సాక్షి, అమరావతి: గణగణ గంటలు మోగడమే ఆలస్యం.. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందచేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పాఠశాలల పునఃప్రారంభానికి నెల రోజుల ముందే విద్యార్ధులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాలను సిద్ధంగా ఉంచడం గమనార్హం. స్కూళ్లు తెరిచిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి 3.38 కోట్ల పుస్తకాలను జగనన్న విద్యాకానుకతో సహా అందించనున్నారు. గత సర్కారు హయాంలో నవంబర్ – డిసెంబర్ వరకు కూడా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో అందించలేని దుస్థితి నెలకొనగా ఇప్పుడు స్కూళ్లు ప్రారంభం కావడమే ఆలస్యం అనే రీతిలో చర్యలు చేపట్టడం విద్యారంగంపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నెలలోనే అమ్మ ఒడి పథకం కింద లబ్ధి చేకూర్చనుంది.
ప్రభుత్వ పాఠశాలలకు పెరిగిన ఆదరణ
అధికారంలోకి రాగానే విద్యారంగ సంస్కరణలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా స్కూళ్లలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల బాట పట్టారు. స్కూళ్లు తెరిచిన వెంటనే జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్ధులకు 3 జతల యూనిఫారం, బెల్టు, బూట్లు, సాక్సులు, బ్యాగుతో పాటు ఇంగ్లీషు డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్కుబుక్స్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
భారం లేకుండా సెమిస్టర్లవారీగా
1 నుంచి 10వ తరగతి వరకు 330 రకాల టైటిళ్ల పుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, కన్నడ, తమిళం, ఒరియా మాధ్యమాలతో కూడిన ఈ పుస్తకాలను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు అందచేస్తారు. గతంలో ఏడాది మొత్తానికి ఒకే ఒక పాఠ్య పుస్తకాన్ని ఇవ్వడం వల్ల పరిమాణం పెరిగి విద్యార్ధులు అధిక బరువులు మోయలేక అల్లాడేవారు. పైగా కొద్ది రోజులకే చిరిగిపోయేవి. ఈ పరిస్థితిని గమనించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 6వ తరగతినుంచి సెమిస్టర్ విధానానికి శ్రీకారం చుట్టింది. సెమిస్టర్ల వారీగా పుస్తకాలను అందించడం వల్ల మోత బరువు నుంచి విముక్తి లభించింది. ఈసారి మొదటి సెమిస్టర్ కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 3,38,70,052 పాఠ్య పుస్తకాలను అందించనున్నారు.
గుత్తాధిపత్యానికి తెర
జూలై 4వతేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో విద్యాశాఖ ఇప్పటికే ముద్రణ ప్రక్రియ పూర్తి చేసి మండల కేంద్రాలకు సరఫరా చేపట్టింది. నెల రోజుల ముందే మండల కేంద్రాలకు 60 శాతానికి పైగా పుస్తకాలు చేరుకున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మిగతావి కూడా చేరనున్నాయి. గతంలో నేతలు, ప్రింటర్ల ఇష్టారాజ్యంగా ముద్రణ వ్యవహారాలు నడిచేవి. మే ఆఖరు వరకు కూడా పుస్తకాల ముద్రణ టెండర్లే ఖరారయ్యేవి కావు. ఇప్పుడు వాయువేగంతో అన్నీ పూర్తి చేసి స్కూళ్లు తెరవటానికి ముందే పుస్తకాలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. గతంలో నలుగురైదుగురి గుత్తాధిపత్యంతో ముద్రణ జరగడం వల్ల చాలా జాప్యం జరిగేది. ఈసారి టెండర్లకు ముందుకు వచ్చిన 20 మంది ప్రింటర్లకు కూడా ముద్రణకు అవకాశమిచ్చారు.
ప్రైవేట్ స్కూళ్లకూ ప్రభుత్వం నుంచే...
ఈ విద్యాసంవత్సరం ప్రైవేట్ స్కూళ్లకు కూడా ప్రభుత్వమే పాఠ్యపుస్తకాల ముద్రణ చేపట్టి పంపిణీ చేస్తోంది. గతంలో ప్రైవేట్ పాఠశాలలకు ప్రైవేట్ ప్రింటర్లు సరఫరా చేయడం వల్ల తల్లిదండ్రులపై మోయలేని భారం పడేది. ప్రభుత్వ ధర కన్నా నాలుగైదు రెట్లు అధిక ధరలకు పుస్తకాలను విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఈ అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం ఈదఫా ఆ పాఠ్యపుస్తకాల ముద్రణ కూడా తానే ప్రైవేట్‌కు అప్పగించి స్కూళ్లకు నేరుగా పంపిణీ చేస్తోంది.
మారుపేర్లతో మాయచేస్తూ..
2007 వరకు ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్లకు అందించే విధానం ఉండగా ఆ తరువాత ప్రైవేట్‌కే విడిచిపెట్టారు. ఫలితంగా ప్రింటర్లు తక్కువ ముద్రణ చూపిస్తూ ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొడుతూ వస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన కంటెంట్‌ను వేరే పబ్లిషర్లకు అందించి మారుపేర్లతో ముద్రణ చేపడుతూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ పాఠ్యపుస్తకాల సెట్ ప్రభుత్వ ధర రూ.280గా మాత్రమే ఉండగా స్కూళ్లలో ప్రైవేట్ ముద్రణ పేరుతో రూ.2 వేల వరకు గుంజేవారు. ఇప్పుడు ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు అందించనున్నందున తల్లిదండ్రులపై అధిక భారం తప్పనుంది. ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన పుస్తకాలకు సంబంధించి విద్యాశాఖ ముందుగానే ఇండెంట్లు తీసుకుంది. మొత్తం 13,635 ప్రైవేట్ స్కూళ్లలో 24 లక్షల మంది విద్యార్ధులుండగా 12,721 స్కూళ్లు 18.02 లక్షల మందికి పుస్తకాల కోసం ఇండెంట్లు ఇచ్చాయి. వీరికి కావాల్సిన 1.36 కోట్ల పాఠ్యపుస్తకాలను కూడా ప్రభుత్వమే ముద్రణ చేపట్టి ఆయా స్కూళ్లకు అందించేలా ఏర్పాట్లు చేసింది.
ద్విభాషా పాఠ్యపుస్తకాలు
ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో విద్యార్ధులకు సౌకర్యంగా ఉండేందుకు పాఠ్యపుస్తకాలను బైలింగ్యువల్ (ద్విభాషా) విధానంలో మిర్రర్ ఇమేజ్‌తో ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఒకపక్క తెలుగు, దానికి ఎదురు పేజీలో ఇంగ్లీషులో పాఠ్యాంశాలు ఉండటంతో విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పటికే 6, 7 తరగతుల విద్యార్ధులకు ఈ సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు అందించారు. ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి విద్యార్ధులకు కూడా సీబీఎస్‌ఈ సిలబస్ పుస్తకాలు అందిస్తారు. రానున్న రెండేళ్లలో 10వ తరగతి వరకు అన్ని తరగతుల్లోనూ సీబీఎస్‌సీ సిలబస్ అమల్లోకి రానుంది.
ప్రభుత్వ స్కూళ్లకు పాఠ్యపుస్తకాల పంపిణీ ఇలా..
జిల్లా ఇండెంట్ ఇప్పటివరకు ఇచ్చినవి
శ్రీకాకుళం 2039753 748657
విజయనగరం 1691284 681190
విశాఖపట్నం 2745643 1267638
ప.గోదావరి 3670404 1626840
తూ.గోదావరి 2563960 1159599
కృష్ణా 2495376 1123140
గుంటూరు 3057027 1500467
ప్రకాశం 2471675 1269181
నెల్లూరు 2065629 821382
కడప 2001972 931523
కర్నూలు 3415546 1612591
అనంతపురం 2946820 1391097
చిత్తూరు 2704963 1266852
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మొత్తం 33870052 15400157
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
నోట్: ఇవి కాకుండా ప్రస్తుతం 70 లక్షల పుస్తకాలను ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి గోడౌన్లకు తరలిస్తున్నారు. మొత్తం పుస్తకాల తరలింపు రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది.
ద్విభాషా పాఠ్యపుస్తకాలు
ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు పాఠ్యపుస్తకాలను బైలింగ్యువల్ (ద్విభాషా) విధానంలో మిర్రర్ ఇమేజ్‌తో ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఒకపక్క తెలుగు, దానికి ఎదురు పేజీలో ఇంగ్లిష్‌లో పాఠ్యాంశాలు ఉండటంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పటికే 6, 7 తరగతుల విద్యార్థులకు ఈ సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు అందించారు. ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతికి కూడా సీబీఎస్‌ఈ సిలబస్ పుస్తకాలు అందిస్తారు. రానున్న రెండేళ్లలో 10వ తరగతి వరకు అన్ని తరగతుల్లోనూ సీబీఎస్‌సీ సిలబస్ అమల్లోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment