42 లక్షల మంది విద్యార్థులకు పుస్తకాలు సిద్ధం చేస్తున్న అధికారులు
2024–25 విద్యా సంవత్సరానికి 4.55 కోట్ల పుస్తకాలు
1 నుంచి 5, 7 తరగతుల పుస్తకాల ముద్రణ బిడ్ దక్కించుకున్న పితాంబరా ప్రెస్‌కు
మిగతా తరగతుల పుస్తకాల ముద్రణ స్థానిక ఎంఎస్‌ఎంఈలకు
గతేడాది పేపర్ నాణ్యత, ప్రమాణాలతో పాటు అదే ధరకు ముద్రణ
ఈసారి పదో తరగతికీ ఇంగ్లిష్ మీడియం విస్తరణ
1 నుంచి 7 వరకు స్టేట్, 8 నుంచి 10 వరకు ఎన్సీఈఆర్టీ సిలబస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ బడులలో చదివే విద్యార్థులందరికీ పాఠశాలలు తెరిచే నాటికల్లా పాఠ్య పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 1 నుంచి 10వ తరగతి వరకు అందరికీ బైలింగ్యువల్ పుస్తకాల ముద్రణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 42 లక్షల మంది విద్యార్థుల కోసం 4.55 కోట్ల పుస్తకాలను సిద్ధం చేస్తోంది. గతేడాది దాదాపు 27 లక్షల పుస్తకాలు మిగలడంతో మిగిలిన 4.28 కోట్ల పుస్తకాలు ముద్రిస్తున్నారు. ఈసారి పాఠ్యపుస్తకాల ముద్రణ బిడ్‌ను ఉత్తరప్రదేశ్‌కు చెందిన పితాంబరా ప్రెస్ పొందింది.
25 శాతం ముద్రణను స్థానిక ఎంఎస్‌ఎంఈలకు అప్పగిస్తారు. గత ఏడాది పుస్తకాల ముద్రణకు అత్యంత నాణ్యమైన 70 జీఎస్‌ఎం పేపర్‌ను వినియోగించారు. ఈ ఏడాది కూడా ఇదే నాణ్యత ఉండేలా ముద్రణ సంస్థకు నిబంధనలు విధించారు. పదో తరగతి ఫిజిక్స్ పుస్తకాలకు ప్రత్యేకంగా అత్యంత నాణ్యమైన 80 జీఎస్‌ఎం ఆర్ట్ పేపర్‌ను వినియోగిస్తున్నారు.
స్కూళ్లు తెరిచేనాటికే ప్రతి విద్యార్థికీ జగనన్న విద్యా కానుక కింద అందించే కిట్లలో ఇతర వస్తువులతో పాటు అన్ని పుస్తకాలు అందిస్తారు. ఇందుకోసం మే 31 నాటికి మొదటి సెమిస్టర్ పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరతాయి. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అదనపు విద్యార్థులకు కూడా పుస్తకాలను అందించేందుకు 5 శాతం పాఠ్య పుస్తకాలను బఫర్ స్టాక్‌గా ఉంచుతారు.
అన్ని మాధ్యమాలకూ ద్విభాషా పుస్తకాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్, తెలుగు మీడియంతో పాటు ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం, కన్నడ మాధ్యమం స్కూళ్లు కూడా ఉన్నాయి. తెలుగు మాధ్యమం విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ ద్విభాషా పుస్తకాలు ఇస్తారు. ఇతర మీడియం విద్యార్థులకు కూడా ఇంగ్లిష్తోపాటు వారు ఎంచుకున్న భాష ఉన్న ద్విభాషా పుస్తకాలు అందిస్తారు. దీంతోపాటు సవర, కొండ, కోయ, సుగాలి వంటి గిరిజన విద్యార్థులకు కూడా ఇదే విధానంలో పుస్తకాలు ముద్రిస్తున్నారు.
ఇప్పటికే 1 నుంచి 9 తరగతులు ఇంగ్లిస్ మీడియంలోకి మారాయి. 2024–25 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి వస్తుంది. దీంతో 1 నుంచి 10 వరకు నూరు శాతం ఇంగ్లిష్ మీడియం బోధనలోకి వస్తుంది. విద్యార్థులకు స్థానిక సంస్కృతులు, జాతీయ అంశాలపై అవగాహన ఉండేలా తరగతులను మూడు కేటగిరీలుగా విభజించి సిలబస్ రూపొందించారు.
1 నుంచి 5 తరగతులకు 100 శాతం ఎస్సీఈఆర్టీ సిలబస్ ఉంటుంది. 6, 7 తరగతులకు ఇంగ్లిష్, సైన్సు, లెక్కల్లో ఎన్సీఈఆర్టీ సిలబస్, తెలుగు, హిందీ, సోషల్ స్టేట్ సిలబస్ ఉంటాయి. 8, 9, 10 తరగతులకు ఫస్ట్, సెకండ్ లాంగ్వేజ్ (తెలుగు, హిందీ) మినహా మిగతా సబ్జెక్టులన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ ఉంటాయి.
స్థానిక ముద్రణ సంస్థలకు 25%అవకాశం
పాఠ్య పుస్తకాల ముద్రణ బిడ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన పితాంబరా ప్రెస్ దక్కించు కుంది. ఈ సంస్థ 1 నుంచి 5, 7 తరగతుల పుస్తకాలు ముద్రిస్తుంది. పేజీకి రూ.0.33 ధర నిర్ణయించారు. స్థానిక ఎంఎస్‌ఎంఈలకు కూడా అవకాశం కల్పించడానికి 6, 8, 9, 10 తరగతుల పుస్తకాల ముద్రణ అప్పగిస్తారు. ఈ మేరకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహా్వనించారు.
Comments
Please login to add a commentAdd a comment