తిరుపతి ఎడ్యుకేషన్: కొత్త విద్యాసంవత్సరం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఏటా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తోంది. ఈ ఏడాది తరగతి, మీడియంల వారీగా దాదాపుగా 21.46లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయి. తిరుపతిలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయ కార్యాలయం, ఎమ్మార్సీ కేంద్రాల్లో గత ఏడాది మిగిలిన పుస్తకాలు 3.74లక్షలు. ఇవికాకుండా మరో 17.71లక్షలు అవసరమవుతాయి. కానీ ఇప్పటివరకు 3.27లక్షల పుస్తకాలు మాత్రమే చేరాయి. ఇంకా 14.44లక్షలు సరఫరా కావాల్సి ఉంది. గతేడాది కంటే పరిస్థితి దారుణంగా ఉంది. ఇదే సమయానికి గత ఏడాది 9.68లక్షలు సరఫరా అయ్యాయి.
పాఠ్యపుస్తకాల సరఫరా ఇలా...
వేసవి సెలవులకు ముందే తరగతి, మీడియంల వారీగా ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయోజిల్లా విద్యాశాఖ లెక్కలేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తుంది. పాఠ్యపుస్తకాల ముద్రణకు ప్రభుత్వం టెండర్ పిలిచి ప్రింటింగ్ ప్రెస్‌కు కేటాయిస్తుంది. ముద్రణ పూర్తయిన పాఠ్యపుస్తకాలను జి ల్లాలోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయ కార్యాలయానికి విడతల వారీగా సరఫరా చేస్తుంది. వీ టిని జిల్లాలోని 66 మండలాల్లో ఉన్న మండల వ నరుల కేంద్రాలకు తరలించి, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తారు. ఇవన్నీ పాఠశాలల పునః ప్రారంభం(జూన్ 12వ తేదీ)లోపు పూర్తి స్థాయిలో సరఫరా చేయాలి. ఇది ఏటా జరిగే ప్రక్రియ.
నివేదికలో ఆలస్యం..
పాఠ్యపుస్తకాల అవసరంపై రాష్ట్ర విద్యాశాఖకు జిల్లా అధికారులు నివేదిక పంపిస్తారు. పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య తదితర విషయాలు ఆన్‌లైన్‌లో పొందుపరచడంతో ఈ ఏడాది జిల్లాకు ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయో రాష్ట్ర విద్యాశాఖే నిర్ణయించింది. మండలాల వారీగా పాఠ్యపుస్తకాల సంఖ్యను పంపించింది. దీనిని సరిచూసి జిల్లా విద్యాశాఖకు నివేదిక పంపించా ల్సిన బాధ్యత మండల విద్యాశాఖాధికారులది. అయితే ఈ నివేదిక పంపించడంలో జాప్యం అయినట్లు సమాచారం. దీనికితోడు పాఠ్యపుస్తకాల్లో క్యూఆర్ కోడ్‌ను ముద్రించనున్న నేపథ్యంలో ఆలస్యం అయినట్లు తెలిసింది.
సకాలంలో సిలబస్ సందేహమే...
21లక్షల పాఠ్యపుస్తకాల్లో ఇప్పటివరకు కేవలం 3లక్షల పాఠ్యపుస్తకాలే సరఫరా అయ్యాయి. పూర్తి స్థాయిలో సరఫరా కావడానికి దాదాపుగా మరో 15రోజుల సమయం పట్టనుంది. విద్యాసంవత్సర క్యాలెండర్ ప్రకారం సిలబస్ కష్టమని ఉపాధ్యాయులంటున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించలేకపోయిన సబ్జెక్టు ఉపాధ్యాయులకు అక్షింతలు తప్పవు. సకాలంలో పాఠ్యపుస్తకాలు అందజేస్తే, డిసెంబరు కల్లా సిలబస్ పూర్తి చేసి రివిజన్ ప్రారంభించవచ్చు. వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి కనీస మార్కులతో పాసయ్యేలా చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలకు ఉపాధ్యాయులు బలికావాల్సి వస్తోందని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు.
మరో పది రోజుల్లో ఇస్తాం
నాలుగు రోజుల నుంచి పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతున్నాయి. ఇప్పటికి 3.27లక్షలు పాఠ్యపుస్తకాలు వచ్చాయి. గత ఏడాది మిగిలిన 2.57లక్షల పాఠ్యపుస్తకాలు మా వద్ద ఉన్నాయి. వీటిని మండలాల వారీగా పంపించనున్నాం. సోమవారం కేవీబీ.పురం, తొట్టంబేడు మండలాలకు సరఫరా చేశాం. మరో పది రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని మండలాలకు పాఠ్యపుస్తకాలను సరఫరా చేస్తాం.
–ఎం.వెంకటేశ్వరరావు, మేనేజర్,ప్రభుత్వ పాఠ్యపుస్తకాలవిక్రయ కార్యాలయం, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment