జిల్లాలో ఉచిత పంపిణీకి 23.02 లక్షల పాఠ్యపుస్తకాలు
పదో తరగతి కొత్త పాఠ్యపుస్తకాలు సిద్ధం
మార్చి నాటికి పాఠశాలలకు...
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్:
జిల్లాలోని పాఠశాలల్లో 2014-15 విద్యా సంవత్సరంలో 1 నుంచి పదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు 27.82 లక్షల పాఠ్యపుస్తకాలు జిల్లా విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ మొత్తంలో ప్రభుత్వరంగ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 23.02 లక్షల పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎ.రాజేశ్వరరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న అన్ని వర్గాల విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన, పొందని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విక్రయించేందుకు 4280 లక్షల పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ విద్యార్థులందరూ మార్కెట్లో పాఠ్యపుస్తకాలను కొనుక్కోవాల్సిందే. జిల్లా విద్యాశాఖచే గుర్తింపు పొందిన పుస్తకాల షాపులు, సూపర్‌బజార్లలో వీరికి పాఠ్యపుస్తకాలను విక్రయిస్తారు. విద్యాశాఖ ముందస్తు అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలను విక్రయించడం నేరం.
59 శాతం పాఠ్యపుస్తకాలు సిద్ధం:
జిల్లాలో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు 59 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లా పాఠ్యపుస్తకాల గోడౌన్‌లో సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు మొత్తం 23.62 లక్షల పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ మొత్తానికి గత సంవత్సరం పంపిణీ చేయగా మిగిలిన పాఠ్యపుస్తకాలు 1.16 లక్షలు గోడౌన్‌లో నిల్వ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఈ ఏడాది పంపిణీకి నికరంగా 21.85 లక్షల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. అయితే ఈ మొత్తంలో ఇప్పటి వరకు 12.05 లక్షల పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం నుంచి ఒంగోలు గోడౌన్‌కు చేరినట్లు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల జిల్లా మేనేజర్ జె.నాగరాజు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఇంకా 9.20 లక్షల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలు 50 శాతంపైగా వచ్చాయి. 9,10 తరగతుల ఒకేషనల్ విద్యార్థులు, మదర్సాల్లో చదువుతున్న మైనార్టీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నారు.
పదో తరగతి పాఠ్యపుస్తకాలు మార్పు
ఈ ఏడాది పదో తరగతి పాఠ్యపుస్తకాలు మారాయి. ప్రస్తుతం 1 నుంచి 9వ తరగతి వరకు నిరంతర చరిత్రగా మూల్యాంకనం (సీసీఈ) విధానం ప్రకారం పాఠ్యపుస్తకాలు రూపొందించారు. ఈ ఏడాది పదో తరగతి పాఠ్యపుస్తకాలను కూడా సీసీఈ విధానంలో రూపొందించారు. పదో తరగతి విద్యార్థులకు మొత్తం 4.19 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని అంచనా వేశారు. ఈ మొత్తంలో 3.14 లక్షల పాఠ్యపుస్తకాలు ఉచిత పంపిణీకి, 1.05 లక్షల పాఠ్యపుస్తకాలు మార్కెట్లో విక్రయిస్తారు. పదో తరగతి పాఠ్యపుస్తకాలు పంపిణీకి సిద్ధమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యపుస్తకాలన్నీ పంపిణీకి సిద్ధమయ్యాయి. గణితంలో కొన్ని పాఠ్యపుస్తకాలు వచ్చాయి. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది.
మార్చి నాటికి పాఠశాలలకు...
విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలన్నింటినీ మార్చి ఆఖరుకు పాఠశాలలకు చేర్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు సిలబస్ మారిన దృష్ట్యా ఏప్రిల్‌లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించే నాటికి ప్రస్తుతం 9వ తరగతి చదువుతూ 2014-15లో 10వ తరగతికి వచ్చే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. వేసవి సెలవుల్లో ఈ పుస్తకాలపై విద్యార్థులు అవగాహన పెంచుకుంటారనేది ప్రభుత్వ భానవ, ఏటా పాఠ్యపుస్తకాల పంపిణీ, మేలో ప్రారంభమవుతుండగా ప్రస్తుతం ఈ నెలాఖరు నుంచే పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలను మండలాలకు చేరవేసేందుకు సోమవారం రవాణా టెండర్లను కూడా ఖరారు చేయనున్నాయి.
పుస్తకాలొచ్చాయ్..
Published Wed, Feb 26 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM
Advertisement
Advertisement