ఏం చదవాలి?
♦ పూర్తి స్థాయిలో అందని పాఠ్యపుస్తకాలు
♦ సైన్స్, ఇంగ్లిష్ పుస్తకాల కొరత
♦ ఏటా ఇదే తంతు
కడప ఎడ్యుకేషన్ : పాఠశాలలు తెరిచేలోపు విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందిస్తామని వేసవికి ముందు నుంచే ఊదరగొట్టిన జిల్లా విద్యాశాఖాధికారుల మాటలు ఆచరణలో అమలు కాలేదు. పాఠ శాలలు పునఃప్రారంభమై వారం కావస్తున్నా నేటికీ పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు. జిల్లాలో 4,449 పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకూ 2.47 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
వీరందరికీ 17,61,460 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటి వరకు 8,79,716 పుస్తకాలే జిల్లాకు చేరాయి. గత ఏడాది మిగిలిపోయిన 2,95,789 పుస్తకాలతో కలిపి ఈ ఏడాది 11,75,505 పుస్తకాలను వివిధ మండలాలకు చేరవేశారు. మిగిలిన 5,85,955 పుస్తకాలు రావాల్సి ఉంది. ఉర్దూ మీడియంకు సంబంధించి ఒకటవ తరగతి నుంచి పది వరకు ఒక్క పుస్తకం కూడా రాలేదు. జిల్లాకు రావ లసిన మిగతా పాఠ్య పుస్తకాలు త్వరలో వస్తాయని, వచ్చిన వెంటనే విద్యార్థులకు అందజేస్తామని డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి తెలిపారు.
అందని పుస్తకాల వివరాలు..
- ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్
- రెండవ తరగతి తెలుగు, ఇంగ్లిష్
- మూడవ తరగతి సైన్స్
- నాలుగవ తరగతి తెలుగు, ఇంగ్లిష్, సైన్స్
- ఐదవ తరగతి తెలుగు
- అరవ తరగతి (ఇంగ్లిష్ మీడియం) లెక్కలు, సైన్స్, సోషియల్
- ఏడవ తరగతి (ఇంగ్లిష్ మీడియం) సైన్స్
- 6,7,8,9 తరగతుల హిందీ
- ఎనిమిదవ తరగతి (ఇంగ్లిష్ మీడియం) ఫిజికల్ సైన్స్