చదువుల తొలకరి | Sakshi Editorial On Education | Sakshi
Sakshi News home page

చదువుల తొలకరి

Published Mon, Jul 1 2024 4:21 AM | Last Updated on Mon, Jul 1 2024 4:21 AM

Sakshi Editorial On Education

వర్షరుతువు ఊరికే రాదు, చదువుల ఋతువును వెంటబెట్టుకుని వస్తుంది. వేసవి కర్ఫ్యూ నుంచి బయటపడి  ఆడా, మగా పిల్లలు గుంపులుగా, అనేక రంగుల పూదోటల్లా వీథుల్లోకి ప్రవహించే దృశ్యం– దేహానికి తొలకరి లానే చూపులకు చందనమవుతుంది. పుస్తకాల బరువుతో బుడిబుడి అడుగుల బాలసరస్వతుల నవ్వుల తళతళలు, మాటల గలగలలు పరిసరాలకు సరికొత్త బాల్యశోభనిస్తాయి. చదువుల నిచ్చెన మీద పిల్లలూ, వాళ్లపై పెట్టుకున్న ఆశల నిచ్చెనపై కన్నవారూ ఏకకాలంలో కొత్తమెట్టు ఎక్కడం ఎల్లెడలా కనిపిస్తుంది. 

చదువుల చరిత్రనే రాస్తే, అది మెరుపులు; మంచి చెడుల మలుపుల మీదుగా సాగిపోతుంది. ప్రాచీనకాలంలో ఋష్యాశ్రమాలే విద్యాలయాలు. అధికార, ధనబలాలలో తేడాలున్న క్షత్రియుల పిల్లలూ, బ్రాహ్మణుల పిల్లలూ కలసి చదువుకునేవారు. అలా చదువుకున్న ద్రుపద, ద్రోణాచార్యుల మధ్య ఆ తర్వాత వచ్చిన అంతస్తుల తారతమ్యాలు శత్రుత్వానికి దారితీసి మహాభారతంలో కొన్ని కీలక పరిణామాలకు కారణమయ్యాయి. వేటకొచ్చిన రాజులు పరివారాన్ని దూరంగా విడిచి పాదచారులై వెళ్ళి గౌరవప్రపత్తులతో ఋషిని దర్శించుకోవడం గురించి వింటాం. 

అలాంటి గురుస్థానం చిరుస్థానమై బతకలేని బడిపంతుల స్థాయికి కుదించుకోవడమూ చూశాం. అయితే, నాటి చదువుల వ్యవస్థలోని ఏ కాస్త వెలుగునూ హరించే చీకట్లూ లెక్కలేనన్నే. కొన్ని చదువుల్ని సార్వత్రికం చేయకపోవడం ఒకటైతే; చదువుల్లో ఎక్కువ, తక్కువ తేడాలు ఇంకొకటి. ‘కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీరకష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్రవృత్తుల సమస్త చిహ్నా’లలో వేటికవే చదువుల తల్లి సిగ పువ్వులన్నది నేటి అవగాహన. సాధారణ విద్యపై సాంకేతిక విద్యది పైచేయి కావడం చూస్తూనే ఉన్నాం. 

అలా కాలక్రమంలో చదువుల నిర్వచనమూ, ప్రయోజనమూ కూడా మారిపోయాయి. హిరణ్యకశిపుడు రాక్షసుడే అనుకున్నా చదువుల ప్రయోజనం గురించి ఆనాటి అవగాహనతోనే మాట్లాడతాడు. ‘చదవనివాడు అజ్ఞాని అవుతాడు, చదివితే సదసద్వివేచన కలుగుతుంది’ అని కొడుకు ప్రహ్లాదుడితో అంటాడు. ‘సదసద్వివేచన’ అనే మాటకు ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు. మంచి చెడుల వివేచన ఒక అర్థమైతే; పారలౌకికంగా సత్యాసత్యాలు, నిత్యానిత్యాలనేవి మరికొన్ని. చదువుకుని వచ్చి ప్రహ్లాదుడు తండ్రికి చెప్పిన సమాధానమూ దానికి దీటుగానే ఉంటుంది. ‘ధర్మార్థాలతో సహా ముఖ్యశాస్త్రాలనే కాదు, చదువులలోని మర్మమంతా చదివేశా’నంటాడు. 

చదువులలోని మర్మమంటే అతని ఉద్దేశం – భక్తి, ఆధ్యాత్మికతలనే! ఆనాడు చదువంటే కేవలం ఉద్యోగానికి ఓ అర్హత కాదు; బ్రహ్మచర్యం, గృహస్థం,వానప్రస్థం, సన్యాసమనే నాలుగు ఆశ్రమాల మీదుగా సాగాల్సిన జీవనయానంలో తొలి అంకం. నాడు రాజాస్థానాల్లో గణకులు, వ్రాయసకాండ్ర వంటి ఉద్యోగాలున్నా వాటి అందుబాటు పరిమితం. 

దాచుకున్న ధనమూ; పురుషుడికి రూపమూ, కీర్తీ, భోగమూ కలిగించేదీ, విదేశబంధువూ, విశిష్ట దైవమూ, రాజపూజితమూ అంటూ ఏనుగు లక్ష్మణకవి చేసిన అభివర్ణన అన్ని విద్యలకూ వర్తించేదే అయినా పెద్ద పీట వేదశాస్త్రాలదే. ఈ విద్యార్థతలున్నవారు ‘సర్టిఫికెట్‌’ పుచ్చుకుని ఉద్యోగం వేటలో పడాల్సిన అవసరమే లేదు; గుర్తింపు, గౌరవం, మడిమాన్యాలు అన్నీ వాళ్ళ దగ్గరికే వచ్చేవి. భాషలో అపర శేషువూ; యజ్ఞయాగాదుల్లో, వేదాధ్యాపనలో మునిగితేలేవాడే అయినా సంపన్నుడు కనుక; రాజులేమైనా ఇవ్వబోతే సాలగ్రామాన్ని సైతం పుచ్చుకోడానికి నిరాకరించే ‘మనుచరిత్ర’లోని ప్రవరాఖ్యుడూ కనిపిస్తాడు. 

వేదాలకు గాదెగా, శాస్త్రాలకు పుట్టిల్లుగా, కళాకలాపాల రచ్చగా తెనాలి రామకృష్ణుడు తన ‘పాండురంగ మాహాత్మ్యం’లో పరిచయం చేసిన సభాపతి అనే ఆయన పశు శిశు దాసీజనం కలిగిన ధనికుడు; ఆపైన వడ్డీవ్యాపారం, సేద్యం కూడా చేస్తూ రాజు దగ్గరికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. తన పేరును నేతిబీరను చేస్తూ చెడు తిరుగుళ్లు మరిగిన నిగమశర్మ ఇతని కొడుకే! ఈ పండితపుత్రుడు ఆగమవాదాల్లో నోరువిప్పడు కానీ విటుల వివాదాలను తీర్చడంలో మాత్రం మహా చురుకని– కవి చురక.  

బ్రిటిష్‌ ఏలుబడిలో డిగ్రీ చదువులొచ్చి ఉద్యోగంతో లంకె పడ్డాయి. స్వతంత్ర భారతంలో ఆ లంకె ఇంకా బిగిసింది తప్ప సడలలేదు. అదే సమయంలో దాదాపు అన్ని చదువులూ సార్వత్రికమై మేలూ చేశాయి. సంధిదశలో రెంటికీ చెడ్డ రేవళ్ళను గిరీశం, వెంకటేశం పాత్రల ద్వారా గురజాడ ‘కన్యాశుల్కం’లో బొమ్మ కట్టారు. నాలుగు ఇంగ్లీష్‌ ముక్కలు నేర్చి రికామీగా తిరిగేవాడు గిరీశమైతే, ‘మీ వల్ల నాకు ఒచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే. పాఠం చెప్పమంటే ఎప్పుడూ కబుర్లు చెప్పడమే’ నని వాపోయినవాడు వెంకటేశం. 

ఇంగ్లీషు చదువులు కుదురుకొని చదువు బడులు సమాజాన్ని చదువుకునే బడులుగా మారుతున్న వైనాన్ని కొడవటిగంటి కుటుంబరావు ‘చదువు’ నవలలో అద్భుతంగా చిత్రిస్తారు. చదువుల సారమైన సదసద్వివేచన అడుగంటి చదువు వ్యాపారమై వందలాది కోచింగ్‌ సెంటర్లను, వేలాది చీటింగ్‌ తుంటర్లను సృష్టించింది. నీతి తప్పిన ‘నీట్‌’ ద్రోహంతో కొత్త విద్యాసంవత్సరం మొదలవడం ఈ దుఃస్థితికి ప్రతీకాత్మక అభివ్యక్తి. నిఖిలదేశం హర్షించే మంచికాలం రహించాలని  చదువులమ్మను కోరుకుందాం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement