text books
-
బంగ్లాదేశ్ విముక్తిని ప్రకటించింది ముజీబ్ కాదు.. జియా!
ఢాకా: బంగ్లాదేశ్‌లోని యూనుస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఆమె తండ్రి, బంగబంధు ముజిబుర్ రహా్మన్కు ప్రాధాన్యం తగ్గిస్తూ పాఠ్యాంశాలను మార్చాలని నిర్ణయించింది. పాఠ్యాంశాల్లో చారిత్రక ఘటనలను అతిగా చూపడం, కొందరు వ్యక్తులను అనవసరంగా కీర్తించడం వంటి వాటిని పూర్తిగా తొలగించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఒకటి నుంచి పదో తరగతి వరకు కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించనుంది. దీని ప్రకారం.. 1971లో బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రాన్ని ప్రకటించింది బంగబంధుగా పిలిచే షేక్ ముజిబుర్ రహా్మన్ కాదు..జియా ఉర్ రహా్మన్ అని ఉంటుంది. ఆ సమయంలో బంగ్లాదేశ్ మిలటరీ అధికారిగా జియా పనిచేస్తున్నారు. అనంతర కాలంలో బంగ్లా ఆరో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బంగ్లాదేశ్ విముక్తిని ప్రకటించింది ముజీబుర్ రహా్మన్ కాగా, ఆయన ఆదేశాల మేరకు జియా ఉర్ రహా్మన్ ఆ ప్రకటనను చదివారనేది అవామీ లీగ్ మద్దతుదారుల వాదన. అయితే, జియా ఉర్ రహా్మనే స్వయంగా స్వతంత్ర ప్రకటనను తయారు చేసి, ప్రకటించారన్నది బీఎన్పీ వాదన. బీఎన్పీ చీఫ్‌గా మాజీ ప్రధాని ఖలేదా జియా ఉన్నారు. పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా ముజీబ్ కుమార్తె కాగా ఖలేదా జియా కుమార్తె. 👉చదవండి : చిన్మయ్ కృష్ణదాస్‌కు నో బెయిల్ -
TG: ‘ముందు మాట’ వివాదం.. ఇద్దరు అధికారులపై వేటు
సాక్షి, హైదరాబాద్: తెలుగు పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు టెక్ట్స్ బుక్స్‌లో వచ్చిన తప్పులను సీరియస్‌గా తీసుకున్న సర్కార్.. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేశ్‌కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ గురుకుల సొసైటీ రమణ కుమార్‌కి ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు కేటాయించారు.ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు. కాగా, కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నింటినీ వెరిఫికేషన్ చేయగా విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటంతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.పాఠ్యపుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. దీంతో, అలర్ట్ అయిన విద్యాశాఖ విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ముందు మాటను మార్చి విద్యార్థులకు తిరిగి ఇవ్వనున్నారు. -
పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోండి.. తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో, పుస్తకాలన్నీంటినీ సేకరిస్తున్నారు.కాగా, ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో బుధవారం పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు. కాగా, కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నింటినీ వెరిఫికేషన్ చేయగా విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటంతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు.పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. దీంతో, అలర్ట్ అయిన విద్యాశాఖ విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. -
ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇంగ్లీష్ మీడియం బోధనను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) వంటి అధునాతన పద్ధతుల్లో విద్యా బోధన చేస్తోంది. రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు బడి తెరిచిన మొదటి రోజే వారికి అవసరమైన పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు వంటివి అన్ని వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక (జేవీకే) కిట్లను అందిస్తోంది. వచ్చే నెల 12న ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరానికి కూడా ఈ కిట్లు సిద్ధమవుతున్నాయి. పాఠ్య పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. మరోపక్క 1 నుంచి 10 తరగతుల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లోనూ పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు–ఇంగ్లిష్ మీడియంలో వర్క్‌బుక్స్‌తో కలిపి మొత్తం 391 టైటిళ్లను పీడీఎఫ్ రూపంలో పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్లో ఉంచింది. గతేడాది ఆన్లైన్లో ఉంచిన పుస్తకాలను దాదాపు 18 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 1,72,482 పాఠ్యపుస్తకాలు డౌన్లోడ్ అవడం విశేషం. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి విద్యార్థులకు కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కొత్త సిలబస్ పుస్తకాలను కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. త్వరలో ఉర్దూ, తమిళం, ఒడియా, కన్నడ వంటి మైనర్ మీడియం బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను సైతం వెబ్సైట్లో ఉంచనున్నారు. పాఠాలను విద్యార్థులు విశ్లేషణాత్మకంగా అర్ధం చేసుకొని, సామరŠాధ్యలను మెరుగుపరుచుకొనేందుకు ఆన్లైన్ పీడీఎఫ్‌లోని ప్రతి పాఠానికి ఎస్సీఈఆర్టీ ‘క్యూఆర్’ కోడ్‌ను జత చేసింది. ఆ కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేస్తే పుస్తకంలోని పాఠాన్ని ‘దీక్ష’ పోర్టల్‌లో వీడియో రూపంలో చూసే అవకాశం కూడా కల్పించారు. పీడీఎఫ్ పాఠ్య పుస్తకాలను https://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
Fact Check: ‘పచ్చ’ ముసుగుతో ‘కోడ్’కూతలా?
ఉన్నపళంగా చంద్రబాబును గద్దెనెక్కించేయాలనీ... ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేయాలనీ... ప్రజలను తప్పుదారి పట్టించి అధికార పక్షంపై ఏవగింపు కలిగించాలన్నది రామోజీ ఆకాంక్ష. అందుకోసం పదేపదే అబద్దాలను అచ్చేయడం... లేనిపోని అభాండాలకోసం పేజీలకు పేజీలు కేటాయించడం... అడ్డగోలుగా ఆరోపణలతో శునకానందం పొందడం ఈనాడుకు నిత్యకృతమైపోయింది. వాస్తవాలు తెలుసుకోకుండా అత్యుత్సాహంతో నిబంధనల్ని సైతం వారికి అనుకూలంగా మలచుకుంటున్నారు. గతేడాది ఇచ్చిన పాఠ్యపుస్తకాలపై సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రాలున్నాయనీ... ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ‘వీటికెలా ముసుగేస్తారు?’ అంటూ సొంత పైత్యాన్ని వండివార్చింది. సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు ఇవ్వడంలో విఫలమైంది. నోటు పుస్తకాలు అస్సలు ఇవ్వలేకపోయింది. అప్పులు చేసి వారంతా పుస్తకాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. పైగా ‘పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వానిది కాద’ంటూ ఓ కొత్త వాదాన్ని తీసుకొచ్చింది. ‘ప్రైవేటు స్కూళ్లున్నాయి.. అక్కడ వసతులు బాగుంటాయి, మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి’ అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సెలవిచ్చారు. ప్రజలకోసం ప్రభుత్వాలు ఏం చేయాలో తనకే తెలుసన్నట్టు నిత్యం గొంతు చించుకునే రామోజీకి ఆనాడు బాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పిదం కనిపించలేదు. పైగా పూర్తిస్థాయిలో సర్కారు బడుల్లోని పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతూ ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందనీ, పిల్లలకు పుస్తకాలు ఇవ్వలేదని బరితెగించి అబద్ధాలు రాసింది. తీరా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 47 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లను జగన్ చిత్రంతో ఉన్నవి అందించినట్టు ఒప్పుకుంది. ‘కోడ్’ నిబంధనలేంటో తెలుసుకోరా.. బాబు కోసం బరితెగించిన ఎల్లో మీడియా అన్నింటికి ముసుగులు వేస్తున్నారు.. మరి ఈ పుస్తకాల సంగతేంటని ప్రశ్నించింది. ‘ఇవన్నీ ఎన్నికల సంఘం కళ్లకు కనిపించవా అని నిలదీసింది. వాస్తవానికి ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక’’ విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తదితర వాటిపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండరాదని ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అంటే ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఇచ్చేవాటిపై ఉండరాదని. కానీ 2023 జూన్ 12న పాఠశాలలు తెరిచిన మొదటి రోజు ఇచ్చిన జగనన్న విద్యాకానుక బ్యాగ్, నోటు పుస్తకాలకు, గతేడాది డిసెంబర్లో ఇచ్చిన ట్యాబ్స్‌పై ఉన్న సీఎం జగన్ స్టిక్కర్లకు ఈ నిబంధన వర్తించదని తెలిసినా... పాపం బాబుకు ఎలాగైనా మేలు చేయాలని... వారి మెప్పుపొందాలనీ... అబద్దపు వార్తను రామోజీ నేతృత్వంలోని ఈనాడు పతాక శీర్షిక చేసింది. కానీ వారికి తెలియని విషయమేంటంటే... ఎన్నికల సంఘం నియమావళిని నూరుశాతం పాటించాలన్న లక్ష్యంతో మార్చి 16వ తేదీ తర్వాత పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే చిక్కీలపై సీఎం ఫొటో ముద్రించిన ర్యాపర్‌ను తొలగించి విద్యార్థులకు అందించాలని పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇవేమీ పట్టించుకోకుండానే ‘ఈనాడు’ ఉపాధ్యాయులపైనా, విద్యాశాఖ ఉన్నతాధికారులపైనా నిందలు వేస్తూ గాలివార్తను అచ్చేసింది. అసలు నిబంధన ఏంటంటే.. భారత ఎన్నికల సంఘం ప్రచురించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని పేజీ నంబరు 94లోని నిబంధన 5(1)లో ఏముందంటే.. లబ్దిదారుల కార్డులు, విద్యుత్ బిల్లులు, నిర్మాణ స్థలం ఫలకాలువంటి వాటిపై రాజకీయ కార్యకర్తల ఫోటోల ప్రదర్శన అంశంలో.. లబ్దిదారులకు పంపిణీ చేసిన లబ్దిదారుల కార్డులు, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలు సమయంలో ఏర్పాటు చేసే ఫలకాలపై ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ కార్యకర్తల ఫొటోలు, సందేశాలు ఉండకూడదు. మోడల్ ప్రవర్తనా నియమావళి అమలుకు ముందు పంపిణీ చేసిన /ప్రతిష్టించిన లబ్దిదారుల కార్డులు, నిర్మాణ ఫలకాలు వంటి వాటిపై ఫొటోలు ఉన్నా తప్పులేదు. ఈనాడుపై చర్యలు తీసుకోండి ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ కార్యదర్శి అప్పిరెడ్డి ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నడుపుతున్న ఈనాడు దినపత్రిక టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని... దానిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రజలకు అవసరమైన వార్తా కథనాలను ప్రచురించేందుకు బదులు చంద్రబాబు అభిప్రాయాలను ప్రచురిస్తోందని పేర్కొన్నారు. కొన్ని నెలలుగా ఈనాడు ప్రధాన సంచికలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు, ప్రజల్లో దానిపై దురభిప్రాయం కలిగించేలా వక్రీకరించి కథనాలు అచ్చు వేస్తోందన్నారు. అందుకు నిదర్శనంగా మంగళవారం ప్రచురించిన ‘‘వీటికెలా ముసుగేస్తారు?’’ కథనాన్ని ఎన్నికల సంఘానికి అందించారు. ఈ కథనంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించిన బ్యాగులు, పుస్తకాలు, ఆహార పదార్థాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బొమ్మలకు ఎలా కవర్ చేయాలో ఈనాడు తన అభిప్రాయాలను వ్యక్తం చేసిందన్నారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన సూచన ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత లబ్దిదారుల కార్డులు, విద్యుత్ బిల్లులు, నిర్మాణ సైట్ ఫలకాలు వంటి వాటిపైనేతల ఫోటోలు ఉండకూడదని చెప్పారు. కోడ్ అమలుకు ముందు పంపిణీ చేసిన వాటికి ఈ నిబంధన వర్తించదని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పునరుద్ధరణ, పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అన్ని పుస్తకాలు, బ్యాగులు, ఆహార పదార్థాలను ప్రభుత్వమే పంపిణీ చేసిందని వాటిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫొటో ఉందనీ, ఇవన్నీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుకు ముందే అందజేసినవని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఈనాడు పత్రిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరువు తీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ రకమైన వార్తా కథనాల ద్వారా సాధారణ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, భారత ఎన్నికల సంఘం పరువు తీయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఈ తప్పుడు కథనం ప్రచురించిన ఆ దినపత్రిక, దాని ప్రచురణకర్తపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
బడి తెరిచిన మొదటి రోజే పుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులందరికీ పాఠశాలలు తెరిచే నాటికల్లా పాఠ్య పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 1 నుంచి 10వ తరగతి వరకు అందరికీ బైలింగ్యువల్ పుస్తకాల ముద్రణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 42 లక్షల మంది విద్యార్థుల కోసం 4.55 కోట్ల పుస్తకాలను సిద్ధం చేస్తోంది. గతేడాది దాదాపు 27 లక్షల పుస్తకాలు మిగలడంతో మిగిలిన 4.28 కోట్ల పుస్తకాలు ముద్రిస్తున్నారు. ఈసారి పాఠ్యపుస్తకాల ముద్రణ బిడ్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన పితాంబరా ప్రెస్ పొందింది. 25 శాతం ముద్రణను స్థానిక ఎంఎస్ఎంఈలకు అప్పగిస్తారు. గత ఏడాది పుస్తకాల ముద్రణకు అత్యంత నాణ్యమైన 70 జీఎస్ఎం పేపర్‌ను వినియోగించారు. ఈ ఏడాది కూడా ఇదే నాణ్యత ఉండేలా ముద్రణ సంస్థకు నిబంధనలు విధించారు. పదో తరగతి ఫిజిక్స్ పుస్తకాలకు ప్రత్యేకంగా అత్యంత నాణ్యమైన 80 జీఎస్ఎం ఆర్ట్ పేపర్‌ను వినియోగిస్తున్నారు. స్కూళ్లు తెరిచేనాటికే ప్రతి విద్యార్థికీ జగనన్న విద్యా కానుక కింద అందించే కిట్లలో ఇతర వస్తువులతో పాటు అన్ని పుస్తకాలు అందిస్తారు. ఇందుకోసం మే 31 నాటికి మొదటి సెమిస్టర్ పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరతాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అదనపు విద్యార్థులకు కూడా పుస్తకాలను అందించేందుకు 5 శాతం పాఠ్య పుస్తకాలను బఫర్ స్టాక్‌గా ఉంచుతారు. అన్ని మాధ్యమాలకూ ద్విభాషా పుస్తకాలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్, తెలుగు మీడియంతో పాటు ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం, కన్నడ మాధ్యమం స్కూళ్లు కూడా ఉన్నాయి. తెలుగు మాధ్యమం విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ ద్విభాషా పుస్తకాలు ఇస్తారు. ఇతర మీడియం విద్యార్థులకు కూడా ఇంగ్లిష్‌తోపాటు వారు ఎంచుకున్న భాష ఉన్న ద్విభాషా పుస్తకాలు అందిస్తారు. దీంతోపాటు సవర, కొండ, కోయ, సుగాలి వంటి గిరిజన విద్యార్థులకు కూడా ఇదే విధానంలో పుస్తకాలు ముద్రిస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 9 తరగతులు ఇంగ్లిస్ మీడియంలోకి మారాయి. 2024–25 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి వస్తుంది. దీంతో 1 నుంచి 10 వరకు నూరు శాతం ఇంగ్లిష్ మీడియం బోధనలోకి వస్తుంది. విద్యార్థులకు స్థానిక సంస్కృతులు, జాతీయ అంశాలపై అవగాహన ఉండేలా తరగతులను మూడు కేటగిరీలుగా విభజించి సిలబస్ రూపొందించారు. 1 నుంచి 5 తరగతులకు 100 శాతం ఎస్సీఈఆర్టీ సిలబస్ ఉంటుంది. 6, 7 తరగతులకు ఇంగ్లిష్, సైన్సు, లెక్కల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్, తెలుగు, హిందీ, సోషల్ స్టేట్ సిలబస్ ఉంటాయి. 8, 9, 10 తరగతులకు ఫస్ట్, సెకండ్ లాంగ్వేజ్ (తెలుగు, హిందీ) మినహా మిగతా సబ్జెక్టులన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ ఉంటాయి. స్థానిక ముద్రణ సంస్థలకు 25%అవకాశం పాఠ్య పుస్తకాల ముద్రణ బిడ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన పితాంబరా ప్రెస్ దక్కించు కుంది. ఈ సంస్థ 1 నుంచి 5, 7 తరగతుల పుస్తకాలు ముద్రిస్తుంది. పేజీకి రూ.0.33 ధర నిర్ణయించారు. స్థానిక ఎంఎస్ఎంఈలకు కూడా అవకాశం కల్పించడానికి 6, 8, 9, 10 తరగతుల పుస్తకాల ముద్రణ అప్పగిస్తారు. ఈ మేరకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహా్వనించారు. -
నడుస్తున్న చరిత్ర!
పాత చరిత్రను కొత్తగా లిఖించే మరోప్రయత్నం మొదలైంది. పిల్లల పాఠ్యపుస్తకాల్లో ప్రస్తుతం ఉన్న ‘ప్రాచీన చరిత్ర’ స్థానంలో ‘సంప్రదాయ (క్లాసికల్) చరిత్ర’ను ప్రవేశపెట్టనున్నారు. అంటే, ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక అంటూ బ్రిటీషు వారు చేసిన చరిత్ర విభజన ఇక చెరిగిపోనుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) వేసిన ఉన్నత స్థాయి సంఘం చేసిన ఈ సిఫార్సు చర్చ రేపుతోంది. అలాగే, ఇకపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ను తీసుకురావాలని సైతం సదరు కమిటీ సిఫార్సు చేసిందన్న వార్త తేనెతుట్టెను కదిలించింది. భారతదేశపు గతానికి సంబంధించిన కథనాలను ‘సరిచేసేందుకు’ ఈ మార్పులు తీసుకు వస్తున్నామన్నది ఎన్సీఈఆర్టీ కమిటీ మాట. ఇండియా స్థానంలో భారత్ అనే సిఫార్సును అంగీకరించలేదని ఎన్సీఈఆర్టీ వివరణనిచ్చినా, కమిటీ చేసిన ఇతర ప్రతిపాదనలపైనా అనుమానాలు, చర్చోపచర్చలు ఇప్పుడప్పుడే ఆగేలా లేవు. 2020 నాటి జాతీయ విద్యా విధానంలో భాగంగా సాంఘిక శాస్త్రాల్లో మార్పులు చేర్పులు సూచించడం కోసం రిటైర్డ్ చరిత్ర ప్రొఫెసర్ అయిన సీఐ ఐజాక్ సారథ్యంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని 2022లో ఎన్సీఈఆర్టీ నియమించింది. పాఠ్యప్రణాళికలో భాగంగా పిల్లలకు బోధించే అన్ని సబ్జెక్టుల్లోనూ ‘భారతీయ విజ్ఞాన వ్యవస్థ’ (ఐకేఎస్)ను ప్రవేశపెట్టాలని కూడా ఈ కమిటీ సిఫార్సు చేసింది. ‘ప్రాచీన చరిత్ర’ బదులు ‘సంప్రదాయ చరిత్ర’ను పెట్టాలనే ప్రతిపాదనకు తనదైన సమర్థనను వినిపించింది. ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో మన వైఫల్యాలనే పేర్కొన్నారనీ, మొఘలులు, సుల్తానులపై మన విజయాలను చెప్పలేదనీ, కాబట్టి యుద్ధాలలో ‘హిందూ విజయాల’పై దృష్టి పెడుతూ పాఠ్యపుస్తకాలు మార్చాలనీ ఐజాక్ బృందపు వాదన. చరిత్రను చరిత్రగా చెప్పాల్సిందే! అందులో లోటుపాట్లను సవరించడమూ తప్పు కాదు. కానీ, సాక్ష్యాధారాలతో సాగాల్సిన ఆ చరిత్ర రచనను మతప్రాతిపదికనో, మరో ప్రాతిపదికనో మార్చాలనుకోవడమే సమస్య. ‘ఇండియా’ అంటూ ప్రతిపక్ష కూటమి తమకు తాము నామకరణం చేసుకున్న తరువాత నుంచి ఈ ‘ఇండియా’ వర్సెస్ ‘భారత్’ రచ్చ నడుస్తూనే ఉంది. భారత రాజ్యాంగం ‘ఇండియా... దటీజ్ భారత్’ అని పేర్కొన్నప్పటికీ, ప్రభుత్వం కొన్నాళ్ళుగా ఈ ‘భారత’ నామంపై కొత్త ప్రేమ కనబరు స్తోంది. ఆ మధ్య జీ–20 వేళ రాష్ట్రపతి అధికారిక విందు ఆహ్వానంలో సైతం ‘భారత్’ అనే పదాన్నే వాడడం వివాదం రేపింది. అసలు ‘ఇండియా’ అనే పేరే వలసవాద ఆలోచనకు ప్రతీక అన్నది అధికార పక్షం వాదన. ఏడువేల ఏళ్ళ నాటి విష్ణుపురాణం తదితర ప్రాచీన గ్రంథాల్లో ‘భారత్’ అని ఉపయోగించినందున ఆ పేరును వాడాలనేది ఐజాక్ కమిటీ సూచన. అయితే, ఇన్నేళ్ళుగా ‘ఇండియా’, ‘భారత్’లను పరస్పర పర్యాయపదాలుగానే వాడుతున్న దేశంలో ‘ఇండియా’ అని ఉన్నచోటల్లా పాఠ్యపుస్తకాల్లో ‘భారత్’ అని మార్చేయమని సిఫార్సు చేయడమే అర్థరహితం. ప్రభుత్వం తమనేమీ ప్రభావితం చేయలేదని ప్రొఫెసర్ ఐజాక్ అంటున్నారు కానీ, హిందూత్వ భావజాలం వైపు ఆయన మొగ్గు జగమెరిగిన సత్యం. పాలక పక్షపు ప్రాపకం కోసం చేసే ఇలాంటి ప్రతిపాదనలు, సిఫార్సులు గాలిలో నుంచి వాటంతట అవి ఊడిపడతాయని అనుకోలేం. అలా అనుకుంటే అమాయకత్వమే. ఆ మాటకొస్తే, 2018లోనే ప్రాచీన చరిత్రను తిరగరాసేందుకు తోడ్పడే నివేదికను సమర్పించాల్సిందిగా కేఎన్ దీక్షిత్ సారథ్యంలోని కమిటీని కోరారు. దీక్షిత్ సాక్షాత్తూ ఇండియన్ ఆర్కియలాజికల్ సొసైటీకి ఛైర్మన్, భారత పురావస్తు సర్వేక్షణ సంస్థకు మాజీ జాయింట్ డైరెక్టర్ జనరల్. తాజా సిఫార్సులు వచ్చే విద్యా సంవత్సరానికల్లా అమలులోకి రావచ్చట. పిల్లల పాఠ్యపుస్తకాల్లోనే కాక, విద్యావిషయక పరిశోధనలోనూ ఈ కమిటీ సిఫార్సులు చోటుచేసుకుంటాయని 2018లో సంస్కృతీశాఖ మంత్రిగా చేసిన మహేశ్‌శర్మ తదితరులు ఆశాభావంతో ఉన్నారు. అసలింతకీ కొత్తగా చేర్చదలచిన ఈ ‘సంప్రదాయ చరిత్ర’ అంటే ఏమిటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేశాన్ని పాలించిన రాజవంశాలన్నిటికీ పాఠ్యగ్రంథాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఐజాక్ కమిటీ ప్రతిపాదించింది. ఈ సమప్రాతినిధ్యం ప్రాంతాల ప్రాతిపదికన, చరిత్రలో ఆ వంశాల ప్రాధాన్యం ప్రాతిపదికనైతే ఫరవాలేదు. అలా జరుగుతుందా అన్నది ప్రశ్న. సంగీతం, సాహిత్యం, కళలు, వాస్తుశిల్పం, వాణిజ్యం, భక్తి ఉద్యమాల్లో ఎంతో భాగమున్న దక్షిణాది రాజవంశాలను ఎన్సీఈఆర్టీ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంతకాలం ఉత్తర భారత దృక్కోణంలోనే నడుస్తున్న వారి పుస్తకాల్లో దక్షిణ భారత రాజవంశాలకూ తగినంత చోటిస్తారా? అది ఓ బేతాళప్రశ్న. అయితే, దేశంలో నిత్యం జరిగే చారిత్రక, పురావస్తు అధ్యయనాల్లో కొత్తగా బయటపడుతున్న అంశాలను సైతం పాఠ్యప్రణాళికలో చేర్చాలన్న కమిటీ సిఫార్సును తప్పక స్వాగతించాలి. చరిత్ర జడపదార్థం కాదు. దొరికిన సరికొత్త సాక్ష్యాధారాలతో ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చు కోవాలి. సమకాలీన అంశాలనూ చేర్చుకోవాలి. కానీ, కొత్త మార్పుల పేరిట పాలకపక్ష భావజాలా నికి అనుకూలంగానో, అన్నీ పురాణాల్లోనే ఉన్నాయిష అనో చరిత్రను మార్చాలని చూడడమే దుస్స హనీయం. అసలు సిసలు భారత్‌కు తామే ప్రతినిధులమని పిల్లలకు పాఠాలతో ఎక్కించి, రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే అంత కన్నా ఘోరం లేదు. చంద్రయాన్–3, నారీ శక్తి వందన్, కోవిడ్ నిర్వహణ లాంటి అంశాలకూ చోటిచ్చేలా ఎన్సీఈఆర్టీ ప్రణాళికా రచన చేసినట్టు విద్యాశాఖ చెబుతోంది. నిజానికి, పరిశోధన చేసి, పిల్లల వయసుకు తగిన పాఠాలతో ముందుకు రావడం ఎన్సీఈఆర్టీ పని. ఆ బాధ్యత వదిలేసి, అధికార పార్టీ రాజకీయ ఆలోచనలకు తగ్గట్టు, లేదా ఒక పక్షం విజయాలనే కీర్తిస్తున్నట్టు పాఠ్యాంశాలనే మార్చాలనుకుంటే అది సమగ్ర చరిత్ర కాదు. సమర్థనీయం కానే కాదు! -
NCERT: పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్!
ఢిల్లీ: దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి NCERT ప్యానెల్ ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రతిపాదనను అంతటా అమలు చేయాలని కోరుతూ మండలికి సిఫార్సు చేయనుంది. జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, కొత్త సిలబస్, మార్పులు చేర్పులు, 2020 పాలసీకి సవరణలు, ఇతర ప్రణాళికల్ని ఖరారు చేసేందుకు 25 మందితో కూడిన ప్రత్యేక కమిటీ ఒక ఏర్పాటైంది. అయితే.. ఇండియా బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు NCERT ప్యానెల్ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినట్లు ప్యానెల్ చైర్మన్ ఐజాక్ బుధవారం వెల్లడించారు. కొత్త ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ ఉంటుందని స్పష్టం చేశారాయన. చాలాకాలంగా ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. తాజాగా ఏకగ్రీవంగా సభ్యులంతా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారాయన. ఎన్సీఈఆర్టీ తరపున అన్ని పుస్తకాల్లో ఈ మార్పు రాబోతుందని ప్యానెల్ ఆశిస్తున్నట్లు తెలిపారాయన. అలాగే.. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులు.. పురాతన చరిత్ర, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని కూడా ప్యానెల్ సిఫార్సు చేసినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు.. వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. చరిత్రలో ఇప్పటిదాకా మన ఓటముల ప్రస్తావనే ఉంది. కానీ, మొఘలుల మీద, సుల్తానుల మీద మన విజయాల గురించి ప్రస్తావన లేదు అని అంటున్నారాయన. అయితే ఢిల్లీ ఎన్సీఈఆర్టీ ప్రధాన కార్యాలయానికి ఈ ప్రతిపాదన మాత్రమే వెళ్లిందని.. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ఈ దశలో ఈ పరిణామంపై స్పందించడం అవసరమని ఎన్సీఈఆర్టీ అంటోంది. ప్యానెల్ సిఫార్సులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఈఆర్టీ ఛైర్మన్ దినేష్ సక్లానీ స్పష్టంచేశారు. -
బడి బ్యాగు బరువు తగ్గించాలి!
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో చదివే విద్యార్థులపై పుస్తకాల బరువు తగ్గించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమలయ్యేలా చూడాలని పేర్కొంది. పుస్తకాల బరువు, దాని వల్ల ఎదురయ్యే పరిణామాలపై కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో చేసిన అధ్యయనం వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 70శాతం మంది స్కూల్ విద్యార్థులపై పుస్తకాల భారం అధికంగా ఉంటోంది. దీనితో పిల్లల కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతోంది. 22 శాతం మంది విద్యార్థులు వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇంటికి రాగానే నీరసంగా, భుజాలు వంగిపోయి నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. దీర్ఘకాలం పాటు ఈ ప్రభావం ఉంటోందని.. ఈ ఆరోగ్య సమస్యలు విద్యార్థి చదువుపై శ్రద్ధ కోల్పోయేందుకు కారణం అవుతున్నాయని అధ్యయనం నివేదిక స్పష్టం చేసింది. మితిమీరిన పుస్తకాలు, చదువుతో విద్యార్థులు సరిగా నిద్రపోవడం లేదని.. దీనితో తరగతి గదిలో చురుకుగా ఉండటం లేదని పేర్కొంది. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని వివరించింది. ప్రైవేటు స్కూళ్లు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండటం, శక్తికి మించిన బరువుతో పిల్లలు మెట్లు ఎక్కడం వల్ల సమస్య పెరుగుతోందని తెలిపింది. ఈ క్రమంలో బడి బ్యాగుల బరువు విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కచ్చితమైన నిబంధనలు ఉండేలా చూడాలని సూచించింది. ఐదేళ్ల నుంచి అడుగుతున్నా.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో స్కూల్ విద్యార్థులపై పుస్తకాల బరువు సమస్య తీవ్రంగా ఉందని ఈ అంశంపై అధ్యయనం చేసిన యశ్పాల్ కమిటీ గతంలోనే స్పష్టం చేసింది. చిన్నప్పట్నుంచే విద్యార్థులు అధిక బరువు మోయడం వల్ల కండరాలపై ఒత్తిడి పడి, భవిష్యత్‌లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని మరికొన్ని అధ్యయనాలు కూడా తేల్చాయి. ఈక్రమంలో పుస్తకాల బరువు తగ్గించే చర్యలు చేపట్టాలని కేంద్ర విద్యా శాఖ ఐదేళ్ల క్రితమే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ఆ దిశగా కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. పిల్లలు మోసే పుస్తకాల బరువు వారి బరువులో పది శాతానికి మించి ఉండకూడదని పేర్కొంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కొంత కార్యాచరణ చేపట్టాయి. స్కూళ్లలో డిజిటల్ విధానం అమలు చేయాలని నిర్ణయించాయి. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విద్యకు ప్రాధాన్యం, అవకాశాలు పెరిగాయి. విద్యా సంస్థలు దీనిని సది్వనియోగం చేసుకోవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది. హోంవర్క్ సహా కొన్ని రాత పనులను డిజిటల్ విధానంలోకి మార్చడం వల్ల బరువు తగ్గించే వీలుందని పేర్కొంది. ఐదేళ్ల క్రితం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో స్పందించలేదని.. ఇకనైనా ఆ దిశగా అడుగువేయాలని కేంద్ర విద్యాశాఖ తాజాగా అభిప్రాయపడింది. బ్యాగు బరువు ఇలా ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రెండో తరగతి విద్యార్థులకు 1.5 కిలోలు మాత్రమే పుస్తకాల బరువు ఉండాలి. 5 తరగతి వరకూ మూడు కేజీలు, 7వ తరగతి వరకు 4 కేజీలు, 9వ తరగతి వారికి 4.5 కేజీలు, పదో తరగతి వారికి 5 కేజీలకు మించి పుస్తకాల బరువు ఉండకూడదు. తెలంగాణ విద్యాశాఖ క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం.. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల పుస్తకాల బరువు 12 కేజీల వరకు, ఉన్నత పాఠశాల విద్యార్థుల పుస్తకాల బరువు 17 కేజీల వరకు ఉంటున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఐదో తరగతి చదివే విద్యార్థులు ఏకంగా 40 పుస్తకాలను మోయాల్సి వస్తోంది. పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్, వర్క్ïÙట్స్, నోట్‌బుక్స్ ఇలా అనేకం బ్యాగులో కుక్కేస్తున్నారు. వీటికితోడు లంచ్ బాక్స్, నీళ్ల బాటిల్ కూడా కలసి పిల్లలపై భారం పడుతోంది. ప్రైవేటు స్కూళ్లు పుస్తకాల ముద్రణ సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాల కారణంగా ప్రతిదీ కొనాల్సిందేనని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. భారంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి పుస్తకాల బరువు తగ్గించే అంశంపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల చర్చించారు. ఈ అంశంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, కార్యాచరణను రూపొందించేందుకు అధికారులతో ఓ కమిటీ వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులకు పుస్తకాల బరువు అధికంగా ఉంటోందని.. అలాంటి వాటిని కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని ఆలోచనకు వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైందని, అన్ని అంశాలను పరిశీలించి త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని విద్యాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. -
డిప్లొమాలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యార్థులకు అత్యున్నతస్థాయి విద్యనందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. సాంకేతిక విద్యలోనూ సీఎం జగన్ పలు సంస్కరణలు చేపట్టారు. విద్యార్థులు చదువు పూర్తి చేయగానే మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా పాఠ్యాంశాల్లో కూడా మార్పులు చేస్తున్నారు. సాంకేతిక విద్యలో ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు తెచ్చింది. డిప్లొమా స్థాయి నుంచి ఇండస్ట్రీ కనెక్ట్ విధానాన్ని అమలు చేస్తోంది. తాజాగా డిప్లొమాలో తొలిసారిగా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను ముద్రిస్తోంది. ఈ విద్యా సంవత్సరం (2023–24)లో డిప్లొమా మొదటి ఏడాదికి ఆరు బ్రాంచ్‌లలో కొత్త కరిక్యులమ్ ప్రకారం 17 థియరీ, 10 ల్యాబ్ మాన్యువల్స్‌ను ప్రచురిస్తోంది. త్వరలో ఆటోమొబైల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. అదనపు సమాచారం కోసం పాఠ్యపుస్తకాల్లో వెబ్ లింక్‌లు, ఆడియో విజువల్ విద్యా సమాచారానికి అనుగుణంగా డిజిటల్ లింక్‌లు పొందుపరిచారు. విద్యార్థులు డిప్లొమా పరీక్షలతోపాటు బహుళ జాతీయ సంస్థ, పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించేలా మంచి క్వశ్చన్ బ్యాంక్‌లను కూడా రూపొందించడం విశేషం. విద్యార్థులకు అందుబాటు ధరల్లో ఇప్పటివరకు డిప్లొమా కోర్సుల్లో బోధనకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఆమోదించిన పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో పుస్తకాల ఎంపికలో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో విద్యార్థులకు మేలు చేకూర్చేలా సొంతంగా పాఠ్యపుస్తకాలు రూపొందించాలని సాంకేతిక విద్యా శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో సాంకేతిక విద్య, శిక్షణ మండలి తక్కువ ధరకు నాణ్యమైన పాఠ్య పుస్తకాలు, ప్రయోగశాల కరదీపికల ప్రాజెక్టును ప్రారంభించింది. వీటి రూపకల్పనకు ప్రత్యేక అధ్యాపక బృందాన్ని ఎంపిక చేసింది. పాఠ్య పుస్తక ప్రచురణలో 46 మంది రచయితలు, 20 మంది సంపాదకులు సేవలు అందించారు. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం అభ్యాస ఫలితాలకు తగినట్లుగా కంటెంట్‌ను రూపొందించింది. మార్కెట్ ధరలతో పోల్చితే తక్కువ ధరకు పాఠ్య పుస్తకాలను అందించనుంది. గతంలో ఏ పుస్తకం కొనాలన్నా రూ.200–రూ.300 ఖర్చు అయ్యేది. ఇప్పుడు మెరుగైన విషయ పరిజ్ఞానంతో ప్రభుత్వమే రూ.100 లోపు ధరలకు పాఠ్యపుస్తకాలను అందించనుంది. ముద్రిత ధరపై మరో 20 శాతం మేర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ప్రత్యేక రాయితీని కల్పిస్తోంది. కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి కొద్ది రోజుల్లోనే డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే సాధారణ సబ్జెక్టుల పుస్తకాలు, ల్యాబ్ మాన్యువల్లు సిద్ధంగా ఉన్నాయి. సీఎం జగన్ సూచనలతో సాంకేతిక విద్యా శాఖ, శిక్షణ మండలి పాఠ్యపుస్తకాలను ముద్రిస్తోంది. ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. – చదలవాడ నాగరాణి, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ -
ఏపీ: పాఠ్యపుస్తకాల విషయంలో విద్యాశాఖ కొత్త విధానానికి బీజం
సాక్షి, విజయవాడ: పాఠ్య పుస్తకాల విషయంలో ఏపీ విద్యాశాఖ కొత్త విధానానికి బీజం వేసింది. 1 నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్లో పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వెబ్సైట్లో ఫ్రీ డౌన్ లోడ్స్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. వెబ్సైట్ నుంచి ఎవరైనా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించటం నిషేధమని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కేవలం 22 రోజుల వ్యవధిలో విద్యాశాఖ విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో 61 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 72 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి అయ్యింది. చదవండి: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. టాప్-3 జిల్లాలు ఇవే.. ఫలితాలపై రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలని మంత్రి బొత్స తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు, ప్రాక్టికల్స్ మే 6 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయని ఆయన వెల్లడించారు. మే 3 లోపు సప్లిమెంటరీ పరీక్షలకి ఫీజు చెల్లించుకోవాలని, విజయనగరం జిల్లాలో ఫలితాలు తగ్గడంపై సమీక్షిస్తామని మంత్రి అన్నారు. -
కావాల్సింది ‘వర్గ పోరాటాల చరిత్ర’
విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848 లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారం లోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. చిత్రం ఏమిటంటే, ‘ఉభయ’ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమ మీదా, చేతివృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ, చెప్పరు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన కొన్ని పాఠ్యపుస్తకాలలో వున్న చరిత్రకి సంబంధించిన కొన్ని పాఠాల్ని ఇప్పటి బీజేపీ ప్రభుత్వం తీసివెయ్యడం ఆరు నెలల కిందట (2022 జులైలో) జరిగింది. అది ఇప్పుడు ఒక వివాదంగా వుంది. కేంద్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకంగానూ, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకో రకంగానూ చరిత్ర పాఠాల్లో ఈ మార్పులు జరుగుతూ వచ్చాయి! గతంలో, ఎప్పుడు ఎలాంటి మార్పులు చేశారు– అనే వివరాలలోకి వెళ్ళడం ఇక్కడ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు జరుగుతోన్న వివాదాన్నే ప్రధానంగా చూడాలి. సెంట్రల్ సిలబస్‌లో 6వ తరగతి నించీ 12వ తరగతి వరకూ వున్న సోషలూ, చరిత్రా పాఠాలు పిల్లలకి భారంగా తయారయ్యాయి కాబట్టి కొన్ని పాఠాల్ని తీసివెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ప్రభుత్వం అంటే, అధికార పార్టీకి అనుకూలంగా వుండే ప్రొఫెసర్ల కమిటీ అన్నమాట! ‘సిలబస్ హేతుబద్ధీకరణ’ అనే పేరుతో, కొన్ని పాఠాలు తీసేశారు. వాటిలో అతి ప్రధానమైనది, దాదాపు 4 వందల యేళ్ళు పాలించిన మొఘల్ చక్రవర్తుల చరిత్ర. అలాగే, గాంధీ హత్యా, గుజరాత్లో మత కల్లోలాలూ, వగైరా, వగైరా. కాంగ్రెసు ప్రభుత్వం ప్రచురించిన పాఠ్యపుస్తకాలలో మొఘలుల పాలనకు విపరీతమైన ప్రాముఖ్యత ఇచ్చారనీ, ప్రాచీన హిందూ రాజుల చరిత్రకి ప్రాధాన్యత లేదనీ, దక్షిణ భారత దేశాన్నీ, ఈశాన్య భారతాన్నీ ఏలిన రాజుల్ని పట్టించుకోలేదనీ, కాంగ్రెసు మీద బీజేపీ సమర్థకుల విమర్శ. ముస్లిం మైనారిటీలను బుజ్జగించి, వారి ఓట్లను పొందడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, ముస్లిం పాలకులకు అంత ప్రాధాన్యత ఇచ్చిందని కాంగ్రెసు మీద బీజేపీ ఆరోపణ. అయితే, బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న మార్పులు, మత విద్వేషాలను రెచ్చగొట్టి, ఎన్నికల్లో మెజారిటీ హిందూ మతస్తుల ఓట్లను రాబట్టడా నికి చేసిన కుట్ర అని ప్రతిపక్షాల వాదన! విద్యలో, ‘ప్రభుత్వ జోక్యం’ అనేది ఈ నాటిది కాదు. ఎప్పుడో 1848 లోనే, మార్క్స్, ఎంగెల్సు ఈ వాస్తవాన్ని ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో ప్రస్తావించారు. ఆ ప్రభుత్వ జోక్యానికి వుండే పెట్టు బడిదారీ వర్గ స్వభావాన్ని కార్మికవర్గ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చాలని, ఆ ప్రణాళిక ఉద్దేశం. ఆ దృష్టితో చూసినప్పుడు కాంగ్రెస్సూ, బీజేపీ, రెండూ బూర్జువా వర్గ ప్రయోజనాలను కాపా డేవే. అలా కాపాడడం కోసం, అధికార పీఠం ఎక్కడానికి, అవి ఎంచుకునే పద్ధతులు తేడాగా వుంటాయి. ఉదాహరణకి, బీజేపీ ఎందుకు హిందూ మెజారిటీ ఓట్లమీద ఆధారపడుతుందీ అనే విషయం అర్థం చేసుకోవాలంటే, 1906లో ఏర్పడ్డ ‘ముస్లిం లీగ్’ గురించీ, 1915లో ఏర్పడ్డ ‘హిందూ మహాసభ’ గురించీ తెలుసుకోవాలి. అప్పుడు ఆ మతాలకు చెందిన భూస్వాములకూ, పరిశ్రమాధిపతు లకూ, వర్తకులకూ, రాజకీయ నాయకులకూ, అటువంటి వారి ప్రయోజనాల మధ్య వున్న వైరుధ్యాలను పరిశీలించాలి. అదంతా ఇక్కడ వీలుకాదు. సారాంశం ఏమిటంటే, మత సంస్థలు గానీ, మతంతో ముడిపడి వున్న రాజకీయాలు గానీ, నిజంగా మతాలకు సంబంధించిన అంశాలు కావు. ఇప్పుడే కాదు, కొన్ని వందల ఏళ్ళ కిందట మతం పేరుతో జరిగిన యుద్ధాల్లో కూడా, ఎంగెల్సు చెప్పి నట్టు, ‘స్పష్టమైన భౌతిక వర్గ ప్రయోజనాలు వుండినాయి’! ‘ఆ నాటి వర్గపోరాటాలు మత నినాదాల దుస్తులలో వుండి, వేరువేరు వర్గాల ప్రయోజనాలూ, అవసరాలూ, డిమాండ్లూ వంటివి, మతం అనే తెరవెనక మరుగు పడ్డాయ’నే విషయాన్ని ‘జర్మనీలో రైతు యుద్ధం’ అనే పుస్తకం లో ఎంగెల్సు చాలా వివరంగా చెపుతాడు. అది ఈ నాటికీ వాస్తవమే. పైకి, తక్షణంగా, ఒక కారణం (ఉదా: గోద్రా రైలు దహనం, ఆ తర్వాత జరిగిన మత కల్లోలాలు) కనిపించినప్పటికీ, అనేక లింకుల ద్వారా చరిత్రని పరికిస్తే, మనకి పాలకవర్గ ప్రయో జనాలు కనిపిస్తాయి. ‘వర్గ ప్రయోజనం’ అన్నప్పుడు రెండు వేరు వేరు వర్గాలు– అనే కాదు; ఒకే వర్గంలోనే, రెండు వేరు వేరు సెక్షన్ల ప్రయోజనాల మధ్యకూడా వైరుధ్యాలు ఉంటాయి. వర్గాలుగానూ, ఉపవర్గాలుగానూ, చీలివున్న సమాజంలో, పాలక వర్గ ప్రయోజనాలను కాపాడడానికి, ఒకే ఒక్క రాజకీయ పార్టీయే వుండదు. అనేక పార్టీలు వుంటాయి. కులం, మతం, ప్రాంతం– అనే భేదాల్ని ఉపయోగించుకుని అధికారం లోకి రావడానికి ప్రతీ పార్టీ సహజంగానే ప్రయత్నిస్తుంది. అనేక రంగాలలో జరిగే అనేక ప్రయత్నాలలో, పాఠ్య పుస్తకాలలో చేసే ఈ మార్పులు కూడా ఒకటి. ఈ చరిత్ర పుస్తకాలలో రాజుల్నీ, చక్రవర్తుల్నీ, చిత్రించేటప్పుడు, ఒక పక్షం మేధావులు అన్ని మతాల పాలకుల్నీ కొంత ‘సంస్కరణ వాద దృక్పథం’తో చూపుతారు. ఇంకో పక్షం మేధావులు హిందూ పాల కుల్ని మాత్రమే గొప్ప చేస్తూ, ముస్లిం రాజుల్ని దుష్టులుగా చూపు తారు. చిత్రం ఏమిటంటే, ఉభయ పక్షాల వారూ, రాజుల్నీ, చక్రవర్తుల్నీ దోపిడీ వర్గ ప్రతినిధులుగా చూడరు. ఆ రాజులే స్వయంగా దోపిడీ దారులనీ, వాళ్ళు శ్రామిక జనాలనించీ లాగిన కౌలూ, వడ్డీ, లాభాల వంటి శ్రమ దోపిడీ ఆదాయాల మీదే బతికిన వాళ్ళనీ మాత్రం గుర్తించరు. వాళ్ళ వీరత్వం గురించీ, యుద్ధ కళల గురించీ, కళా పోషణల గురించీ, వాళ్ళ పాండిత్య ప్రతిభల గురించీ, మత సామరస్యాల గురించీ, వాళ్ళ దైవభక్తి గురించీ, దానశీలతల గురించీ... ఇలా, ఇలా చిత్రించుకుంటూ పోతారు, ఇరుపక్షాల వారూ కూడా! అంతేగానీ, ఆ రాజులూ, యువరాజులూ, రాణులూ, యువ రాణులూ, ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టేవారు కాదనీ, వాళ్ళది వందలాది సేవక పరివారం మీద ఆధారపడిన పరమ సోమరి జీవితం అనీ మాత్రం, ఎక్కడా ఒక్క ముక్క అయినా రాయరు. ఆ రాజులూ, చక్రవర్తులూ ఆ నాటి కాలాల్లో రైతుల శ్రమమీదా, చేతి వృత్తుల వారి శ్రమ మీదా ఆధారపడి బతికిన పరాన్న జీవులనీ, చెప్పరు (స్కూలు పుస్తకాల్లో కాదు గానీ, చరిత్రకి సంబంధించిన ఇతర రచనల్లో, వర్గాల గురించీ, వర్గ పోరాటాల గురించీ రాసిన మేధావులు కొందరైనా వున్నారు). చరిత్రకి సంబంధించిన పాఠ్యపుస్తకాల వివాదం చూశాక, శ్రామిక వర్గ పక్షం వహించే రచయితలు చెయ్యాల్సింది ఏమిటి? ‘పిల్లల కోసం వర్గపోరాట చరిత్ర పాఠాలు’ రాయడం! ‘పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం’ పేరుతో రాసినట్టు, వర్గ దృక్పధంతో కొన్ని చరిత్ర పాఠాలు రాయాలనివుంది నాకు. బీజేపీ ప్రభుత్వం అంటే భయం లేదుగానీ, నా ‘హెర్నియా’ జబ్బు రాయనిస్తుందో లేదో చూడాలి! వ్యాసకర్త ప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ -
2, 3 సెమిస్టర్ల పాఠ్యపుస్తకాలు సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన 2, 3 సెమిస్టర్ల పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. జగనన్న విద్యా కానుక కింద అందిస్తున్న ఈ పుస్తకాల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్, మార్గదర్శకాలతో ఆయన మంగళవారం సర్క్యులర్ విడుదల చేశారు. 2022–23 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక–3 కింద సెమిస్టర్–2, 3కు సంబంధించిన పాఠ్య పుస్తకాలు అక్టోబర్ 15 నుంచి 31 వరకు పూర్వపు 13 జిల్లాల గోడౌన్లకు సరఫరా చేసినట్లు తెలిపారు. జిల్లా బుక్ డిపో మేనేజర్లు మండల పాయింట్లకు వీటిని పంపిణీ చేసేందుకు వీలుగా షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. విద్యార్థులకు ప్రతి పుస్తకం చేరేలా... సెమిస్టర్–1 పాఠ్యపుస్తకాల సరఫరాలో కొన్ని లోపాలు తలెత్తాయి. ఇప్పుడు అటువంటి సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులకు కమిషనర్ సూచించారు. అన్ని జిల్లాల బుక్ డిపోల మేనేజర్లు సెమిస్టర్–2, 3 పాఠ్యపుస్తకాల అన్ని టైటిళ్లను ఒకే షెడ్యూల్లో అందించాలి. అన్ని మండలాల విద్యాశాఖాధికారులు సెమిస్టర్–2, 3ల అన్ని పాఠ్యపుస్తకాలను తమ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సరఫరా చేయాలి. ప్రతి టైటిల్ బుక్ ప్రతి విద్యార్థికి చేరేలా చూసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు అందరూ తమ స్కూలులో ప్రస్తుత నమోదు ప్రకారం మండల పాయింట్ల నుంచి అన్ని పాఠ్యపుస్తకాల శీర్షికలను తీసుకోవాలి. ఏ పాఠశాలలో అయినా ఆంగ్ల మాధ్యమంలో నమోదు పెరిగి, తెలుగు మాధ్యమంలో తగ్గితే మండల విద్యాధికారి ద్విభాషా పాఠ్యపుస్తకాలను ఆంగ్ల మాధ్యమం విద్యార్థుల కోసం సరఫరా చేయాలి. ఇంకా, మండలాల్లో చేరికలు పెరిగి ఏదైనా కొరత ఏర్పడితే మండల విద్యాధికారి సంబంధిత పత్రాలతో జిల్లా విద్యాధికారికి, జిల్లా బుక్ డిపో మేనేజర్‌కు తెలియజేసి అవసరమైన శీర్షికలను పొందాలి. ఉర్దూ, తమిళం, కన్నడ, ఒడియా మాధ్యమాల పాఠ్యపుస్తకాలు, సంస్కృతం పాఠ్యపుస్తకాలు కూడా ప్రింట్ అయి జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్లకు సరఫరా అయ్యాయి. జిల్లా విద్యాధికారి, జిల్లా బుక్ డిపో మేనేజర్ ఈ పుస్తకాలను అవసరమైన పాఠశాలలకు సరఫరా చేయాలి. సెమిస్టర్–2, 3ల పాఠ్యపుస్తకాలు మొత్తం నవంబర్ 10వ తేదీలోపు పంపిణీ చేయాలి. ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా బుక్‌డిపో మేనేజర్లు పాఠ్యపుస్తకాల పంపిణీని పర్యవేక్షించాలి. ఏదైనా మండల విద్యాధికారి, ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తిస్తే విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. -
హిందీలో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలు
భోపాల్: వైద్య విద్యను హిందీలో అందించే లక్ష్యంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్ మూడు సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను విడుదల చేశారు. ఎంబీబీఎస్ కోర్సును హిందీలో అందిస్తున్న మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అని అన్నారు. ఇది స్వర్ణాక్షరాలతో లిఖింపబడుతుందని అభివర్ణించారు. ఆదివారం భోపాల్ మంత్రి అమిత్ షా ఎంబీబీఎస్‌లోని మెడికల్ బయో కెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియాలజీ సబ్జెక్టుల హిందీ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించారు. సాంకేతిక, వైద్య విద్యను మరో 8 భాషల్లోనూ ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు. ఇంగ్లిష్ తమకు రాదనే ఆత్మనూనతతో విద్యార్థులు బాధపడాల్సిన పనిలేదన్నారు. మాతృభాషల్లోనూ విద్యను కొనసాగించవచ్చని తెలిపారు. ఈ పాఠ్యపుస్తకాలను 97 మంది వైద్యులతో కూడిన బృందం రూపొందించిందని సీఎం చౌహాన్ చెప్పారు. కాగా, ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను హిందీలో తీసుకురావడం వైద్యవిద్యలో సానుకూల పరిణామమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
నిజాం పాలనలో జీవిస్తునే దేశ స్వాతంత్ర్యంకోసం పోరాటం
-
ఈ రాతలకు ‘బుక్’ చేయాల్సిందే!
రెండున్నర దశాబ్దాలుగా ప్రయివేటు స్కూళ్ల పాఠ్య పుస్తకాలను ముద్రించేది ఇద్దరు ముగ్గురు పబ్లిషర్లే. ఇక ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలయితే ఆ పుస్తకాలకు వసూలు చేసే మొత్తానికి ఒక పద్ధతీ పాడూ లేదు. పైపెచ్చు విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగైదు నెలలు గడిచేదాకా పుస్తకాలు అందుబాటులోకి వచ్చేవి కావు. కాకపోతే ఇవేవీ రామోజీరావుకు తప్పుగా అనిపించలేదు. ఎన్నడూ భారీగా వసూలు చేసే ప్రయివేటు పాఠశాలల్ని గానీ, సకాలానికి అందివ్వలేని పబ్లిషర్లను గానీ... వారిని నియంత్రించలేని ప్రభుత్వాన్ని గానీ ప్రశ్నించలేదు. ఈ ఏడాది నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పద్ధతిని మార్చారు. పబ్లిషర్ల కోసం ఓపెన్ టెండర్లు పిలిచారు. ధరలను ప్రభుత్వమే నిర్ణయించింది. అంతకన్నా ఎక్కువకు విక్రయించడానికి వీల్లేదంటూ... విద్యార్థుల తల్లిదండ్రులపై పెను భారం పడకుండా చేసింది. ఓపెన్ టెండర్లలో ఎక్కువ మంది పబ్లిషర్లు ఎంపికయ్యారు కనక పుస్తకాల సరఫరా కూడా బాగానే ఉంది. కాకపోతే ఇదంతా చేసింది చంద్రబాబు కాదు కనక... షరా మామూలుగా రామోజీ విమర్శల రాగం అందుకున్నారు. ప్రయివేటు స్కూళ్లతోను, పబ్లిషర్లతోను కుమ్మక్కును నిరూపించే రాతలకు దిగారు. పుస్తకాలెక్కడ? అంటూ అబద్ధాలు అచ్చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం... ప్రయివేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకాలను ముద్రించడం, విక్రయించటం వంటివి చేయటానికి ప్రయివేటు పబ్లిషర్లను అనుమతిస్తూ 2006– 07 విద్యా సంవత్సరంలోనే నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓపెన్ టెండర్ల ద్వారా ప్రయివేటు పబ్లిషర్లకు అప్పగించింది. దీనికి వారు ఏటా పుస్తకం ధరలో ఐదు శాతాన్ని రాయల్టీగా చెల్లించాలి. ఇదిగో... నాటి నుంచి గతేడాది వరకూ పుస్తక ముద్రణను ఎమెస్కో బుక్స్, విజయవాణి ప్రింటర్స్, ప్రజాశక్తి దినపత్రిక, విశాలాంధ్ర చేస్తూ వచ్చాయి. అయితే ఈ విద్యా సంవత్సరానికి (2022–23) టెండర్లు పిలిచేటపుడు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని, తరగతిని బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నాయని ఫిర్యాదులొచ్చాయి. పైపెచ్చు ప్రభుత్వం సరఫరా చేసే పుస్తకాల కంటే ఆక్స్ఫర్డ్, రత్నసాగర్, ఓరియెంట్ బ్లాక్స్వాన్, మాక్స్‌మిల్లర్ వంటి ప్రయివేటు పబ్లిషర్లు ముద్రించే పుస్తకాలను వాడటానికే ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇవి ఖరీదైనవి కావడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అంతేకాక ప్రయివేటు స్కూళ్లు ఇలా చేయటం వల్ల విద్యార్థులు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన నాణ్యమైన కంటెంట్ ఉన్న పాఠ్యపుస్తకాలకు దూరమవుతున్నారనీ ప్రభుత్వం గుర్తించింది. వీటన్నిటికీ తోడు... గత మూడేళ్లుగా ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులెవరూ తమ పుస్తకాలను కొనుగోలు చేయడం లేదని పేర్కొంటూ పబ్లిషర్లు 25 శాతమే రాయల్టీ చెల్లించారు. వారు విక్రయించిన పాఠ్యపుస్తకాల వివరాలను, ఆడిటింగ్ నివేదికలను కూడా ప్రభుత్వానికి సమర్పించలేదు. ఇవన్నీ చూశాక... ప్రచురణకర్తలు ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటించటం లేదని, తక్కువ నాణ్యత గల పేపర్‌పై రంగులతో ముద్రిస్తున్నారని, అది విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోందని గుర్తించింది. ధరలు అధికంగా ఉండటంతో నియంత్రించాలని భావించింది. ప్రైవేటుకూ ప్రభుత్వమే పుస్తకాల సరఫరా... ప్రైవేటు విద్యారంగంలో జరుగుతున్న పుస్తక దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వ విద్యార్థులతో సమానంగా ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలను ముద్రించి సరఫరా చేయాలని ఈ ఏడాది ఏప్రిల్ 3న ప్రభుత్వం నిర్ణయించింది. గతం కంటే నాణ్యమైన పుస్తకాలు ముద్రించేందుకు వీలుగా టెండర్లు పిలవగా 83 సంస్థలు ముందుకు వచ్చాయి. వీటిలో 57 సంస్థలు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎన్టీపీఎల్ నుంచి పేపర్ అందిన తేదీ నుంచి 20 రోజుల్లో పుస్తకాల ముద్రణ, సరఫరా చేసేందుకు అంగీకరించాయి. ఈ 57 సంస్థలకూ వాటి సామర్థ్యానికి అనుగుణంగా ముద్రణ వర్క్స్‌ను కేటాయించారు. దీనికంటే ముందే... అవసరమైన పేపరు సరఫరా చేస్తామని ఈ ఏడాది మార్చిలోనే ఎన్టీపీఎల్ అంగీకరించింది. దాంతో మార్చి 28, మే 26 తేదీల్లో విద్యాశాఖ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి ప్రైవేట్, అన్–ఎయిడెడ్ పాఠశాల పిల్లలకు విద్యాశాఖే పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తుందని స్పష్టంచేసింది. ఈ మేరకు అధికారులు వారికి అవగాహన కల్పించారు. మొదటి సెమిస్టర్ నాటికే 1,25,14,786 పుస్తకాలు... ఈ విద్యా సంవత్సరంలో 24,44,942 మంది విద్యార్థులు స్టేట్ సిలబస్‌తో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నట్లు లెక్కతేల్చగా, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు 18,02,879 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అవసరమని ఇండెంట్ ఇచ్చాయి. మిగిలిన విద్యార్థులు పాత పుస్తకాలను ఉపయోగించుకుంటారని తెలిపాయి. దీని ప్రకారం ఈ జూలై 25వ తేదీ మొదటి సెమిస్టర్ నాటికి జిల్లాల్లోని విద్యార్థులకు అవసరమైన 1,39,84,625 పాఠ్య పుస్తకాల్లో 1,25,14,786 పుస్తకాలను సరఫరా చేసింది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ధరలు నిర్ణయించింది. -
పది రోజుల్లో ఇంటర్ పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీలకు మరో పది రోజుల్లో ఇంటర్ పాఠ్య పుస్తకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, తెలుగు అకాడమీ డైరెక్టర్ దేవసేన తెలిపారు. ‘సాక్షి’ప్రతినిధితో సోమవారం ఆమె మాట్లాడుతూ.. పేపర్ కొరత కారణంగానే ముద్రణ ఆలస్యమైందన్నారు. ‘‘ఈ పుస్తకాలకు నాణ్యమైన పేపర్‌ను ఉపయోగిస్తాం. పేపర్ రేట్లు ఇటీవల విపరీతంగా పెరిగాయి. పాత కాంట్రాక్టు సంస్థల్లో ఒకటి మాత్రమే పేపర్ అందించడానికి ముందు కొచ్చింది. ప్రభుత్వం ఇటీవల వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంతో తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలకు డిమాండ్ పెరిగింది. దీంతో గతంలో వచ్చిన పేపర్ అవి ముద్రించడానికే ఉపయోగించాల్సి వచ్చింది. అవసరమైన పేపర్‌ను తెప్పించేందుకు అధికారులు సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రవాణాకు ఇబ్బంది ఏర్పడింది’’అని చెప్పారు. మార్కెట్లో ఖరీదుకు అందించే పుస్తకాలను ఇప్పటికే ముద్రించామని, ప్రభుత్వ కాలేజీలకు ఉచితంగా ఇవ్వాల్సిన పుస్తకాల్లో కొన్ని ముద్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పేపర్ అందిన మూడు రోజుల్లో ప్రింటింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. తర్వాత వారం రోజుల్లో అన్ని కాలేజీలకు అందిస్తామన్నారు. పేపర్ కొరత సమస్య తెలంగాణకే కాదని, అన్ని రాష్ట్రాలకూ ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత అంతర్జాతీయంగానూ పేపర్ ఖరీదు పెరిగిందన్నారు. తాము టెండర్లు పిలిచినప్పటికి, ఇప్పటికి పేపర్ ఖరీదు రెట్టింపు అయిందని, అయినా నాణ్యత విషయంలో రాజీ పడకుండా విద్యార్థులకు మంచి పుస్తకాలు అందించాలనే సంకల్పంతో ఉన్నామని వివరించారు. -
తెలంగాణ: పుస్తకాల ముద్రణ ఇంకా ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠ్య పుస్తకాల పంపిణీ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటివరకూ 63 శాతమే పంపిణీ జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. మిగతా 37 శాతం పాఠ్యపుస్తకాలను ముద్రించాల్సి ఉంది. ఈ ప్రక్రియకు ఇంకా సమయం పట్టేలా కన్పిస్తోంది. అయితే, మరో పది రోజుల్లో మొత్తం పుస్తకాలను విద్యార్థుల వద్దకు చేరుస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే బోధన మొదలైంది. సర్కారీ బడుల్లో మాత్రం పుస్తకాల కొరత కారణంగా బోధన చేపట్టలేదు. దీన్ని కప్పి పుచ్చుకోవడానికి బ్రిడ్జ్ కోర్సు పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. జూలైలోనూ పుస్తకాలు ఇవ్వకుండా, బోధన మొదలవ్వకపోతే విద్యార్థుల్లో ప్రమాణాలు ఎలా పెరుగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 24 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తారు. విద్యా శాఖ అంచనా ప్రకారం దాదాపు 1.67 కోట్ల పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంటుంది. బడులు మొదలై నెల రోజులకుపైగా గడిచినా ఇప్పటివరకూ 1.07 కోట్ల పుస్తకాలనే బడులకు పంపారు. ఇంకా 60 లక్షల పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. విద్యార్థులందరికీ సరిపడా పుస్తకాలు లేకపోవడంతో పంపిణీ కార్యక్రమంలో ఉపాధ్యాయులూ తికమక పడుతున్నారు. ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే స్థానికంగా ఇబ్బందులొస్తున్నాయని అంటున్నారు. దీంతో స్కూళ్లకు చేరిన పుస్తకాలను కూడా పంపిణీ చేయడం లేదు. ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన చేపట్టాల్సి ఉండటంతో ద్విభాషలో పుస్తకాలు ముద్రించారు. పది రోజుల్లో ఇస్తాం: శ్రీనివాసచారి, డైరెక్టర్ ప్రభుత్వ పుస్తక ముద్రణ విభాగం పుస్తకాలకు అవసరమైన కాగితం ఆలస్యంగా రావడంతోనే సకాలంలో ముద్రించలేకపోయాం. ఇప్పటికే 63 శాతం జిల్లాలకు పంపాం. వాటిని వెంటనేపంపిణీ చేయమని చెప్పాం. మిగతావి కూడా మరో పది రోజుల్లో పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. -
పేపర్ సంక్షోభం! ఇక 'పుస్తకాలు' ఉండవేమో!
No textbooks for students: పాకిస్తాన్లో లోపభూయిష్టమైన విధానాలు, ద్రవ్యోల్బణం తదితర కారణాల రీత్యా తీవ్రమైన పేపర్ సంక్షోభం తలెత్తింది. దీని ఫలితంగా వచ్చే ఏడాది విద్యాసంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని పాకిస్థాన్ పేపర్ అసోసియేషన్ అధికారులు చెబుతున్నారు. అదువల్ల స్కూళ్లు ఆలస్యంగా ఆగస్టులో ప్రారంభమవుతాయని పాకిస్థాన్ పేపర్ మర్చంట్ అసోసియేషన్, పాకిస్థాన్ అసోసియేషన్ ఆఫ్ ప్రింటింగ్ గ్రాఫిక్ ఆర్ట్ ఇండస్ట్రీ, పేపర్ పరిశ్రమకు సంబంధించిన ఇతర సంస్థలు తెలిపాయి. పేపర్ ధర పెరగడం వల్ల ప్రచురణకర్తలు ధరను నిర్ణయించలేకుపోతున్నారని పాకిస్తాన్‌కి చెందిన స్థానికి మీడియా పేర్కొంది. అందువల్లే సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తుంక్వా వంటి పాఠ్యపుస్తకాల బోర్డులు ఇక ముద్రించలేమని స్పష్టం చేశాయి. దీంతో పాకిస్తాన్ కాలమిస్ట్ అయాజ్ అమీర్ దేశంలోని అసమర్థలైన పాలకుల పై విమర్శల వర్షం కురిపించారు. అంతేకాదు పాకిస్తాన్ గత రుణాలను చెల్లించేందుకు అప్పుల తీసుకునే విషవలయంలో చిక్కుకుపోయిందంటూ ఆవేదన చెందారు. ప్రస్తుతం ఏ దేశాలు పాకిస్తాన్‌కి రుణ సాయం చేయడానికి ఇష్టపడని దుస్థితలో ఉందని చెప్పారు. దీన్ని చైనా క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తుందన్నారు. ఆ దిశగానే రుణాలు, పెట్టుబడుల చెల్లింపుల విషయమై ఈ తరుణంలోనే పాకిస్తాన్‌తో గట్టి బేరం కుదుర్చుకుని పరిస్థితిని చక్కబెట్టుకునేందుకు యత్నిస్తోందన్నారు. ఈ మేరకు పాకిస్తాన్ 2021-22 ఆర్థిక సంవత్సారానికి గానూన సుమారు రూ. 30 వేల కోట్ల చైనా ట్రేడ్స్ ఫైనాన్స్ ఉపయోగించినందుకు సుమారు రూ. వెయ్యి కోట్లు పైనే వడ్డిని చెల్లించిందని నివేదిక పేర్కొంది. (చదవండి: యుద్ధం క్లైమాక్స్‌కి చేరుకుంటున్న వేళ...రష్యాకి ఊహించని ఝలక్!) -
AP: స్కూళ్ల ప్రారంభానికి ముందే ‘పుస్తకం’ సిద్ధం
సాక్షి, అమరావతి: గణగణ గంటలు మోగడమే ఆలస్యం.. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందచేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పాఠశాలల పునఃప్రారంభానికి నెల రోజుల ముందే విద్యార్ధులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాలను సిద్ధంగా ఉంచడం గమనార్హం. స్కూళ్లు తెరిచిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి 3.38 కోట్ల పుస్తకాలను జగనన్న విద్యాకానుకతో సహా అందించనున్నారు. గత సర్కారు హయాంలో నవంబర్ – డిసెంబర్ వరకు కూడా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో అందించలేని దుస్థితి నెలకొనగా ఇప్పుడు స్కూళ్లు ప్రారంభం కావడమే ఆలస్యం అనే రీతిలో చర్యలు చేపట్టడం విద్యారంగంపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నెలలోనే అమ్మ ఒడి పథకం కింద లబ్ధి చేకూర్చనుంది. ప్రభుత్వ పాఠశాలలకు పెరిగిన ఆదరణ అధికారంలోకి రాగానే విద్యారంగ సంస్కరణలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా స్కూళ్లలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల బాట పట్టారు. స్కూళ్లు తెరిచిన వెంటనే జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్ధులకు 3 జతల యూనిఫారం, బెల్టు, బూట్లు, సాక్సులు, బ్యాగుతో పాటు ఇంగ్లీషు డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్కుబుక్స్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారం లేకుండా సెమిస్టర్లవారీగా 1 నుంచి 10వ తరగతి వరకు 330 రకాల టైటిళ్ల పుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, కన్నడ, తమిళం, ఒరియా మాధ్యమాలతో కూడిన ఈ పుస్తకాలను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు అందచేస్తారు. గతంలో ఏడాది మొత్తానికి ఒకే ఒక పాఠ్య పుస్తకాన్ని ఇవ్వడం వల్ల పరిమాణం పెరిగి విద్యార్ధులు అధిక బరువులు మోయలేక అల్లాడేవారు. పైగా కొద్ది రోజులకే చిరిగిపోయేవి. ఈ పరిస్థితిని గమనించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 6వ తరగతినుంచి సెమిస్టర్ విధానానికి శ్రీకారం చుట్టింది. సెమిస్టర్ల వారీగా పుస్తకాలను అందించడం వల్ల మోత బరువు నుంచి విముక్తి లభించింది. ఈసారి మొదటి సెమిస్టర్ కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 3,38,70,052 పాఠ్య పుస్తకాలను అందించనున్నారు. గుత్తాధిపత్యానికి తెర జూలై 4వతేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో విద్యాశాఖ ఇప్పటికే ముద్రణ ప్రక్రియ పూర్తి చేసి మండల కేంద్రాలకు సరఫరా చేపట్టింది. నెల రోజుల ముందే మండల కేంద్రాలకు 60 శాతానికి పైగా పుస్తకాలు చేరుకున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మిగతావి కూడా చేరనున్నాయి. గతంలో నేతలు, ప్రింటర్ల ఇష్టారాజ్యంగా ముద్రణ వ్యవహారాలు నడిచేవి. మే ఆఖరు వరకు కూడా పుస్తకాల ముద్రణ టెండర్లే ఖరారయ్యేవి కావు. ఇప్పుడు వాయువేగంతో అన్నీ పూర్తి చేసి స్కూళ్లు తెరవటానికి ముందే పుస్తకాలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. గతంలో నలుగురైదుగురి గుత్తాధిపత్యంతో ముద్రణ జరగడం వల్ల చాలా జాప్యం జరిగేది. ఈసారి టెండర్లకు ముందుకు వచ్చిన 20 మంది ప్రింటర్లకు కూడా ముద్రణకు అవకాశమిచ్చారు. ప్రైవేట్ స్కూళ్లకూ ప్రభుత్వం నుంచే... ఈ విద్యాసంవత్సరం ప్రైవేట్ స్కూళ్లకు కూడా ప్రభుత్వమే పాఠ్యపుస్తకాల ముద్రణ చేపట్టి పంపిణీ చేస్తోంది. గతంలో ప్రైవేట్ పాఠశాలలకు ప్రైవేట్ ప్రింటర్లు సరఫరా చేయడం వల్ల తల్లిదండ్రులపై మోయలేని భారం పడేది. ప్రభుత్వ ధర కన్నా నాలుగైదు రెట్లు అధిక ధరలకు పుస్తకాలను విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఈ అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం ఈదఫా ఆ పాఠ్యపుస్తకాల ముద్రణ కూడా తానే ప్రైవేట్‌కు అప్పగించి స్కూళ్లకు నేరుగా పంపిణీ చేస్తోంది. మారుపేర్లతో మాయచేస్తూ.. 2007 వరకు ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్లకు అందించే విధానం ఉండగా ఆ తరువాత ప్రైవేట్‌కే విడిచిపెట్టారు. ఫలితంగా ప్రింటర్లు తక్కువ ముద్రణ చూపిస్తూ ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొడుతూ వస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన కంటెంట్‌ను వేరే పబ్లిషర్లకు అందించి మారుపేర్లతో ముద్రణ చేపడుతూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ పాఠ్యపుస్తకాల సెట్ ప్రభుత్వ ధర రూ.280గా మాత్రమే ఉండగా స్కూళ్లలో ప్రైవేట్ ముద్రణ పేరుతో రూ.2 వేల వరకు గుంజేవారు. ఇప్పుడు ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు అందించనున్నందున తల్లిదండ్రులపై అధిక భారం తప్పనుంది. ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన పుస్తకాలకు సంబంధించి విద్యాశాఖ ముందుగానే ఇండెంట్లు తీసుకుంది. మొత్తం 13,635 ప్రైవేట్ స్కూళ్లలో 24 లక్షల మంది విద్యార్ధులుండగా 12,721 స్కూళ్లు 18.02 లక్షల మందికి పుస్తకాల కోసం ఇండెంట్లు ఇచ్చాయి. వీరికి కావాల్సిన 1.36 కోట్ల పాఠ్యపుస్తకాలను కూడా ప్రభుత్వమే ముద్రణ చేపట్టి ఆయా స్కూళ్లకు అందించేలా ఏర్పాట్లు చేసింది. ద్విభాషా పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో విద్యార్ధులకు సౌకర్యంగా ఉండేందుకు పాఠ్యపుస్తకాలను బైలింగ్యువల్ (ద్విభాషా) విధానంలో మిర్రర్ ఇమేజ్‌తో ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఒకపక్క తెలుగు, దానికి ఎదురు పేజీలో ఇంగ్లీషులో పాఠ్యాంశాలు ఉండటంతో విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పటికే 6, 7 తరగతుల విద్యార్ధులకు ఈ సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు అందించారు. ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి విద్యార్ధులకు కూడా సీబీఎస్ఈ సిలబస్ పుస్తకాలు అందిస్తారు. రానున్న రెండేళ్లలో 10వ తరగతి వరకు అన్ని తరగతుల్లోనూ సీబీఎస్సీ సిలబస్ అమల్లోకి రానుంది. ప్రభుత్వ స్కూళ్లకు పాఠ్యపుస్తకాల పంపిణీ ఇలా.. జిల్లా ఇండెంట్ ఇప్పటివరకు ఇచ్చినవి శ్రీకాకుళం 2039753 748657 విజయనగరం 1691284 681190 విశాఖపట్నం 2745643 1267638 ప.గోదావరి 3670404 1626840 తూ.గోదావరి 2563960 1159599 కృష్ణా 2495376 1123140 గుంటూరు 3057027 1500467 ప్రకాశం 2471675 1269181 నెల్లూరు 2065629 821382 కడప 2001972 931523 కర్నూలు 3415546 1612591 అనంతపురం 2946820 1391097 చిత్తూరు 2704963 1266852 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 33870052 15400157 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– నోట్: ఇవి కాకుండా ప్రస్తుతం 70 లక్షల పుస్తకాలను ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి గోడౌన్లకు తరలిస్తున్నారు. మొత్తం పుస్తకాల తరలింపు రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. ద్విభాషా పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు పాఠ్యపుస్తకాలను బైలింగ్యువల్ (ద్విభాషా) విధానంలో మిర్రర్ ఇమేజ్‌తో ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఒకపక్క తెలుగు, దానికి ఎదురు పేజీలో ఇంగ్లిష్‌లో పాఠ్యాంశాలు ఉండటంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పటికే 6, 7 తరగతుల విద్యార్థులకు ఈ సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు అందించారు. ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతికి కూడా సీబీఎస్ఈ సిలబస్ పుస్తకాలు అందిస్తారు. రానున్న రెండేళ్లలో 10వ తరగతి వరకు అన్ని తరగతుల్లోనూ సీబీఎస్సీ సిలబస్ అమల్లోకి రానుంది. -
పాఠ్య పుస్తకాలకు తడ‘బడి’..
► వేసవి సెలవుల అనంతరం జూన్ 13 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ విద్యా సంవత్సరంలోనే 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడతామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎక్కువ సంఖ్యలో పాఠ్య పుస్తకాలను ముద్రించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియే పూర్తికాక పోవడంతో విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందే పరిస్థితి లేకుండా పోయింది. ► పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రక్రియ ఫిబ్రవరి, మార్చి నుంచే మొదలవ్వాల్సి ఉంది. సాధారణంగా ఏప్రిల్, మేలో పుస్తకాల ముద్రణ పూర్తయినా, విద్యార్థులకు జూలై వరకూ అందని పరిస్థితి ఉండేది. ఇప్పుడు పుస్తకాల ముద్రణ పెరగడంతో పాటు, ఇప్పటివరకు ముద్రణకు టెండర్లే ఖరారు కాకపోవడంతో స్కూళ్లు తెరిచినా కనీసం రెండు నెలల వరకు పుస్తకాల పంపిణీ జరిగే అవకాశం కన్పించడం లేదని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జూన్ 13 నుంచి మొదలయ్యే విద్యా సంవత్సరంలోనే 1 నుంచి 8 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఈ దిశగా కార్యాచరణ కన్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించే పరిస్థితి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని గమనిస్తే స్కూళ్లు తెరిచినా, కనీసం రెండు నెలల వరకూ విద్యార్థి చేతికి పుస్తకం వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. రెండేళ్లుగా కరోనా వల్ల విద్యా సంస్థలు దాదాపుగా మూతపడ్డాయి. అరకొరగా నడిచినా పాఠశాల విద్యపై కరోనా తీవ్ర ప్రభావం చూపించిందని ప్రభుత్వ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ప్రస్తు తం తిరిగి గాడిలో పడుతున్న సమయంలో పాఠ్యపుస్తకాలు ఆలస్యం కానుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాల విద్య కమిషనర్ దీనిపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రెండు భాషలతో పెరిగిన ముద్రణ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం తెలుగు, ఇంగ్లిష్ 2భాషల్లో (బై లింగ్వల్) పుస్తకాలను ముద్రించాలని నిర్ణయించింది. ఒక వైపు ఇంగ్లిష్, మరోవైపు తెలుగు భాషలో పాఠాలను ముద్రిస్తారు. దీంతో పుస్తకం బరువు దాదాపు రెట్టింపు కానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కో సబ్జెక్టును రెండు భాగాలుగా విభజించారు. సమ్మేటివ్ అసెస్మెంట్–1 (ఎస్ఏ–1) వరకు ఉన్న సిలబస్‌ను ఒక పుస్తకంలో, ఎస్ఏ–2లో ఉన్న సిలబస్‌తో మరో పుస్తకాన్ని ముద్రించాలని నిర్ణయించారు. దీంతో ఈసారి ఎక్కువ సంఖ్యలో పుస్తకాలు ప్రింట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 24 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా వీటిని అందజేస్తారు. ఉచితంగా అందించే పుస్తకాలను 2.10 కోట్ల వరకు, ప్రైవేటులో విక్రయానికి మరో 1.40 కోట్ల పుస్తకాలు ముద్రించాల్సి ఉంది. గతంలో ఉచితంగా అందించే పుస్తకాలకు రూ. 60 కోట్లు వెచ్చిస్తే... ఇప్పుడు రూ.120 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఖరారు కాని టెండర్లు ప్రభుత్వ ముద్రణాలయంలో యంత్రాలన్నీ చాలావరకు పాతబడి, ముద్రణకు అనుకూలంగా లేవని చెబుతున్నారు. ఫలితంగా ప్రైవేటు ముద్రణాలయాల్లో వీటిని ముద్రించాల్సి ఉంది. దీని కోసం ప్రత్యేకంగా కమిటీ ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ, పరిశ్రమల శాఖ నుంచి ఓ అధికారి, ప్రభుత్వ ముద్రణాలయం ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. అయితే ఇప్పటివరకు ఈ కమిటీ సీనియస్‌గా భేటీ అయిన దాఖలాల్లేవు. కమిటీ భేటీ లేకుండానే టెండర్ల ప్రక్రియ చేపట్టారనే విమర్శలున్నాయి. పేపర్ అందించేందుకు తమిళనాడు పేపర్ మిల్స్, పంజాబ్‌కు చెందిన సాతియా పేపర్స్, చండీగఢ్‌కు చెందిన మరో సంస్థ టెండర్లు వేసింది. అయితే ఇప్పటివరకు ఈ ప్రక్రియ పూర్తికాకపోవడం గమనార్హం. పుస్తకాలు ఆలస్యంగా వస్తే బోధనతో పాటు విద్యార్థులు చదువుకోవడమూ కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూన్ నెలాఖరు లక్ష్యంగా పెట్టుకున్నాం పుస్తకాల ముద్రణకు సంబంధించిన టెండర్లు ఈ నెల 16న తెరుస్తాం. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎల్–1ను గుర్తించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. ద్విభాష ముద్రణ కావడం వల్ల ఈసారి పుస్తకాల ముద్రణ ఎక్కువ సంఖ్యలో చేయాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా పుస్తకాలు ముద్రించే ప్రయత్నం చేస్తున్నాం. స్కూళ్ళు తెరిచే సమయానికి కొన్ని పుస్తకాలు అందించడంతో పాటు అన్ని పుస్తకాలను జూన్ నెలాఖరులోగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – ఎస్ శ్రీనివాసచారి (డైరెక్టర్, ప్రభుత్వ పుస్తకాలు, స్కూల్ ఎడ్యుకేషన్) సకాలంలో పుస్తకాలు ఇవ్వాలి : చెరుకు ప్రద్యుమ్నకుమార్ (ప్రభుత్వ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్, కరీంనగర్) ఆంగ్ల భాషలో బోధన చేపడుతున్న నేపథ్యంలో ముందే విద్యార్థుల చేతికి పుస్తకాలు అందాలి. అప్పుడే వాళ్ళకు కొత్త విధానంపై కొంత అవగాహన ఏర్పడుతుంది. అదే విధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించేందుకు అవసరమైన ప్రిపరేషన్ చేసుకునే వీలుంటుంది. పుస్తకాలు ఆలస్యమైతే సిలబస్ పూర్తి కోసం బోధనను పరుగులు పెట్టించాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి ఏటా ఆలస్యంతో ఇబ్బంది పాఠ్య పుస్తకాల ముద్రణ ఆలస్యం ప్రతి ఏటా ఇబ్బందిగా మారుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. విద్యార్థులకు ఇచ్చే పుస్తకాలను విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత తిరిగి తీసుకుని, లైబ్రరీలో భద్రపరిచి, కొత్త వారికి ఇవ్వాలి. దీనివల్ల ఆలస్యం సమస్య తలెత్తదు. ప్రభుత్వ ఖజానాపై భారమూ తగ్గుతుంది. – మామిడోజు వీరాచారి (లోకల్ కేడర్ ప్రభుత్వ టీచర్ల సంఘం అధ్యక్షుడు) -
తిరియాటి.. సదవాటి.. రాసాటి!
కేంజాతి (వినండి).. తిరియాటి (మాట్లాడండి).. సదవాటి (చదవండి).. రాసాటి (రాయండి).. లిపిలేని కోయ భాషలోని పదాలివి. ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యార్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీంతో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన గూడేల్లోని అడవి బిడ్డలకు వారి మాతృభాష ఆధారిత బహుళ భాషా విద్యాబోధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఇకపై గిరిజన పాఠశాలల్లో కోయ భాషలోని పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధన చేస్తూ.. లిపి లేని ఆ భాషలకు ఊపిరి పోయాలని సంకల్పించింది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కొండకోనల్లో అంతరించిపోతున్న అరుదైన కోయ భాషలకు రాష్ట్ర ప్రభుత్వం ఊపిరిలూదుతోంది. లిపి కూడా లేని వివిధ కోయ భాషలకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి.. గిరిపుత్రులకు విద్యాబుద్ధులు నేర్పే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సహజంగా గిరిజన తండాల్లో మూడొంతుల మంది గిరిజనులకు మాతృభాష తప్ప మరో భాష రాదు. ఈ కారణంగా వారు విద్యకు దూరమై సమాజంలో వెనుకబాటుకు గురవుతున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి, వారి జీవితాల్లో విద్యా సుగంధాలు నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గిరిజనులు మాతృభాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసించేలా వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేలా కార్యక్రమాన్ని చేపట్టింది. 6 భాషలు.. 920 పాఠశాలల్లో అమలు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో ఆరు రకాల కోయ భాషల్లో అమలు చేయనున్నారు. ఈ విధానాన్ని ‘కోయ భారతి’ పేరిట ఉభయ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించారు. అయితే, గత పాలకులకు దీనిపై చిత్తశుద్ధి లేకపోవడంతో ఏడాది తిరగకుండానే ‘కోయ భారతి’ కార్యక్రమం అటకెక్కింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులకు వారి మాతృభాషలో తెలుగును సులువైన విధానంలో అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు రూపొందించింది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాలు, మెటీరియల్‌ను గిరిజన భాషలోనే రూపొందించి పంపిణీ చేసింది. చింతూరు మండలం చట్టి పాఠశాలలో కోయ భాషలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు ఉభయ గోదావరి జిల్లాల్లో (కోయ), శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో (సవర), విశాఖపట్నం జిల్లాలో (కొండ, కువి, ఆదివాసీ), కర్నూలు, అనంతపురం జిల్లాల్లో (సుగాలి) భాషలకు అనుగుణంగా ప్రత్యేక పాఠ్య పుస్తకాలను తీసుకొచ్చింది. సర్వశిక్షా అభియాన్ సూచనల మేరకు ఐటీడీఏల్లో ఆరు భాషలపై పట్టున్న నిపుణుల తోడ్పాటు తీసుకున్నారు. వారి ఆలోచనల మేరకు 1 నుంచి 3వ తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను సిద్ధం చేశారు. రూ.60 లక్షల వ్యయంతో పాఠ్యాంశాలు రూపొందించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 920 పాఠశాలల్లో 18,795 మంది గిరిజన విద్యార్థులకు తెలుగు, ఇతర సబ్జెక్టులను గిరిజన భాషలోనే బోధిస్తారు. ఇందుకోసం గిరిజన ఉపాధ్యాయులతో పాటు వారు లేనిచోట ఆ భాషపై కాస్తోకూస్తో పట్టున్న విద్యా వలంటీర్లను నియమించి, శిక్షణ ఇచ్చి నియామక పత్రాలు అందజేశారు. యవ్వ.. ఇయ్య భాషలోనే.. కోయ భాషలో అమ్మను యవ్వ అని.. నాన్నను ఇయ్య అంటారు. అన్నను దాదా.. అక్కను యక్క అంటారు. చెట్టును మరం అని.. ఈగను వీసి అని.. కోడి పుంజును గొగ్గోడు అని.. పిల్లిని వెరకాడు అని పిలుస్తారు. కూడికేకు (కూడిక), తీసివేతాకు (తీసివేత), బెచ్చోటి (ఎంత పరిమాణం), దోడ తిత్తినే (అన్నం తిన్నావా), బాత్ కుసిరి (ఏం కూర), దెమ్ము (పడుకో), ఏరు వాట (నీరు ఇవ్వు, పెట్టు), మీ పెదేరు బాత (నీ పేరు ఏమిటి) వంటి పదాలు ఇకపై గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఈ పదాలు వాడుకలోకి రానున్నాయి. ప్రాథమిక విద్యార్థులకు వారు మాట్లాడే మాతృ భాషలోనే బోధన చేయడం వల్ల వారిలో అభ్యసన స్థాయిని పెంచడంతోపాటు వారి భాష, సంస్కృతి, సంప్రదాయాలను చెక్కు చెదరకుండా కాపాడాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇతర భాషలపై పట్టు సాధించేందుకే.. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధించడమనేది ఇతర భాషలపై పట్టు సాధించేందుకు ఎంతో దోహదపడుతుంది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను రూపొందించారు. మాతృభాషలో బోధన వలన డ్రాపౌట్లు కూడా తగ్గుతాయి. – ఆకుల వెంకటరమణ, పీవో, ఐటీడీఏ, చింతూరు మాతృభాషా బోధన మంచి నిర్ణయం మాతృభాషలో బోధనకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక స్థాయిలో గిరిజన విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అక్షరం ముక్కలు రాక అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతున్న గిరిజనులకు ఇది సువర్ణావకాశమనే చెప్పాలి. – ముర్రం దూలయ్య, ఉపాధ్యాయుడు, జీపీఎస్ పాఠశాల, చట్టి, చింతూరు మండలం కోయభాషలో బోధన ఎంతో అవసరం కొత్తగా పాఠశాలలకు వెళ్లే పిల్లలకు వాడుకలో ఉన్న కోయభాషలో బోధన ఎంతో అవసరం. ఇతర భాషలు నేర్చుకోవాలంటే వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. కోయభాషలో పాఠాలు చెబుతుంటే మా పిల్లలకు సులువుగా అర్థమవుతుంది. కోయభాషతో పాటు తెలుగులో కూడా చెబుతుండటం బాగుంది. – తుర్రం బాయమ్మ, గిరిజన విద్యార్థి తల్లి, చింతూరు -
పుస్తకాల్లేని చదువులు.. విద్యార్థుల చింత
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసలే టీవీ పాఠాలు. వాటిని వింటున్న విద్యార్థులు చాలా తక్కువ. అధికారుల లెక్కల ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులు కొంతమేరకు టీవీ పాఠాలను చూస్తున్నా.. ఎక్కువ మంది విద్యార్థులు చదువు లకు దూరమయ్యారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. తమ పిల్లలకు విద్యా బోధన ఎలా? అని ఆవేదన చెందుతున్నారు. టీవీ పాఠాలు పెద్దగా అర్థంకావడం లేదని, కనీసం పుస్తకాలున్నా కొంతవరకు వాటిని చదువుకొని ఉపాధ్యాయులను ఫోన్లలో అడిగి సందేహాలను నివృత్తి చేసుకునే వారమని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీచర్లు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నా.. అవి అత్యధిక మంది విద్యార్థులకు చేరడం లేదు. 8 జిల్లాల్లో అందని పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలోని 8 జిల్లాల్లో విద్యార్థులకు ఇంతవరకు పాఠ్య పుస్తకాల పంపిణీనే ప్రారంభించలేదు. ఆదిలాబాద్, జోగుళాంబ, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, ములుగు, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా కేంద్రాలకు పాఠ్య పుస్తకాలు చేరినా వాటిని మండల స్థాయికి, పాఠశాలలకు పంపించి విద్యార్థులకు పంపిణీ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. 12 జిల్లాల్లో 20 శాతంలోపే పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు ఇవ్వగా, ఆరు జిల్లాల్లో 20-50 శాతంలోపు పంపిణీ చేశారు. కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే ఎక్కువ మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందినట్లు అధికారులు తేల్చారు. విందామన్నా.. నెట్‌వర్క్‌తో ఇబ్బంది చాలా జిల్లాల్లో విద్యార్థులు టీవీ పాఠాలను వినేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టీవీల్లో ఏయే సమయాల్లో ఆ పాఠాలను బోధిస్తారనే విషయంపై అవగాహన లేక ఇబ్బంది పడుతున్నారు. టీచర్లు కొంత చొరవ తీసుకొని వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి పాఠాలు ప్రసారమయ్యే సమయం తెలియజేస్తున్నారు. దీంతో కొద్దిమంది వాటిని వింటున్నారు. మిగతా విద్యార్థుల్లో స్మార్ట్ ఫోన్లు కలిగిన కొందరు విద్యార్థులు టీశాట్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకొని పాఠాలను విందామనుకుంటే నెట్వర్క్ సమస్యలతో వీడియో పాఠాలను వినలేకపోతున్నారు. పుస్తకాలు ఇవ్వలేదు మా పాప పదో తరగతి రామన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. ఆన్లైన్ తరగతులు ప్రారంభమై 12 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు పుస్తకాలు రాలేదు. ఆన్లైన్ తరగతులు జరుగుతున్న నేపథ్యంలో ఏమైనా సందేహాలు చూసుకునేందుకు పుస్తకాలు లేవు. దీంతో ఇబ్బంది పడుతోంది. - సుభద్ర, విద్యార్థిని తల్లి, రామన్నపేట ఏమి అర్థం కావడం లేదు ఆన్లైన్ పాఠాలు జరుగుతున్నా పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆన్లైన్లో పాఠాలు చూడటం తప్పæ పుస్తకంలో చదువుకునే వీలులేకుండా పోతోంది. సందేహం వస్తే పుస్తకాలు లేకపోవటంతో ఏమీ అర్థంకావడం లేదు. - రాకేశ్, 10వ తరగతి ,బాలుర ఉన్నత పాఠశాల, మంచిర్యాల పుస్తకాలు లేకుండా విద్య ఎలా? ఆన్లైన్లో బోధించేటప్పుడు విద్యార్థులకు పుస్తకాలు ముందు ఉండాలి. అర్థంకాని అంశాలను అందులో చూసి చదువుకుంటారు. పుస్తకాలు లేకుండా విద్యార్థులకు విద్యనందించడం సాధ్యం కాదు. పుస్తకాలు లేకుండా క్లాస్‌లు నిర్వహిస్తే ప్రయోజనం ఉండదు. అందరికీ పుస్తకాలు అందేలా చూడాలి. - తుకారం, టీచర్, రెబ్బెన, ఆసిఫాబాద్ జిల్లా -
పుస్తకాలన్నింట్లో క్యూఆర్ కోడ్.. స్కాన్ చేయండి పాఠాలు వినండి.
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధన ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో విద్యార్థులు ఇళ్ల వద్దే ఉండి డిజిటల్ పాఠాలు వినేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకున్న విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్‌ను ముద్రించింది. విద్యార్థులు వాటిని మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేస్తే ఆడి యో, వీడియో పాఠాలు వస్తాయి. గతంలో కొన్ని సబ్జెక్టులకు పైలట్ ప్రాజెక్టుగా ముద్రించిన క్యూ ఆర్ కోడ్‌ను ప్రభుత్వం ఈసారి అన్ని సబ్జెక్టుల పుస్తకాల్లో ముద్రించింది. దీంతో విద్యార్థులు మరింత మెరుగ్గా పాఠాలను అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. జిల్లా కేంద్రాల నుంచి పంపిణీ చేసేందుకు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు మొత్తం 1.42 కోట్ల పాఠ్య పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 41 శాతం పుస్తకాలు జిల్లా కేంద్రాలకు చేరాయి. అక్కడి నుంచి వెంటవెంటనే మండల కేంద్రాలకు, పాఠశాలలకు పంపిణీ చేసేలా జిల్లాల్లో అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిగతా పాఠ్య పుస్తకాలనూ ఈ నెలాఖరులోగా స్కూల్ పాయింట్‌కు చేరేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతోపాటు గురుకులాల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఉచితంగా పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తోంది. వాటిలో ఆరు నుంచి నుంచి టెన్త్ వరకు చదువుకునే దాదాపు 14 లక్షల మంది విద్యార్థులకు క్యూఆర్ కోడ్ ముద్రించిన పుస్తకాలను ఇస్తారు. విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లో ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు ఆ పాఠానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు, ఆడియోతో కూడిన వివరాలను పొందగలుగుతారు. లాక్‌డౌన్‌తో మిగిలిపోయిన సేల్ పుస్తకాలు రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ముద్రించిన సేల్ పుస్తకాలు భారీగా మిగిలిపోయాయి. 2020–21 విద్యా సంవత్సరంలో 35 లక్షల వరకు సేల్ పుస్తకాలను ముద్రించగా, అందులో 17 లక్షల పుస్తకాలను మాత్రమే విద్యార్థులు కొనుగోలు చేశారు. కరోనా కారణంగా ప్రత్యక్ష బోధన లేకపోవడంతో విద్యార్థులు పుస్తకాలను కొనుక్కోలేదు. దీంతో దాదాపు 18 లక్షల పుస్తకాలు మిగిలిపోయాయి. అయితే వాటిని 2021–22 విద్యా సంవత్సరంలో విక్రయించుకునేందుకు ప్రింటర్లు విద్యాశాఖ అనుమతి కోరారు. ఈ అంశంపై తాము నిర్ణయం తీసుకోలేమని, ప్రభుత్వానికి లేఖ రాశామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో బడులెన్ని..? పాఠశాలలు విద్యార్థులు ప్రభుత్వ 30,135 26,88,805 ప్రైవేట్ 10,763 32,37,448 మొత్తం 40,898 59,26,253 -
మరాఠా మనసు గెలిచిన తెలుగోడు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహారాష్ట్రలో మన తెలుగు రచయిత గంటేడ గౌరునాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన రాసిన గేయం మరాఠాల మనసులను హత్తుకుంది. తొమ్మిదో తరగతి తెలుగు వాచకంలో ఆయన రాసిన ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’కు అక్కడి ప్రభుత్వం మొదటి పాఠ్యాంశంగా చోటు కల్పించింది. విజయనగరం జిల్లా కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన గంటేడ గౌరునాయుడు గిరిజన ఆశ్రమ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. స్థానిక అంశాలకు యాస, భాషలను జోడించి వందలాది కవితలు, కథలు, గేయాలను రాశారు. తాను పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులకు ఏటా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఆలపించేందుకు కొత్త పాటను పరిచయం చేయాలని సంకల్పించుకున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన కలం నుంచి జాలువారిందే.. ‘పాడుదమా స్వేచ్ఛాగీతం.. ఎగరేయుదమా జాతిపతాకం’ అనే దేశభక్తి గేయం. ఈ గీతాన్ని ఆయన గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల కోసం 1990లో రచించారు. మూడు దశాబ్దాలుగా మార్మోగుతున్న గేయం స్వాతంత్రోద్యమ ఘటనలను, అందులోని సమరయోధులను గుర్తు చేస్తూ.. నాటి సన్నివేశాలు కళ్లముందు కదలాడుతున్నట్టుగా ఈ గేయాన్ని రాశారు. అప్పట్లో ఈ పాట విన్న అనంతపురం జిల్లా కలెక్టర్ లెనిన్‌బాబు అనే గాయకుడితో పాడించి రికార్డింగ్ చేయించారు. దీనికి ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి సూర్యనారాయణరావు వాద్య సహకారాన్ని అందించారు. అనంతరం జనవిజ్ఞానవేదిక, ప్రజానాట్యమండలి తదితర సంస్థలు, సంఘాలు ప్రారంభ గీతంగా దీన్ని వినియోగించుకున్నాయి. ఇలా గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల్లో మూడు దశాబ్దాలుగా ఈ గేయం మార్మోగుతోంది. దేశం గొప్పతనం గురించి చెప్పే గేయం మా రాష్ట్రంలోని తెలుగు వాచకంలో మీరు రాసిన ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’ అనే దేశభక్తి గేయం పాఠ్యాంశంగా చేర్పించాలనుకుంటున్నాం.. ఇందుకు మీ అనుమతి కావాలంటూ మహారాష్ట్ర తెలుగు విభాగం ప్రత్యేక అధికారి తులసి భరత్ భూషణ్ అడిగేసరికి ఎంతో సంతోషం కలిగింది. దేశం గొప్పతనం గురించి చెప్పే చాలా మాటలు, కథలు, గేయాలు వచ్చాయి. కానీ, గురజాడ మాటల్లో.. దేశమంటే మట్టికాదు మనుషులు. అందుకే నా రచనలో దేశం కోసం మనుషులు చేసిన వీరోచిత పోరాటాలను భావితరాలకు అందించాలనిపించింది. ఆ దిశగా ఎన్నో కవితలు, కథలు రాశాను. అందులో పాడుదమా స్వేచ్ఛాగీతం ఒకటి. –గంటేడ గౌరునాయుడు, గేయ రచయిత చదవండి: సీఎం జగన్ నన్ను బతికిస్తున్నాడమ్మా.. ‘వృథా’కు కట్టడి: మూడంచెల వ్యూహం