ఎక్కడి పుస్తకం అక్కడే..!
దేవుడు వరమిచ్చినా.. పూజారి అనుగ్రహించలేదన్నట్టుంది జిల్లాలో పాఠ్య పుస్తకాల సరఫరా. ప్రతి సంవత్సరం సకాలంలో పుస్తకాలు రాక ఇబ్బంది పడుతుంటే..ఈ సారి సకాలంలో వచ్చినా వాటిని పంపిణీ చేయకపోవడంతో సమస్య తలెత్తింది. డబ్బుల చెల్లింపులో వచ్చిన పంచాయతీ విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెట్టింది.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : ప్రతి ఏటా జిల్లాకు పాఠ్యపుస్తకాలు చేరడంలో ఆలస్యం జరిగేది.. కానీ, ఈ ఏడాది పాఠ్యపుస్తకాలు సకాలంలో జిల్లా గోదాంకు చేరినా సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పుస్తకాలు సరఫరా చేసే వాహన కాంట్రాక్టర్‌కు ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో పాటు, పుస్తకాలను లోడ్ చేసే కూలీలకు వేతనం కూడా ఇవ్వలేదు. దీంతో వారు పాఠ్యపుస్తకాల సరఫరా నిలిపివేశారు. పాఠ్యపుస్తకాలు సరిపడినన్ని ఉన్నా విద్యార్థులకు అందజేయలేని దుస్థితిలో విద్యాశాఖ ఉంది. పాఠశాలలు తెరిచేనాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేస్తామని ప్రకటించిన విద్యాశాఖాధికారులు, నిధులు లేవని చేతులెత్తేయడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
15లక్షల పుస్తకాలే సరఫరా..
జిల్లాలో 2,725 ప్రాథమిక, 578 యూపీఎస్, 657 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటి లో సుమారు 4.50లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారికి 2015-16 విద్యాసంవత్సరానికి 25,54,404 పాఠ్యపుస్తకాలు అవస రం. వీటిలో జిల్లాకు 24,28, 821 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. పుస్తకాల ను మండల కేంద్రాలకు తరలించేం దుకు టెండర్లు నిర్వహించి రూ.9లక్షలకు ప్రదీప్‌కుమార్ అనే కాంట్రాక్టర్ కు అప్పగించారు. టెండర్ల సందర్భం గా వాహనాల డీజిల్‌ఖర్చు, లేబర్ చార్జీలకు కొంత మొత్తం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మే 26 నుంచి పాఠ్యపుస్తకాల సరఫరా ప్రా రంభించారు. 20రోజుల్లోపు పూర్తిచేయాలని ఆదేశించారు.
అప్పటి నుంచి మొదటి విడత 64 మండలాలకు సరఫరా చేసిన తర్వాత కాంట్రాక్టర్, లే బర్ జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి తమకు డీజిల్‌కు, కూలి డబ్బులు చె ల్లించాలని కోరారు. నిధులు లేవని.. వారంరోజుల్లో ఇస్తామని చెప్పడంతో రెండోవిడత 14మండలాలకు మొత్తం ఇప్పటివరకు 15,12,345 పాఠ్యపుస్తకాలను మండలాలకు సరఫరా చేశా రు. ఒక్క పైసాకూడా విడుదల చేయకపోవడంతో తమకు కూలి డబ్బులు చెల్లిస్తేనే పాఠ్యపుస్తకాలను సరఫరా చే స్తామని లేబర్ రాకపోవడంతో కాం ట్రాక్టర్లు నాలుగు రోజులుగా వాహనాలను గోదాం ఎదుటే నిలుపుకొని ఉన్నారు.
ప్రతి ఏటా ముందుగానే చెల్లించే వారు..
ప్రతి ఏటా టెండర్ తర్వాత పుస్తకాలు సరఫరా చేసేట ప్పుడు వాహనాల డీజిల్‌కు, లేబర్ కూలి చెల్లించేందుకు టెండర్ ధరలో 30శాతం నిధులు విడుదల చేసే వారు. కానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్కపైసా ఇవ్వలేదు. లేబర్ కూలి చెల్లిస్తేనే వస్తమంటున్నారు. డీఈఓ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. ప్రతిరోజు వాహనాల కిరాయి రూ.2వేలు చెల్లిస్తూ నాలుగు రోజులుగా వృథాగా గోదాం ఎదుట నిలుపుకున్నాం.
-ప్రదీప్‌కుమార్, పుస్తకాల సరఫరా కాంట్రాక్టర్.
నిధులు లేకపోవడం వల్లనే...
నిధులు లేక పోవడం వల్లే డబ్బులు చెల్లించలేదు. టెండర్ సందర్భంగా మొత్తం సరఫరా చేసిన తర్వాతనే డబ్బులు ఇస్తామని ఏజేసీ చెప్పారు. కానీ, ముందుగానే చెల్లించాలని కాంట్రాక్టర్ అడుగుతున్నాడు. వెంటనే వారికి కొంత డబ్బు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. పాఠ్యపుస్తకాలు ఇప్పటికే అన్ని మండలాలకు చేరాయి. మిగతా పుస్తకాలు వెంటనే చేరవేసేలా చర్యలు తీసుకుంటాం.
-నాంపల్లి రాజేష్ ,జిల్లా విద్యాశాఖాధికారి