అభిప్రాయం
విజయవాడలో జరిగిన మొన్నటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించడమే కాక, తత్సంబంధ జీవో నం.85ను రద్దు చేయాలని కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరడం ఏ కోణం నుండి చూసినా సమంజసనీయమైనది కాదు. గౌరవ నీయ సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయ మూర్తిగా ఆయనకిది ఏమాత్రం తగినట్లుగా లేదు. అందుకే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
మోదీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానంలో 8వ తరగతి వరకు మాతృభాషా మాధ్యమాలలోనే విద్య నేర్పాలని సూచించారు. అయితే నేటి పోటీ ప్రపంచంలో దీని అమలు అసాధ్యమని తెలిసినప్పటికీ, జస్టిస్ రమణ దీనిని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఎక్కడా కోరలేదు. కానీ స్వరాష్ట్రానికి వచ్చేటప్పటికి తెలుగు మాధ్యమానికి మాత్రమే, అందునా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే తెలుగు మాధ్యమానికి తావివ్వాలని మాట్లాడుతున్నారు!
ప్రైవేట్ స్కూళ్లలో కూడా తెలుగు మీడియం ప్రవేశపెట్టాలని నామమాత్రంగానైనా ఆయన ఎందుకు అడగటం లేదు? అంటే సంపన్నుల పిల్లలకు ఒక న్యాయం, పేద దళిత గ్రామీణ పిల్లలకు మరొక న్యాయం! ఇదేనా ఎవరైనా ఇవ్వవలసిన ‘తీర్పు’? ఇంగ్లిష్ మీడియంతో ప్రైవేట్ విద్యారంగం కళకళలాడాలనీ, కేవలం తెలుగు మీడియంతో నడిచే ప్రభుత్వ పాఠశాలలు వెలవెల పోవాలనీ; ‘ప్రభుత్వం వేస్ట్.. ప్రైవేట్ రంగం బెస్ట్’ అనీ... ఆయన, ఆయన వెనుక ఉన్న రాజకీయ నేతల ఉద్దేశంలా కనిపిస్తోంది.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తూ తెలుగు భాషపై ప్రేమ వెలిబుచ్చుతూ ఉంటారు. వీరి పిల్లలందరూ ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి! విదేశాలకు వెళ్లి వచ్చి, గొప్పగా సంపాదించుకోవాలి. కానీ పేదవాళ్లకు మాత్రం ఆ అవకాశం ఇవ్వకూడదు, వాళ్లు రాష్ట్రం దాటి వెళ్లకూడదు.
జగన్ సంస్కరణలు చరిత్రాత్మకం
గత ఐదేళ్లలో జగన్ దేశంలోకెల్లా అత్యధికంగా పాలనలో, పలు రంగాలలో, ముఖ్యంగా విద్యారంగంలో అద్భుతమైన సంస్కరణలు తెచ్చి చరిత్రకెక్కారు. రాజకీయంగా జగన్ మోహన్‌రెడ్డితో విభేదిస్తే, రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప, ఆయన మీది ద్వేషంతో ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలను రద్దు చేస్తూ పోవడం ఏమాత్రం సమంజసం కాకపోగా విపరిణామాలకు దారి తీస్తుంది.
ద్విభాషా పాఠ్యపుస్తకాలను, ఇంగ్లిష్–తెలుగు నిఘంటువులను ఇచ్చినప్పటికీ, ఏ మీడియంలోనైనా చదువుకునే, పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ, 90 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియంనే కోరుకున్నప్పటికీ, లక్షలాదిగా ఉన్న వారి అభీష్టానికి, హక్కుకు వ్యతిరేకంగా ఈ న్యాయమూర్తి ఇలా మాట్లాడటం సరైనది కాదు. ఆయన మాట విని, ఆంగ్ల మాధ్యమంలో 9వ తరగతి వరకు వచ్చిన విద్యార్థులను నట్టేట ముంచి, తిరోగమన దిశలోకి మరల్చడం చంద్రబాబు చారిత్రక తప్పిదంగా నిలిచిపోతుంది.
దీనికి బదులు, తెలుగు భాషపై తెలుగు మాధ్యమంపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, ఆంగ్ల మాధ్యమాన్ని కొనసా గిస్తూనే, కేజీ టు పీజీ తెలుగు మాధ్యమ బోధనా విద్యాసంస్థలను సమాంతరంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రత్యే కంగా ఏర్పాటు చేసి, వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధులలో రిజర్వేషన్ కల్పించాలని కోరడం సముచితంగా ఉంటుంది. స్థానిక ప్రభుత్వాలు స్థానిక ప్రజల భాష లోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని, న్యాయస్థానాలు ప్రజల భాషలోనే తీర్పులు ఇవ్వాలని ఆదేశిస్తే, నిర్దేశిత రాజ్యాంగ ఆశయాలు కూడా తద్వారా నెరవేరుతాయి.
ఇలాంటి విశాల దృక్పథంతో ఆంగ్ల లేక తెలుగు మాధ్యమ అంశాలను పరిశీలించినప్పుడే ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరుకుతుంది. అలా కాని పక్షంలో ఎన్నో వేల ఏళ్లుగా వివక్షకు గురైన అట్టడుగు పేద బడుగు వర్గాల నుండి ప్రతిఘటనను, ఇంగ్లిష్ మీడియం పరి రక్షణ ఉద్యమాలను కూటమి పాలకులు ఎదుర్కోవలసి వస్తుంది.
ఈదర గోపీచంద్
వ్యాసకర్త సామాజిక ఉద్యమ కార్యకర్త
మొబైల్: 94403 45494
Comments
Please login to add a commentAdd a comment