Andhra Pradesh Govt Created Record in Distribution of Books Students - Sakshi
Sakshi News home page

AP: 45 వేల పాఠశాలలు.. 1.06 కోట్ల పుస్తకాలు

Published Sun, Jul 23 2023 3:49 AM | Last Updated on Sun, Jul 23 2023 10:51 AM

Andhra Pradesh Govt Created Record In distribution of books students - Sakshi

తిరుపతి జిల్లా కమ్మకండ్రిగ జెడ్పీ హైసూ్కల్‌లో రెండో సెమిస్టర్‌ పుస్తకాలతో విద్యార్థులు, టీచర్లు

సాక్షి, అమరావతి: వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యార్థులకు విద్యాకానుక అందించి చరిత్ర సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు రెండో సెమిస్టర్‌కు పుస్త­కాల పంపిణీ విషయంలోనూ రికార్డు నెల­కొల్పింది. నవంబర్‌లో ప్రారంభమయ్యే 2వ సెమి­స్టర్‌ పుస్తకాలను విద్యార్థులకు 2 నెలల ముందే పంపిణీ చేసింది. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో సైతం పుస్తకాల పంపిణీ పూర్తిచేసింది. రాష్ట్రంలోని 45,409 పాఠశాలల్లో ఒకటి నుంచి 9వ తరగతి వరకు 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

వీరికి అవసరమైన 1,06,82,080 రెండో సెమిస్టర్‌ పుస్తకాలను శనివారం అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలా సాగిన పుస్తకాల పంపిణీలో విద్యాశాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని అమలాపురం ఎంపీపీ స్కూల్‌లోను, ఎస్‌.రాయవరం మండలంలోని రేవు పోలవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పుస్తకాలను పంపిణీ చేశారు. 

ముందస్తు ప్రణాళిక విజయవంతం
ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యార్థులకు అవసరమైన అన్ని వసతుల కల్పనలోను లోటు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూలై నాలుగో శనివారాన్ని ‘పుస్తకాల పంపిణీ రోజు’గా పాఠశాల విద్యాశాఖ ముందే ప్రకటించి అందుకు అనుగుణంగా పనులు చేపట్టింది. విద్యార్థులకు పుస్తకాల కొరత ఉండరాదని విద్యా సంవత్సరం ప్రారంభం రోజే అన్ని పుస్తకాలను అందించిన అధికారులు.. నవంబర్‌లో ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్‌కు అవసరమైన 1,06,82,080 పుస్తకాలను జూన్‌ నెలాఖరునాటికే సిద్ధం చేశారు. దీనికోసం పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ నేతృత్వంలో ప్రత్యేక ప్రణాళిక అమలు చేశారు.

పుస్తకాలను మొదట ప్రింటర్స్‌ నుంచి స్టాక్‌ పాయింట్లకు, ఆపై ఈనెల 16వ తేదీ నాటికి మండల కేంద్రాలకు చేరవేశారు. ఉపాధ్యాయులకు ఎలాంటి శ్రమ లేకుండా పౌర సరఫరాల శాఖ సహాయం తీసుకున్నారు. ఈనెల 17వ తేదీ నాటికి ఇంటింటి రేషన్‌ సరుకుల పంపిణీ పూర్తవడంతో 3,400 ఎండీయూ వాహనాల్లో పుస్తకాలను పాఠశాలలకు చేరవేశారు. మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న 1,000 పాఠశాలలకు అమెజాన్‌ కొరియర్‌ సేవలను వినియోగించుకుని పుస్తకాలను పంపిణీ చేశారు. 20వ తేదీనాటికే రాష్ట్రంలోని 45,409 పాఠశాలల్లో రెండో సెమిస్టర్‌ పుస్తకాలను సిద్ధంగా ఉంచి, శనివారం అన్ని పాఠశాలల్లోను ఒకేసారి పంపిణీ చేశారు. 

జగనన్న విద్యాకానుక పంపిణీ సైతం.. 
ఎలాంటి విమర్శలకు తావులేకుండా 2023–24 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న 43,10,165 మంది విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన మొదటిరోజు జగనన్న విద్యా కానుకను అందించి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ప్రణాళికాబద్ధంగా మండలాల్లో స్టాక్‌ పాయింట్లను సిద్ధం చేయడంతో పాటు ప్రత్యేకంగా ఆయా కేంద్రాల్లో క్వాలిటీ వాల్‌ను ఏర్పాటు చేశారు.

ప్రతి విద్యార్థికి బైలింగువల్‌ పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్‌–తెలుగు) నోట్‌ బుక్స్, వర్క్‌ బుక్స్, కుట్టు కూలితో 3 జతల యూనిఫామ్‌ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్‌–తెలుగు డిక్షనరీ, ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు పిక్టోరియల్‌ డిక్షనరీతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్‌ను బడులు తెరిచిన మొదటి రోజే అందజేసింది. ఇదే ప్రణాళికను సెమిస్టర్‌–2 పుస్తకాల పంపిణీలోను విద్యాశాఖ అమలు చేసి విజయం సాధించింది. 

సీఎం ఆదేశాల మేరకు ఒకేరోజు పంపిణీ 
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాల కొరత రాకుండా చూడాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ముందే చెప్పారు. గత ఏడాది నవంబర్‌లో జరిగిన సమావేశంలోనే రెండో సెమిస్టర్‌ పుస్తకాలను సకాలంలో అందించాలని, అదీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు పంపిణీ చేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేశాం. ఈ నవంబర్‌లో ప్రారంభమయ్యే రెండో సెమిస్టర్‌ పుస్తకాలను ముందే ముద్రించి స్కూళ్లకు పంపిణీ చేశాం. ముందస్తు ప్రణాళికతో  పుస్తకాలను అందించడంలో విజయవంతమయ్యాం. 
– ప్రవీణ్‌ ప్రకాశ్, పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి 

నాణ్యత తగ్గకుండా ముద్రణ 
ప్రతి విద్యార్థికి సకాలంలో పుస్తకాలు అందించడంతో పాటు ముద్రణలో నాణ్యత తగ్గకూడదని విద్యాశాఖ సమీక్ష సమావేశాల్లో సీఎం చెప్పేవారు. ఆమేరకు నాణ్యమైన పేపర్‌ను తీసుకున్నాం. మొదటి సెమిస్టర్‌ ముద్రణ జూన్‌ ఒకటో తేదీనాటికే పూర్తిచేశాం. వెంటనే రెండో సెమిస్టర్‌ ముద్రణ చేపట్టాం. సమష్టి కృషితో ఏకకాలంలో కోటికిపైగా పుస్తకాలను పాఠశాల పాయింట్‌ వరకు రవాణా చేశాం. ఉపాధ్యాయులపై ఎలాంటి ఒత్తిడి, ఖర్చు పడకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకుంది. 
– కె.రవీంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ప్రచురణ, ముద్రణ సంచాలకులు 

ప్రభుత్వ ఖర్చుతోనే రవాణా 
మా స్కూలు రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. బైరెడ్డిపల్లిని ఆనుకునే కర్ణాటక రాష్ట్రం ప్రారంభం అవుతుంది. ఇక్కడి ఏపీ మోడల్‌ స్కూల్‌లో ఆరు నుంచి 9వ తరగతి వరకు 340 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇలాంటి ప్రాంతంలో కూడా మొదటి సెమిస్టర్‌ పుస్తకాలను జూన్‌ మొదటి వారంలోనే అందిస్తే.. నవంబర్‌లో ఇవ్వాల్సిన రెండో సెమిస్టర్‌ పుస్తకాలను ఇప్పుడే అందించారు. గతంలో మండల పాయింట్‌ నుంచి పుస్తకాలను సొంత ఖర్చులతో తెచ్చుకోవాల్సి చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మాకు ఎలాంటి శ్రమ లేకుండా ప్రభుత్వమే పాఠశాలలకు పుస్తకాలను తరలించి మాకు భారం లేకుండా చేసింది.  
– టీఎస్‌ అనిత ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్, బైరెడ్డిపల్లి (చిత్తూరు జిల్లా) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement