పసుమర్రులో మాట్లాడుతున్న కృష్ణాజిల్లా డీఈవో తాహెరా సుల్తానా
సాక్షి, అమరావతి/మచిలీపట్నం/పసుమర్రు (పామర్రు)/ఏలూరు (ఆర్‌ఆర్ పేట): రాష్ట్రంలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్, మాస్ కాపీయింగ్ తదితర అక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 44 మంది అరెస్ట్ అయ్యారని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి చెప్పారు. వీరిలో 30 మంది ప్రభుత్వ టీచర్లను పాఠశాల విద్యా శాఖ సస్పెండ్ చేసిందని తెలిపారు.
కృష్ణా జిల్లాలో ఏడుగురు..
పామర్రు మండలం పసుమర్రు జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ అందిన సమాచారం మేరకు పోలీసులు, రెవెన్యూ, విద్యా శాఖ అధికారులతో కలిసి కృష్ణా జిల్లా డీఈవో తాహెరా సుల్తానా సోమవారం తనిఖీలు జరిపారు. ఉపాధ్యాయులు సీహెచ్ వెంకయ్యచౌదరి, వై.సురేష్, పి.గంగాధరం, కె.వరప్రసాద్, తిరుమలేష్, శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని డీఈవో తెలిపారు. వీరికి ఏలూరు జిల్లా కనుమోలు టీచర్ బి.రత్నకుమార్ సహకరించినట్లు గుర్తించామన్నారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తాము కూడా సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
మాస్ కాపీయింగ్ ప్రయత్నం భగ్నం..
ఏలూరులోని సత్రంపాడు విద్యా వికాస్ స్కూల్‌లోని పరీక్ష కేంద్రాన్ని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఎల్.శ్రీకాంత్ సోమవారం తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం డిపార్ట్‌మెంటల్ అధికారి రామాంజనేయ వరప్రసాద్ మ్యాథ్స్ ప్రశ్నపత్రానికి సంబంధించిన జవాబులు చెబుతుండగా.. అదనపు ఇన్విజిలేటర్ ప్రదీప్ తెల్ల కాగితం కింద రెండు కార్బన్ పేపర్లు పెట్టి రాస్తుండడాన్ని గుర్తించారు. ఇదంతా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సమక్షంలోనే జరగడాన్ని గమనించి.. వెంటనే వారందరినీ ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డిపార్ట్‌మెంటల్ అధికారిని, అదనపు ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకునేందుకు పాఠశాల విద్యా శాఖకు సిఫార్సు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment