సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన 2, 3 సెమిస్టర్ల పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. జగనన్న విద్యా కానుక కింద అందిస్తున్న ఈ పుస్తకాల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలతో ఆయన మంగళవారం సర్క్యులర్ విడుదల చేశారు.
2022–23 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక–3 కింద సెమిస్టర్–2, 3కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు అక్టోబర్ 15 నుంచి 31 వరకు పూర్వపు 13 జిల్లాల గోడౌన్‌లకు సరఫరా చేసినట్లు తెలిపారు. జిల్లా బుక్ డిపో మేనేజర్లు మండల పాయింట్లకు వీటిని పంపిణీ చేసేందుకు వీలుగా షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు.
విద్యార్థులకు ప్రతి పుస్తకం చేరేలా...
సెమిస్టర్–1 పాఠ్యపుస్తకాల సరఫరాలో కొన్ని లోపాలు తలెత్తాయి. ఇప్పుడు అటువంటి సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులకు కమిషనర్ సూచించారు. అన్ని జిల్లాల బుక్ డిపోల మేనేజర్లు సెమిస్టర్–2, 3 పాఠ్యపుస్తకాల అన్ని టైటిళ్లను ఒకే షెడ్యూల్‌లో అందించాలి. అన్ని మండలాల విద్యాశాఖాధికారులు సెమిస్టర్–2, 3ల అన్ని పాఠ్యపుస్తకాలను తమ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సరఫరా చేయాలి.
ప్రతి టైటిల్ బుక్ ప్రతి విద్యార్థికి చేరేలా చూసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు అందరూ తమ స్కూలులో ప్రస్తుత నమోదు ప్రకారం మండల పాయింట్ల నుంచి అన్ని పాఠ్యపుస్తకాల శీర్షికలను తీసుకోవాలి. ఏ పాఠశాలలో అయినా ఆంగ్ల మాధ్యమంలో నమోదు పెరిగి, తెలుగు మాధ్యమంలో తగ్గితే మండల విద్యాధికారి ద్విభాషా పాఠ్యపుస్తకాలను ఆంగ్ల మాధ్యమం విద్యార్థుల కోసం సరఫరా చేయాలి.
ఇంకా, మండలాల్లో చేరికలు పెరిగి ఏదైనా కొరత ఏర్పడితే మండల విద్యాధికారి సంబంధిత పత్రాలతో జిల్లా విద్యాధికారికి, జిల్లా బుక్ డిపో మేనేజర్‌కు తెలియజేసి అవసరమైన శీర్షికలను పొందాలి. ఉర్దూ, తమిళం, కన్నడ, ఒడియా మాధ్యమాల పాఠ్యపుస్తకాలు, సంస్కృతం పాఠ్యపుస్తకాలు కూడా ప్రింట్ అయి జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్లకు సరఫరా అయ్యాయి. జిల్లా విద్యాధికారి, జిల్లా బుక్ డిపో మేనేజర్ ఈ పుస్తకాలను అవసరమైన పాఠశాలలకు సరఫరా చేయాలి.
సెమిస్టర్–2, 3ల పాఠ్యపుస్తకాలు మొత్తం నవంబర్ 10వ తేదీలోపు పంపిణీ చేయాలి. ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా బుక్‌డిపో మేనేజర్లు పాఠ్యపుస్తకాల పంపిణీని పర్యవేక్షించాలి. ఏదైనా మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తిస్తే విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని కమిషనర్ స్పష్టం చేశారు.
2, 3 సెమిస్టర్ల పాఠ్యపుస్తకాలు సిద్ధం
Published Wed, Nov 2 2022 4:12 AM | Last Updated on Wed, Nov 2 2022 4:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment