మైదుకూరులో ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ విద్యకు ఆదరణ కరువవుతోంది. జిల్లాలో పలు జూనియర్ కళాశాలల్లో సమస్యలు తిష్ట వేసి ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. అలాగే కేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో ఇంటర్ కళాశాలల్లో కనీస వసతులు సమకూరలేదనే విమర్శలున్నాయి. కళాశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడంలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఇంటర్ విద్యకు రోజురోజుకు ఆదరణ కరువవుతోంది. కళాశాలకు కావల్సిన కనీస వసతుల కల్పన, పూర్తిస్థాయిలో అధ్యాపకుల నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ కళాశాలలపై ప్రభుత్వం చిన్నచూపు చూడడంతో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంటర్ చదివించాలంటే తల్లిదండ్రులు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇందుకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి ఉంది.
కళాశాలలు పున:ప్రారంభమైనా..
కళాశాలలు పున:ప్రారంభమైనా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు లేవు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థుల చేతిలో పుస్తకాలు ఉండాలి.. కాని అది అమలు కావడం లేదు. జిల్లాలో 26 ప్రభుత్వ, 20 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 12 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 77 వేలకు పైగా పుస్తకాలు అవసరం. సంబం«ధిత పుస్తకాలు త్వరలో జిల్లాకు రానున్నాయి.
తరగతులు ప్రారంభం..
జూన్ 1 నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. ద్వితీయ సంవత్సరానికి తరగతులు మొదలయ్యాయి. ప్రథమ సంవత్సవానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్సు గ్రూపు విద్యార్థులకు ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలను ఉచితంగా ఇస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ప్రతి విద్యార్థికి పుస్తకాలు అందించాల్సి ఉన్నప్పటకీ ఇంతవరకూ ఈ ప్రక్రియ ఓ కొలిక్కిరాకపోవడంతో విమర్శలకు తావిస్తోంది.
వేధిస్తున్న సొంత భవనాల కొరత..
జిల్లాలో 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా ఇందులో 21 వాటికి సొంత భవనాలు ఉన్నాయి. మిగతా 5 వాటికి సొంత భవనాల్లేవు. హైస్కూల్స్‌లో షిఫ్ట్ పద్ధతిన కళాశాలలను నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు ఉర్దూ, మైదుకూరు ఉర్దూ, రాజంపేట ఉర్దూ, నందలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనాల్లేవు. ఈ పరిస్థితుల్లో ఆయా కళాశాలల విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
కనీస వసతులు కరువు..
సొంత భవనాల్లేని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస వసతులు కూడా కరువు. కనీసం మంచినీరు. మరుగుదొడ్లు కూడా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి సొంత భవనాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదేనా ప్రైవేటుకు దీటంటే..
ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యాబోధన జరుగుతోంది. కొన్ని విద్యా సంస్థలు వేసవి సెలవుల్లోనే తరగతులను నిర్వహించాయి. కానీ ప్రభుత్వ కళాశాలల్లో సకాలంలో పాఠ్యపుస్తకాలు అందని పరిస్థితి. ప్రైవేటుకు దీటుగా రాణించాలంటే సకాలంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉందని విద్యావేత్తలు, మేధావులు చెబుతున్నారు.
15 రోజుల్లో పాఠ్య పుస్తకాలు..
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు పదిహేను రోజుల్లో పాఠ్య పుస్తకాలు అం దజేస్తాం. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాల జాబితాను ప్రభుత్వానికి పంపాం. త్వరలో వస్తాయి. అలాగే సొంత భవనాల గురించి కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపాం. సమస్యను త్వరలో పరిష్కరిస్తాం. – చంద్రమౌళి, జిల్లా వృత్తివిద్యాధికారి. ఇంటర్మీడియట్
Comments
Please login to add a commentAdd a comment