సాక్షి, హైదరాబాద్: తెలుగు పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలుగు టెక్ట్స్ బుక్స్‌లో వచ్చిన తప్పులను సీరియస్‌గా తీసుకున్న సర్కార్.. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి, రాధారెడ్డిని తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేశ్‌కు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ గురుకుల సొసైటీ రమణ కుమార్‌కి ముద్రణ సేవల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతలు కేటాయించారు.
ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. అయితే, విద్యాశాఖ వీటిలో ముందుమాట మార్చకుండా ముద్రించింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామన్న ఉత్సాహంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి పేర్లతో పాఠ్య పుస్తకాల్లో ముద్రించి పంపిణీ చేశారు. కాగా, కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నింటినీ వెరిఫికేషన్ చేయగా విద్యార్థులకు పంపిణీ చేసిన అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లోని ముందు మాట పేజీలో తప్పులు ఉండటంతో ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
పాఠ్యపుస్తకాల్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, సంచాలకులు జగదీశ్వర్ పేర్లు ఉన్నాయి. దీంతో, అలర్ట్ అయిన విద్యాశాఖ విద్యార్థులకు పంపిణీ చేసిన పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ముందు మాటను మార్చి విద్యార్థులకు తిరిగి ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment