స్కూళ్లు..సమస్యల గూళ్లు ! | Schools problems | Sakshi

స్కూళ్లు..సమస్యల గూళ్లు !

Jun 29 2015 2:51 AM | Updated on Sep 3 2017 4:32 AM

స్కూళ్లు..సమస్యల గూళ్లు !

స్కూళ్లు..సమస్యల గూళ్లు !

జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మొత్తం కలిపి 3,458 పాఠశాలలు ఉన్నాయి.

గుంటూరు ఎడ్యుకేషన్ : జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మొత్తం కలిపి 3,458  పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 3,48,724 మంది చదువుతున్నారు. దశాబ్దాల కిందట నిర్మించిన శిథిల భవనాల్లో రెండు వేల పాఠశాలలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నామని ఓ వైపు ప్రభుత్వం చెబుతుండగా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.  పాఠశాలలు ప్రారంభమై పది రోజులు దాటినా ప్రభుత్వ స్కూళ్లల్లోని నాలుగు లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు.

జిల్లాలో అవసరమైన 26,37,753 పాఠ్య పుస్తకాల్లో ఇప్పటికీ ఎనిమిది లక్షలకు పైగా రావాల్సి ఉన్నాయి. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, కేజీబీవీ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న 2.50 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రెండు జతల చొప్పున యూనిఫాం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత విద్యాసంవత్సరంలో ఇవ్వాల్సిన యూనిఫాం ప్రస్తుత విద్యాసంవత్సరంలో పంపిణీ చేశారు. పల్నాడులోని పలు మండలాల్లో యూనిఫాం పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదు.

 నీటికీ కరువే..
 పాఠశాలల్లో సురక్షిత తాగునీరు అందడం లేదు. జిల్లాలోని 400 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మినహా 3600 ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలల్లో సురక్షిత తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు శూన్యం. ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న ఏజెన్సీల నిర్వాహకులు తెచ్చే తాగునీటిపైనే ఆధారపడుతున్నారు.

 తరగతి గదుల కొరత..
 అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రహసనంగా మారింది. గుర్తింపు లేని పాఠశాలలపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న అవగాహనతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగు తోంది. తదనుగుణంగా నూతన తరగతి గదులు నిర్మాణాలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలోని 300 పాఠశాలల్లో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. బాపట్ల నియోజకవర్గంలో 219పాఠశాలలుండగా కేవలం మూడు పాఠశాలలకే పక్కా భవనాలున్నాయి.

చందోలు ఎస్టీ కాలనీలో స్థలం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలకు పక్కా భవనం సౌకర్యం లేదు. దాతల సహకారంతో కాలువ కట్టపై ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులోనే పాఠశాలకు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మంతెనవారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలకు మాత్రం గదుల కొరత తీవ్రంగా ఉంది.

 తూతూ మంత్రంగా బడిపిలుస్తోంది..
 ప్రభుత్వ పాఠశాలల ప్రగతిపై విస్తృత ప్రచారానికి ఉద్దేశించిన బడి పిలుస్తోంది కార్యక్రమం జిల్లాలో తూతూ మంత్రంగా సాగింది. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత ఏడాది ప్రభుత్వ రంగంలో 61 శాతం, ప్రైవేటు పాఠశాలల్లో 31 శాతం ఎన్‌రోల్‌మెంట్ ఉండగా, ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల వాటా మాత్రం 48 శాతానికి పెరిగింది.

 ప్రశ్నార్ధకంగా డీఎస్సీ నియామకాలు
 ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్దేశించిన డీఎస్సీ-2014 నియామకాలు ఎప్పుడు చేపడుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. పాఠశాలలు తెరిలో లోగానే పోస్టింగ్స్ కల్పిస్తామని పదే పదే ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకూ మెరిట్ జాబితాను సైతం విడుదల చేయలేదు. డీఎస్సీ 2012 ద్వారా జిల్లాలో 404 పోస్టులు భర్తీ అయిన తరువాత మరలా ఇప్పటి వరకూ ఉపాధ్యాయ నియామకాల ఊసే లేదు. ఫలితంగా గత రెండేళ్లుగా నూతన నియామకాలు, పదవీ విరమణతో ఖాళీ అయిన పోస్టులు భారీగా పేరుకుపోయాయి. డీఎస్సీ-2014 ద్వారా జిల్లా 951 పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయించారు.

 బదిలీలతో గందరగోళ పరిస్థితులు
 వేసవి సెలవుల్లో నిర్వహించాల్సిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియను ప్రభుత్వం పాఠశాలలు తెరిచి తరగతులు కొనసాగుతున్న తరుణంలో చేపట్టేందుకు సిద్ధమైంది. త్వరలోనే బదిలీలు చేపట్టేందుకు నిర్ణయించిన ఫలితంగా ఉపాధ్యాయుల తమ దష్టి అంతా బదిలీలపైనే సారించే అవకాశముడటంతో పాఠశాలల్లో విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement