పాఠ్య పుస్తకాల్లో ‘నల్లగొండ’
మన పాఠ్యపుస్తకాలు.. మన చరిత్ర
నాగార్జున్ సాగర్ ప్రాజెక్టు, బేతవోలు
చెరువుల వివరాలు
కవులు, పోరాట యోధుల జీవిత విశేషాలు
6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు,
సాంఘిక శాస్త్రంలో ప్రస్తావన
చిలుకూరు: సమైక్య పాలనలో మరుగున పడిపోయిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కరువులు, కళాకారులు, పోరాటయోధుల జీవన గాథలు ఇకపై మన విద్యార్థులు పాఠ్యాంశాలుగా చదువుకోనున్నారు. ఈ విద్యాసంవత్సరం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పాఠ్య పుస్తకాల్లో జిల్లాకు చెందిన ప్రముఖ ప్రాజెక్టులు, ప్రాంతాల విశేషాలు, కవులు, కళాకారులు, తెలంగాణ పోరాట యోధుల జీవిత విశేషాలను పాఠ్యాంశాలుగా పొందుపరిచారు. 6 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో వీటిని చేర్చారు. చిలుకూరు మండలం బేతవోలు చెరువు, పోరాట యోధులు ఆరుట్ల కమలాదేవి, ఉప్పల మల్సూరు, కవులు సుద్దాల హనుమంతు, భాస్కర్‌రెడ్డి తోపాటు నాగార్జునసాగర్ ప్రాజెక్టు, పోచంపల్లి చేనేతను ప్రస్థావనకు తెచ్చారు. వీటి వల్ల భవితరం పౌరులైన విద్యార్థులు మన సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునే వీలుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
చేనేత కార్మికులకూ స్థానం
జిల్లాలో చేనేత వస్త్రాలకు పేరుగాంచిన భూదాన్‌పోచంపల్లి చేనేత కార్మికులు గురించి 7వ తరగతి తెలుగు వాచకంలో వివరించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టై అండ్ డై చీరలు ఎలా నేస్తారు, కార్మికుల నైపుణ్యాన్ని వివరించారు.
పోరాట యోధుడు మల్సూర్ ప్రస్థావనం..
నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఉప్పల మల్సూర్ ప్రస్థావ 6వ తరగతి తెలుగు పుస్తకంలో ఉంది. మల్సూర్ జీవన విధానం, రాజకీయ జీవితం, రైతాంగ పోరాటంలో ఆయన పాత్రను వివరించారు.
‘మిషన్ కాకతీయ’లో బేతవోలు చెరువు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన మిషన్ కాకతీయ చెరువుల అభివృద్థి పథకాన్ని వివరిస్తూ చిలుకూరు మండలం బేతవోలు చెరువు గురించి 7వ తరగతి సాంఘిక శాస్త్రంలో చెప్పారు. ఈ చెరువుకు సంబంధించిన పూర్తి వివరా లు పాఠ్యాంశంలో పొందుపరిచారు. చెరువు పేరు, ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మిం చారు, ఆయకట్టు తదితర వివరాలు ఉన్నాయి.
ప్రముఖ కవి భాస్కర్‌రెడ్డి
జిల్లాలోని అంకుశాపురం గ్రామానికి చెందిన ప్రముఖ కవి బద్దం భాస్కర్‌రెడ్డి(చెరబండరాజు) గురించి 6వ తరగతి తెలుగులో పుస్తకంలో ప్రస్థావించారు. భాస్కర్‌రెడ్డి ఉపాధ్యాయుడిగా, కవిగా చేసిన సేవలు, రాసిన విప్లవ గేయాలు, కథలు, నవలలను వివరించారు. గమ్యం, ముట్టడి, పల్లవి లాంటి కవితా సంకలనాలు, కత్తిపోటు పాటలు తదితర వివరాలు తెలియజేశారు.
ఆరుట్ల కమలాదేవి జీవిత చరిత్ర
ఆలేరుకు చెందిన తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు ఆరుట్ల కమలాదేవి గురించి 7వ తరగతి తెలుగు పుస్తకంలో ప్రస్తావించారు. ఉద్యమ స్ఫూర్తి, బాల్య జీవితం, బాల్య వివాహాలు, రాజకీయ అవగాహన, ఎమ్మెల్యేగా ఎన్నిక తదితర అంశాలను తెలియజేస్తూ పాఠ్యాంశాన్ని రూపొందించారు.
సుద్దాల హనుమంతు
గుండాల మండలం సుద్దాలకు చెందిన సుద్దాల హనుమంతు గురించి 6వ తరగతి తెలుగు వాచకంలో పొందుపరిచారు. ఆయన రాసిన చైతన్య గీతాలు, బుర్రకథలు, గొల్లసుద్దులు, పిట్టల దొర తదితర రచనల గురించి వివరించారు.
నాగార్జున్‌సాగర్ గురించి...
6వ తరగతి తెలుగు వాచకంలో నాగార్జున సాగర్ గురించి విద్యార్థులకు తెలియజేశారు. లేఖ పాఠ్యాంశంలో నాగార్జున సాగర్ గురించి పూర్తి వివరాలు పొందుపరిచారు. పొడవు, నీటి సామర్థ్యం, ప్రకృతి అందాలు, సాగర్ చుట్టు పక్కల చూడదగిన ప్రదేశాలు, ప్రాజెక్టు నిర్మాణ శైలి తదితర అంశాలను విద్యార్థులకు పాఠ్యాంశంగా అందించారు.
విద్యార్థులకు ఎంతగానో ఉపయోగం
పాఠ్యపుస్తకాల్లో జిల్లాకు అధిక ప్రాధన్యం ఇవ్వడం సంతోషం. దీని వల్లన జిల్లా యొక్క ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోగలరు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని పలు అంశాలు పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి. - చలసాని శేఖర్, ప్రధానోపాధ్యాయులు, జెడ్పీహెచ్‌ఎస్ చిలుకూరు.