గతేడాది ఇచ్చిన పుస్తకాలపై ఇప్పుడు ఏడుపా!
కోడ్ తర్వాత ఇచ్చే వాటిపైనే ఆంక్షలుంటాయని తెలియదా?
బాబు మెప్పు కోసం ఎన్నికల సంఘంపైనే నిందలు
నిబంధనలను పక్కాగా పాటించే ప్రభుత్వం ఇది
ఏమైతేనేం 47 లక్షలమంది పిల్లలకు పుస్తకాలిచ్చినట్టు రామోజీ అంగీకారం
ఇకపై విద్యార్థులకు చిక్కీలపై రేపర్ తొలగించి పంపిణీ
ఉన్నపళంగా చంద్రబాబును గద్దెనెక్కించేయాలనీ... ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేయాలనీ... ప్రజలను తప్పుదారి పట్టించి అధికార పక్షంపై ఏవగింపు కలిగించాలన్నది రామోజీ ఆకాంక్ష. అందుకోసం పదేపదే అబద్దాలను అచ్చేయడం... లేనిపోని అభాండాలకోసం పేజీలకు పేజీలు కేటాయించడం... అడ్డగోలుగా ఆరోపణలతో శునకానందం పొందడం ఈనాడుకు నిత్యకృతమైపోయింది.
వాస్తవాలు తెలుసుకోకుండా అత్యుత్సాహంతో నిబంధనల్ని సైతం వారికి అనుకూలంగా మలచుకుంటున్నారు. గతేడాది ఇచ్చిన పాఠ్యపుస్తకాలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాలున్నాయనీ... ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ‘వీటికెలా ముసుగేస్తారు?’ అంటూ సొంత పైత్యాన్ని వండివార్చింది.
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు ఇవ్వడంలో విఫలమైంది. నోటు పుస్తకాలు అస్సలు ఇవ్వలేకపోయింది. అప్పులు చేసి వారంతా పుస్తకాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. పైగా ‘పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వానిది కాద’ంటూ ఓ కొత్త వాదాన్ని తీసుకొచ్చింది. ‘ప్రైవేటు స్కూళ్లున్నాయి.. అక్కడ వసతులు బాగుంటాయి, మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి’ అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సెలవిచ్చారు.
ప్రజలకోసం ప్రభుత్వాలు ఏం చేయాలో తనకే తెలుసన్నట్టు నిత్యం గొంతు చించుకునే రామోజీకి ఆనాడు బాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పిదం కనిపించలేదు. పైగా పూర్తిస్థాయిలో సర్కారు బడుల్లోని పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతూ ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందనీ, పిల్లలకు పుస్తకాలు ఇవ్వలేదని బరితెగించి అబద్ధాలు రాసింది. తీరా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 47 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లను జగన్ చిత్రంతో ఉన్నవి అందించినట్టు ఒప్పుకుంది.
‘కోడ్’ నిబంధనలేంటో తెలుసుకోరా..
బాబు కోసం బరితెగించిన ఎల్లో మీడియా అన్నింటికి ముసుగులు వేస్తున్నారు.. మరి ఈ పుస్తకాల సంగతేంటని ప్రశ్నించింది. ‘ఇవన్నీ ఎన్నికల సంఘం కళ్లకు కనిపించవా అని నిలదీసింది. వాస్తవానికి ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక’’ విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తదితర వాటిపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండరాదని ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అంటే ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఇచ్చేవాటిపై ఉండరాదని.
కానీ 2023 జూన్ 12న పాఠశాలలు తెరిచిన మొదటి రోజు ఇచ్చిన జగనన్న విద్యాకానుక బ్యాగ్, నోటు పుస్తకాలకు, గతేడాది డిసెంబర్‌లో ఇచ్చిన ట్యాబ్స్‌పై ఉన్న సీఎం జగన్ స్టిక్కర్లకు ఈ నిబంధన వర్తించదని తెలిసినా... పాపం బాబుకు ఎలాగైనా మేలు చేయాలని... వారి మెప్పుపొందాలనీ... అబద్దపు వార్తను రామోజీ నేతృత్వంలోని ఈనాడు పతాక శీర్షిక చేసింది.
కానీ వారికి తెలియని విషయమేంటంటే... ఎన్నికల సంఘం నియమావళిని నూరుశాతం పాటించాలన్న లక్ష్యంతో మార్చి 16వ తేదీ తర్వాత పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే చిక్కీలపై సీఎం ఫొటో ముద్రించిన ర్యాపర్‌ను తొలగించి విద్యార్థులకు అందించాలని పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇవేమీ పట్టించుకోకుండానే ‘ఈనాడు’ ఉపాధ్యాయులపైనా, విద్యాశాఖ ఉన్నతాధికారులపైనా నిందలు వేస్తూ గాలివార్తను అచ్చేసింది.
అసలు నిబంధన ఏంటంటే..
భారత ఎన్నికల సంఘం ప్రచురించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని పేజీ నంబరు 94లోని నిబంధన 5(1)లో ఏముందంటే.. లబ్దిదారుల కార్డులు, విద్యుత్ బిల్లులు, నిర్మాణ స్థలం ఫలకాలువంటి వాటిపై రాజకీయ కార్యకర్తల ఫోటోల ప్రదర్శన అంశంలో.. లబ్దిదారులకు పంపిణీ చేసిన లబ్దిదారుల కార్డులు, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలు సమయంలో ఏర్పాటు చేసే ఫలకాలపై ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ కార్యకర్తల ఫొటోలు, సందేశాలు ఉండకూడదు. మోడల్ ప్రవర్తనా నియమావళి అమలుకు ముందు పంపిణీ చేసిన /ప్రతిష్టించిన లబ్దిదారుల కార్డులు, నిర్మాణ ఫలకాలు వంటి వాటిపై ఫొటోలు ఉన్నా తప్పులేదు.
ఈనాడుపై చర్యలు తీసుకోండి
ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ కార్యదర్శి అప్పిరెడ్డి
ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నడుపుతున్న ఈనాడు దినపత్రిక టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని... దానిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రజలకు అవసరమైన వార్తా కథనాలను ప్రచురించేందుకు బదులు చంద్రబాబు అభిప్రాయాలను ప్రచురిస్తోందని పేర్కొన్నారు. కొన్ని నెలలుగా ఈనాడు ప్రధాన సంచికలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు, ప్రజల్లో దానిపై దురభిప్రాయం కలిగించేలా వక్రీకరించి కథనాలు అచ్చు వేస్తోందన్నారు.
అందుకు నిదర్శనంగా మంగళవారం ప్రచురించిన ‘‘వీటికెలా ముసుగేస్తారు?’’ కథనాన్ని ఎన్నికల సంఘానికి అందించారు. ఈ కథనంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించిన బ్యాగులు, పుస్తకాలు, ఆహార పదార్థాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మలకు ఎలా కవర్ చేయాలో ఈనాడు తన అభిప్రాయాలను వ్యక్తం చేసిందన్నారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన సూచన ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత లబ్దిదారుల కార్డులు, విద్యుత్ బిల్లులు, నిర్మాణ సైట్ ఫలకాలు వంటి వాటిపైనేతల ఫోటోలు ఉండకూడదని చెప్పారు.
కోడ్ అమలుకు ముందు పంపిణీ చేసిన వాటికి ఈ నిబంధన వర్తించదని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పునరుద్ధరణ, పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అన్ని పుస్తకాలు, బ్యాగులు, ఆహార పదార్థాలను ప్రభుత్వమే పంపిణీ చేసిందని వాటిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫొటో ఉందనీ, ఇవన్నీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుకు ముందే అందజేసినవని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కానీ ఈనాడు పత్రిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరువు తీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ రకమైన వార్తా కథనాల ద్వారా సాధారణ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, భారత ఎన్నికల సంఘం పరువు తీయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఈ తప్పుడు కథనం ప్రచురించిన ఆ దినపత్రిక, దాని ప్రచురణకర్తపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment