సాక్షి, అమరావతి: జాతీయ నూతన విద్యావిధానం అమల్లో భాగంగా చేపట్టిన ప్రభుత్వ స్కూళ్ల మ్యాపింగ్‌తో ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులకు మేలు జరగనుంది. పాఠశాల విద్యలో ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా మ్యాపింగ్ ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు చేపట్టారు. నూతనంగా ప్రవేశపెడుతున్న ఆరంచెల విద్యా విధానంలో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు ఏ ఒక్కటీ మూతపడకుండా, ఏ ఒక్క టీచర్ పోస్టూ తగ్గకుండా అన్ని వనరులను సమర్థంగా వినియోగించుకొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఫౌండేషన్ విద్యను పటిష్టంగా తీర్చిదిద్దుతోంది.
స్కూళ్ల మ్యాపింగ్ ద్వారా 3వ తరగతి నుంచే విద్యార్థులకు ఉత్తమ బోధన అందేలా సబ్జెక్టు టీచర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇçప్పటికే ఒకే ప్రాంగణం లేదా 200 మీటర్ల దూరంలోని ప్రైమరీ పాఠశాలల్లో 3, 4, 5, తరగతులను హైస్కూళ్లకు అనుసంధానిస్తూ మ్యాపింగ్ పూర్తి చేసింది. ఇలా 2,682 హైస్కూళ్లకు సమీపంలోని ప్రైమరీ, యూపీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతులను అనుసంధానించారు. తదుపరి దశలవారీగా హైస్కూల్‌కు 3 కిలోమీటర్ల లోపు ఉన్న 19,534 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 3 కిలోమీటర్లకు పైబడి దూరం ఉన్న 16,603 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతుల మ్యాపింగ్ చేపడుతోంది. సహజసిద్ధమైన, భౌగోళిక అడ్డంకులు లేని స్కూళ్లను మ్యాపింగ్ చేస్తోంది. విద్యార్థులకు ఎటువంటి సమస్యల్లేకుండా చర్యలు చేపట్టింది. 2023–24 నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
1, 2 తరగతులు యథాతథం
మ్యాపింగ్ పూర్తై 3, 4, 5 తరగతులు సమీపంలోని హైస్కూల్‌కు మారినా ప్రస్తుతం ఉన్న ప్రైమరీ, ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో 1, 2 తరగతులు అక్కడే కొనసాగుతాయి. వీటికి అంగన్‌వాడీ కేంద్రాలు అనుసంధానమై పీపీ–1, పీపీ–2 విద్య అందుబాటులోకి వస్తుంది. మొదటి దశ కింద ఇప్పటికే 2,835 ప్రైమరీ స్కూళ్లకు అంగన్‌వాడీ కేంద్రాలను అనుసంధానించి ఫౌండేషన్ స్కూళ్లుగా తీర్చిదిద్దారు. ఇక 1,640 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు వివిధ కారణాలతో మ్యాపింగ్‌కు వీలు కాలేదు. ఇవి యధాతథంగా కొనసాగుతాయి. అందువల్ల ఏ ఒక్క పాఠశాలా మూతపడదు. టీచర్ల తొలగింపూ ఉండదు.
అన్ని వనరులతో అత్యుత్తమ బోధన
మ్యాపింగ్ ద్వారా ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అన్ని వనరులు అందుబాటులోకి రావడంతోపాటు అత్యుత్తమ బోధన అందుతుంది. ఇప్పటివరకు అతీగతీ లేనట్లుగా మిగిలిన అంగన్‌వాడీ కేంద్రాలు ఫౌండేషన్ విద్యా కేంద్రాలుగా మారనున్నాయి. ఇవి ప్రైమరీ, ప్రీప్రైమరీ పాఠశాలల్లో కలవడం ద్వారా చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో కూడిన బోధన అందుతుంది. ఫౌండేషన్ స్కూళ్లలో ముగ్గురు అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకులతోపాటు ఇద్దరు ఎస్‌జీటీ టీచర్లను నియమిస్తారు. హైస్కూళ్లలో 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులుంటారు.
విద్యార్థుల సంఖ్యను అనుసరించి 10 నుంచి 15 మంది సబ్జెక్టు టీచర్లు ఉంటారు. ఈ స్కూళ్లకు అనుసంధానమయ్యే ప్రైమరీ, యూపీ స్కూళ్లలోని 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఆట స్థలాలు, క్రీడా పరికరాలు, ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, వర్చువల్ డిజిటల్ తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పెద్ద తరగతుల పిల్లలతో కలిసి ఉండటంవల్ల పై తరగతులకు వెళ్లేకొద్దీ ఆ వాతావరణానికి సులభంగా అలవాటు పడతారు. ప్రస్తుతం ప్రైమరీలో 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు హైస్కూలులో 6వ తరగతిలో చేరే సమయంలో ఒకింత బెరుకుగా ఉంటున్నారు. కొన్నిచోట్ల ఇది డ్రాపౌట్లకు దారితీస్తోంది. అంగన్‌వాడీల నుంచి ప్రైమరీలోకి వచ్చే పిల్లల విషయంలోనూ ఇదే పరిస్థితి తలెత్తుతోంది. మ్యాపింగ్‌తో ఇలాంటి ఇబ్బందులు దూరం కానున్నాయి.
ఆరంచెల విద్యా విధానమిలా..
► అంగన్‌వాడీ కేంద్రాలు (సమీపంలో ఏ స్కూలు లేని) మాత్రమే ఉండే చోట వాటిలో ప్రీ ప్రైమరీ 1 , ప్రీ ప్రైమరీ 2 ( పీపీ 1 , పీపీ 2 )లను ప్రవేశ పెట్టి శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లుగా కొనసాగిస్తారు.
► ప్రైమరీ పాఠశాలలు సమీపంలో ఉంటే అంగన్‌వాడీ కేంద్రాలను అనుసంధానం చేసి పీపీ 1 , పీపీ 2లను 1, 2 తరగతులతో ఫౌండేషన్ స్కూళ్లుగా నిర్వహిస్తారు.
► ప్రైమరీ స్కూళ్లలోని 3 , 4 , 5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్లకు అనుసంధానించే వీలులేని చోట పీపీ 1 , పీపీ 2 లను, 1 నుంచి 5 తరగతులతో ప్రైమరీ స్కూళ్లను ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లుగా నిర్వహిస్తారు
► సమీపంలో అప్పర్ ప్రైమరీ స్కూలు ఉంటే 3 నుంచి 5 తరగతుల పిల్లలను అనుసంధానించి 3 నుంచి 7 లేదా 8 వ తరగతి వరకు ప్రీ హైస్కూళ్లుగా కొనసాగిస్తారు
► ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోని 3 , 4 , 5 తరగతులను సమీపంలోని హైస్కూళ్లకు అనుసంధానించడం ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లుగా నిర్వహిస్తారు.
► 3 నుంచి 10వ తరగతితో పాటు ఇంటర్ (11 , 12 తరగతులు) కలిపి హైస్కూల్ ప్లస్ గా మారుస్తారు.
టీచర్లకు ఎన్నో ప్రయోజనాలు
మ్యాపింగ్ వల్ల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పలు ప్రయోజనాలు కలుగుతాయి. ప్రైమరీ పాఠశాలల్లో పాత విధానంలో 1 నుంచి 6 తరగతుల విద్యార్ధులకు మొత్తం 18 సబ్జెక్టులు బోధించేవారు. ఒకరిద్దరు టీచర్లు మాత్రమే ఉన్న చోట్ల వారిపై విపరీతమైన పనిభారం ఉంది. విద్యార్ధులకు సరైన బోధనకు అవకాశం ఉండేది కాదు. కొత్త విధానంలో ప్రైమరీ స్కూళ్లలోని 1, 2 తరగతుల విద్యార్థులకు ఒకరు లేదా ఇద్దరు ఎస్జీటీలను ప్రభుత్వం నియమించనుంది.
వీరిపై పనిభారం చాలా తగ్గుతుంది. 3, 4, 5 తరగతుల విద్యార్థులు హైస్కూల్లో చేరడం వల్ల దాదాపు 30 వేల మంది ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభిస్తాయి. మరోపక్క ప్రతి మండలంలో రెండేసి హైస్కూళ్లలో జూనియర్ కాలేజీల ఏర్పా టుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమేరకు రాష్ట్రంలో కొత్తగా 833 జూనియర్ కళాశాలలు ఏర్పాటవుతాయి. తద్వారా పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లకు ఆయా జూనియర్ కాలేజీల్లో లెక్చరర్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ స్థాయి పదోన్నతులు రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment