
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార టారిఫ్‌ల ప్రతిపాదనలతో చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) ఎగుమతులకు ప్రతికూలంగా ఉంటుందని ఎగుమతిదారుల్లో ఆందోళన నెలకొంది. దీని వల్ల స్వల్పకాలికంగా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ ఎస్‌సీ రాల్హన్ తెలిపారు.
10 శాతం వరకు సుంకాలు ఫర్వాలేదని, అంతకు మించితే మాత్రం ఇబ్బందేనని ఆయన పేర్కొన్నారు. అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్‌పై టారిఫ్‌ల ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. దిగుమతి సుంకాలపై అనిశ్చితి వల్ల ఇప్పటికే కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లివ్వకుండా తాత్కాలికంగా ఆపి ఉంచారని రాల్హన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని పరిస్థితిని సరిదిద్దాలని, టారిఫ్‌ల సమస్యను ఎదుర్కొనడంలో ఎగుమతిదార్లకు మద్దతుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.