. బాగా కష్టమైన ప్రశ్నలను ఒకటికి నాలుగుసార్లు చదువుకుని చిత్తుపుస్తకంలో రాసుకోండి. క్షణాల్లో మీకు జవాబు వచ్చేస్తుంది. ఇవి తీసుకెళ్లండి.. నిర్ణీత సమయానికంటే ముందే పరీక్ష కేంద్రానికి వెళ్లాలి. హాల్‌టికెట్ మరవకూడదు. పెన్నులు, పెన్సిళ్లు, స్కేల్, స్కెచ్ పెన్నులు తీసుకెళ్లాలి. -
పది ‘పరీక్ష’
పత్తికొండ అర్బన్, న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షల సమయం సమీపించింది. చదువుకుందామని తెల్లవారుజామున లేస్తే చీకటి స్వాగతం పలుకుతుంది. పది పరీక్షలు ఈనెల 27వతేదీ నుంచి వచ్చేనెల 11వతేదీ వరకు జరగనున్నాయి. పత్తికొండ మండల పరిధిలోని పుచ్చకాయలమాడ నుంచి 30మంది విద్యార్థులు, దేవనబండ 21, హోసూరు 78, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల 170, బాలికోన్నత పాఠశాల 140, గురుకులం బాలుర, బాలికల పాఠశాలల్లో 210మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వారు సుమారు 300 మంది వరకు పది పరీక్ష రాయనున్నారు.ఉపాధ్యాయులు ఎలాగోలా విద్యాసంవత్సరాన్ని పూర్తి చేశారు. పలు పాఠశాలల్లో ఇంకా సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. మరికొన్ని చోట్ల పున శ్చరణ తరగతులు మొక్కుబడిగా ముగిశాయి. విద్యార్థులందరిలోనూ ఒకటే టెన్షన్. పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఏకాగ్రతతో చదువుకోవాలంటే వారిని కరెంటు కోతలు వేధిస్తున్నాయి. దీంతో పరీక్షల ఫలితాలు ఎలా ఉంటాయోన నే భయం విద్యార్థులను తల్లిదండ్రులను పట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రారంభానికి ముందు, ముగింపు తరువాత ఒక్కో గంట ప్రకారం అదనంగా (పునశ్చరణ) తరగతులు నిర్వహించాలని మూడు నెలల క్రితమే నిర్ణయించారు. అయితే అనేక పాఠశాలల్లో ఇవి మొక్కుబడిగానే ముగిశాయి. డిసెంబర్ 31వతేదీ లోపలే సిలబస్ పూర్తి చేసి పునశ్చరణ చేయాల్సి ఉండగా ఇప్పటికీ పలు చోట్ల సిలబస్ పూర్తి కాలేదు. దీంతో విద్యార్థులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని మారుమూల ప్రాంత పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రిపరేషన్ పరీక్ష : కరెంటు కోతల కారణంగా విద్యార్థులకు ప్రిపరేషన్ ‘పరీక్ష’గా మారింది. పగలు రాత్రి తేడా లేకుండా విధిస్తున్న నిరవధిక కోతలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అధికారికంగా ఉదయం 6 గంటల నుంచి 9గంటల వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు పత్తికొండలో కోతలు విధిస్తుండగా పల్లెల్లో 12గంటల వరకు కోతలు అమలవుతున్నాయి. ఇక అనధికారిక కోతలకు లెక్కేలేదు. విద్యార్థులకు పరీక్షలు దగ్గరపడుతుండటంతో రాత్రింబవళ్లు చదువుదామనుకుంటే కరెంటు కోతలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి.